Jump to content

బంజారాల చరిత్ర సంస్కృతి

వికీపీడియా నుండి

బంజారాల చరిత్ర సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న బంజారా లంబాడీ లకు ఒక ధర్మం, ఒక సంస్కృతి[1], సంప్రదాయాలు ప్రత్యేకత ఉన్నాయి[2].వీరికి ఏ మతాన్ని ఆపాదించలేము. స్థానికంగా ఉన్న అన్ని మతాలతో మమేకమై జీవించినా వీరి ఆచార వ్యవహారాలు వీరివే.

బంజారా సంస్కృతి
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
 భారతదేశంసుమారు 15 కోట్లు
భాషలు
గోర్ బోలి బంజారా భాషతెలుగుమరాఠీహిందీ
మతం
హిందూ మతం
సంబంధిత జాతి సమూహాలు
బరోపియన్ ఇండో ఆర్యన్ భాష కుటుంబ సముహము

బంజారాలను భారత ప్రభుత్వాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, బీహార్ లలో షెడ్యూలు తెగలుగాను, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్,హర్యానా, కర్నాటక రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు గాను, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాష్ట్రాల్లో ఒసిలు గాను, మహారాష్ట్రలలో వీరిని విజేయన్టీ విముక్త జాతి భటక్యా జమాతి( VJNT:-Vimukt Jathi Nominated Tribe) రాజస్తాన్ రాష్ట్రాల్లో డినోటిఫైడ్ ట్రైబ్(DNT) గాను గుర్తింపబడి ఉన్నారు.యుగయుగాలుగా వన సంచారం చేసిన జాతి బంజారా భారతదేశమంతా ఒకే జాతి ఒకే భాష ఉంది .(ఎకజ్ జాత్, ఎకజ్ వాత్ ) దేశమంతా గిరిజనులుగా గుర్తించవలసిన అవసరం ఉంది.తెలంగాణ ప్రాంతంలో ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ది షెడ్యూల్డ్ ట్రైబ్ ఆర్డరు ఆమేండ్మేంట్ యాక్ట్ /1976 నుండి ఎస్టీ రిజర్వషన్ జాబితాలో గుర్తింపబడినప్పటి నుండి వీరి జీవన విధానంలో కొంత మార్పులు జరిగి ప్రస్తుతం వీరి పరిస్థితి కొంత వరకు మెరుగ్గా ఉందని చెప్పవచ్చు.

సాంప్రదాయ దుస్తుల్లో లంబాడీ గిరిజన మహిళలు.

తాండాల ఏర్పాటు

[మార్చు]

బంజారాలు (లంబాడీలు) భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో ఏజెన్సీ, మైదాన ప్రాంతాలలో నివసిస్తున్నారు. అదే విధంగా వీరు గ్రామాలలో, పట్టణాలతో పాటు అడవిలో,కొండలలో, గుట్టలలో, సభ్యసమాజానికి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రత్యేక తండాలను ఏర్పాటు చేసుకొని జీవిస్తారు.వీరు నివసించే ప్రాంతాలను తండా అంటారు. తాండలోని మగవారిని వారు తాండ్రో అని, ఆడవారిని తాండ్రి అని సంబోధిస్తూ ఉంటారు.తాండలో పెద్దలు నాయక్, కార్భారి,డావ్, మాన్కరి, డావ్ గేరియ్య వ్యవస్థ ఇప్పటికి కూడా ప్రతి తాండలో సజీవంగా ఉంది.వీరు బాధ్యత గా తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తాండలో కలిసి మెలిసి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.ఎవైనా గొడవలు జరిగినపుడు పంచాయతీ ద్వారా పరిష్కరిస్తారు. బంజారా పదంలో బన్ అంటే అడవి, జారా అంటే సంచరించే వారు అనగా అడవిలో సంచరించే వారు అని అర్ధం.వీరిని గోర్ మాటి అని కూడా అంటారు. అంటే గోవులను మేపే మనిషి అన్నమాట.వీరిని తెలంగాణలో లంబాడీ/ లంబాడా అని పిలుస్తారు.పూర్వ కాలంలో లవణం అంటే ఉప్పు అమ్మేవారు కాలక్రమేణా లవణ శబ్దం లంబాడీ గా మారిందని వాదన, లంబాడా అంటే శారీరకంగా భారీ మనుషులు దృఢమైన శరీరం కలిగి ఎత్తుగా ఉంటారు. వారిని చూసిన బ్రిటిష్ ప్రభుత్వం లాంగ్ బాడి అని పేరు పెట్టారు.లాంగ్ అంటే ఎత్తు,బాడి అంటే శరీరం కాలానికి అనుగుణంగా ఆ శబ్దం మార్పు చెంది లంబాడీ అయినది.అందుకే వారికి లంబాడీ/లంబాడా/లమ్మాని /బంజారా అని పేర్లు వచ్చాయి.వీరు వెయ్యేండ్ల క్రితం మహమ్మదీయుల అరాచకాలకు బలై రాజస్థాన్ నుండి దేశంలో బతుకు తెరువు కోసం నలు దిక్కులకు ‌వెళ్ళి సంచార జీవులుగా జీవనం సాగించారు.కాని వీరు రాజస్తాన్ కు చెందిన రాజపుత్రులు కారు.

గోర్ బంజారా

[మార్చు]

భారత దేశంలో బంజారాల్లోని అన్ని తెగలకంటే గోర్ బంజారాలు అధిక సంఖ్యలో దాదాపు భారతదేశమంతటా వ్యాపించి ఉన్నారు. ఈ గోర్ బంజారాలు దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేర్లతో పిలువబడుచున్నారు. తెలంగాణలో లంబాడీలని, ఆంధ్రప్రదేశ్ లో సుగాలీలని, కర్నాటకలో లంబాణి/లంమాణీలనీ, మహారాష్ట్రలో బంజారాలని ఉత్తర భారతదేశంలో బంజారా/బళదియ/డప్డియా/లదణియా/గవారియా/ సింగడియా/ గోర్ బంజారాలని, పిలువబడుచున్నారు.వారి భాషలో వారు గోర్ అని ఇతరులు ఉంటే కోర్ అని చెప్పుకుంటారు.దేశమంతటా వివిధ పేర్లతో కాకుండా ఒకే పేరు బంజారా ఉండాలని వీరి కోరిక.

