బక్షీ గులామ్ మొహమ్మద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బక్షీ గులామ్ మొహమ్మద్

జమ్మూ కాశ్మీరు 2 వ ప్రధాని
రాష్ట్రపతి కరణ్ సింగ్

జమ్మూ కాశ్మీరు మొదటి ఉప ప్రధాని
ప్రధాన మంత్రి షేక్ అబ్దుల్లా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీరు నేషనల్ కాన్ఫరెన్సు

బక్షీ గులాం మొహమ్మద్ (1907-1972) జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్‌ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. 1953 నుండి 1964 వరకు జమ్మూ కాశ్మీర్ ప్రధాన మంత్రిగా పనిచేశాడు. బక్షీ నేషనల్ కాన్ఫరెన్స్‌ పార్టీని స్థాపించినప్పటి నుండీ దానిలో సభ్యుడిగా ఉన్నాడు. దాని ముఖ్య నాయకుడు షేక్ అబ్దుల్లా తరువాత ద్వితీయ స్థానానికి ఎదిగాడు. అతను 1947-1953 మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఉప ప్రధాన మంత్రిగా పనిచేశాడు. కాని 1953 లో షేక్ అబ్దుల్లా, రాష్ట్రానికి స్వాతంత్ర్యం కావాలని వాదించడంతో బక్షీ అతనితో విభేదించాడు. రాష్ట్ర గవర్నరు కరణ్ సింగ్ మద్దతుతో 'తిరుగుబాటు' చేసి, [1] షేక్ అబ్దుల్లాను తొలగించి, జైలులో పెట్టారు. తాను ప్రధానమంత్రి అయ్యాడు. బక్షీ జమ్మూ కాశ్మీర్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రి. అతని పాలనా కాలం లోనే జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత ప్రభుత్వంతో జమ్మూ కాశ్మీర్ సంబంధాలను సౌహృద్భావ స్థితికి తీసుకొచ్చాడు.

తొలి జీవితం

[మార్చు]

బక్షీ గులాం మొహమ్మద్ 1907 లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జన్మించాడు. అతను CMS టిండేల్ బిస్కో పాఠశాలలో చదువుకున్నాడు. [2] అతను జమ్మూ కాశ్మీర్‌లో స్కర్దూ, లేహ్ వంటి ప్రాంతాల్లో పాఠశాల ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం మొదలు పెట్టాడు. తరువాత ఆల్ ఇండియా స్పిన్నర్స్ అసోసియేషను కాశ్మీర్ శాఖలో పనిచేశాడు.

సంస్థాన రాజకీయాలు

[మార్చు]

1927 లో రాష్ట్ర ముస్లింలకు పౌర, రాజకీయ హక్కుల సాధన కోసం జరిగిన ఆందోళనలో బక్షీ షేక్ మొహమ్మద్ అబ్దుల్లాతో చేయి కలిపాడు. ఇది ముస్లిం కాన్ఫరెన్స్ ఏర్పాటుకు దారితీసింది. ఈ కాలంలో సంస్థ మనుగడ కోసం బక్షీ గులాం మొహమ్మద్ తన ప్రతిభను నియోగించాడు. అతను విద్యార్థులు, కార్మికులను ఉత్తేజపరచాడు. వారి సంఘాలను ఏర్పాటు చేశాడు. రియాసి సబ్ జైలులో పదహారు నెలల శిక్షతో సహా స్వాతంత్ర్య పోరాటంలో అతను అనేకసార్లు అరెస్టయ్యాడు. ముస్లిం కాన్ఫరెన్స్ పార్టీలో అతను, "ఖలీద్-ఇ-కాశ్మీర్" అనే బిరుదును పొందాడు. గొప్ప ముస్లిం జనరలైన ఖలీద్ బిన్ వలీద్ తరువాత ఆ బిరుదు పొందిన దతడే.

