Jump to content

పెద్ద బాలశిక్ష

వికీపీడియా నుండి
(పెద్దబాల శిక్ష నుండి దారిమార్పు చెందింది)
గాజుల సత్యనారాయణ వ్రాసిన పెద్ద బాలశిక్ష ముఖ చిత్రం

పెద్ద బాలశిక్ష అనే పుస్తకం తెలుగులో ఎన్సైక్లోపెడియా అనవచ్చు. బ్రిటీషువారు భారతదేశాన్ని పరిపాలించు కాలంలో ఆంధ్రదేశములోని పాఠశాలల్లో పిల్లలకు పెద్దబాలశిక్ష సిలబస్ గా ఉండేది. పిల్లలు మొట్టమొదట తమ విద్యాభ్యాసాన్ని పెద్ద బాలశిక్షతోనే ప్రారంభించేవారు.

నేపథ్యం

[మార్చు]

వర్తకానికి వచ్చి రాజ్యాధిపతులైన ఆంగ్లేయులు వారి కొలువులో రెవెన్యూ డిపార్టుమెంటులో చాలీ చాలని జీతాలతో పనిచేస్తూ ఉన్న స్థానికులు అడ్డదారులు తొక్కి ధనార్జన కోసం అక్రమాలు, అన్యాయాలు మోసాలు దగాలు తప్పుడు రికార్డులు సృష్టించడం మొదలైనివి చేస్తున్నారని గుర్తించారు. స్థానికులు విశ్వసనీయంగా ప్రవర్తించాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అని ఆలోచించారు. స్థానికుల విద్యావిధానంలో లోపం ఉందని తెలుసుకున్నారు. ఆనాటి మద్రాసు గవర్నరు సర్ థామస్ మన్రో 1822 జూలై 2వ తేదీన ఒక యీ దస్తు కోరారు.అందులో ఇలా వుంది :

రాజ్యాలను సంపాదించాక మనం భౌగోళికంగా సర్వేలు చేయించాము. దేశంలో పండే పంటల ఆరాలు తీశాము. వనరుల గురించి భోగట్టాలు రాబట్టాము. జనాభా లెక్కలు గుణించాము. అంతేగాని స్థానికుల విద్యావిధానం గురించి తెలుసుకోడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు.

స్థానికులలో మన విశ్వాసాలకు భంగం కలగకుండా వారి విద్యావిధానంలో ఏ మార్పులను తీసుకు రావాలో తెలుసుకున్నారు. అప్పటి దాకా తమ సివిల్ సర్వెంట్ల చదువు కోసమే పుస్తకాలను వ్రాయించిన ప్రభువులు స్థానికుల కోసం ప్రాథమిక గ్రంథాలను వ్రాయించాలని అనుకొన్నారు. 1832 లో మేస్తర్ క్లూలో (Clu Low) అనే తెల్లదొర, తన ఆశ్రితుడైన పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి చేత బాలశిక్ష అనే గ్రంథాన్ని రచింపచేశాడు. ఈయన రచనా ప్రణాళికను చాలా జాగ్రత్తగా కుర్రవాళ్ళ గ్రహణశక్తిని దృష్టిలో ఉంచుకొని రూపొందించాడు. ఇటువంటి పుస్తకం కోసమే ఆవురావురంటూ ఎదురు చూస్తున్న మన దేశం దీనిని రెండు చేతులా ఆహ్వానించింది.