బంజారాల జీవన విధానం

[మార్చు]

లంబాడీ గిరిజనులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని తండాలుగా ఏర్పడి వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకొని నీటి వనరులు చూసుకొని వర్షపు నీటిపైనే ఆధారపడి జొన్నలు పండించే వారు.నీటి సౌకర్యం కలిగిన భూముల్లో మొక్కజొన్నలు పండించే వారు.లంబాడీల ముఖ్య ఆహారం రొట్టెలు,కారం, ఆకుకూరలు,(భాజి,బాటి,కాందార్ ఖోడి) సంచార జీవన కాలం నుండి కాయగూరలు అందుబాటులో లేని కాలంలో అటవీ ప్రాంతాలలో మైదాన ప్రాంతాలలో విరివిగా లభించే ఆకుకూరలపై ఆధారపడేవారు. అందుకే లంబాడీ గిరిజనుల నిత్య జీవితంలో అప్పటి నుండి ఇప్పటి వరకు జొన్న రొట్టెలు, ఆకుకూరలు,(భాజిన్ బాటి) ముఖ్య ఆహారమైంది.ఇదేవిధంగా లంబాడీలకు బయట సమాజంతో ఏర్పడిన సాన్నిహిత్యం వల్ల వరి, గోధుమలు, పప్పుధాన్యాలు మొదలుకొని వాణిజ్య పంటలైన పత్తి ,సోయా,పొగాకు, జనపనార, మొదలైన ఆహారపు వాణిజ్యపంటలు వారి జీవన విధానంలోకి‌ ప్రవేశించాయి. లంబాడీలు,గోర్ బోలి అనే ప్రత్యేకమైన భాషను మాట్లాడతారు.వీరిని "గోర్ మాటి" అని కూడ అంటారు.బంజారా భాష (గోర్ బోలి) భాషకు లిపి లేదు. ఇండో-ఆర్యుల భాష హిందీ భాషకు దగ్గరి సంబంధం ఉంది.ఈ భాష మాట్లాడుతుంటే విన సొంపుగా ఉంటుంది.

గోత్రనామాలు

[మార్చు]

గోత్రం అనగా వారి మూల పురుషుల పేర్లని గోత్రాలుగా వారి పూర్వీకులు అన్నారు. లంబాడీల గోత్ర శాఖలను వీరి పూర్వీకులు ఈ విధంగా చెప్తూ వచ్చారు. ఛో గోత్ చవాణ్ , సాత్ గోత్ భూక్యా (ఇరువై ఏడు పాడ భూక్యా) బార గోత్ పవార్,తేర పాడ బాణోత్, బావన్ పాడా వడ్తియా, ఏక్ జాత్ తూరీ తి సేగోతే సారి అనగా ఒకే శాఖతో నున్న తూరీ గోత్రంతో కలిపి సంపూర్ణ బంజారా గోత్రాలుగా చెప్పబడుచున్నది.పైన తెలిపినట్లు గోర్ బంజారాల ముఖ్యమైన ఆరుగురు మూలపురుషులతో ఆరు గోత్రాలు ఏర్పడ్డాయి.అవి చౌహాణ్, పవార్ భూక్యా, వడ్తియా, బాణోత్ ,తూరీ.ఒక్కొక గోత్రంలో శాఖలు ఆ శాఖల్లో అనేక ఉప శాఖలుగా ఏర్పడ్డాయి.గోత్ అంటే గోత్రము,జాత్,జతియా అంటే శాఖ పాత్ (పాడ) అంటే ఉప శాఖ అని అర్థం. కొన్ని జిల్లాల్లో వీరి ఇంటిపేర్లు గోత్రాలతో చెప్పుకుంటారు. మరికొన్ని జిల్లాల్లో వీరి ఇంటిపేర్లు ఉప గోత్రాలతో చెప్పుకుంటారు.ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బాణోత్ గోత్రం మరియు భూక్యగోత్రం అంటే రాథోడ్ గోత్రం వారు పెళ్ళి సంబంధాలు కుదుర్చుకుంటారు.వారు ఇలా అంటారు.బాలా మరియు భీకా అన్నదమ్ములు లోలోపల సంబంధాలు ( బాలాన్ భీకా భాయి మాయి మాయి వేగి సగాయి) ఉమ్మడి వరంగల్ తదితర జిల్లాల్లో బానోత్ గోత్రం మరియు రాథోడ్ గోత్రం వారు అన్నదమ్ములుగా భావిస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాల్లో రాథోడ్ వంశం వారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరి పేర్లు పూర్వ కాలంలో‌ ఏ‌రోజున జన్మిస్తే ఆ రోజు ఏ వారం ఉంటుందో అదే వారం పేరు మీదుగా పేరు పెట్టేవారు. సోమవారం రోజున మగ పిల్లవాడు జన్మిస్తే సోమియ్య అని, ఆడపిల్ల పుట్టినచో సోమ్లి అని, మంగళవారం జన్మిస్తే మంగియ్యా అని, అమ్మాయి పేరు మంగ్లీ అని,బుధవారం జన్మిస్తే బదియ్యా, అమ్మాయి ఐతే బద్లీ అని, ఏ వారం పుట్టిన ఆ వారం పేర్లు పెట్టేవారు కాని కాలానికి అనుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వీరి పేర్లలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పటి కాలంలో వీరు దేవి, దేవతలు పేర్లు, సినీ నటీనటుల పేర్లు, క్రికెటర్ల పేర్లు పెట్టడం జరుగుతున్నది. మొఘల్ చివరి చక్రవర్తి ఔరంగజేబు మత మార్పిడి చేస్తూన్న కాలంలో సిక్కుమత గురువులలో తొమ్మిదో గురువు అయిన టేక్ బహదూర్ మత మార్పిడికి నిరాకరించడంతో 1675 నవంబర్ 11న భాయి గురుభక్త సింగ్ ని కళ్ళముందే ఢిల్లీ నగరంలోని చాందినీ చౌక్ వద్ద శిరశ్చేదం చేయించారు.సిక్కు గురువు యొక్క పార్థీవ దేహానికి అంతిమ సంస్కారం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారి వీరుడు ధీరుడు అయిన బాబా లక్కీషా బంజారా ఔరంగజేబు సైన్యంతో పోరాడి ఢిల్లీ లోని రాయిసినా తాండాకు తీసుకుని వచ్చి గురువు యొక్క పార్థీవ దేహానికి తన ఇంట్లోనే దహన సంస్కార కార్యక్రమాలు నిర్వహించారు.

ఇది సిక్కు మతములో బాబా లక్కీషా బంజారా సృష్టించిన కొత్త అధ్యాయంగా చెప్పవచ్చు. అప్పటి నుండి సిక్కులతో బంజారాలకు ఏర్పడిన సాన్నిహిత్యం వల్ల వీరు పేరు చివర సింగ్ అని పెట్టుకోవడం జరుగుచున్నది. నాయకత్వ లక్షణాల వల్ల వీరు తమ యొక్క పేరు చివర నాయక్ కూడా పెట్టుకుంటున్నారు. జిల్లాలో లంబాడీ జాతికి తోడుగా సహజీవనం గడిపే ముఖ్యమైన లంబాడీ సముహముల్లో సనార్, నావి, ఢాడి, భాట్, ఢాలియా, మొదలగు ఉప జాతులు వారితో కలిసి మెలిసి సహజీవనం చేస్తున్నారు. కానీ పెళ్ళి సంబంధాలు చేసుకోవడం లేదు. ఒకటే భాష, ఒకే సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉన్న లంబాడీ ఉప జాతులతో లంబాడీ జాతి పెళ్ళి సంబంధాలు చేసుకోవలసిన అవసరం ఈ రోజుల్లో ఎంతైనా ఉంది.

