ఫస్ట్ క్లాస్ క్రికెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫస్ట్-క్లాస్ క్రికెట్, క్రికెట్ లోని అత్యున్నత-ప్రామాణిక రూపాలలో ఒకటి. ఫస్ట్-క్లాస్ మ్యాచ్ అనేది రెండు జట్లు చెరి పదకొండు మంది ఆటగాళ్లతో మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజుల షెడ్యూల్ వ్యవధిలో ఆడే పోటీ. జట్లలో అఆడే ఆటగాళ్ళ ప్రమాణాల ప్రకారం అధికారికంగా ఫస్ట్ క్లాస్ హోదా అర్హతను నిర్ణయిస్తారు. మ్యాచ్‌లో రెండు జట్లు చేరి రెండు ఇన్నింగ్స్‌లు ఆడేందుకు అనుమతించాలి. అయితే ఆచరణలో మొత్తం నాలుగు ఇన్నింగ్సు లోనూ ఒక జట్టు ఒకటే ఇన్నింగ్సు ఆడవచ్చు. రెండో జట్టు ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడవచ్చు లేదా అసలు ఆడకనే పోవచ్చు.

"ఫస్ట్-క్లాస్ క్రికెట్" శబ్దవ్యుత్పత్తి తెలియదు. అయితే ఇది 1895లో అధికారిక హోదాను పొందే ముందు ప్రముఖ ఇంగ్లీష్ క్లబ్‌లు వాడేవి. 1947లో జరిగిన ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ (ICC) సమావేశంలో, దీన్ని ప్రపంచ స్థాయిలో అధికారికంగా నిర్వచించారు. అయితే, అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లను ఎలా నిర్వచించాలో ICC రూలింగ్‌లో చెప్పలేదు. దీంతో మునుపటి మ్యాచ్‌లను, ముఖ్యంగా 1895కి ముందు గ్రేట్ బ్రిటన్‌లో ఆడిన మ్యాచ్‌లను ఎలా వర్గీకరించాలనే సమస్య ఉండిపోయింది. అసోసియేషన్ ఆఫ్ క్రికెట్ స్టాటిస్టిషియన్స్ అండ్ హిస్టోరియన్స్ (ACS) ప్రారంభ మ్యాచ్‌లలో ఉన్నత ప్రమాణాలుగా ఉన్నాయని భావించిన వాటి జాబితాను ప్రచురించింది.

క్రికెట్‌లో అత్యున్నత ప్రమాణమైన టెస్ట్ క్రికెట్ కూడా ఫస్ట్-క్లాస్ క్రికెట్ రూపాల్లో ఒకటి. అయితే "ఫస్ట్-క్లాస్" అనే పదాన్ని ప్రధానంగా దేశీయ పోటీని సూచించడానికి ఉపయోగిస్తారు. ఒక ఆటగాడి ఫస్ట్-క్లాస్ గణాంకాలలో టెస్ట్ మ్యాచ్‌లలో చేసే ప్రదర్శనలు కూడా ఉంటాయి.

1947 మే నాటి ICC రూలింగ్ ప్రకారం అధికారిక నిర్వచనం

[మార్చు]

"ఫస్ట్-క్లాస్ క్రికెట్" అనే పదాన్ని 1947 మే 19 న అప్పటి ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ (ICC) అధికారికంగా నిర్వచించింది. ఈ నిర్వచనం "గతంలో జరిగిన మ్యాచ్‌లపై ప్రభావం చూపదు" అని స్పష్టం చేశారు. [1] ఆ నిర్వచనం క్రింది విధంగా ఉంది: [1]

అధికారికంగా ఫస్ట్-క్లాస్‌గా పరిగణించబడిన పదకొండు మంది ఆటగాళ్లతో కూడిన రెండు జట్ల మధ్య మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజుల వ్యవధితో జరిగే మ్యాచ్‌ను ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌గా పరిగణించాలి. ఏ జట్టు అయినా పదకొండు మంది కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను కలిగి ఉన్నా, లేదా వ్యవధి మూడు రోజుల కంటే తక్కువగా ఉన్నా ఆ మ్యాచ్‌లు ఫస్ట్-క్లాస్‌గా పరిగణించబడవు. ఆయా దేశాల్లోని గవర్నింగ్ బాడీలు జట్ల స్థాయిని నిర్ణయిస్తాయి.

