భారతీయ రైల్వేలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
భారతీయ రైల్వేలు
తరహా ప్రభుత్వ పరమైన
స్థాపన ఏప్రిల్ 16, 1853, జాతీయం 1951
ప్రధానకేంద్రము కొత్తఢిల్లీ, భారతదేశం
Area served భారతదేశం
కీలక వ్యక్తులు రైల్వేశాఖ మంత్రి:
m:en:piyush goyal పియుష్ గోయల్
పరిశ్రమ రైల్వేలు మరియు లోకోమోటివ్స్
ఉత్పత్తులు రైలు రవాణా, సరుకుల రవాణా, సర్వీసులు
రెవిన్యూ INR 1,63,450 కోట్లు (25 బిలియన్లుడాలర్లు)(2014–15)
ఉద్యోగులు 13,34,000 (2014)
మాతృ సంస్థ రైల్వేమంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం
విభాగాలు 16 రైల్వే విభాగాలు (కొంకణ్ రైల్వే గాక)
నినాదము "జాతి జీవనరేఖ"
వెబ్ సైటు www.indianrailways.gov.in

భారతీయ రైల్వేలు (ఆంగ్లం: Indian Railways; హిందీ: भारतीय रेल Bhāratīya Rail); సంక్షిప్తంగా భా.రే.) భారత ప్రభుత్వ విభాగము. భారతదేశంలో రైల్వేలు మొదటిసారిగా 1853 లో ప్రవేశపెట్టబడ్డాయి. 1947 (స్వతంత్రం వచ్చే)నాటికి దేశంలో మొత్తం42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి ఉన్నాయి. 1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు మరియు నగరాలలో దగ్గరి ప్రయాణాలకు సబర్బన్ (suburban) అనగా పట్టణపు పొలిమేరలవరకు) అవసరమైన రైళ్ళను నడుపుతోంది.

రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి ఉన్నాయి. భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛ్ఛత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 114500 కి.మీ. ఇది సుమారు 65000 కి.మీ రూటు పై వుంది మరియు 7500 స్టేషన్లు వున్నాయియ 20 11 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వాగన్లు, 69,000 కోచ్ లు, 9000 ఇంజిన్లు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి వున్న సంస్థలలో భారతీయ రైల్వేది (సుమారు పదనాలుగు లక్షలు)ద్వితీయ స్థానము.

భారతీయ రైల్వే కంప్యూటరీకరణలో అన్నిటిలో ప్రథమ స్థానంలో ఉంది. ముందస్తుగా ప్రయాణం ఖరారు చేసుకునేటందులకు మరియు మార్పులు చేసుకునేందుకు సౌకర్యం అందిస్తోంది. ఈ విభాగం భారతీయ రైల్వే ఆహార నిర్వహణ మరియు పర్యాటక సంస్థ నిర్వహిస్తుంది. ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి (కేబినెట్ హోదా) నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కింద పనిచేస్తుంది. దీనిని పరిపాలనా సౌలభ్యం కోసం 17 జోన్లుగా విభజించారు.

చరిత్ర[మార్చు]

బాంబే - థానే రైలు, 1853 -- భారతీయ రైల్వేల ప్రారంభకాలంనాటి చిత్రం.
ముంబై లోకల్ రైలు
Darjeeling Himalayan Railway.jpg