సంస్కృతి

[మార్చు]

లంబాడీ గిరిజనుల పెళ్ళిళ్ళు, పేరంటాలు, విందులు ప్రత్యేకతను కల్గి ఉంటాయి. పెళ్ళీడుకు వచ్చిన యువతి యువకులు పెళ్ళి చేయాలని పెద్దలు నిశ్చయించుకుంటే బంధువుల లంబాడీ పెద్దలు, పురోహితులు, బాటసారులు, మిత్రులు, ద్వారా వరుస అయ్యే యువతి యువకుల వివరాలు తెలుసుకుంటూ చర్చించుకుంటారు. వరుస కలిసిన కుటుంబంలో యువకుడు ఉన్నాడని తెలిస్తే అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చి ఇల్లు చూసి, కట్నం ఇచ్చే వివరాలు ఆస్తి పాస్తులు, గోసంపద మొదలగు వివరాలను అడిగి తెలుసుకొని తమవారికి చేరవేస్తారు. అప్పటి కాలంలో ఢాడి, భాట్, నావి,తెగల వారు సమాచారాన్ని సేకరించి చేరవేసేవారు. కాని నేటి ఆధునిక యుగంలో వచ్చిన మార్పుల వల్ల జిల్లాలో ఢాడి,భాట్,నావి,వ్యవస్థ కనుమరుగైంది.కుటుంబ సభ్యులు, సంబంధీకులు అన్ని విధాలా చర్చించుకొని ఇరువురికి సమ్మతమైనపుడు అమ్మాయి ఇంటి వద్దకు కాబోయే వియ్యంకుల (సమ్ది,సగాసేణ్) కుటుంబ సభ్యులు బంధువులు, పెద్దలు, ఇరువైపుల వారు కూర్చొని ఇచ్చి పుచ్చుకునే కట్నకానుకల విషయాలను కుల పెద్దలు నాయక్,కార్భారి,డావ్ ,పంచుల మధ్య చర్చించుకొని ఇరువురు అంగీకారానికి వచ్చిన శుభ సందర్భంగా తీపికి సంబంధించిన చాయితాగి నోటిని తీపి చేసుకొంటారు.దీనినే సగాయి అంటారు. సగాయి చేసేటప్పుడు గాని , గోళ్ తినేటప్పుడు గాని అందరూ క్షేమంగానే ఉన్నారా ? అని ఈ విధంగా క్షేమసమాచారం అడుగుతారు.

  • పంచ్ పంచాయత్ రాజా,రాజాభోజ్ రాజేరి సభ సగళ్ కచేరి పచారెలాక్, పచారే సవాలాక్,‌ హియాతి హియా గోత్ ములాఖాత్, గోత్ గంగా గంగారోజళ్‌ కాశిర్‌తిరత్,బాయిర్ సఘా భాయిసణ్,ఆపణ్ సే‌ కసళ్ ఛ..! ఆపణ్,సేఆణంద్,...ఛ..!

ఆనాటి నుండి ఆ రెండు కుటుంబాల మధ్య "వియ్యం" కుదిరినట్లు భావిస్తారు.అటు తరువాత హోళి పండుగ అయిన తర్వాత ఐదు రోజుల్లో పెళ్ళితంతు కార్యక్రమాలు ప్రారంభమయ్యేవి. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి, కరోనా మహమ్మారి వచ్చి నప్పటి నుండి ఎప్పుడంటే అప్పుడే పెళ్లిళ్లు చేస్తున్నారు. లంబాడీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాల్లో మంగళవారం పవిత్రమైన దినంగా భావిస్తారు. మొదట పెళ్ళి కుమారుని వెత్డు ఇంట్లో (సాడి) చేస్తారు.పెళ్ళి కుమారుని సహాయకుడిగా అతని బావ ఉంటారు.అతనిని వారు లేర్యా అంటారు.ఇతని వద్ద ఒక సంచి ఉంటుంది అందులో బీడీలు, పొగాకు , పోకలు ఉంటాయి అతడు సమయానుసారంగా సందర్భాన్ని బట్టి ఇస్తూ ఉంటాడు. ఆ రోజు వారి కుల గురువు దేమా గురు పేరిట"దాగ్ " ఇచ్చేటప్పుడు ఈ విధంగా పాట పాడుతారు

  • కోళిఅవ కోళిజావ కోళిమాయిజ్యోత్ సమావ, ధోళో ఘోడో హస్లో పాతళియా సవార్, ముంగ్గె ఆవడా మోగరా, తల్లి అవడాతేవ్వార్, మాయిజ్ పూజా, మాయిజ్ పాతి, మాయిజ్ హింగణ్ హర్, కోతళికటార్,లాగితలవార్, స్వామి అయో స్వామి ఘోడో గురుబా,సదా..! సదా..!,

అని పాడుతారు.పెళ్ళి కొడుకుకు, మరియు అతని తమ్మునికి సూదితో చురక(దాగ్) వేస్తారు. కుడుక, బెల్లం పానకంతో ఘోటా అనే శుభకార్యం చేసి బంధువులందరూ భుజిస్తారు.అ తరువాత రోజు టేళో (విందుభోజనం) చేసి మరుసటి రోజు బాజా బజంత్రీలతో అమ్మాయి ఇంటికి పెళ్ళికి బయలు దేరుతారు. పెళ్ళి అమ్మాయి (నవలేరి) ఇంట్లోనే చేస్తారు. దీనినే వాయా అంటారు.పెళ్ళి అయిన తరువాత వరుడికి ఇవ్వవలసిన కట్నం పూర్తిగా అదే రోజు సాయంత్రం ఇచ్చేస్తారు.ఆ తర్వాత పెళ్ళి ‌కూతురును అత్తారింటికి సాగనంపటానికై ముస్తాబు చేసి బయటకు తెస్తూ "

  • హావేలియో....!
  • హావేలి....! వడలాసు వదెసయే ఘూరలాసు ఫేలెసయో హావేలి....!

అని పాట పాడి ఆరుబయటకు తీసుకొస్తారు.అ తరువాత అత్త తన అల్లుడి మెడ పట్టి ఏడుస్తూ ఢావ్లో చేస్తూ తన కూతురుకి ఎటువంటి కష్టాలు వచ్చినా గట్టు ఎక్కించాలని చెపుతు ఢావ్లో చేస్తుంది. అదే రోజు తెల్లవారే లోపు పెళ్ళి కూతురును అత్తవారింటికి పంపిస్తారు.కాని శుక్రవారం రోజున ఇంటి నుండి లక్ష్మి తరలి పోవద్దనే ఉద్దేశంతో రాత్రి పన్నెండు న్నర, తర్వాత పంపే ఏర్పాట్లు ‌ చేస్తారు.ఇలా పెళ్ళి తంతు కార్యక్రమము ముగుస్తుంది.

