బొమ్మలకొలువు

వికీపీడియా నుండి
(బొమ్మల కొలువు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బొమ్మల కొలువు - శ్రీ కృష్ణ లీలలు థీమ్
బొమ్మల కొలువు - శ్రీ కృష్ణ లీలలు థీమ్

సర్వసాధారణంగా పిల్లల ఆనందం, ఉత్సాహాల కోసం తీర్చిదిద్దే దీనినే దసరా బొమ్మల కొలువు అని కూడా అంటారు. దసరా నవరాత్రులలో పది రోజులు (9 రాత్రులు) ఈ సరదా బొమ్మలకొలువు పండగ జరుపుకుంటారు. దుర్గాదేవి రాక్షస విజయానికి గుర్తుగా ఈ పండగ జరుగుతుంది. దీని అలంకరణకు తొమ్మిది మెట్లుంటాయి. వారి కళాదృష్టి, ఆర్థిక స్తోమత, సౌకర్యాలను బట్టి వాళ్ళు ఈ మెట్లపై రకరకాల బొమ్మలను అమరుస్తారు.

అలంకరణ

[మార్చు]

పై మెట్లపై దేవుళ్ళ బొమ్మలను ఉంచుతారు. అమ్మవారి బొమ్మలు కూడా వుంచే ఈచోటుని సత్వగుణానికి ప్రతీకగా నిర్వచిస్తారు. కింద వున్న మెట్లు పై ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలు వుంచుతారు. అవి తామస గుణాన్ని ప్రతిబింబిస్తాయని అంటారు. మధ్యభాగములో క్షత్రియధర్మాన్ని తెలుపుతూ ఉండే రాజు, రాణి, యుద్ధవీరుల వంటి బొమ్మల నుంచుతారు. ఇక అన్నిటికన్నా పై మెట్టు మీదవుంచే కలశం దేవీ కరుణకు సూచనగా బావిస్తారు. ఈ మూడు గుణాలను అధిగమించిన వారికి దేవీ కటాక్షము లభ్యమవుతుందని అంటారు. ఇదీ బొమ్మలకొలువు తత్వము. మెట్ల పై తెల్లని వస్త్రము పరచి ఆ పై బొమ్మలను అమర్చుతారు.

విశేషాలు

[మార్చు]

దీప ధూప నైవేద్యాలతో ప్రతిరోజూ లలితా సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరం చదివి పూజలు చేస్తారు. రోజూ ఒక కన్యకి (చిన్నఅమ్మాయి), ఒక సువాసినికి భొజనము పెట్టి తాంబూలం, అలంకరణ వస్తువులు, బట్టలు ఇస్తారు. ఇలా దసరా తొమ్మిది రోజులు చేస్తారు. ప్రతి రోజూ సాయంత్రము పేరంటానికి ముత్తైదువులను, పిల్లలను పిలిచి, అందరికీ పసుపు - కుంకుమ, తాంబూలము, దక్షిణ ఇస్తే తమకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. ఆ సమయములో మగువలంతా ఇచ్చుపుచ్చుకొనే కుంకుమ ఇల్లాలి సౌభాగ్యానికి చిహ్నము. అష్టగంధము, పసుపు ఆరోగ్యానికి చిహ్నాలు. మహిషాసురుణ్ణి చంపేందుకు దేవి కొంతకాలము సూది మొన మీద తపస్సు చేసిందంటారు. అందుకని బొమ్మల కొలువున్నన్ని రోజులు సూదిలో దారము పెట్టి ఏపని చెయ్యరు. ఈ బొమ్మలకొలువు ప్రతి సంవత్సరము చేస్తారు. కొన్ని ప్రాంతాలలో సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు. బొమ్మలు అమర్చే పద్ధతి మాత్రం ఇదే. బొమ్మల కొలువు పెట్టడం మొదలు పెట్టాక సంవత్సరానికో మెట్టు చొప్పున తొమ్మిది మెట్ల వరకు పెంచుతూ వెళతారు. ప్రతీ సంవత్సరము తప్పనిసరిగా ఓ క్రొత్త బొమ్మ కొనడం సంప్రదాయం. ప్రస్తుతం ప్లాస్టిక్ బొమ్మలు, బార్బీలు చోటు చేసుకున్నాయి కానీ ఒకప్పుడు మట్టి బొమ్మలు, పింగాణీ బొమ్మలు మాత్రమే ఉండేవి.

అమ్మకానికి సిద్ధంగా ఉన్న బొమ్మలు

సాధారణంగా అలంకరించే బొమ్మలు

[మార్చు]

దేవుని బొమ్మలైన వినాయకుడుగణపతి, రాముడ, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి, స్వాతంత్ర్య సమరయోదుల బొమ్మలు, పెళ్ళితంతు బొమ్మలు, హాస్యబొమ్మలు మొదలగునవి. దేవుళ్ళ బొమ్మలతో పాటు బొమ్మల కొలువులో తప్పకుండా పెట్టే బొమ్మలు కొన్ని ఉంటాయి. పంచాంగం బ్రాహ్మడు, పెద్ద ముత్తైదువ, పచారీ కొట్టు కోమటి, అతని భార్య, తల్లీ పిల్ల, ఆవూ దూడ వంటివి. ఇవి కాక వివిధ జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్లు, చెట్ల బొమ్మలు – ఇలా వారి వారి దగ్గరున్న బొమ్మలన్నీ ఆ కొలువులో పెడతారు. కాలక్రమంలో దేశనాయకుల బొమ్మలు, పురాతన కట్టడాల బొమ్మలు, ప్రయాణ సాధనాలు, వాహనాల బొమ్మల వంటివి కొలువులో చోటు చేసుకున్నాయి.