ఉదాహరణకు, గ్రేట్ బ్రిటన్‌లో ఆడే మ్యాచ్‌ల స్థితిని నిర్ణయించే అధికారం MCCకి ఉంది. అన్ని ఉద్దేశాలు ప్రయోజనాల కోసం, 1947 నాటి ICC నిర్వచనం 1894 లో MCC చేసిన నిర్వచనాన్నే నిర్ధారించింది. దీనికి అంతర్జాతీయ గుర్తింపును, వాడుకనూ ఇచ్చింది.

అందువల్ల, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) లో పూర్తి సభ్యునిగా ఉన్న వివిధ దేశాల పాలకమండళ్ళకు ఈ హోదా ఇచ్చే బాధ్యత ఉంటుంది. పాలక మండలి అంతర్జాతీయ జట్లకు, దేశం లోని అత్యున్నత ఆట ప్రమాణానికి ప్రతినిధిగా ఉన్న దేశీయ జట్లకు ఫస్ట్-క్లాస్ హోదాను మంజూరు చేస్తుంది. తర్వాతి కాలంలో ICC చేసిన తీర్మానాల ద్వారా, ICC సహచర సభ్య దేశాలకు చెందిన అంతర్జాతీయ జట్లకు కూడా ఫస్ట్-క్లాస్ హోదా ఇవ్వడం సాధ్యపడింది. అయితే అది ఆయా మ్యాచ్‌లలో వారితో ఆడిన ప్రత్యర్థుల స్థితిపై ఆధారపడి ఉంటుంది.[2]

నిర్వచనం

[మార్చు]

ICC నిర్వచనం ప్రకారం, కింది లక్షణాలున్న మ్యాచ్‌ని ఫస్ట్-క్లాస్‌గా నిర్ణయించవచ్చు: [2]

  • ఆట వ్యవధి మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉండాలి
  • మ్యాచ్ ఆడే ప్రతి జట్టులో పదకొండు మంది ఆటగాళ్లు ఉండాలి
  • ప్రతి వైపు రెండు ఇన్నింగ్స్ ఉండాలి
  • మ్యాచ్ సహజమైన పిచ్‌పై ఆడాలి, కృత్రిమ పిచ్‌పై కాదు
  • వేదికలకు సంబంధించి నిర్దిష్ట ప్రామాణిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండే వేదికపై మ్యాచ్ ఆడాలి
  • చిన్న చిన్న సవరణలు మినహా, మ్యాచ్ క్రికెట్ చట్టాలకు అనుగుణంగా ఆడాలి
  • ఆయా దేశపు క్రీడల పాలక మండలి గానీ లేదా స్వయంగా ICC గానీ మ్యాచ్‌ను ఫస్ట్-క్లాస్‌గా గుర్తిస్తుంది.

ఫస్ట్-క్లాస్ దేశీయ పోటీలకు ఉదాహరణలు

[మార్చు]
దేశం పేరు గమనికలు
 ఇంగ్లాండు కౌంటీ ఛాంపియన్‌షిప్
 దక్షిణాఫ్రికా 4-రోజుల దేశీయ సిరీస్
 ఆస్ట్రేలియా షెఫీల్డ్ షీల్డ్
 న్యూజీలాండ్ ప్లంకెట్ షీల్డ్
 India రంజీ ట్రోఫీ
దులీప్ ట్రోఫీ బీసీసీఐ ఎంపిక చేసిన జట్ల మధ్య పోటీ
ఇరానీ కప్ రంజీ ట్రోఫీ విజేతకు, BCCI ఎంపిక చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకూ మధ్య జరుగుతుంది
 పాకిస్తాన్ క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ 2019 నుండి జోనల్ అసోసియేషన్లు ఆడుతున్నాయి.
 వెస్ట్ ఇండీస్ ప్రాంతీయ నాలుగు రోజుల పోటీ
 శ్రీలంక మేజర్ లీగ్ టోర్నమెంట్
 బంగ్లాదేశ్ నేషనల్ క్రికెట్ లీగ్ BCB ఎంపిక చేసిన 8 డివిజన్ -ఆధారిత జట్లు ఆడతాయి.
బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్ BCB ఎంపిక చేసిన 4 జోన్ జట్ల మధ్య జరుగుతుంది
 జింబాబ్వే లోగాన్ కప్
 ఆఫ్ఘనిస్తాన్ అహ్మద్ షా అబ్దాలీ 4-రోజుల టోర్నమెంట్
 ఐర్లాండ్ ఇంటర్ ప్రొవిన్షియల్ ఛాంపియన్‌షిప్

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Wisden 1948, p. 813.
  2. 2.0 2.1 (1 October 2017). "ICC Classification of Official Cricket". International Cricket Council.