బోయ జంగయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బోయ జంగయ్య
జననం(1942-10-01)1942 అక్టోబరు 1
మరణం2016 మే 7(2016-05-07) (వయసు 73)
మరణ కారణంపక్షవాతం
విద్యసాహిత్యంలో బి. ఎ
వృత్తిరచయిత, ప్రభుత్వ ఖజానాలు, లెక్కల శాఖలో ఉద్యోగి
తల్లిదండ్రులు
  • మల్లయ్య (తండ్రి)
  • ఎల్లమ్మ (తల్లి)

బోయ జంగయ్య (అక్టోబరు 1, 1942 - మే 7, 2016) ప్రముఖ రచయిత. నాటికలు, కవిత్వం, కథ, నవలలు మొదలైన ప్రక్రియల్లో ఆయన రచనలు చేశాడు. దళిత సాహిత్య స్ఫూర్తి ప్రధాతగా నిలిచాడు.[1]

జీవిత విశేషలు

[మార్చు]

జంగయ్య నల్గొండ జిల్లా, రామన్న పేట తాలూకాలోని పంతంగి గ్రామంలో ఎల్లమ్మ, మల్లయ్య దంపతులకు 1942 అక్టోబరు 1 న జన్మించారు. బి.ఏ, డి.లిట్‌ చదివారు. వృత్తి రీత్యా ప్రభుత్వ ఖజానాలు, లెక్కల శాఖలో చాలాకాలం పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన చదువుకున్న చదువు చేసిన ఉద్యోగం సాహిత్యంతో ఏమాత్రం సంబంధం లేకున్నా హృదయంలో సాహిత్యానుబంధం ఏర్పడింది.

రచయితగా

[మార్చు]

బోయ జంగయ్య యాభై సంవత్సరాలుగా నిరంతరం సాహిత్య కృషి చేశాడు. ఆయన ఎన్ని ప్రక్రియల్లో రచనలు చేసినా అతని ప్రతిభ కథలు వ్రాయటంలో నవలలు రచించటంలో ఎక్కువగా ప్రకాశించిందని చెప్పాలి. ఆయన వ్రాసిన కథలు మానవతా వాదాన్ని చిత్రిస్తున్నాయి. దళిత వాదాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆయన రచించిన నవలల్లోనూ దళితవాద దృక్కోణం చోటు చేసుకున్నది. దళితవాదంలో కవిత్వం వచ్చినంత బలంగా వచన రచనలు రాలేదని చెప్పాలె. కాని తెలంగాణ నుంచి మాత్రం దళిత వాదాన్ని చిత్రిస్తూ కథలు, నవలలు వంటి వచన ప్రక్రియల్లో రచనలు చాలా వచ్చాయి. అటువంటి వచన ప్రక్రియల్లో రచనలు చేసిన ప్రముఖ రచయిత, సీనియర్‌ రచయిత బోయ జంగయ్యనే. పద్యం, కవిత్వం వ్రాయటం సులభం కాని వచనం వ్రాయటం కఠినం. అందులో చక్కని సమగ్రమైన అర్ధవంతమైన విషయావగాహన కలిగించే వచనం వ్రాయటం అంతగా సులభమైన పనికాదు. కాని బోయ జంగయ్య కథల్లోగాని నవలల్లోగాని వచన రచన సమగ్రంగా వుంటుంది. చక్కని శైలిలో ఆయన వచన రచన చేశాడు.

డా బోయ జంగయ్య బాలల కోసం అనేక పుస్తకాలు ప్రచురించారు. పిల్లల కోసం కథలు, గేయాలు, కవితలు, నాటికలు రాశారు. 2006లో వీరు ప్రచురించిన ‘మన వడు చెప్పిన కథలు’ మంచి గుర్తింపు పొందిం ది. 1999లో ‘గుజ్జనగూళ్ళు’ అదే సంవత్స రం పిల్లల కోసం ‘ఆటలు-పాటలు’ పుస్తకాలు ప్రచురితమయ్యాయి. 2002లో ‘మాటల ఆటలు’, 2003లో ‘చిలకల పలుకులు’, 2004లో ‘మన నేతలు’, అదే సంవత్సరం ‘టీవీ ముచ్చట్లు’, 2005లో ‘మనం మారాలి’ పుస్తకాలు ప్రత్యేకంగా పిల్లల కోసం రాసినవే. ఈ పుస్తకాలన్నీ డా బోయజంగయ్యను బాల సాహితీశిల్పిగా నిలబెట్టాయి. జంగయ్యగారిని సాహితీప్రియులు, సన్నిహితులు ముద్దుగా ‘బోజ’ అని పిలుచుకుంటారు.