లంబాడీ మహిళలు

[మార్చు]

లంబాడీ మహిళలు తనకంటే వయసులో పెద్ద వారితో గాని చిన్న వారితో గాని మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వకంగా సంబోధిస్తూ మాట్లాడుతారు.అక్క,చెల్లిని బాయి, అన్నా, తమ్మునికి బియా, బాపూ అమ్మకు యాడి,నాన్న కు బా,బాపూ, ఇలా అందరిని సంబోధిస్తూ మాట్లాడుతారు. లంబాడీ మహిళలు వారి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మహిళలు సుఖదుఃఖాలను కీర్తిస్తూ జ్ఞాపకాలను నెమరు వేస్తూ మధురమైన పాటలను నేటి తరానికి మౌఖికంగా అందిస్తూ సమాజంలో గొప్ప కవయిత్రిలుగా,గొప్ప గాయినిలుగా లంబాడీల చరిత్రలో ప్రసిద్ధి గాంచారు. గోర్ బంజారా మహిళల హృదయాంతరాల్లోని కరుణాభరితమైన బాధ కళ్లల్లో నీళ్ళు కట్టలు తెంచు కుని ప్రవహించినట్లుగా గానం చేస్తుంటే ఎడ్వవని వారు ఉండరు.ఈ రాగ మధురమైన కన్నీటి భరితమైన గానమునే ఢావ్లో(లంబాడీ మహిళల కన్నీటి గాథలు)అంటారు.ఈ ఢావ్లో బంజారా యాడీలు కూడా పాడుతూ కన్నీటి పర్యంతమౌతారు.ఢావ్లోలో మహిళలు వివిధ సందర్భాలలో వివిధ రకాల పాటలు పాడుతూ ఢావ్లో చేస్తారు.ఢావ్లో పెళ్ళిలో గాని ఏదైనా విషాద సంఘటనలు, ప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు గాని, అత్తారింట్లో ఆడ పడుచుల వేధింపులు భరించలేక గాని, దూర ప్రాంతపు బంధువులు వచ్చినప్పుడు గాని, తాండ వదిలి కూలినాలికి, బతుకుదెరువు కోసం వెళ్ళినప్పుడు గాని, పెళ్ళి కూతురు ఇంటికి వచ్చినప్పుడు గాని, పెళ్ళి కూతురు ఇంటికి తన అమ్మా, నాన్న,అక్కా, చెల్లెళ్ళు,అన్నాదమ్ములు వెళ్ళినప్పుడు గాని,ఈ లంబాడీ యాడీలు ఢావ్లో చేస్తుంటే ఎంతటి కఠోర మనస్సు గల మనుషులులనైనా కరిగించే శక్తి ఈ ఢావ్లో వుందనడం అతిశయోక్తి కాదు.

లంబాడీ యాడీలు తన కొడుకు, కూతురు, అన్నయ్య, అక్కయ్య, అమ్మానాన్న ఇలా బంధువులందర్ని తలచుకొని ఏడుస్తూ వినడానికి రాగయుక్తంగా చేసే మధురమైన శబ్దాల సమ్మేళనమే ఈ ఢావ్లో. బంజారా సంస్కృతిలో గోర్ బంజారా మహిళల హృదయాల కన్నీటి గానం ఢావ్లోకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సమాజంలో కాబోయే పెళ్ళి కూతురుకు పెళ్ళి పది, పదిహేను రోజుల ముందు నుంచే సాయంత్రం అందరూ తండా వాసులు భోజనాలు ముగించుకుని పెళ్ళి జరిగే అమ్మాయి ఇంటికి తాండ లోని, మహిళలు, అమ్మాయిలు,యువతులందరు వెళ్ళుతారు.అందులో కొందరు పాటలు పాడుతుంటే మరికొందరు వధువుకు ఢావ్లో నేర్పిస్తారు.ఇలా రోజు సాధన చేసి పెళ్ళి జరిగే రోజు వరకు వధువుకి ఈ ఢావ్లో కంఠస్థం చేయిస్తారు. వధువుకు ‌పెళ్ళి మండపంలో వరునితో మూడు ముళ్ళ కట్టించిన తర్వాత తన భర్త చేతిలో చెయ్యి వేసి ఏడు అడుగులు వేసే సమయ సందర్భంలో భావేజో!వరాణే పతియాఓరే,హతేమాయి,హతకడి పగెమాయి పగబేడి ఘాలదేన బాజు హూబరెగి మారోణి భావజో...!! అని ఢావ్లో చేస్తుంది. వధువు తాను ఇన్నిరోజులు కలిసి మెలిసి ఉన్న‌ తన వదినమ్మతో తన ఆవేదన, భావాలను పూర్వాపరాలను స్మరిస్తూ మదిలోని భావాన్ని వ్యక్తం చేస్తు నన్ను ఇక వరుని చేతిలోకి ఇచ్చి అప్పజెప్పి పక్కకు జరిగినావు అని వదినమ్మ తో చెపుతూ తన చెల్లెలుతమ్ములు,అన్నలను పొగడ్తలతో ముంచుతు ఢావ్లో పాడుతుంటే శరీరంలోని రోమాలు నిక్కబొడుచుకొని ఆ బాధలకు తాళలేక వధువు స్నేహితురాలు, పెళ్ళి మండపంలో ఉన్న బంధువులు, తాండ లోని మహిళలు, యువతులు ఏడుస్తూ ఫిదా అయిపోతారు.

మహిళలు ఢావ్లో చేసేటప్పుడు మర్యాద పూర్వకంగా సంబోధిస్తూ నాన్న కు - బాపుఓరే/బావెలో/నాయిక నసాబి బాపుఓ.. అమ్మకు-యాడియెజే అన్నదమ్ములకు- వీరేణా, చెల్లెళ్ళులకు- జావేణో,కొడుకుకు - లడేక, కూతురుకు - లడేకి,వదినమ్మకు-భావజో,భర్తకు -‌సాయేబా ఈ విధంగా అందరినీ గౌరవంగా సంబోధిస్తూ ఢావ్లో చేస్తారు.బాధకు ఓదార్పు భార్య ప్రేమను పంచుకునే భర్త ఇలా భార్యాభర్తల బంధం జన్మజన్మల అనుబంధం అంటారు.తనను పోషించే భర్త మరణించిన తర్వాత భార్య సౌభాగ్యానికి సంతోషానికి గుర్తుగా నిలిచే సింధూరం (‌టికో) మంగళ సూత్రం ( ఇప్పటి పుస్త్యా, అప్పటి ఘూగరి) కాళ్ళమట్టెలు(చటకి) విడిచి కేవలం సాధారణ దుస్తులు ధరించి మిగిలిన జీవితమంతా మరణించిన భర్తను గుర్తు చేసుకుంటూ సాయేబా కతిదెక ఓతో తారిమురతే‌దికాఏని సాయేబా అని చనిపోయిన భర్తను గుర్తు చేస్తూ అర్థనాధ దుఃఖ స్వరంతో ఢావ్లో చేస్తూంటే ఏడ్వని వారు ఉండరు.