భారతదేశంలో రైలు మార్గాల కొరకు మొదటిసారిగా 1832లో ప్రణాళిక ప్రవేశపెట్టబడినప్పటికీ, ఆ తరువాత మరో దశాబ్దం వరకూ ఇందులో ఎటువంటి పురోగతి సాధించలేదు. 1844లో అప్పటి గవర్నర్ జనరెల్ విస్కౌంట్ హార్డింగ్ (Lord Hardinge) రైల్వేలలో ప్రయివేటు వ్యక్తుల పెట్టుబడులను అనుమతించాడు. ఇదే కాక రెండు రైల్వే సంస్థలను (బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ)స్థాపించి నూతన పెట్టుబడిదారులకు సాహయపడవలసిందిగా కోరాడు. ఆ తరువాతి కొద్ది సంవత్సరాలలో బ్రిటిష్ పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా అనేక రైలు మార్గాలు వేగంగా నిర్మించబడ్డాయి. భారతదేశంలో మొట్టమొదటి రైలు 1851 డిసెంబరు 22న నడుపబడింది. ఇది రూర్కీలో నిర్మాణ సామాగ్రిని తరలించడానికి వినియోగించబడింది. ఆ తరువాత ఒకటిన్నర సంవత్సరాలకు అనగా ది.1853 ఏప్రిల్ 16లో మొదటి ప్రయాణీకుల రైలు బోరిబందర్, బొంబాయి, థాణేల మధ్య నడుపబడింది. ఈ ప్రయాణం మొత్తం దూరం 34 కి.మీ కాగా, సాహిబ్, సుల్తాన్, సింధ్ అనే ఇంజిన్లను వినియోగించారు. ఒక విధంగా ఈ సంఘటన భారత రైల్వేలకు అంకురార్పణ చేసిందని చెప్పుకోవచ్చు.

పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నూతన పధకాలను ప్రవేశపెట్టింది. ఈ పధకం ప్రకారం, పెట్టుబడిదారులకు మొదటి కొద్ది సంవత్సరాలకు కనీసం ఐదు శాతం లాభాలకు హామీ లభిస్తుంది. సంస్థ ప్రారంభమైన తరువాత అది బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనమౌతుంది, కానీ సంస్థ మీద అజమాయిషీ మాత్రం పెట్టుబడిదారుల వద్దే ఉంటుంది. దీంతో 1880కి, మొత్తం రైలు మార్గాల దూరం 14,500 కి.మీ (9000 మైళ్ళు) వరకు విస్తరించింది. ఇందులో అధికశాతం పెద్ద రేవు పట్టణాలైన బొంబాయి, మద్రాస్, కలకత్తాలను చేరుకునేందుకు నిర్మించబడ్డాయి. 1895 నాటికి భారతదేశంలో ఇంజిన్ల తయారీ మొదలయ్యింది. 1896లో భారత ఇంజినీర్లు ఉగాండా రైల్వేను నిర్మించడంలో సాయపడ్డారు.

భారత ద్వీపకల్ప రైల్వే నెట్-వర్క్ 1870 లో. ఆ కాలంలో GIPR అతిపెద్ద రైళ్ళ కంపెనీలలో ఒకటి.

ఆ తరువాత కొద్దికాలంలోనే దేశంలోని వివిధ రాజ సంస్థానాలు తమ సొంత రైలు మార్గాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ విధంగా రైలు మార్గాలు వేర్వేరు ప్రాంతాలు (ఇప్పటి రాష్ట్రాలు) అస్సాం, రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్ లకు విస్తరించాయి. 1901లో రైల్వే బోర్డు స్థాపించబడినప్పటికీ విధాన నిర్ణయాధికారం మాత్రం బ్రిటిష్ వైస్రాయ్ జెనరెల్ (లార్డ్ కర్జన్) వద్దనే వుండేది. రైల్వే బోర్డు ఆర్థిక మరియు పరిశ్రమల శాఖ కింద పని చేసేది. ఈ బోర్డును నిర్వహించేదుకు ప్రభుత్వ రైల్వే అధికారి అధ్యక్షుడు గానూ, ఇంగ్లాండు నుండి ఒక రైల్వే నిర్వహణాధికారి, రైల్వే సంస్థ ప్రతినిధి ఒకరు ఉండేవారు. రైల్వే బోర్డు చరిత్రలో మొదటి సారిగా లాభాలను ఆర్జించడం మొదలైన తరువాత 1907 లో రైల్వే సంస్థలన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ఆ తరువాతి సం.లో మొదటి సారిగా విద్యుత్ ఇంజిన్లను ప్రవేశపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైన తరువాత రైల్వేలు బ్రిటీష్ వారి అవసరాల కోసం దేశం వెలుపల కూడా వినియోగించడం జరిగింది. ప్రపంచ యుద్ధం పూర్తయ్యే సరికి రైల్వేలు బాగా దెబ్బ తిని మూల పడ్డాయి, దాంతో 1920లో ప్రభుత్వం వాటి నిర్వహణను తన ఆధీనంలోకి తీసుకొని రైల్వేల ఆర్థిక వ్యవహారాలను ఇతర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నుండి వేరు చేసింది. ఈ విధానం ఇప్పటికీ ప్రత్యేక రైల్వే బడ్జెట్ రూపంలో అమలులో ఉంది.

