Jump to content

ప్రాజెక్టు యూనిగేజ్

వికీపీడియా నుండి
భారతదేశంలో వివిధ గేజ్‌ల ప్రామాణిక గేజ్‌తో పోల్చడం

భారతీయ రైల్వేలు ప్రాజెక్టు యూనిగేజ్ పథకాన్ని 1992లో ప్రారంభించింది. దేశంలోని మీటర్ గేజ్, నారో గేజ్ మార్గాలన్నింటిని బ్రాడ్ గేజ్ (1.676 మీ. / 5 అడుగుల ఆరు అంగుళాలు) గా మార్చడం దీని ప్రాథమిక లక్ష్యం.

నేపథ్యం 

[మార్చు]

1992 ప్రాంతంలో భారతీయ రైల్వే విభిన్న గేజు మార్గాలవల్ల ప్రయాణికులకు కలుగుతున్న ఇబ్బందులు (ముఖ్యంగా ఒక మీటర్ గేజ్ లేదా నారో గేజ్ రైలు దిగి బ్రాడ్ గేజ్ రైలు ఎక్కడం) తొలగించాలని భావించింది. అందుకే దేశమంతా ఏకరూప గేజ్(యూనిగేజ్) విధానం ఉండాలని నిర్ణయించింది. పైగా నారో గేజ్ మార్గాల నిర్వహణ వ్యయం భారీగా మారడం కూడా ఒక కారణం.వీటన్నింటి మూలాన 1992లో ప్రాజెక్టు యూనిగేజ్ పథకం తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా బ్రాడ్ గేజ్ 1,676 ఎం.ఎం. (5 అడుగుల ఆరు అంగుళాలు) కు మీటర్, నారో గేజ్ మార్గాలను మార్చాలని కార్యాచరణ రూపొందించింది.

1991లో నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు లోక్ సభకు ఎన్నికయ్యేందుకు వీలుగా నంద్యాల లోక్ సభ స్థానానికి అప్పటి ఎం.ఫి. గంగుల ప్రతాప రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ నియోజకవర్ర్గంగానికి ఉప ఎన్నిక అవసరమైంది. అప్పుడు లోక్ సభకు పోటీ చేసిన పీవీ నరసింహారావు ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ నంద్యాలకు బ్రాడ్ గేజ్ లైన్ నిర్మిస్తామని వాగ్దానం చేశారు. గుంటూరు-గుంతకల్ మీటర్ గేజ్ సెక్షన్ ను బ్రాడ్ గేజ్ చేస్తామని ప్రకటించారు. ఆయన నంద్యాల నుంచి లోక్ సభకు ఎన్నికైన తరువాత ఇచ్చిన హామీలను అమలు చేసే కార్యాచరణ ప్రారంభించారు. దీనిలో భాగంగా గుంటూరు-గుంతకల్ సెక్షన్ గేజ్ మార్పిడి (బ్రాడ్ గేజ్ గా మార్చే పని) కోసం ప్రత్యేకంగా ఒక ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో నాటి రైల్వే మంత్రి సి. కె. జాఫర్ షరీఫ్, రైల్వే బోర్డు ఛైర్మన్, సభ్యులు పాల్గొన్నారు. దీనికి పీవీ వారికి కేటాయించిన సమయం కేవలం 15 నిమిషాలు మాత్రమే. కానీ సమావేశం గంటన్నరపాటు సాగింది. దీనిలో నాటి రైల్వేమంత్రి జాఫర్ షరీఫ్- రైల్వే దేశవ్యాప్తంగా ఒకే గేజ్ విధానం(యూనిగేజ్) కోసం 1972లో తయారు చేసిన ప్రాజెక్టు నివేదికను ఈ సమావేశంలో ఉంచారు. ఎందుకంటే.. గుంటూరు-గుంతకల్ మీటర్ గేజ్ సెక్షన్ ను బ్రాడ్ గేజ్ చేయాలంటే ఆనాటి పరిస్థితుల్లో అధి సాధ్యంకాదు. అప్పటికి భారతీయ రైల్వే ఏటా కేవలం వంద కి.మీ. మాత్రమే గేజ్ మార్పిడి చేస్తుండేది. దాని ప్రకారం చూస్తే ఈ సెక్షన్ను పూర్తి చేయాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది. అందుకే ఏటా 1200 కి.మీ చొప్పున ఐదేళ్లలో 6000 కి.మీ. పూర్తి చేయాలని లక్ష్యం. అలా ఇరవై ఏళ్లలో మొత్తం 24 వేల కి.మీ. మీటర్ గేజ్, 3000 కి.మీ. నేరో గేజ్ మార్గాల గేజ్ మార్పిడి చేపట్టాలని, దీని కోసం ప్రాజెక్టు యూనిగేజ్ పథకం మాత్రమే అనువైనదని ఈ సమావేశంలో ప్రతిపాదించారు. దీనికి నాటి ప్రధాని పీవీ నరసింహా రావు ఆమోదం తెలిపారు.