నిజానికి ‘బోజ’ పెద్దల కోసం సాంఘిక కథలు రాయడంలో దిట్ట. లోకం, గొర్రెలు, ఎచ్చ రిక, దున్న రంగులు, చీమలు, తెలంగాణ వెతలు, బోజ కథలు, బొమ్మలు, ఉప్పు నీరు, ఇప్పపూలు, ఆమె, అడవిపూలు, దాడి కథా సంపుటాలు... దేశం కోసం, కొత్త బాటలు, ఆలోచించండి నాటికలు రాశారు. నడుస్తున్న చరిత్ర, వెలుతురు, బోజ కవితలు అనే కవితా సంపుటాలు ప్రచురించారు. జాతర, జగడం, ఆలోచించండి నవలల రాశారు.

డా బోయ జంగయ్య బాలల కోసం ప్రతి సంవత్సరం కనీసం ఒక్క పుస్తకమైనా ప్రచు రించాలన్న లక్ష్యంతో ఉన్నారు. వీరి సాహితీసే వలను గుర్తించి అనే క సంస్థలు సన్మానాలు, పురస్కారాలు అందజేశాయి. తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు వారు 2003లో వీరికి గౌరవ డాక్టరేటు ఇచ్చి గౌరవించారు.

డా బోజ రాసిన ‘జాతర’ నవల మైసూరు విశ్వవిద్యా లయం 1995లో బి.ఏ. ఎడ్‌, ఉపవాచకంగా ఎన్నుకుంది. అలాగే ‘గొర్రెలు’ పుస్తకం ఉస్మానియా విశ్వ విద్యాలయం ఎం.ఎ తెలుగుకు ఉపవాచ కంగా తీసు కుంది. ఇదే పుస్తకం ఆంధ్రా విశ్వ విద్యాల యం కూడా ఉపవా చకంగా తీసు కోవడం విశే షం. ‘డా అంబేద్కర్‌’ వచన కవిత 8వ తరగతి వాచకానికి పాఠ్యాంశంగా తీసుకున్నారు.

బాలల కోసం డా బోజ రాసిన కథలు, కవితలు, గేయాలు, నాటికలు, వ్యాసాలు మరికొన్ని పుస్తకరూపంలో తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

రచనలు

[మార్చు]

1963లో ‘‘కష్టసుఖాలు’’ నాటికను తన తొలిపుస్తకంగా ప్రచురించిన వీరి కలం నుండి అనేక రచనలు వెలువడ్డాయి.వీరి తొలికథ‘‘ జీవితమలుపులు’’ ఆ తర్వాత విస్తృతంగానే రాసినా, విశిష్టమైన కథల్ని రాశారు.‘‘లోకం, గొర్రెలు (1981), ఎచ్చరిక (1984), దున్న(1989), రంగులు (1984), చీమలు (1996),[2] తెలంగాణ వెతలు (1998), బోజ కథలు ( 2000), బమ్మలు (2002), ఉప్పనీరు (2002), ఇప్పపూలు (2003), ఆమె ( 2004) మొదలైన కథా సంపుటాలుగా ప్రచురించారు. మనుషుల్లోని క్రూరత్వాన్ని ప్రతీకాత్మకంగా చెప్పడానికి జంతువుల కంటే వికృతంగా ప్రవర్తించేదోపిడీదారుల గురించి గొర్రెలు కథలు రాశారు.అంబేద్కర్‌, జగజ్జీవన్‌, గుర్రం జాషువ, కె.ఆర్‌.నారాయణన్‌ ల జీవిత చరిత్రల్ని రాశారు.వీటితో పాటు బాలల కోసం ప్రత్యేకించి ‘‘బడిలో చెప్పనిపాఠాలు’’, గుజ్జనగూళ్ళు, ఆటలు`పాటలు, చిలకల పలుకులు మొదలైనవి రాశారు. జాతర (1989) నవలిక : "జగడం" నవల బోయ జంగయ్య ఆత్మకథగా సాహితి లోకం భావించిన తర్వాత ప్రసిద్ధ నవలాకారులు వేముల ఎల్లయ్య సంపాదకత్వంలో ఆకారపు పాండురంగ ప్రజాసింగం కవి చేత వ్రాయబడిన డాక్టర్ బోయ జంగయ్య గారి ఆత్మకథ "అవసరం" (2014) ప్రచురించబడింది.

మరణం

[మార్చు]

కొంతకాలం నుంచి పక్షవాతం కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జంగయ్య హైదరాబాద్ వనస్థలిపురంలోని తన కుమారుడి నివాసంలో మే 7, 2016 న కన్నుమూసారు.[3]

మూలాలు

[మార్చు]
  1. ఉదారి, నారాయణ (October 2018). "అవమానాల కొలిమిలోంచి ఎగిసిపడ్డ అక్షరం". ramojifoundation.org. రామోజీ ఫౌండేషన్. Archived from the original on 1 ఆగస్టు 2018. Retrieved 13 December 2018.
  2. జంగయ్య, బోయ. చీమలు.
  3. "ప్రముఖ రచయిత బోయ జంగయ్య కన్నుమూత". Archived from the original on 2016-05-09. Retrieved 2016-05-08.

యితర లింకులు

[మార్చు]