ఆ తరువాతి కాలంలో సంభవించిన రెండవ ప్రపంచ యుద్ధంలో ట్రైన్లను మధ్య ప్రాచ్యంలోకి తరలించడంతో రైల్వేలు మరింత దెబ్బ తిన్నాయి. రైల్వే కర్మాగారాలు ఆయుధ కర్మాగారాలుగా మారిపోయాయి. 1947 లో స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో అధిక శాతం రైలు మార్గాలు కొత్తగా అవతరించిన పాకిస్థాన్ లో ఉండి పోయాయి. దాంతో మిగిలిన నలభై రెండు వేర్వేరు రైలు మార్గాలను (రాజ సంస్థానాల ఆధీనంలో ఉన్న ముప్పై రెండు మార్గాలతో సహా) కలుపుకొని ఏకైక సంస్థ "భారతీయ రైల్వే" అవతరించింది. 1951లో అప్పటి వరకు వేర్వేరుగా ఉన్న రైల్వేలను మార్చి, మొత్తం ఆరు ప్రాంతీయ విభాగాలను ఏర్పాటు చేయటం జరిగింది. భారత దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు పడటంతో అన్ని రైల్వే కర్మాగారాలు పూర్తిగా దేశీయ సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగంలోకి తెచ్చాయి. సం.1985 నాటికి అప్పటి వరకూ వినియోగంలో ఉన్న ఆవిరి యంత్రాలకు బదులుగా డీసెల్ మరియు విద్యుత్ యంత్రాలు ప్రవేశించాయి. 1995 నాటికి దేశంలోని రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ మొత్తం కంప్యూటరీకరించబడింది. ప్రపంచలో చైనా మిలిటరీ తరువాత అత్యధిక ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థగా భారత రైల్వేలు రికార్డును సృష్టించాయి.[ఆధారం చూపాలి]

రైల్వే గణాంకాలు[మార్చు]

భారత రైల్వే నెట్-వర్క్ యొక్క మ్యాపు.

రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 114500 కి.మీ .[1]. ఇది సుమారు 65000 కి.మీ రూటు పై వుంది మరియు 7500 స్టేషన్లు వున్నాయియ [1] 20 11 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వాగన్లు, 69,000 కోచ్ లు, 9000 ఇంజిన్లు ఉన్నాయి.[1] భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛ్ఛత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. ఇది ప్రతి రోజూ మూడు కోట్ల ప్రయాణీకులను గమ్యం చేరుస్తూండడమే కాక మరో 28 లక్షల మెట్రిక్ టన్నుల సరుకులను కూడా రవాణా చేస్తోంది.[2] ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను (సుమారు పదనాలుగు లక్షలు)కలిగి వున్న సంస్థలలో భారతీయ రైల్వేది ద్వితీయ స్థానము.

రైల్వే విభాగాలు[మార్చు]

భారతరైల్వేల మ్యాపు.

పాలనా సదుపాయం కోసం భారతీయ రైల్వేలను 17 జోనులుగా విడగొట్టారు.