మహిళలు ప్రతి వేడుకల్లో ఏదో ఒక సందర్భంలో ఏడ్వడం పురుషుల కంటే మహిళలే కన్నీళ్లు ఎక్కువగా కార్చడం వలన వారి బాధలు కన్నీళ్లు రూపంలో ధారాళంగా ప్రవహిస్తుంది.కాబట్టి పురుషుల కంటే మహిళలకు గుండె పోటు తక్కువ శాతం ఉంటుందని బంజారాల విశ్వాసము.ఈ గోర్ బంజారాల మహిళల ఢావ్లో ఎంతో బాగుంటుంది. ఢావ్లో ఉయ్యాల ప్రారంభమై చివరి ఎత్తు స్థానం వరకు చేరి మళ్ళీ యథాస్థితికి ఉయ్యాల ఏ విధంగా వచ్చునో అదే విధంగా ప్రారంభం మరియు ముగింపు కూడా అంతే అద్భుతంగా ఉంటుంది.మహిళల గొంతులో ఎన్నెన్నో భావాలు, ఆవేదనలు, మరెన్నెన్నో సాదక భాధలను స్వరంతో ప్రతిఫలించిన ధ్వనులను ఎప్పటికీ మర్చిపోలేని రీతిలో ఉంటుంది.ఇంత ప్రాధాన్యతను కలిగిన ఈ ఢావ్లో మనిషి పుట్టిన దగ్గర్నుంచి చనిపోయే వరకూ జరుపుకునే వివిధ రకాల వేడుకల్లో ఢావ్లో చేసెటప్పుడు తమ సంబంధీకుల మెడ పట్టి పాడుతూ ఏడ్వడం ఈ లంబాడీ గిరిజన సంస్కృతిలో ఒక భాగం అని చెప్పవచ్చు, జిల్లాలో లంబాడీ గిరిజనుల సంస్కృతి కొంత వరకు సజీవంగా ఉందంటే దానికి కారణం మహిళలే.

మహిళల నృత్యాలు

[మార్చు]
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో బంజారా కళాకారుల నృత్య ప్రదర్శన

లంబాడీ గిరిజనుల జీవనంలో నృత్యం ఆట పాటలు ఒక భాగం, లంబాడీ స్త్రీలు దాదాపు తొమ్మిది,పది పద్ధతుల్లో డప్పు దరువుకు‌ అనుగుణంగా నెమ్మదిగా ఊగుతున్న కదలికలో నృత్యాలు చేస్తారు. నృత్యంలో ఝాజ్కాళీ, లంగ్డీపాయి,డోడ్పాయి,మోరేర్,ఎక్ హతేర్, దిహతేర్, మొదలగు నృత్యాలు చేస్తారు.కాని ఈ రోజుల్లో ఎక్కువ డిజే పాటలపై దాండియా నృత్యాలు చేస్తూ కనిపిస్తూంటారు. లంబాడీలలో డప్పు లంబాడీలు ( ఢాలియా) అనే ఉపజాతి వారు డప్పు వాయిస్తారు. పెళ్ళి ,చావు, సందర్భాలలో కార్య పద్ధతులకు అనుగుణంగా డప్పు వాయిస్తారు. డప్పు లంబాడీలు కాళ్ళకు గజ్జెలు కట్టుకొని డప్పు వాయిస్తూ చేసే నాట్యం శ్రోతలను, ప్రేక్షకులను రంజింపచేసి ఆకట్టుకుంటుంది.

ఆచారాలు

[మార్చు]

లంబాడీ గిరిజనుల విందు, వినోదాలు, పెండ్లి,చావు, పుట్టుక, గృహప్రవేశం, శుభ, అశుభ కార్యక్రమాలలో బ్రాహ్మణుల వేద మంత్రాలు ముందురోజులలో‌ లేకపోయినా ఈ రోజులలో తప్పని సరి అయినాయి. పెళ్ళి కొడుకు వారు పెళ్ళిలో బ్రాహ్మణులను తీసుకుని రాకపోతే ఇరువురి మధ్య కొట్లాటలు కూడా జరుగుతాయి.లంబాడీ గిరిజనుల కుటుంబంలో ఎవరైనా మరణిస్తే మూడవ రోజు దినాలు చేస్తారు దీనినే దాడో అంటారు.శని,ఆదివారం రోజు మరణిస్తే ఆదే‌‌ రోజు దినాలు చేయాల్సి ఉంటుంది.ఆదివారం దాటనీయరు ఇది వారి ఆచారము.శని, ఆది ఈ వారాల్లో చనిపోతే గ్రామస్తులు దహనానికి ముందు ఊర్లో ఒక మేక బలి ఇస్తారు. చనిపోయిన రోజు నుండి పదమూడో రోజు దశత్రియ దినకర్మ చేస్తారు దీనిని " తెరవి "పెద్ద కర్మ" అంటారు,"తెరవి"జరిగేవరకు తాండ ప్రజలు, మిత్రులు బంధువులే ఓదార్చి చాయి, భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి మరణవార్త, దహన సమాచారం తెలిసిన వెంటనే తప్పకుండా అందరూ హాజరు కావడం, లేదంటే పెద్దకర్మ రోజున కలిసి పరామర్శించడం జరుగుతుంది. సంతలో గాని,మరి ఏ సందర్భంలోనైనా తారసపడితే అచ్చటనే హోటల్ కి తీసుకేళ్ళి చాయ్ తాగించి పరామర్శించడం, బీడీలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా క‌ష్టకాలంలో ఉంటే వారి కష్టసుఖాలో పాలు పంచుకొనే గొప్ప సంస్కృతి బంజారాల సంస్కృతి. ఈ తెరవి తెలంగాణ లోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే చేస్తుంటారు. ఇతర జిల్లాల్లో తెరవి భిన్నంగా ఉంటుంది.లంబాడీ గిరిజనుల తెగలో ఏ కారణం చేతనైనా కుటుంబంలో అన్న మరణిస్తే కుటుంబ సభ్యులు, బంధువులు, పెద్దలు, శ్రేయోభిలాషులు చేరి విధవరాలైన స్త్రీ యొక్క బాగోగుల గూర్చి ఆలోచించి అన్నకు పుట్టిన సంతానం తమ్ముడైతేనే బాధ్యతగ చూసుకుంటాడని వారిని తన సంతానంగా భావించి విధవరాలును సమాజంలో నీచంగా చూస్తారని ఆలోచించి వదినమ్మను పెళ్ళి చేసుకునే ఆచారం లంబాడీ గిరిజనుల్లో ఇప్పటికీ కొనసాగుతోంది.ఈ నిర్ణయం తీసుకోని కుటుంబాన్ని నిలబెట్టడం గొప్ప విషయం

మద్యపానం

[మార్చు]

గతంలో వీరు ఇప్పపువ్వుతో స్వయంగా మద్యం తయారు చేసి తాగి ఇతరులకు అమ్మేవారు. అడవి నుండి ఇప్పపువ్వు సేకరించి తమ తమ ఇంట్లోనే సారా బట్టీలు పెట్టేవారు.కానీ వివిధ కారణాల వల్ల ఇప్పపువ్వు దొరకకపోవడంతో బెల్లం పానకంతో గుడుంబా తయారు చేసి అమ్మేవారు కానీ దీక్షగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ప్రతి తాండలో సార బట్టిలు, గుడుంబా బట్టిలను నిషేధించారు. అప్పటి నుండి ప్రభుత్వ సారని తాగుతున్నారు.

