బాపూజీ (జాషువా రచన)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాపూజీ కవి జాషువా 1948 సంవత్సరంలో రచించిన ప్రసిద్ధ పద్య కావ్యం. భారత జాతిపిత మహాత్మా గాంధీని ఒక దుండగుడు హత్య చేసినప్పుడు అఖిల భారతావని, ప్రపంచమంతా శోకించింది. జాషువా కవి ఈ సందర్భంలో గాంధీజీ ఔన్నత్యాన్ని, పవిత్రతను తలచుకొని పెక్కు విధాలుగా కొనియాడారు. జరిగిన ఘోరానికి మిక్కిలి పరితపించారు. బాపూజీ లేని భారతదేశమెంత శూన్యమో తలుచుకొని దుఃఖించారు. ఇది గాంధీజీ పూర్తి జీవిత కథ కాదు.

కొన్ని పద్యాలు[మార్చు]

భారతదేశములోని వజ్రాల సంపద నంతటినీ తూకం వేసినా గాంధీజీయే ఎక్కువ బరువు తూగుతాడు. పదివేల సంవత్సరాలలో భూదేవత ఇంతటి పవిత్రుని కనియుండదు. తాను గోచిపాతను మాత్రమే ధరించి జాతి గౌరవమును నిలిపినాడు. లోకమంతటికి సామరస్యమును ప్రసాదించిన విజ్ఞాన ప్రదాత - అని జాషువా పేర్కొన్నాడు ఈ క్రింది పద్యంలో.

సీ. భరత వర్షంబీను వజ్రాల ధనరాశి
తూకంబునకు పెచ్చుదూగునాడు
మూడు మూర్తుల దయాభూతి ప్రత్యంగాన
తాండవించెడు పవిత్ర స్వరూపి
పదివేల యేండ్ల లోపల ధరాదేవత
కనియెఱుంగని జగన్ముని వరుండు
అనుగుదమ్ములు కోరుకొని స్వరాజ్యార్థమై
పస్తుండి శుష్కించు పండుముసలి

గోచిపాత గట్టుకొని జాతి మానంబు
నిలిపినట్టి ఖదరు నేతగాడు
విశ్వసామరస్య విజ్ఞాన సంధాత
కామిత ప్రదాత గాంధి తాత.


సీమబట్టలు ధరించు పుట్టు భోగులకు గాంధీజీ చేనేత బట్టలు ధరించడాన్ని నేర్పటమే కాక వారందరు ఖద్దరును చేతితో నూలు వడికి తయారుచేసుకోవటం కూడా నేర్పాడు. ఆయన జడుపులేని శాంతి సైన్యాన్ని తయారుచేశారు.

సీ. సత్యాగ్రహ స్వర్ణ శంఖంబు పూరించి
స్వాంతంత్ర్య సమర బీజములు నాటి
సీమ బట్టలు ధరించెడు పుట్టుభోగికి
చేనేతి మగ్గాలు చేతికిచ్చి
దొరల చేజిక్కిన భరత సామ్రాజ్యంబు
నుపవాసముల చేత నూచియూచి
స్వీయదేశీయ సిపాయి ఖైదీయౌట
గౌరవంబను సుద్దు గట్టి జేసి

పొదలు మంచుకొండమొదలు సేతువుదాక
భారతంబు వెంట బరుగులెత్త
జడుపు గిడుపులేని శాంతి పటాలంబు
సిద్ధపరచె ధర్మ బుద్ధుడగుచు.