వ. పేరు సూక్ష్మరూపం స్థాపించిన తేదీ కేంద్రము విభాగము
1. ఉత్తర రైల్వే NR ఏప్రిల్ 14, 1952 ఢిల్లీ అంబాలా కంటోన్మెంట్, ఫెరోజ్‌పూర్, లక్నో, మొరదాబాద్
2. ఈశాన్య రైల్వే NER 1952 గోరఖ్‌పూర్ ఇజ్జత్‌నగర్, లక్నో, వారణాసి
3. ఈశాన్య సరిహద్దు రైల్వే NFR 1958 గౌహతి అలీపూర్‌ద్వార్ జంక్షన్, కతిహార్, లుమ్‌డింగ్, రంగియా, తిన్‌సుఖియా
4. తూర్పు రైల్వే ER ఏప్రిల్, 1952 కోలకతా హౌరా, సియల్దా, అనసోల్, మాల్దా
5. ఆగ్నేయ రైల్వే SER 1955 కోలకతా అద్రా, చక్రధర్ పూర్, ఖరగ్‌పూర్, రాంచీ
6. దక్షిణ మధ్య రైల్వే SCR అక్టోబరు 2, 1966 సికింద్రాబాదు సికింద్రాబాదు, హైదరాబాదు, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్, విజయవాడ
7. దక్షిణ రైల్వే SR ఏప్రిల్ 14, 1951 చెన్నై చెన్నై, మదురై, పాలఘాట్, తిరుచిరాపల్లి, త్రివేండ్రం, సేలం కోయంబత్తూరు
8. మధ్య రైల్వే CR నవంబరు 5, 1951 ముంబై ముంబై, భూసావల్, పూణె, షోలాపూర్, నాగపూర్
9. పశ్చిమ రైల్వే WR నవంబరు 5, 1951 ముంబై ముంబై సెంట్రల్, బరోడా, రత్లాం, అహ్మదాబాదు, రాజకోట్, భావ్‌నగర్
10. నైరుతి రైల్వే SWR ఏప్రిల్ 1, 2003 హుబ్లీ హుబ్లీ, బెంగళూరు, మైసూరు
11. వాయువ్య రైల్వే NWR అక్టోబరు 1, 2002 జైపూరు జైపూరు, అజ్మీర్, బికనీర్, జోధ్‌పూర్
12. పశ్చిమ మధ్య రైల్వే WCR ఏప్రిల్ 1, 2003 జబల్ పూర్ జబల్ పూర్, భోపాల్, కోటా
13. ఉత్తర మధ్య రైల్వే NCR ఏప్రిల్ 1, 2003 అలహాబాదు అలహాబాదు, ఆగ్రా, ఝాన్సీ
14. ఆగ్నేయ మధ్య రైల్వే SECR ఏప్రిల్ 1, 2003 బిలాస్‌పూర్ CG బిలాస్‌పూర్, రాయపూర్, నాగపూర్
15. తూర్పు తీర రైల్వే ECoR ఏప్రిల్ 1, 2003 భువనేశ్వర్ ఖుర్దారోడ్, సంబల్‌పూర్, విశాఖపట్టణం
16. తూర్పు మధ్య రైల్వే ECR అక్టోబరు 1, 2002 హాజీపూర్ దానాపూర్, ధన్‌బాద్, మొఘల్ సారాయ్, సమస్తిపూర్, సోనాపూర్
17. కోల్‌కతా మెట్రో రైల్వే KMR డిసెంబ‌రు 31, 2010 కలకత్తా కోల్‌కతా మహానగర ప్రాంతం, దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు

ప్రతి ప్రాంతీయ విభాగం నిర్వహణలో వున్న ప్రాంతాన్ని కొన్ని డివిజన్లుగా విభజించారు. ప్రతి డివిజన్ కూ ఒక ముఖ్య పట్టణం వుంటుంది. దేశమంతటా కలిపి మొత్తం అరవై ఏడు డివిజన్లు ఉన్నాయి.