బంజారాల ఆరాధ్యదైవం

[మార్చు]

భారత దేశంలో మధ్యయుగ భక్తి ఉద్యమ ప్రబోధకుల్లో సంత్ సేవాలాల్ మహారాజ్ ఒకరు. సంత్ సేవాలాల్ మహారాజ, జగదాంబ దేవి భక్తుడు కావడం వల్ల లంబాడీలు సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ దేవిని పూజిస్తారు. జిల్లాలోని ప్రతి లంబాడీ తాండలో సంత్ సేవాలాల్ మహారాజ్ మరియు జగత్ జననీ జగదాంబ దేవి దేవాలయమును నిర్మించుకుంటున్నారు.ఆలయ ప్రాంగణంలో రెండు జెండాలు ఉంటాయి. ఒకటి సేవాలాల్ మహారాజ్, రెండోది జగదాంబ దేవి. రెండు జెండాలు కూడా ప్రక పక్కనే నిలబెడతారు. సేవాలాల్ జెండాకు తెలుపు రంగు బట్ట మరియు జగదాంబ దేవి జెండాకు ఎరుపు రంగు బట్టలతో జెండాలు ఉంటాయి.

పవిత్రమాసం

[మార్చు]

లంబాడీ గిరిజనులు శ్రావణ మాసాన్ని పవిత్ర మాసంగా భావిస్తారు. శ్రావణ‌ మాసంలో మద్యం మాంసానికి దూరంగా ఉండి ఒక నెల రోజులు ఉపవాస దీక్షలు చేపట్టి నెలరోజులు సాయంత్రం భోజనాలు ముగించుకుని ఊర్లో ఎవ్వరూ ఆహ్వానిస్తే వాళ్ల ఇంటికి వెళ్ళి భజనలు కీర్తనలు, చౌకట్ (పాసా) ఆటలు ఆడుతారు. అదే నెలలో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో కొలువై ఉన్న హథిరామ్ బావాజీ, బాలాజీ వేంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుని శ్రీ కృష్ణాష్టమి రోజున బాలాజీ భోగ్ భండారో, హథిరామ్ చూర్మో నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత భోజనాలు చేస్తారు.ఇలా ప్రతి తాండలో చేయడం జరుగును.

పండుగలు

[మార్చు]

అదిలాబాద్ జిల్లా లంబాడీ గిరిజనుల సంస్కృతిలో ముఖ్యమైన పండుగలలో " సేవాలాల్ జయింతి, తీజ్, బాలాజీ, (భోగ్,భండారో), పంచమి,దసరా,దవాళి,మత్రాల్(గౌమాతాపూజ) హోళీ,పాడ్వా, సమ్నక్,(హెటాల్)* ముఖ్యమైనవి. వర్షాలు కురవక పోతే అమ్మాయిలతో "భత్కోలా", అబ్బాయిలతో "మిటక్,మాటక్", చేయించి వరుణదేవునికి నైవేద్యం సమర్పిస్తారు.రోహిణీ నక్షత్రం ముగింపు సమయంలో మంగళవారం రోజున ఊరి చివర పొలిమేరలో మేకపోతు కోసి సమ్నక్ అనే పండుగ నిర్వహించి మరుసటి రోజు నుంచి విత్తనాలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎండాకాలంలో దస్రావ్ పండుగను లంబాడీ గిరిజనుల ఎక్కువగా చేస్తుంటారు. ఈ పండుగకు అబ్బాయిల కేశ ఖండనం చేస్తారు.కొందరు అమ్మాయిల కేశ ఖండనం కూడా చేస్తున్నారు.ఏడు దేవతలైన,భవాని,మేరమ్మ తళ్జా,కంకాళికి,ధోళాంగర్ దేవతలకు మేకపోతును బలిచ్చి మాంసంతో తయారు చేసిన సళోయి,నారెజా, లంగాణ్,దారు భోటి,బాటి తిని కుటుంబ సభ్యులు, బంధువులు, పెద్దలు ఇత్తడి లేదా కంచు పల్లెము,నగారా (ఢంకా) (థాళి,నంగారా )మోగిస్తూ రాత్రంతా నిద్దురపోకుండా భవానిని కొలుస్తూ ఈ పాటలు పాడుతారు. అత్‌రాదనేరి భవాని కత గయితి తోన కుణ వలేమాయో అని పాడి ఉదయం దేవిమ దేవికుణ్సి మోటి వియోర కోళేతారా* హారతితో సమాప్తం చేసి భోజనం చేసి ముగిస్తారు.

  • పవిత్రమైన ప్రకృతి పండుగ తీజ్* లంబాడీ గిరిజనులు తీజ్ [3]పండుగను శ్రావణ మాసంలోని రాఖీ పూర్ణిమ రోజున ‌ప్రారంభించి, శ్రీకృష్ణాష్టమిన సమాప్తం చేస్తారు. దేశమంతటా ఘనంగా తొమ్మిది రోజులు జరుపుతారు.పండుగ మొదటి రోజు చివరి రోజు ముఖ్యమైనవి.

తీజ్ ప్రకృతి ఒడిలో గిరిజనులు జరిపే పవిత్రమైన పండుగ కాబట్టి దీనినే ప్రకృతి పండుగ అని కూడా అంటారు. తాండలోని ఆడపడుచులు, పెళ్ళికాని అమ్మాయిలు పండుగ జరుపుకునేందుకు అనుమతి కోసం తాండ నాయిక్ ఇంటికి వెళ్ళి అనుమతి తీసుకొని అంగడి నుండి వెదురు బుట్టలు (ఓల్డి )తెచ్చి అడవికి వెళ్ళి చీమపుట్ట (మకోడార్,ధూడ్) మట్టిని సేకరించి నానబెట్టినా గోధుమలను ఊరిలోని స్త్రీలందరు నాయకుని ఇంటికి వెళ్ళి బుట్టలలో గోధుమలు,మట్టి చల్లుతారు వాటిని తాండ నాయికుని ఇంటి ముందు ఏర్పాటు చేసిన మంచెపై బుట్టలు పెట్టి యువతులందరు రోజు రెండు సార్లు నీరు పోస్తు సేవాభాయా, మేరమ్మ యాడిని పొగుడుకుంటు ఈ పాట‌ పాడుతారు."సేవాభాయా బోరాయోతీజ్ ఘడిఎక రమలెతి" "మారిహూసె లాడెరియే తీజ్ ఘడిఎక రమలెతి" ఇలా ఎనిమిది రోజులు భక్తి శ్రద్ధలతో నీరు పోసి ఆరోజు మట్టితో ఆడ,మగ‌ రెండు మట్టి బొమ్మలు డొక్రి,డొక్రా ,(గణ్,గోర్) తయారు చేసి వాటికి పూజ చేసి పెళ్ళి కాని యువతులకు మంచి భర్త, మంచి సంబంధాలు రావాలని కోరుతారు దీనిని ఢంబోళి అంటారు.ఈ పండుగ సమయంలో పెళ్ళికాని అమ్మాయిలు ఆకుకూరలు,ఉప్పు, ఉల్లిపాయ పచ్చిమిర్చి, మాంసం ముట్టుకోరు. తొమ్మిదవ రోజున పూజ చేసి,సేవాలాల్ మేరమ్మ యాడికి నైవేద్యం సమర్పిస్తారు.తరువాత తాండ లోని, నాయక్,కారోభారి, డావ్,మాన్కరి, స్త్రీ,పురుషులు, యువకులందరు గుంపుగా (మళావ్) కూర్చుంటే యువతులు తమతమ బుట్టల నుండి తీజ్ తెంపి వరుసగా గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతూ తీజ్ ను వారివారి,తలపాగా (పాగడి),జేబు,(ఖీసో), చేతులలో ఇచ్చి ఇలా పవిత్రంగా పచ్చగా ఉండాలని, వర్షాలు బాగా కురవాలని, అందరూ సంతోషంగా జీవించాలని కోరుతారు. యువతులు, యువకులు, పెద్దలు,అందరు డప్పు చప్పుళ్ళతో నృత్యాలతో పాటలు పాడుతూ ఆడుతూ తీజ్ ను నిమజ్జనానికి నీళ్ళున్న చోటుకు చెరువుకి గాని,నదీతిర ప్రాంతానికి గాని చేరుకొని నీటిలో దిగి తమ తమ చేతుల్లో ఉన్న తీజ్ బుట్టలను నీటిలో వదులుతారు అప్పుడు అమ్మాయిల కాళ్ళను వారి వారి తోబుట్టువులు కడగుతారు.తమకు వరుసైన యువకులను బనాయిస్తూ తమ తమ ఇండ్లల్లకు చేరుకోవడంతో తీజ్ పండుగ ముగుస్తుంది.