పెద్దబాలశిక్ష 11 వ పేజి

1856లో అంటే మొదటి ముద్రణకు రెండు పుష్కరాల తర్వాత వెలువడిన బాలశిక్షలోని పుటల సంఖ్య 78. డెమ్మీ ఆక్టావో సైజు.ఆ తర్వాత సాహిత్య విషయాలు, భౌగోళిక విషయాలు, సంస్కృత శ్లోకాలు చేర్చి 12 పేజీలు అదనంగా కలుపుతూ 90 పేజీలతో 1865 లో ఇది పునర్ముద్రణ పొందింది. అంటే పన్నెండు పేజీలు పెరిగాయన్నమాట. పాత ముద్రణలో లేని సాహిత్య విషయాలను, చందస్సు సంస్కృత శ్లోకాలు, భౌగోళిక విషయాలను యిందులో చేర్చారు. దానిని బాలవివేకకల్ప తరువు గా రూపొందించారు. అందుకనే అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలోఉన్న పుస్తకం పెద్ద బాలశిక్షగా కొత్త పేరును దాల్చింది. ఈ పెద్ద బాలశిక్ష ఇందులో విషయపరిజ్ఞానికి-అంటే భాషాసంస్కృతులకు కావాల్సిన పునాదిరాళ్ళనదగిన భాషా విషయాలు, అక్షరాలు, గుణింతాలు వత్తులు, సరళమైన పదాలు- రెండు మూడు నాలుగు అక్షరాలతో కూడిన మాటలు, తేలిక వాక్యాలు- నీతి వాక్యాలు, ప్రాస వాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ, అందరూ తెలుసుకోదగ్గవీ నాటికి తెలిసిన చారిత్రక, భౌగోళిక, విజ్ఞాన సంబంధ విషయాలను రూఢి వాచకాలను ఈ పుస్తకం ఆది స్వరూపంలోనే ఆనాడు పుదూరువారు పొందుపరచారు.

ఆ తరువాత, 1832 నుండి ఇప్పటివరకు పెద్ద బాలశిక్షను తెలుగు సమాజం ఆదరించగా కొన్ని మార్పుల చేర్పులతో ఎంతోమంది ప్రచురణకర్తలు ఎన్నో పండిత పరిష్కరణలతో అందిస్తూవచ్చారు. ఆ మధ్య ఎన్నో గుజిలీ ఎడిషన్లు కూడా లభిస్తూ వచ్చాయి. పుదూరివారి తర్వాత పేర్కొనదగిన పరిష్కరణ 1916లో వావిళ్ళ వారిది. 1916 లో వావిళ్ళ రామస్వామి శాస్తులు అండ్ సన్స్ సంస్థ నుండి ఒక పెద్దబాల శిక్ష వెలువడింది. దీని విపుల పరిష్కరణను 1949లో అందించారు. భాషోద్దారకులు వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రి 1949 పరిష్కరణలో ఇలా చెప్పారు:

భారత దేశమునకు స్వరాజ్యము లభించినందుకు ఇక ముందు దేశభాషలకు విశేషవ్యాప్తి ఏర్పడి ఇట్టి (పెద్దబాలశిక్ష) గ్రంథములకు వేలకువేలు ప్రచారమగునని తలంచుచున్నాను.ఇప్పుడు భారత దేశానికి స్వరాజ్యం వచ్చిన ఏభైతొమ్మిది సంవత్సరాలకు కూడా వయోజనులకే కాక, తెలుగు పిల్లలకు తెలుగుదనాన్ని నేర్పి చక్కని పండితపౌరులుగా తీర్చిదిద్దే సామర్థ్యం ఈ పెద్ద బాలశిక్షకు ఉంది.

1983లో రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రాశస్త్యాన్ని గ్రహించి కొన్ని భాగాల్ని పాఠ్యాంశాలుగా కూడా చేర్చింది.పత్రికాధిపతులు, విజ్ఞులు పెద్ద బాలశిక్షను గుణశీల పేటికగా అభివర్ణించారు.

పెద్దబాలశిక్ష పేజీ 32, నీతివాక్యములు

ఆరుద్ర పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి' చేత బాలశిక్ష అని వ్రాశారు గానీ, పుదూరు పుదూరు సీతారామశాస్త్రి వేరు. చదలవాడ సీతారామశాస్త్రి వేరు. పుదూరు సీతారామశాస్త్రి అనే వారు వజ్ఝల సీతారామశాస్త్రి . వీరి తమ్ములు వజ్ఝల నారాయణశాస్త్రి. వారు అన్నగారైన పుదూరు సీతారామశాస్త్రి గారికి బాలశిక్ష మలి ముద్రణలో తోడ్పడ్డారు. వీరు ఏనుగుల వీరాస్వామయ్యతో బాటు కాశీ యాత్రలో పాల్గొని పుదూరుకు వారిని తీసికెళ్లారు.