ప్రయాణీకుల సౌకర్యాలు[మార్చు]

భారతీయ రైల్వేలు మొత్తం 8,702 ప్రయాణీకుల రైళ్ళను నడుపుతున్నాయి. ఇవి దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో (ఢిల్లీ, పుదుచ్చేరి, ఛండీగడ్)సుమారు ఒక కోటీ యాభై లక్షల మంది ప్రయాణీకులను వారి వారి గమ్యాలకు చేరుస్తున్నాయి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలకు ఇంకా రైలు రవాణా సౌకర్యం లేదు.

భారతదేశంలో ప్రజలు దూర ప్రయాణాలకు అత్యధికంగా రైలు మర్గాలనే ఆశ్రయిస్తారు. ప్రతి సాధారణ ప్రయాణీకుల రైలులో సుమారుగా పద్దెనిమిది బోగీలు ఉండగా ప్రజాదరణ పొందిన రైళ్ళలో ఇరవై నాలుగు భోగీల వరకూ ఉంటాయి. ఈ బోగీలు పద్దెనిమిది నుండి డెబ్బైరెండు మంది ప్రయాణించేందుకు వీలుగా తయారు చేయబడ్డాయి, అయితే రద్దీ సమయాలలో ఈ భోగీలలో అంతకంటే చాలా ఎక్కువ మంది కూడా ప్రయాణం సాగించవచ్చు. ఈ భోగీలలో ఎక్కువ భాగం ఒక దానికి మరొకటి అనుసంధానించబడి ఒక దాని నుండి మరొక దానికి మారేందుకు వీలుగా ఉంటాయి. అయితే కొన్ని రైళ్ళలో అవసరార్దం ఈ మార్గం మూసివేయబడవచ్చు. సరకు రవాణా చేసే భోగీలలో చాలా రకాలు ఉన్నాయి.

ఒక డియమ్‌యు రైలు DEMU

ప్రయాణీకులకు కల్పించబడిన సదుపాయాల దృష్ట్యా ఈ బోగీలు వివిధ తరగతులుగా విభజించబడ్డాయి. వీటిలో సాధారణ రెండవ తరగతి రిజర్వేషన్ తరగతి అత్యంత ప్రజాదరణ పొందింది. సాధారణంగా ప్రయాణీకుల రైలు సుమారు తొమ్మిది వరకూ ఈ రకం బోగీలు కలిగి ఉండటం గమనించవచ్చు. ఇవి కాక మొదటి తరగతి, ఎయిర్ కండిషన్డ్ (రెండు మరియు మూడు పడకలతో) బోగీలు, జనరల్ బోగీలను కూడా గమనించవచ్చు.

భారత రైల్వేలు మరి కొన్ని విశేషాలు[మార్చు]