1938 నాటికి, అన్ని వర్గాల ప్రజలు బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలనే డిమాండును లేవనెత్తారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. ముస్లిం కాన్ఫరెన్స్ పేరును నేషనల్ కాన్ఫరెన్స్‌గా మార్చారు. ఈ కాలంలో బక్షీ గులాం మహమ్మద్ రాష్ట్ర పోలీసుల కళ్ళుగప్పి, ఒక అడుగు ముందుకేసి ప్రచ్ఛన్నంగా పనిచేశాడు. 1946 లో, "క్విట్ కాశ్మీర్" ఉద్యమ సమయంలో, బక్షీ గులాం మొహమ్మద్‌ను అరెస్టు చేసేందుకు వారెంటు జారీ అయినప్పుడు అతడు బ్రిటిష్ ఇండియాకు పారిపోయాడు. కాశ్మీర్ ఆందోళనకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని సమీకరించేందుకు అతను అనేక ప్రదేశాలను సందర్శించాడు. 1947 ఆగష్టులో మహాత్మా గాంధీ కాశ్మీర్ సందర్శించిన తరువాత బక్షీపై ఉన్న వారెంటును ఉపసంహరించారు. పదిహేడు నెలల తర్వాత అతను తిరిగి వచ్చాడు.

రాజకీయాలు

[మార్చు]

1947 అక్టోబరు 30 న, షేక్ మొహమ్మద్ అబ్దుల్లా అత్యవసర పాలనా వ్యవస్థకు అధిపతిగా నియమితుడయ్యాడు. పాకిస్తాని దురాక్రమణదారులు కాశ్మీరుపై నుండి దాడి చేస్తున్నారు. బక్షీ గులాం మొహమ్మద్ అతనికి డిప్యూటీగా ఎన్నికయ్యాడు. 1948 మార్చిలో, ఈ పరిపలనా వ్యవస్థను తాత్కాలిక ప్రభుత్వంగా ఉన్నతీకరించారు. బక్షికి గృహ మంత్రిత్వ శాఖను అప్పగించారు. 1951 లో రాజ్యాంగ సభ ఎన్నికలలో, అబ్దుల్లా రాష్ట్ర ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యాడు, బక్షీ ఉప ప్రధాన మంత్రిగా నియమితుడయ్యాడు.

ప్రధాన మంత్రి (1953–1964)

[మార్చు]

1953 ఆగష్టులో, షేక్ మహమ్మద్ అబ్దుల్లాను తొలగించి, అతన్ని అరెస్టు చేశారు. రాష్ట్ర మంత్రివర్గం మెజారిటీ ఓటు ద్వారా బక్షీ గులాం మొహమ్మద్‌ను రాష్ట్ర ప్రధాన మంత్రిగా ఎన్నుకుంది. అతను నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి కూడా అధ్యక్షుడయ్యాడు. అతని పాలనా కాలం లోనే అబ్దుల్లా పైనా ఇతరులపైనా ప్రసిద్ధిచెందిన కాశ్మీర్ కుట్ర కేసు మోపారు.

బక్షీ గులాం మొహమ్మద్ సమర్థుడైన పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. రాష్ట్రంలో ఆయన చేసిన నిర్మాణాత్మక కృషి కారణంగా అతన్ని "ఆధునిక కాశ్మీర్ వాస్తుశిల్పి" అని పేరుపొందాడు. అతను కాశ్మీర్‌ని ప్రగతి మార్గంలో నడిపించాడు. "నయా కాశ్మీర్" ఆదర్శానికి అతను ఆచరణాత్మక రూపునిచ్చాడు. కాశ్మీరుపై మిగతా దేశంలో సత్కీర్తిని, సద్భావననూ సంపాదించాడు. క్షేత్ర స్థాయి లోని వ్యక్తులతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో అతనికి ప్రత్యేక నైపుణ్యం ఉంది. అన్ని ప్రాంతాల ప్రజలలో అతను విపరీతమైన ప్రజాదరణ పొందాడు.