ఆ తర్వాత ఈ వందేళ్ళలో ఎన్నో పెద్దబాల శిక్షలను ఎందరో ముద్రించారు. ప్రస్తుతం గాజుల సత్యనారాయణ గ్రంధ్ర కర్తగా ఉండగా, విజయవాడకు చెందిన వనజా ఆఫ్ సెట్ ఫింటర్స్ ద్వారా పెద్దబాల శిక్ష ముద్రణ అవుతోంది. మహా భారతంలో 18 పర్వాలున్నట్టే నేడు పెద్దబాల శిక్ష - భాషావిజ్ఞాన పర్వం, సంస్కృతీ సంప్రదాయ పర్వం, బాలానంద పర్వం, శతక పర్వం, నీతి కథా పర్వం, సంఖ్యా శాస్త్ర పర్వం, ఆధ్యాత్మిక పర్వం, కంప్యూటర్ పర్వం, గణిత శాస్త్ర పర్వం, విజ్ఞాన శాస్త్ర పర్వం, వాస్తు శాస్త్ర పర్వం, పంచాంగ పర్వం, ఆరోగ్య పర్వం, మహిళా పర్వం, క్రీడారంగ పర్వం, ఆంధ్ర ప్రదేశ్ పర్వం, భారతదేశ పర్వం, ప్రపంచ పర్వం అను 18 పర్వాలతో మేటి పుస్తకంగా పేరు పొందినది.

ప్రజాదరణ పొందిన కొన్ని బాలశిక్ష ప్రచురణలు

[మార్చు]

ఆవశ్యకత

[మార్చు]

తెలుగు వారు చదవాల్సిన పుస్తకాల్లో పెద్దబాల శిక్ష అతి ముఖ్యమైనది, ప్రతి తెలుగువారి ఇంట్లో ఉండవలసిన పుస్తకం పెద్దబాల శిక్ష. ఈ పుస్తకం బ్రిటీషువారు భారతదేశాన్ని పాలించే కాలంలో గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పాఠ్యపుస్తకంగా ఉండేది. పూర్వం పెళ్ళిసంబంధాలు మాట్లాడేటప్పుడు "మీ అబ్బాయి ఏం చదివాడు?" లేదా "మీ అమ్మాయి ఏం చదివింది?" అని అడిగితే "మావాడు పెద్దబాల శిక్ష పూర్తి చేశాడు", "మా ఆమ్మాయికి పెద్దబాల శిక్ష కంఠోపాఠం వచ్చు" అని గొప్పగా చెప్పేవారు. పెద్దబాలశిక్ష గ్రంథాన్ని పూర్తిగా చదివితే ప్రపంచంలోని అన్ని విషయాల గురించి తెలుసుకున్నట్లు భావించేవారు. తెలుగు సంస్కృతి, తెలుగు కథలు, విజ్ఞాన శాస్త్రం, క్రీడలు, సాహిత్యం వగైరా విషయాలు గల పెద్దబాల శిక్షను తెలుగు ఎన్ సైక్లోపెడియాగా పేర్కొనవచ్చు. 1960, 1970 శకాల్లో ఆంగ్ల విద్య ప్రవేశం వలన ఈ పుస్తకం ఆదరణ కోల్పోయినా ఇటీవల మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు తెలుగువారు అత్యంత ప్రియంగా ఆదరించే పుస్తకంగా పేరొందింది.

మూలాలు

[మార్చు]
  • బుడ్డిగ సుబ్బరాయన్ గారి సురభి-పెద్ద బాలశిక్ష (1997) [లోని ఆరుద్ర గారి ఆనంద వాక్యాలు, బుడ్డిగ సుబ్బరాయన్ గారి నా మాట ]

ఇవీచూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
Wikibooks
Wikibooks
వికిబుక్స్ లో ఈ విషయము మీద మరింత సమాచారము కలదు