Jump to content

ప్రత్యంగిరా దేవి

వికీపీడియా నుండి
ప్రత్యంగిరా దేవి
సింహవాహనంపై ప్రత్యంగిర అమ్మవారు
ఇతర పేర్లునారసింహి, అథర్వణ భద్రకాళి, ప్రత్యంగిర, సింహముఖి
సంస్కృతంप्रत्यङ्गिरा
అనుబంధంమహాదేవి, మహాలక్ష్మి, భద్రకాళి
ఆయుధములుత్రిశూలం, డమరుకం, కపాలం, పాషం
భర్త / భార్యనరసింహావతారం[1]
వాహనంసింహం
పాఠ్యగ్రంథాలుఅథర్వవేదం, దేవీ భాగవతం, కాళికా పురాణం
ప్రత్యంగిరా యంత్రం

ప్రత్యంగిరా దేవి (సంస్కృతం: प्रत्यङ्गिरा) అథర్వణ భద్రకాళి, నారసింహి, నికుంబల అని కూడా పిలువబడే హిందూ దేవత, శాక్తమతంతో సంబంధం కలిగి ఉంది. ఆమెను నరసింహస్వామి వారి స్త్రీ శక్తిగా వర్ణించారు.[2][3] వేదాలలో, ప్రత్యంగిరాదేవిని మొదట్లో, అథర్వవేద దేవతయైన అథర్వణ భద్రకాళి రూపంలో కొలిచారు.

అష్టమాతృకలలో నారసింహి ఒక భాగం. అష్టమాతృకలు అంటే ఎనిమిది దేవతల శక్తులు. వీరిని సప్తమాతృకలు అని కూడా అంటారు. అయితే, వీరిలో బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేశ్వరి, చాముండి ఉంటారు. అదనంగా, మహాలక్ష్మి (నారసింహి/ప్రత్యంగిర) కూడా అష్టమాతృకల సమూహంలో భాగం.

పురాణాలు

[మార్చు]

నారసింహికి సంబంధించిన వివిధ ఇతిహాసాలను వివరించే అనేక హిందూ గ్రంథాలు ఉన్నాయి.

దేవి మహాత్మ్యం లోని ఒక కథలో, ప్రత్యంగిర అమ్మవారు అష్టమాతృకలలో ఒకరు. ఆది పరాశక్తి రూపమైన ఎనిమిది మాతృదేవతలలో ఆమె ఒకరు. ఆమె స్వర్గలోకం ఆక్రమించిన శుంభ, నిశుంభులనే రాక్షసులను ఓడించడానికి యుద్ధం చేసింది.[4]

కొన్ని పురాణాల ప్రకారం, కృతయుగం చివరిలో విపులాసురుడనే దుష్ట రాక్షసుడు ఉండేవాడు. అష్టలక్ష్మీదేవి యజ్ఞాలు నిర్వహిస్తున్న ఎనిమిది మంది ఋషుల బృందాన్ని విపులాసుడు కలవరపరిచాడు. దీంతో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. పవిత్ర తామర పువ్వును బలమైన కవచంగా ఋషులకు మారుస్తుంది. ఇలా రూపాంతరం చెందిన తామర పుష్పంలో 562 రేకులు ఉన్నాయని కూడా ప్రస్తావించబడింది. ఈ కవచం ఎనిమిది మంది ఋషులకు గొప్ప రక్షణను అందించింది, వారికి ఎటువంటి భంగం కలగకుండా పవిత్ర ఆచారాలను నిర్వహించడానికి వీలు కల్పించింది. దీని తరువాత, లక్ష్మిదేవి నారసింహి రూపాన్ని స్వీకరించి, విపులాసుర అనే రాక్షసుడిని సంహరించింది.[5]

మార్కండేయ పురాణం, శివ పురాణాల ప్రకారం, త్రేతాయుగ ప్రారంభంలో విష్ణువు దశావతారాలలో నాల్గవ అవతారమైన నరసింహస్వామి, రాక్షస రాజు హిరణ్యకశిపుడిని చంపాడు. ఈ కథ ప్రహ్లాదుడు నరసింహ స్వామిని ప్రసన్నం చేయడంతో ముగుస్తుంది. అతను విష్ణువుగా తన నిజమైన రూపాన్ని స్వీకరించిన తరువాత వైకుంఠానికి తిరిగి వస్తాడు.[6] శైవ సంప్రదాయంలో, నరసింహస్వామిని శాంతింపచేయడానికి శివుడు శూలిని దేవి, ప్రత్యంగిరా దేవిలను రెండు రెక్కలుగా చేసుకుని పక్షి-సింహం సంకర రూపమైన శరభ రూపాన్ని స్వీకరించాడు. ఇది చూసిన నరసింహస్వామి, శరభంతో పోరాడటానికి శక్తివంతమైన రెండు తలల పక్షి, గంధబేరుండను సృష్టించాడు. శరభ, గంధబేరుండ మధ్య పోరాటం ప్రపంచాన్ని భయపెడుతోందని చూసిన శరభం, ఉగ్రరూపిణియైన ప్రత్యంగిరను తన మూడవ కన్ను నుండి విడుదల చేసాడు. ఇలా ప్రత్యంగిరాదేవి నరసింహస్వామిని శాంతింపజేయగలిగింది. దాంతో అతను తన సాత్విక రూపాన్ని తిరిగి పొందాడు. ఆ విధంగా ప్రపంచంలో ధర్మం పునరుద్ధరించబడింది.[7]