ఆవిధంగా 1992-93 ఆర్థిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ప్రాజెక్ట్ యూనిగేజ్ కార్యాచరణ ప్రారంభమైంది. అయితే తొలి నాలుగేళ్లలో (1996 ఫిబ్రవరి నాటికి) గుంటూరు నుంచి నంద్యాల వరకు మాత్రమే మీటర్ గేజ్ ను బ్రాడ్ గేజ్ గా మార్చారు. ఆతరువాత 1998 మధ్య కాలానికి గుంతకల్ వరకు పూర్తి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే గుంటూరు-నంద్యాల- గుంతకల్ లైను కోసమే ప్రాజెక్ట్ యూనిగేజ్ పథకాన్ని తీసుకువచ్చినట్లయింది. ప్రధాన మంత్రి ప్రాతినిధ్యంవహిస్తున్ననంద్యాల నియోజకవర్గంలో- ఆయన ఇచ్చిన హామీ మేరకు ఆలైన్ పూర్తికావాలంటే ఈపథకం తీసుకురావడం తప్పనిసరయింది.

గుంటూరు-నంద్యాల-గుంతకల్ సెక్షన్ లో ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు ప్రాతినిధ్యంవహిస్తుండగా సికింద్రాబాద్-మహబూబ్ నగర్-కర్నూలు-డోన్ సెక్షన్ లో మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి రైల్వే శాఖ సహాయ మంత్రి మల్లికార్జున్, కర్నూలు జిల్లా డోన్ (అసెంబ్లీ స్థానం) నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యంవహించడంవల్ల సికింద్రాబాద్-మహబూబ్ నగర్ సెక్షన్ కూడా త్వరగా గేజ్ మార్పిడి పూర్తికావడానికి అవకాశం ఏర్పడింది. తొలిదశలో సికింద్రాబాద్-మహబూబ్ నగర్ (113 కి.మీ.) మార్గాన్ని 1993 ఆగస్టు 21న ప్రారంభించారు.

ప్రాజెక్టు యూనిగేజ్ కింద ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2010 నాటికి మొత్తం మీటర్ గేజ్ లైన్లన్నీ బ్రాడ్ గేజ్ గా మారాయి. చివరిగా ధర్మవరం-పాకాల సెక్షన్(227 కి.మీ.) బ్రాడ్ గేజ్ మార్చారు. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో ప్రస్తుతం మీటర్, నేరో గేజ్ మార్గాలు లేవు. తమిళనాడులో ఉన్న కొన్ని మార్గాలను కూడా గేజ్ మార్పిడి కోసం అక్కడ మీటర్ గేజ్ మార్గాలను తొలగించారు. బ్రాడ్ గేజ్ గా మార్చే పనులు జరుగుతున్నాయి. మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా మీటర్ గేజ్ మార్గాలు లేవు. అయితే తమిళనాడులోని మెట్టుపాళ్యం-ఉదకమండలం(ఊటీ) 46 కి.మీ. మీటర్ గేజ్ మార్గాన్ని వారసత్వ (హెరిటేజ్) లైన్ గా యునెస్కో ప్రకటించడంవల్ల దాన్ని మినహాయించారు. హెరిటేజ్ లైన్లను గేజ్ మార్పిడి చేసే అవకాశం లేదు.

ప్రస్తుత స్థితి

[మార్చు]
గేజ్[1] 2020

రూట్ కి.మీ.

2020

రూట్ వాటా

1951 

రూట్ కి.మీ.

1951 

రూట్ వాటా

బ్రాడ్ గేజ్ 1,676 ఎంఎం(1,676 mm (5 ft 6 in) 63,391 94.03% 25,258 47.0%
మీటర్ గేజ్ (1,000ఎంఎం) (1,000 mm (3 ft 3+38 in) 2,339 3.46% 24,185 45.0%
నారోగేజ్ (762ఎంఎం ) 762 mm (2 ft 6 in) and 610 ఎంఎం (610 mm (2 ft)
1,685 2.50% 4,300 8.0%
మొత్తం 67,415 100% 53,743 100%

బ్రాడ్ గేజ్ గా మార్చని లైన్లు

[మార్చు]

దేశంలో ఐదు మార్గాలను వారసత్వ మార్గాలుగా యునెస్కో ప్రకటించింది. వీటిని బ్రాడ్ గేజ్ గా మార్చే అవకాశం లేదు.

  1. జోగీందర్ నగర్-పఠాన్ కోఠ్ 167 కి.మీ.(నేరో గేజ్)
  2. శిమ్లా-కల్కా 96 కి.మీ.(నేరో గేజ్)
  3. నేరల్-మథెరాన్ 21 కి.మీ.(నేరో గేజ్)
  4. డార్జిలింగ్-న్యూజల్పాయిగురి 99 కి.మీ.(నేరో గేజ్)
  5. ఉదకమండలం-మెట్టుపాళ్యం 46 కి.మీ.(మీటర్ గేజ్)

References

[మార్చు]
  1. "Indian Railways Year Book 2018 - 2019" (PDF). Ministry of Railways (Railway Board). New Delhi: Indian Railways Statistical Publications. p. 6. Retrieved 2020-03-31.