బి.ఎస్.రాజయ్యంగార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బి.ఎస్.రాజయ్యంగార్
బి.ఎస్.రాజయ్యంగార్
జననం1901
వృత్తికర్ణాటక సంగీత విద్వాంసుడు

బి.ఎస్.రాజయ్యంగార్ (1901 - 1978) కర్ణాటక గాత్ర విద్వాంసుడు. ఇతడు మైసూరు సంస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా పని చేశాడు.

జీవిత విశేషాలు[మార్చు]

రాజయ్యంగార్ కర్ణాటక రాష్ట్రంలోని బాణావర అనే గ్రామంలో జన్మించాడు. ఇతడు తన 13వ యేటనే తల్లిదండ్రులను కోల్పోయి తన మేనమామ శ్యామాచార్ వద్ద పెరిగాడు. ఇతని కంఠశ్రావ్యాన్ని మెచ్చుకున్న వరదాచార్ ఇతడిని తమ "రత్నావళి నాటక కంపెనీ"లో చేర్చుకున్నాడు. అక్కడ ఇతడు శ్రీనివాస అయ్యంగార్ వద్ద సంగీతం నేర్చుకున్నాడు. 1930లో మద్రాసు "ఎగ్మోర్ సంగీత సభ"లో జరిగిన కచేరీ ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తరువాత 1932లో "ఓడియన్ జర్మన్ కంపెనీ" వారి 'జగదోద్ధారనా, కండు కండు నీ ఎన్న, క్షీరసాగర శయన, బ్రోచేవారెవరురా మొదలైన కీర్తనల గ్రామఫోన్ రికార్డు ద్వారా ఇతని పేరు దేశమంతటా మారు మ్రోగింది. ఇతని కచేరీలకు దేశవిదేశాలలో ప్రజలు క్రిక్కిరిసి హాజరయ్యేవారు.

సినిమా ప్రస్థానం[మార్చు]

ఇతని ఆప్తమిత్రుడైన ఆర్.నాగేంద్రరావు ఇతడిని బలవంతంగా సినిమాలలో ప్రవేశింపజేశాడు. సత్య హరిశ్చంద్ర సినిమాలో నారదుని పాత్ర పోషించడంతో పాటు అతను పాడిన "దేవ దేవనె శరణు" అనే పాట జనప్రియమయ్యింది. ఆర్.నాగేంద్రరావు మరొక చిత్రం జాతక ఫలలో కూడా నటించాడు. తెలుగులో "జలంధర", తమిళంలో నాట్యరాణి, హిందీలో తులసీదాస్ మొదలైనవి ఇతడు నటించిన సినిమాలలో కొన్ని. 1951లో ఇతడు పతాకస్థాయిలో ఉన్నప్పుడే సినిమారంగానికి స్వస్తి చెప్పి కర్ణాటక సంగీత క్షేత్రంలోనే ముందుకువెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.

సంగీత ప్రస్థానం[మార్చు]

ఇతడు మైసూరు సంస్థానంలో సంగీతవిద్వాంసునిగా ఉన్నాడు.1954లో మైసూరు ఆకాశవాణిలో ఇతడు చేసిన రాగం తానం పల్లవి అనే సంగీత కచేరీ జనప్రియమైంది. 1965లో మైసూరు రాష్ట్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం ఇతనికి లభించింది. 1970లో జరగిన మొదటి కర్ణాటక గాన కళాపరిషత్తు సమావేశాలకు అధ్యక్షుడిగా ఉన్నాడు.[1] 1975లో ఇతడిని కేంద్ర సంగీత నాటక అకాడమీ కర్ణాటక గాత్ర సంగీత విభాగంలో అవార్డును ఇచ్చి సత్కరించింది.[2]

మూలాలు[మార్చు]

  1. "Looking back, looking ahead". The Hindu. 13 February 2020.
  2. "B. S. Raja Iyengar".[permanent dead link]