Jump to content

బాబూభాయ్ వైద్య

వికీపీడియా నుండి

బాబూభాయ్ ప్రాణ్‌జీవన్ వైద్య (1909 జూలై 23- 1979 డిసెంబరు 12) భారతీయ స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త, రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త, పాత్రికేయుడు, రచయిత.

తొలి జీవితం

[మార్చు]

బాబుభాయ్ పి. వైద్య, గుజరాత్ రాష్ట్రం ద్వారకలో 1909 జూలై 23 న వైద్యుల కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి డాక్టర్ ప్రాణ్‌జీవన్ దాస్ ఎమ్. వైద్యకు బరోడాలో కార్యాలయాలు ఉన్నాయి. అతని అన్నయ్య, డాక్టర్ మనుభాయ్ వైద్య, సంఘంలో పెద్దమనిషి, రాష్ట్రపతి నుండి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నాడు. బాబుభాయ్ ఇద్దరు సోదరీమణులు, సుమతి, సుశీల, పశ్చిమ భారతదేశంలో మహిళా విద్యకు నాంది పలికారు.

వైద్య, ముంబై లోని ముంబై విశ్వవిద్యాలయం లో ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించాడు. అక్కడ పట్టా పుచ్చుకున్న తర్వాత భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

వైద్య 1951 లో జెట్‌పూర్ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా సౌరాష్ట్ర రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. [1] 1962 లో రాజ్‌కోట్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గుజరాత్ శాసనసభకు ఎన్నికయ్యాడు. [2]

సాహితీ కృషి, పాత్రికేయ వృత్తి

[మార్చు]

హెన్రిక్ ఇబ్సెన్, ఆస్కార్ వైల్డ్, పమేలా వాల్టన్, సలాం ఆలేకుమ్ రచనలను వైద్య గుజరాతీ భాషలోకి అనువదించాడు. వైద్య మొదటి ప్రధాన నవల ఉపమా. జావర్‌చంద్ మేఘానితో పాటు, ఫూల్‌ఛాబ్ పత్రికకు సహ సంపాదకుడుగా పని చేసాడు. బ్రిటిష్ పాలనలో అణచివేతకు ప్రతిస్పందనగా మేఘాని, వైద్య ఇద్దరూ స్వతంత్ర జర్నలిజానికి వేదికగా నిలిచారు. సౌరాష్ట్రలో మొదటి దినపత్రికకు సంపాదకుడయ్యాడు; మకరంద్ దవే దాని సహ సంపాదకుడు.

బాబూభాయ్, విశ్వామిత్ర, శాకుంతలీయ భారత్ అనే రెండు పెద్ద నవలలు రాసాడు. శాకుంతలీయ భారత్, బ్రిటిష్ పాలనకు పూర్వమున్న చరిత్ర ఆధారంగా భారతదేశ భవిష్యత్తు గురించి అతను చేసిన కల్పనను వర్ణిస్తుంది. వైద్యకు వాల్ట్ విట్మన్ కవిత్వం చాలా ఇష్టం. అతని సమాధిని సందర్శించాడు కూడా.

సామాజిక కార్యకలాపాల్లో క్రియాశీలత

[మార్చు]

ఆర్యసామాజికుడైన తాత మాయారామ్ సుందర్జీ వైద్య నుండి బాబూభాయ్ సంస్కరణవాద స్ఫూర్తిని పొందాడు. అతను ఆయుర్వేద వైద్యుడు. శిష్టమైన హిందూ ఆచారాలు, విగ్రహారాధనలను విడిచిపెట్టాడు. తన జీవితమంతా కులం, మతం, జాతి, సంపద పేరిట జరిగే అణచివేతకు, అన్యాయానికీ వ్యతిరేకంగా పోరాడాడు. అతని జీవితము, సాహిత్యమూ మానవ హక్కుల కోస్ం, అతను చేసిన ఆందోళనను ప్రతిబింబిస్తాయి.

వైద్య అస్పృశ్య కులాలు, ఉన్నత కులాలకు చెందిన అబ్బాయిలు కలిసి నివసించే హాస్టల్‌ను నడిపాడు.

అతను ప్రాచీన ఆరోగ్య వ్యవస్థ (ఆయుర్వేదం) ను విడిచిపెట్టి, జీవశాస్త్రంలో వస్తున్న కొత్త కొత్త పరిణామాలను స్వీకరించాలని ప్రతిపాదించాడు. ఆయుర్వేద విశ్వవిద్యాలయం ఈ పరిశోధనలో ముందంజలో ఉండాలని ఆయన కోరుకున్నాడు. నిరూపిత విధానాలతో కూడిన వైద్య సాధన ఆవశ్యకతను అతను నొక్కి చెప్పాడు. ఆయుర్వేదంలో రివర్స్ ఫార్మకాలజీని ఉపయోగించడం ద్వారా ఈ అభ్యాసం ఇటీవల నెరవేరింది.

మరణం

[మార్చు]

బాబుభాయ్ 1979 డిసెంబరు 12 న ముంబైలో మరణించాడు. అతని పేరుతో ఏర్పాటు చేసిన స్మారక ధర్మసంస్థ అతని 50 సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరిపింది.

మూలాలు

[మార్చు]
  1. "Sourastra, 1951". Election Commission of India (in Indian English). Retrieved 2021-08-17.
  2. "Gujarat Assembly Election Results in 1962". Elections in India. Archived from the original on 2021-01-21. Retrieved 2021-08-17.