శ్రీనగర్-కార్గిల్-లేహ్ రైలు మార్గము శ్రీనగర్ స్టేషన్ నుండి కార్గిల్ టౌన్ ద్వారా లెహ్ వరకు ప్రతిపాదిత రైల్వే మార్గము. 2013 ఫిబ్రవరి 26 న ఈ జాతీయ పథకాన్ని జాతీయ ప్రణాళికలో చేర్చారు. 2013-14 సంవత్సరంలో శ్రీనగర్-కార్గిల్-లేహ్ రైలు మార్గము సర్వే చేపట్టనున్నట్లు రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ ప్రకటించారు.[1]
ఈ రైలు మార్గము పూర్తయిన తర్వాత, లెహ్ నుండి నేరుగా జమ్మూ కాశ్మీర్, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు రైల్వే ద్వారా అనుసంధానించబడుతుంది. శ్రీనగర్ , లెహ్ మధ్య రోడ్డు మార్గం 422 కి.మీ. (262 మైళ్ళు) దూరంలో ఉంది. లెహ్ కు రైల్వే లైన్లు పూర్తయినప్పుడు, ఢిల్లీ నుండి లెహ్ చేరుకోవడానికి సమయం తగ్గుతుంది. ఈ రైలు మార్గము సురక్షిత, శీఘ్ర పద్ధతిలో ప్రజా రవాణాకు సేవలు అందిస్తుంది. సైనిక సిబ్బంది, సామగ్రి వ్యూహాత్మక సైనిక స్థావరాలైన లేహ్ ప్రాంతానికి మరింత సులభంగా రవాణా చేయబడుతుంది.
జమ్మూ-బారాముల్లా రైలు మార్గము తరువాత, శ్రీనగర్-కార్గిల్-లేహ్ మార్గం భారతీయ రైల్వేలో అత్యంత సవాలు రైల్వే ప్రాజెక్టుగా ఉంటుంది. ఇక్కడి ఎత్తైన పర్వతాలు, పెద్ద సంఖ్యలో సొరంగాలు, ఎత్తైన వంతెనలు, తీవ్రమైన చల్లని వాతావరణం ఇందుకు ముఖ్య కారణం.