 • భారతదేశంలో మొదటి సారిగా రైలు ప్రయాణం చేసిన తేది 22.12.1851.
 • భారతదేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన రైలు స్టేషన్లు వరుసగా భవానీ మాండీ ఇది మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ సరిహద్దులలో ఉంది. నవాపూర్ ఇది మహారాష్ట్రా మరియు గుజరాత్ సరిహద్దులలో ఉంది. జరాయ్‌కేలా ఇది ఒడిషా మరియు జార్ఖండ్ సరి హద్దులలో ఉంది. ఒడిషా మరియు జార్ఖండ్ సరి హద్దులలో ఉన్న మరో రైల్వే స్టేషన్ బార్బిల్.
 • భారతదేశంలో అత్యంత చిన్న పేరున్న రైల్వే స్టేషను ఇబ్. ఇది ఒడిషా లోని ఝూర్స్ గూడా సమీపంలో ఉంది.
 • భారతదేశంలో పెద్ద పేరున్న రైల్వే స్టేషను వెంకట నరసింహరాజు వారి పేట. ఇది అర్కోణమ్ మరియు రేణిగుంట రైలు మార్గంలో ఉంది.
 • భారతదేశంలో అత్యంత తక్కువ దూరం ప్రయాణిచే రైలు నాగపూర్ నుండి అంజి వరకు ప్రయాణం చేస్తుంది.ఈ రైలు ప్రయాణం చేసే దూరం కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే.
 • భారతదేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు కన్యాకుమారి కుమారి నుండి దిబ్రూఘ‌డ్‌టౌన్‌ వరకు ప్రయాణించే వివేక్ ఎక్స్‌ప్రెస్. ఇది 80.15గంటల సమయంలో 4283 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది.
 • భారతదేశంలో అత్యంత తక్కుగా మధ్య దూరం ఉన్న రైలు స్టేషన్లు సఫిల్ గూడ దయానంద సాగర్. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 170 మీటర్లు మాత్రమే.
 • భారతదేశంలో ఉన్న అత్యంత పొట్టి రైలు కొసాంబ్ ఉమర్‌పడ వరకు ప్రయాణిస్తుంది. దీనికి కేవలం రెండు బోగీలు మాత్రమే ఉన్నాయి.
 • భారతదేశంలో అత్యంత ఆలస్యంగా వచ్చే రైలు గౌహతి. ఇది గౌహతి నుండి తిరువనంత పురంవరకు సరాసరి 10 నుండి 12 గంటల ఆలస్యంగా ప్రయాణం చేస్తుంది. దీని ప్రయాణ సమయం 63.05 గంటలు.
 • భారతదేశంలో ఉన్న అత్యంత పొడవైన రైలు స్టేషను పశ్చిమ బెంగాలు లోని ఖరగ్‌పూర్. దీని పొడవు 1072.5 మీటర్లు.
 • భారతదేశంలో మూడు గేజుల పట్టాలు ఉన్న స్టేషను పశ్చిమ బెంగాల్ లోని న్యూజల్సాయ్ గురి.
 • భారతదేశంలో అత్యధిక మార్గాలు ఉన్న రైలు జంక్షన్ ఉత్తరప్రదేశ్‌లో ఉన్న మ‌థుర‌'.

భారతీయ రైల్వే మండలాలు[మార్చు]

భారతీయ రైల్వే లు 17 రైల్వే జోన్స్ (రైల్వే మండలాలు) గా విభజించబడింది. ప్రతి రైల్వే జోన్ కొన్ని రైల్వే డివిజన్లు (రైల్వేవిభాగములుగా ) విభజించబడింది. అన్ని రైల్వే జోన్|మండలములలో దాదాపుగా 67 విభాగాలు ఉన్నాయి.

దక్షిణ మధ్య రైల్వే[మార్చు]

ప్రధాన వ్యాసం దక్షిణ మధ్య రైల్వే చూడండి.

 • భారతదేశం లోని 17 రైల్వే జోన్‌లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే 1966, అక్టోబరు 2న ఏర్పడింది. ఈ రైల్వే జోన్ సికింద్రాబాదు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దీని పరిధిలో ప్రస్తుతం 6 రైల్వే డివిజన్‌లు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని హైదరాబాదు, సికింద్రాబాదు, గుంతకల్లు, విజయవాడ, గుంటూరు లతో పాటు మహారాష్ట్రకు చెందిన నాందేడ్ డివిజన్‌లు దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించియున్న ఈ డివిజన్ కొంతమేరకు కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో కూడా వ్యాపించియున్నది. మొత్తం 5752 కిలోమీటర్ల నిడివి కలిగిన రైలు మార్గం ఈ జోన్‌లో విస్తరించిఉన్నది. దేశంలో అత్యధిక లాభాలు ఆర్జించే జోన్‌లలో ఇది ఒకటి.

చిత్రమాలిక[మార్చు]

పేరొందిన రైళ్ళు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

‌వనరులు[మార్చు]

 1. 1.0 1.1 1.2 Indian Railways Year Book (2009–2010) (PDF). Ministry of Railways, Government of India. 2011. p. 13. Retrieved 26 August 2008. 
 2. Indian Railways Year Book (2009–2010) (PDF). Ministry of Railways, Government of India. 2007. p. 53. Retrieved 23 December 2008. 

బయటి లింకులు[మార్చు]

మూసలు మరియు వర్గాలు[మార్చు]