  • లక్ష్మీపూజ, దవాళి*

ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ. పూర్తి అమావాస్య రోజున జరుపుకునే పండుగ కాబట్టి లంబాడీ గిరిజనులు కాళీమావస్ అని అంటారు.వీరు దీపావళి అంగడికి తప్పకుండా వెళ్ళి అమ్మాయిలకు కొత్త బట్టలు, సూర్సుర్ బత్తిలు, టపాకాయలు ఇప్పిస్తారు. ఈ పండుగను పురస్కరించుకుని ఇంటిని శుభ్రం చేసి నూతనంగా పండించిన ధాన్యాల పైన లక్ష్మి మాత ప్రతిమను కూర్చోబెట్టి పూజ చేస్తారు.అసలైన లక్ష్మి అయిన గోమాతను పూజించండానికి రాత్రి వేళల్లో యువతులు, మహిళలు ఇంటి నుండి బయటకు దీపాలతో ఇంటి ముందు పశువులు కట్టిన చోటికి వెళ్ళి పశువులకు దీపం చూపించి రాత అంధేరియె దీవలో బాళేలిజో !! ఘర సకరాయియే మకరాయి కరలిజో !! పాణిరో టోటోయె కువలో ఖోదాలిజో !! ఈ విధంగా పాటలు పాడి వారి కుల దేవతలు అయిన మేరమ్మ యాడి సేవాలాల్ బాపుతో కానుకలు(మేరా) అడుగుతారు. వర్షేదనేరి కోడ్ దవాళీ సేవాతోన మేరా, వర్షేదనేరి కోడ్ దవాళీ యాడితోన మేరా అని అడుగుతారు. బంజారాల జీవన ప్రయాణంలో లదణి ఒక భాగం ఆదిమానవుడు అనుసరించిన విధానం బ్రతుకుతెరువు కొరకు సాగించే ప్రయాణంలో వీరు సమూహాలుగా జీవించేవారు. ఒక్కోసమూహంలో ఇరువై నుండి ఇరువై ఐదు కుటుంబాలు ఉండే వారు.ఒక్కో కుటుంబానికి వందనుండి నూటా ఏభై గోవులు(గావ్ డి) ఉండేవి.వీరు గోమాతను పూజిస్తారు. సంచార జీవనంలో తమ యొక్క వస్తువులను చేరవేయడానికి,ఉప్పు వ్యాపారం చేసినపుడు, సంచారంలో గోవులు ఉపయోగపడ్డాయి.సంచార జీవనం నుండి ‌స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకొని జీవించే క్రమంలో, నాగలి (నాగర్ )దున్నడానికి, బండి (గాడి) లాగడానికి, పశువులు ఉపయోగపడ్డాయి.చివరికి గోవు మూత్రమును కూడ ఇండ్లలో, వాకిట్లో చల్లుతారు.గోవు మూత్రం వల్ల సూక్ష్మక్రిములు నశిస్తాయని వీరి నమ్మకం.‌ ఆవు పేడ పంట పొలాలకు ఎరువుగా ఉపయోగిస్తారు.అందుకే గోవుతో ఉన్న అనుబంధం దృష్ట్యా గోవును అసలైన లక్ష్మీ మాత అని పూజిస్తారు. దీపావళి లక్ష్మి పూజ రోజు సాయంత్రం ఆవుకు దీపం చూపించి కానుకలు అడుగుతారు ఆడపడుచులు అడిగే టప్పుడు ఈ విధంగా అంటారు. వర్షే దనేరీ కోడ్ దవాళీ దేవళీతోన మేరా ! వర్షే దనేరీ కోడ్ దవాళీ లాల్మీ తోన మేరా ! అని ముందు పశువులను అడిగిన తర్వాత ఇంట్లోని కుటుంబ సభ్యులను అడుగుతారు. మరుసటి రోజున దీపావళి పండుగ నూతన ధాన్యాలతో రకరకాల వంటకాలు తయారు చేసి చనిపోయిన వాళ్ళకు నైవేద్యం సమర్పించి మొక్కుకుంటారు.ఆడపడుచులు పాటలు పాడుతూ పొలాలకు వెళ్ళి వివిధ రకాల పూలు తీసుకొని వచ్చి పేడతో తయారు చేసిన గుండ్రటి ఆకారం పై పువ్వులతో బతుకమ్మను అలంకరించినట్టు అలంకరిస్తారు.దానినే గోధన్ పూజ అంటారు.దీపావళి పండుగ పెళ్ళి కాని అమ్మాయిల పండుగ అని చెప్పవచ్చు.ప్రకృతికి దీపావళికి అవినాభావ సంబంధం ఉందని లంబాడీ మహిళలు చెప్పుతూ ఉంటారు.

  • హోళి పండుగ*

లంబాడీ గిరిజనులు అత్యంత ఉత్సాహంతో జరుపుకునే పండుగల్లో హోళి ఒకటి.హోళి పండుగ వసంతకాలంలో పున్నమిన వచ్చే పండుగ. తాండలో పండుగకు పది రోజుల ముందు నుంచే డప్పు వాయిస్తూ లెంగీ పాటల పై లెంగీ నృత్యాలు చేస్తారు.నృత్యాలు చెసే మగవాళ్ళని గేర్యా అని ఆడవాళ్ళను గేరణి అని అంటారు. గేర్యా, గేరణిలు ఒకరినొకరు తిట్టుకుంటూ హోళి పాటలు పాడుతారు. వీరు కూర్చోని డప్పులు వాయిస్తూ లెంగి పాటలు పాడుతారు దానిని బెటిలెంగీ అంటారు. ఆ ఊరిలో సంవత్సర కాలంలో ఎవరైనా చని పోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించిన తర్వాత వాళ్ళను కూడా లెంగీ నృత్యాల్లో కలుపుకుని తీసుకోని వెళ్తారు. వీరు హోళి పండుగన చిన్నారి మగ పిల్లలకు ఢూండ్ చేస్తారు. హోళి కామధహనం మరుసటి రోజున దులండి పండుగ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ మోదుగ(కేసులా) పువ్వులతో తయారు చేసిన రంగులను గాని, రసాయన రంగు‌ నీళ్ళను గాని ఒకరి పై ఒకరు జల్లు కుంటు గేర్ ( పండుగ ఇనామ్) అడుగుతారు. వరుసగా మరిది అయ్యే వారి వస్తువులను గాని, ధరించే బట్టలను గాని వదినమ్మలు దాసి పెట్టుతారు. ఆ వస్తువును మళ్ళీ పొందాలంటే వారికి కుడుకలు బెల్లం ఇనామ్ ఇచ్చి తీసుకుంటారు.