'ప్రతి' అనే పదానికి తిప్పికొట్టడం అని అర్థం. అందువల్ల, ఏదైనా చేతబడులను ప్రత్యంగీర అమ్మవారు తిప్పికొడుతుంది అని నమ్ముతారు. దక్షిణ భారతదేశంలోని దేవాలయాలలో, ఆమె అథర్వవేద అవతారంగా పరిగణించబడుతున్నందున ఆమెను అథర్వణ భద్రకాళి అనే పేరుతో కూడా పూజిస్తారు.

సాహిత్యం

[మార్చు]

రామాయణంలో కూడా ప్రత్యంగిరామాత ప్రస్తావన ఉంది. శ్రీరాముడు, అతని సైనికులు లంకలో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రజిత్తు, ప్రత్యంగిర అమ్మవారి మరొక పేరు అయిన నికుంబలను పూజిస్తూ, నికుంబల యజ్ఞం చేయడం ప్రారంభించాడు. హనుమంతుడు ఆ ప్రదేశానికి వచ్చి ఆ కర్మను నిలిపివేసినట్లు చెప్పుతారు. ఎందుకంటే అది పూర్తయితే ఇంద్రజిత్తుకు అజేయత్వం లభించేది.[8] పర్యవసానంగా, లక్ష్మణుడు యుద్ధంలో అతనిని సంహరించగలిగాడు.

ఆరాధన

[మార్చు]

తంత్రంలో ప్రావీణ్యం ఉన్న గురువు మార్గదర్శకత్వం ద్వారా మాత్రమే ప్రత్యంగీర అమ్మవారి ఆరాధన జరుగుతుంది.[9] ప్రజల సంక్షేమం కోసం, దుష్ట శక్తుల ప్రభావాలను తొలగించడానికి అనేక ఆలయాలలో ప్రత్యంగిరా మాతకు పూజలు నిర్వహిస్తారు. కొన్ని దేవాలయాలలో అమావాస్య రోజులలో ప్రత్యంగిరా హోమం ప్రత్యేకంగా నిర్వహిస్తారు.[10] అయితే, భక్తులు కోరికలు కోరుకున్నప్పుడు, మరీ ముఖ్యంగా చంపడం, పీడించడం వంటి దుష్కార్యాలలో, తిరిగి వాటిని ఉపసంహరించుకోవడం అసాధ్యం అని అంటారు.

మూలాలు

[మార్చు]
  1. Kindler, Babaji Bob (4 July 1996). Twenty-Four Aspects of Mother Kali. SRV Associations. ISBN 9781891893179.
  2. Nagar, Shanti Lal (1989). The Universal Mother (in ఇంగ్లీష్). Atma Ram & Sons. ISBN 978-81-7043-113-8.
  3. Punja, Shobita (1996). Daughters of the Ocean: Discovering the Goddess Within (in ఇంగ్లీష్). Viking. ISBN 978-0-670-87053-0.
  4. Bhattacharji, Sukumari; Sukumari (1998). Legends of Devi (in ఇంగ్లీష్). Orient Blackswan. ISBN 978-81-250-1438-6.
  5. Nagar, Shanti Lal (2007). Śiva-mahāpurāṇa: Māhātmyam, Vidyeśvara saṁhitā, Rudra saṁhitā (Sr̥ṣṭi khaṇḍa, Satī khaṇḍa and Pārvatī khaṇḍa) (in ఇంగ్లీష్). Parimal Publications. ISBN 978-81-7110-298-3.
  6. Swami, Bodhasarananda (2016-03-02). Stories from the Bhagavatam (in ఇంగ్లీష్). Advaita Ashrama. ISBN 978-81-7505-814-9.
  7. "The Mother Who Calmed Down Ugra Narasimha - Sri Maha Pratyangira Devi" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-10-29.
  8. Dharma, Krishna (2020-08-18). Ramayana: India's Immortal Tale of Adventure, Love, and Wisdom (in ఇంగ్లీష్). Simon and Schuster. p. 390. ISBN 978-1-68383-919-4.
  9. Ajit Mookerjee KALI Brill Archive 1988
  10. "Pratyangira Devi Homa". nanjangud.info. Archived from the original on 2020-01-27. Retrieved 2016-01-17.