Jump to content

బై (క్రికెట్)

వికీపీడియా నుండి

క్రికెట్‌లో బై అనేది ఒక రకమైన ఎక్స్‌ట్రా పరుగులు. ఇవి, బ్యాటరు బంతిని కొట్టనపుడు, బంతి బ్యాటరు శరీరానికి తగలనప్పుడూ బ్యాటింగ్ జట్టు తీసే పరుగులు.[1]

స్కోరింగ్ బైలు

[మార్చు]

సాధారణంగా, బంతి నేరుగా బ్యాటర్‌ను దాటి వెనక్కి వెళ్తే, వికెట్ కీపరు దానిని క్యాచ్ పడతాడు. దీనివలన సాధారణంగా పరుగులు రావు. ఒకవేళ బ్యాటరు పరుగుతీయబోతే, వికెట్ కీపరు స్టంపింగు చెయ్యడమో లేదా రనౌట్ అవడమో జరుగుతుంది. అయితే, వికెట్ కీపరు బంతిని పట్టుకోవడంలో తడబడినా లేదా అసలే పట్టుకోలేకపోయినా బ్యాటర్లు సురక్షితంగా పరుగులు చేయగలరు. ఈ పరుగులను బైలుగా లెక్కిస్తారు: వాటిని జట్టు స్కోరుకు కలుపుతారు, బ్యాటర్ చేసిన పరుగుల సంఖ్యకు కలపరు.

వికెట్ కీపరును తప్పించుకుని, బంతి బౌండరీ వరకు ప్రయాణిస్తే, బ్యాటింగ్ జట్టుకు నాలుగు బైలు కలుస్తాయి. ఒక అసాధ్యమైన సందర్భంలో బౌలరు వేసిన బౌన్సరు అసలు భూమిని తాకకుండా నేరుగా బౌండరీపైగా ఎగిరి దాటినప్పటికీ 4 బైలే మాత్రమే వస్తాయి, 6 రావు.

బంతి వైడ్‌గా వేస్తే, అప్పుడు వచ్చే ఎక్స్‌ట్రాలను వైడ్‌లుగా గుర్తిస్తారు, బైలుగా కాదు.

వైడ్లు, నో-బాల్‌లు బౌలరు చేసిన తప్పులుగా పరిగణిస్తారు. బౌలరు రికార్డులో ప్రతికూల గణాంకాలుగా పరిగణించబడతాయి. బైలు వికెట్-కీపరు చేసిన తప్పుగా పరిగణిస్తారు. వికెట్-కీపర్ రికార్డులో ప్రతికూలంగా పరిగణించబడతాయి. అయితే, కొన్ని ఆట పరిస్థితుల్లో వికెట్-కీపరు సామర్థ్యంతో సంబంధం లేకుండా బైలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, దారితప్పిన ఫాస్ట్ బౌలింగు, లేదా అసమానంగా ఉన్న పిచ్ లేదా కీపర్ నేరుగా స్టంప్‌ల వెనుకనే నిలబడవలసిన అవసరం ఉండడం మొదలనవి.

వన్-డే క్రికెట్‌లో బైలు చాలా అరుదు. సాధారణంగా స్కోర్‌లో ఎక్స్‌ట్రాలు చాలా కొద్ది భాగమే ఉంటాయి. ఎందుకంటే బ్యాటర్ బంతిని కొట్టే ప్రయత్నం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో బైలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఉదాహరణకు, 2010-11లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో, ఐదు మ్యాచ్‌లలో 258 ఎక్స్‌ట్రాలు ఉండగా, వాటిలో 76 బైలు (29.4% ఎక్స్‌ట్రాలు). ఇవే జట్ల మధ్య జరిగిన ఏడు వన్డే, T20 మ్యాచ్‌లలో 262 ఎక్స్‌ట్రాలు ఉండగా వాటిలో 10 మాత్రమే బైలు (3.8%) ఉన్నాయి.[2]

సాధారణంగా బ్యాటర్లు వికెట్ కీపర్ బంతిని పట్టుకున్నప్పుడు బైలు తీయడానికి ప్రయత్నించరు. అయితే, ఆట ముగిసే సమయానికి బ్యాటింగ్ చేసే జట్టు విజయం సాధించేందుకు వేగంగా పరుగులు సాధించాల్సి వచ్చినప్పుడు, బ్యాటర్‌లు రనౌటయ్యే అయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ, వికెట్ కీపర్ బంతిని సరిగ్గా వెయ్యలేడనే ఆశతో పరుగు తీసేందుకు తెగిస్తారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బ్యాటరు రనౌట్ కావడం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఈ వ్యూహం ఫలించి కొన్ని వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు (కనీసం ఒక టెస్టులో కూడా జరిగింది) గెలిచిన ఘటనలున్నాయి.

రికార్డులు

[మార్చు]

ఒక్కో టెస్టుకి కనీస సంఖ్యలో సగటు బైలు ఇచ్చిన వికెట్ కీపరు (10 టెస్టులు లేదా అంతకంటే ఎక్కువ ఆడిన వారిలో) డెనిస్ లిండ్సే. అతను వికెట్ కీపింగ్ చేసిన 15 టెస్టుల్లో మొత్తం 20 బైలు ఇచ్చాడు; ఈ విషయంలో చాలా మంది అత్యుత్తమ కీపర్లు కూడా ఒక్కో టెస్ట్‌కు సగటున 3 లేదా 4 బైలు ఇస్తారు.[3] లిండ్సే తన చివరి నాలుగు టెస్టుల్లో ఒక్క బై కూడా ఇవ్వలేదు.

అంపైర్ సిగ్నల్

[మార్చు]

అంపైర్ తన చేతిని నిలువుగా పైకి లేపి బై ని సూచిస్తాడు, బై కి, అవుట్ కీ ఇచ్చే సిగ్నల్ మధ్య తేడాను గుర్తించడానికి, బై చూపించినపుడు అరచేతిని తెరిచి పెడతారు.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Law 23 – Bye and leg bye". MCC. Retrieved 29 September 2017.
  2. Statistics derived from score sheets in Wisden 2011, pp. 227-46, 862-69.
  3. S. Rajesh, 'The unsung heroes behind the stumps', http://www.espncricinfo.com/magazine/content/story/220524.html
  4. Signal for bye