దుస్తులు, ఆభరణాలు

[మార్చు]
సంప్రదాయ వస్త్రధారణలో బంజారా మహిళ

లంబాడీ సంస్కృతిలో వివాహమైన స్త్రీలకు అద్దాల కాచళి ,ఫేటియ్య, ఆటి, చోట్లా,భూరియా,బలియా, కల్డా, హాసలో,కోప్ రియా,విటిఫూలా, ఘూంగటో(శిరస్త్రాణం) లేక టుక్రి కప్పుకుంటారు, పురుషులు,ఖమిష్,ధోతి, చదువుకున్న వారు ప్యాంట్, ఝీగ్లా, దస్తీ సేలా,పట్కా (పాగడి)కట్టుకొని తలకు తలపాగ పట్కచుట్టుకుంటారు.వస్త్రధారణలో వచ్చిన మార్పులతో ఇప్పుడు మహిళలు చీరలు పురుషులు ప్యాంటు ధరిస్తున్నారు. లంబాడీ గిరిజనుల దుస్తులకు సినిమా యందు ఈ రోజుల్లో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది[4]. లంబాడీ గిరిజనుల కుటుంబంలో కూతురు జన్మించిందంటే తమ ఇంట్లో లక్ష్మి వచ్చిందని గర్వించి వృద్ధాప్యంలో కొడుకులు బాగోగులు చూసుకోకున్నా బిడ్డలైన చూసుకుంటారనే ధైర్యం, ముఖ్యంగా ఇంటి పనిలో, వంటపనిలో, వ్యవసాయపనులలో తల్లిదండ్రులకు సహాయకారిగా ఉంటారని భావిస్తారు.కాని పేద కుటుంబంలో వరుసగా అమ్మాయిలు పుట్టినచో పోషణ భారం వల్ల అమ్మాయిలను అమ్ముకునే సంస్కృతి లంబాడీ గిరిజనుల్లో కన్పిస్తుంది. ఆమ్మాయిలకు వీరు చిన్న వయసు నుండే కాళ్ళకు పట్టిలు (పింజణ్) గజ్జెలు ( ఘూగ్రాలు) కడతారు.ముక్కుకు నతలి భూరియ్యా ,చెవులకు రింగె (రింగులు) కాళ్ళగజ్జెల చప్పుడు విని విషపురుగులు పక్కకు పారిపోతాయి అని లంబాడీ గిరిజనుల విశ్వాసము. కుటుంబంలోని పెద్ద, చిన్న కుమారుడికి పెండ్లి చేసేటప్పుడు తప్పక రెండు లేదా మూడు మేకపోతులు కోసి వదాయి చేస్తారు.పెండ్లి సమయంలో చనిపోయిన పెద్ద లకు గుర్తుగా చోకో పూరించి మేకపోతు కోసి వకాళీ,నారేజా,నంగాణ్ బాటి చేసి మాంసం ఉడికించి మూలగబొక్కలు ఏడు, కాలేయం ముక్కలు ఏడు (ఘూండివాళో హడ్కా,కళజొ) సమర్పించి ధప్కార్ అగ్నిహారం ఇచ్చి దానితో పాటు సార కూడా భూమి పై పోస్తారు. మొక్కిన తర్వాత వారు సార తాగి భోజనం చేస్తారు.

సేవాలాల్ దీక్షలు

[మార్చు]

సేవాలాల్ దీక్షలు శ్రీ సంత్ దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ మొట్టమొదటి సారిగా 1992లో ప్రారంభించారు.దీక్షభూమి కొత్త పల్లి నుండి పౌరాఘడ్ కు సేవాదళ్ పేరుతో సుమారు యాభై వేలకు పైగా భక్తులను కాలినడకన గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ పౌరాదేవికి తీసుకుని వెళ్ళడం గొప్ప విషయం.అప్పటి నుండి ప్రతి సంవత్సరం భక్తులు దీక్ష భూమి కొత్తపల్లిలో దీక్ష తీసుకుని పౌరాదేవి వెళ్ళుతుంటారు. బంజారాల కాశీగా పిలువబడే మహారాష్ట్రలోని పౌరాగడ్ లో కొలువైవున్న బంజారాల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబ దేవిని సందర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి గోర్ బంజారా భక్తులు తరలివెళ్తారు. మహాశివరాత్రి పర్వదినం మొదలు శ్రీరామ నవమి వరకు ఎటు చూసినా సేవాలాల్ దీక్షలు జై సేవాలాల్ నామస్మరణలు వీనులవిందు చేస్తాయి. భక్తి మార్గంలో ప్రేమ్ సింగ్ మహారాజ్ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడంతో పాటు భక్తులు సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు దాదాపు ఐదు ఆరు మహా‌ యజ్ఞాలు నిర్వహించారు. అందులో రుద్ర సహకార మహా యజ్ఞం, లక్షచండీ యజ్ఞం దీక్షభూమి కొత్తపల్లిలో తీర్థ క్షేత్రం పోహ్రదేవిలో చేయడం గమనార్హం.దీక్షగురు దేశంలోని వివిధ రాష్ట్రాల తండాల్లో పర్యటిస్తూ ప్రజలను భక్తి మార్గంలో నడిపిస్తూ సేవాలాల్ మహారాజ్ జగదాంబ దేవి ఆలయ భూమి పూజ మందిర నిర్మాణానికి కృషి చేస్తున్నారు.ప్రతి తాండలో విగ్రహ ప్రతిష్ఠాపన భోగ్ భండారో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తన మధురమైన వచనాలతో ప్రజలను చైతన్య పరుస్తూ హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుతున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "బంజారా సంస్కృతి ప్రపంచ దేశాలకు ఆదర్శం". EENADU. Retrieved 2024-09-08.
  2. Anukaran (2021-05-12). "బంజారాల సంస్కృతి… బహుబాగు." Disha daily (దిశ) | Breaking news (in ఇంగ్లీష్). Retrieved 2024-09-08.
  3. Ravi (2022-08-05). "గిరిజనుల ప్రత్యేక పండుగ తీజ్ ఎలా జరుపుకుంటారో తెలుసా?". www.dishadaily.com. Retrieved 2024-09-08.
  4. "Sakshi | Karimnagar Main Edition - 06/11/2024, Karimnagar Main Today Telugu News ePaper Online". epaper.sakshi.com. Retrieved 2024-11-06.