పేషన్స్ కూపర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పేషన్స్ కూపర్

పేషన్స్ కూపర్ (English:Patience Cooper) (19051983) తొలి తరము భారతీయ సినిమా నటి. కలకత్తాకు చెందిన ఆంగ్లో-ఇండియన్ కుటుంబములో[1] జన్మించిన పేషన్స్, విజయవంతమైన మూకీ చిత్రాల్లోను, టాకీ చిత్రాల్లోను నటించి రెండిటిలో తొలి భారతీయ తారగా పేరుతెచ్చుకొన్నది.[2]

రంగస్థల జీవితము

[మార్చు]

కూపర్, బాండ్‌మాన్స్ మ్యూజికల్ కామెడీ అనే యురేషియన్ బృందములో నర్తకిగా జీవితాన్ని ప్రారంభించినది. ఆ తరువాత జమ్షెడ్జీ ఫ్రాంజీ మదన్ స్థాపించిన కొరింథియన్ స్టేజ్ కంపెనీ అనే నాటక సంస్థలో నటిగా చేసినది. ఈ సంస్థనే తర్వాత కాలములో భారతదేశములో సినిమా నిర్మాణము, పంపిణీ, ప్రదర్శనలను చేపట్టిన మదన్ థియేటర్ లిమిటెడ్ గా ఆవిర్భవించింది.

సినీ రంగములో

[మార్చు]

పేషన్స్ కూపర్, 1921లో తన తొలి సినిమా విష్ణు అవతార్ తో మొదలుకొని 1944 సినిమా జీవితము నుండి విరమణ పొందే ముందు నటించిన ఇరాదా (యోచన) వరకు 40కి పైగా సినిమాలలో నటించినది. కూపర్ చరచూ తన చుట్టూ ఉన్న మగాళ్ల వలన నైతిక సంధిగ్దత మధ్య కొట్టుమిట్టాడే అమాయక అమ్మాయి పాత్రలను పోషించినది. భారతీయ సినిమా రంగములో మొట్టమొదటి ద్విపాత్రాభినయము చేసిన తొలి నటి కూపరే. 1923లో విడుదలైన పత్నీ ప్రతాప్ లో ఇద్దరు అక్కచెల్లెల్ల పాత్రలు పోషించినది. 1924లో విడుదలైన కాశ్మీరీ సుందరిలో తల్లీకూతుళ్ల పాత్రలు పోషించినది.

కూపర్ నటించిన సినిమాలలో అత్యంత విజయవంతమైనది 1922లో విడుదలైన పతి భక్తి. ఇందులో కూపర్ లీలావతి పాత్రను పోషించింది. జె.జె.మదన్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా స్త్రీలు తమ భర్తల యెడల ఆరాధ్య భావనతో మొలగవలెనని ప్రభోదించింది. ఇది పేషన్స్ యొక్క అత్యున్నత చిత్రంగా భావిస్తారు. మద్రాసులో ఈ సినిమా చిన్న దుమారంలో కూడా చిక్కుకున్నది. అసభ్యంగా ఉందన్న కారణంగా సెన్సారు వారు ఒక పాటను తొలగించాలని ఆదేశించారు. పేషన్స్ కూపర్ ను తారాపథానికి తీసుకెళ్ళటానికి ఆమె హాలీవుడ్ లుక్కే ప్రధాన కారణం. ఆమె నల్లని, స్పష్టమైన కళ్ళు, తెల్లని మేనిఛాయ సాంకేతిక నిపుణులకు హాలివుడ్ నుండి అనుకరించిన ఐ లెవల్ లైటింగు పద్ధతులతో ప్రయోగాలు చేసేందుకు దోహదపడ్డాయి. భారతీయ సినిమా రంగంలో ఈ కంటి స్థాయి లైటింగును చాలా అరుదుగా ఉపయోగిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. p 163, Parama Roy, Indian Traffic: Identities in Question in Colonial and Postcolonial India, University of California Press, ISBN 0520204875
  2. "Personalities of Indian Cinema - Silent screen stars". www.indiaheritage.org. Archived from the original on 2007-10-19. Retrieved 2009-02-16.