బక్షీ గులాం మొహమ్మద్ 1955 లో షేక్ అబ్దుల్లా అనుచరులు ఏర్పాటు చేసిన ప్లెబిసైట్ ఫ్రంట్ నుండి గట్టి రాజకీయ సవాలును ఎదుర్కొన్నాడు.

1963 మే లో, మూడు పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత, కాంగ్రెస్ పార్టీ, కామరాజ్ ప్రణాళిక ప్రకారం, కొంతమంది మంత్రులు రాజీనామా చేయాలనీ, పార్టీ పనికి తమ సమయాన్ని కేటాయించాలనీ నిర్ణయించుకున్నారు. తుది ఎంపికను జవహర్‌లాల్ నెహ్రూకు అప్పగించారు. ఢిల్లీలో చాలా మంది కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో బక్షీ కూడా రాజీనామా చేయాలని నెహ్రూ సూచించాడు. బక్షీ సిఫారసు మేరకు, అతని విధేయుడు ఖ్వాజా షంషుద్దీన్ అతని వారసుడిగా పదవి స్వీకరించాడు. కానీ షంషుద్దీన్ చాలా తక్కువ కాలం మాత్రమే రాష్ట్రానికి నాయకత్వం వహించాడు.

బక్షీ పదకొండు సంవత్సరాల పాటు కాశ్మీరు ప్రధాన మంత్రిగా పని చేసాడు. కాశ్మీరులో ఏ ప్రధాన మంత్రి గానీ, ఏ ముఖ్యమంత్రి గానీ ఇంత సుదీర్ఘ కాలం పాటు నిరంతరాయంగా పదవిని నిర్వహించలేదు. స్వాతంత్య్రానంతర రాష్ట్ర చరిత్రలో అతని పదవీ కాలమే స్థిరత్వం ఉన్న కాలంగా గుర్తిస్తారు.  భారత యూనియన్‌లో అంతర్భాగంగా ఉన్న జమ్మూ కాశ్మీరుకు ఉన్న ప్రత్యేక హోదాను దెబ్బతీసే ప్రయత్నాన్ని బక్షీ గులాం మొహమ్మద్ గట్టిగా ప్రతిఘటించాడు.

ప్రతిపక్షంలో (1964-1965)

[మార్చు]

1964 లో గులాం మహ్మద్ సాదిక్ ముఖ్యమంత్రిగా ఉండగా బక్షీ గులాం మొహమ్మద్ ప్రతిపక్షానికి నాయకత్వం వహించాడు. ఆ సంవత్సరం వేసవికాలం చివరిలో మెజారిటీ శాసనసభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టమని వత్తిడి చేశారు. రాష్ట్ర శాసనసభలో అతనికి మెజారిటీ సభ్యుల మద్దతు ఉంది. అయితే, అతన్ని భారత రక్షణ నిబంధనల కింద అరెస్టు చేసి నిర్బంధించారు. గవర్నరు శాసనసభను ప్రొరోగ్ చేశారు. బక్షీ గులాం మొహమ్మద్ డిసెంబర్‌లో ఆరోగ్య కారణాల మీద విడుదలయ్యాడు. 1965 జూన్ లో రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు.

భారత పార్లమెంటు సభ్యుడిగా (1967–1971)

[మార్చు]

1967 లో బక్షీ నేషనల్ కాన్ఫరెన్స్ టికెట్‌పై అధికార కాంగ్రెసు పార్టీ అభ్యర్థి అలీ మహమ్మద్ తారిక్‌ను భారీ తేడాతో ఓడించి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1971 వరకు అతను లోక్ సభ సభ్యుడిగా కొనసాగాడు.

మరణం

[మార్చు]

బక్షీ గులాం మొహమ్మద్ 1972 జూలై 9 న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. Puri, Jammu and Kashmir, State Politics in India 2015, p. 229.
  2. "Bakshi Ghulam Mohammed- A Life Sketch". www.kashmirnetwork.com. Retrieved 2019-04-01.