రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపూర్తలా
పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీ భారతీయ రైల్వేకు చెందిన కర్మాగారము. దీనిలో ప్రయాణీకులకు అవసరమైన పలురకాలైన రైలుపెట్టెలను తయారు చేస్తున్నారు. ఈ కర్మాగారము టౌన్‌షిప్‌తో కలిపి 1178 ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించుకొన్నది. సుమారు 8,000 మందికి ఉపాధిని కల్పిస్తున్నది.
చరిత్ర
[మార్చు]ఈ కర్మాగారానికి పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తలా పట్టణానికి సమీపంలో 1985 ఆగస్టు 17వ తేదీన అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ శంకుస్థాపన చేశాడు. అధునాతన యంత్రాలను కలిగిన ఈ ఉత్పత్తి కేంద్రము భారత పారిశ్రామికరంగంలో గణనీయమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పటిదాకా సుమారు 28,000లకు పైగా రైలు పెట్టెలను తయారు చేసి భారతరైల్వేలలోని పాసెంజర్ కోచ్‌లలో 50 శాతాన్ని ఆక్రమించుకొంది. డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి రంగాలలో స్వయంసమృద్ధి సాధించి పలు రకాలైన రైలు పెట్టెలను తయారు చేస్తున్నది.
మైలురాళ్లు
[మార్చు]- శంకుస్థాపన - 1985
- మొదటి కోచ్ ఉత్పాదన - 1988
- మొదటి ఎ.సి.ఛెయిర్ కార్ రూఫ్ మౌంటెడ్ ఎ.సి.యూనిట్‌తో - 1992
- మొదటి ఎ.సి. 3టైర్ కోచ్ ఉత్పాదన - 1993
- మొదటి బ్రాడ్‌గేజ్ మెయిన్‌లైన్ ఎలెక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) రేక్ -1998
- మొదటి రాజధాని రేక్ - 2003
- మొదటి శతాబ్ది రేక్ - 2004
- మొదటి ఎగుమతి ఆర్డర్ - 2006
- మొదటి గరీభ్‌రథ్ రేక్ - 2006
- మొదటి స్టెయిన్‌లెస్ స్టీల్ రేక్ - 2009[1]
- మొదటి ఎ.సి.డబుల్ డెక్కర్ రేక్ - 2010
- మొదటి దురంతో రేక్ -2011
- మొదటి బయో టాయిలెట్ కలిగిన ఎల్.హెచ్.బి.కోచ్ -2013
ఉత్పత్తి
[మార్చు]1986లో ప్రారంభమైన ఈ కర్మాగారం 1988నుండి ఉత్పత్తిని ప్రారంభించింది. ఇప్పటి వరకు 29000కు పైగా రైలుపెట్టెలను నిర్మించింది. భారతీయ రైల్వే అవసరాలకు అనుగుణంగా 40 రకాలకు పైగా ఎ.సి. నాన్ ఎ.సి. కోచ్‌లను నిర్మిస్తున్నది. వీటిలో సాంప్రదాయమైన రైలుపెట్టెలు మొదలుకొని, స్వయంచాలిత వాహనాల వరకు ఉన్నాయి. ఈ ఉత్పత్తి కోసం ఈ కర్మాగారం అత్యాధునికమైన లేజర్ ప్రొఫైల్ యంత్రాలు, సి.ఎన్.సి.యంత్రాలు, రోబోటిక్ యంత్రాలు, ప్లాస్మా ప్రొఫైల్ యంత్రాలను సమకూర్చుకొన్నది. గంటకు 200కి.మీ.వేగంతో ప్రయాణించడానికి అనువైన ఎల్.హెచ్.బి.కోచ్‌లను జర్మనీ దేశంతో సాంకేతికమార్పిడి ద్వారా తయారు చేయగలిగింది. ప్రారంభంలో ఏడాదికి 1000 కోచ్‌ల నిర్మాణ సామర్థ్యం కలిగిన ఈ కర్మాగారం 1500 కోచ్‌ల నిర్మాణ సామర్థ్యానికి ఎదిగింది. 2013-14లో దాని సామర్థ్యం కన్నా ఎక్కువగా 1701 కోచ్‌లను నిర్మించి రికార్డు సృష్టించింది[2].
ఎగుమతులు
[మార్చు]ఈ కర్మాగారం భారతీయ రైల్వే అవసరాలనే కాక, భారతీయ సైన్యానికి, పోస్టల్ శాఖకు అవసరమైన కోచ్‌లను అందించి వాటి అవసరాలను తీర్చింది. అంతే కాక మయన్మార్, వియత్నాం, సెనెగల్, మాలి దేశాలకు రైల్ కోచ్‌లను ఎగుమతి చేస్తున్నది.
సాధించిన విజయాలు
[మార్చు]- ఈ కర్మాగారానికి నాణ్యతా ప్రమాణాల ఆధారంగా ISO9000 సర్టిఫికెట్ లభించింది.
- పర్యావరణానికి చెందిన నిర్వహణకు గాను ISO 14000 గుర్తింపు లభించింది.
- ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ సొసైటీ నుండి OHSAS 18000 గుర్తింపు పొందింది.
- పర్యావరణ సౌకర్యాల కల్పన, నిర్వహణలకు గాను 2006,2008,2009,2011లలో బంగారు నెమలి (Golden peacock) అవార్డులు.
కార్మికులు, సదుపాయాలు
[మార్చు]ఈ ఉత్పాదక సంస్థలో 186 మంది అధికారులు, 7838 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగులకోసం ఈ కర్మాగారానికి అనుబంధంగా 4029 గృహాలతో ఒక టౌన్‌షిప్‌ను నిర్మించారు. ఈ టవున్‌షిప్‌లో ఉద్యోగులకు, వారి కుటుంబాలకు అనేక సదుపాయాలను కల్పించారు.76 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ ప్రాథమిక, సెకండరీ పాఠశాలలు, జాక్ ఎన్ జిల్ ప్రాథమిక పాఠశాల మొదలైన విద్యాసంస్థలు నెలకొల్పారు.ఇంకా ఈ టవున్‌షిప్‌లో వాణిజ్య సముదాయము, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యు.టి.ఐ.బ్యాంక్, ఆర్.సి.ఎఫ్.సహకార పరపతి సంఘం, పోస్ట్‌ఆఫీస్ సదుపాయాలు ఉన్నాయి. స్త్రీలకోసం చేతివృత్తుల శిక్షణాకేంద్రము, కంప్యూటర్ శిక్షణాకేంద్రము, చిన్నపిల్లల కొరకు క్రెచ్ మొదలైనవి నెలకొల్పారు[3].