బ్రాహ్మీ లిపి
బ్రాహ్మీ లిపి ఆధునిక బ్రాహ్మీ లిపి కుటుంబము యొక్క సభ్యుల మాతృక. ఇది ప్రస్తుతము వాడుకలో లేని లిపి. క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ అశోకుని శిలా శాసనాలు బ్రాహ్మీ లిపిలో చెక్కబడినవే. ఇటీవలి వరకు ఇవే బ్రాహ్మీ రాతకు అత్యంత పురాతనమైన ఉదాహరణలుగా భావించేవారు అయితే ఇటీవల శ్రీలంక, తమిళనాడులలో దొరికిన పురావస్తు శాస్త్ర ఆధారాలను బట్టి బ్రాహ్మీ లిపి వాడకము క్రీ.పూ.6వ శతాబ్దమునకు పూర్వమే మొదలైనదని రేడియోకార్బన్, థర్మోల్యూమినిసెన్స్ డేటింగ్ పద్ధతుల ద్వారా నిర్ధారించారు.
దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా, టిబెట్, మంగోలియా, మంచూరియాలలోని దాదాపు అన్ని లిపులు బ్రాహ్మీ నుండి పుట్టినవే. కొరియన్ హంగుల్ కూడా కొంతవరకు బ్రాహ్మీ నుండే ఉద్భవించి ఉండవచ్చు. ప్రపంచ వ్యాప్తముగా ఉపయోగించే హిందూ అరబిక్ అంకెలు బ్రాహ్మీ అంకెలనుండే ఉద్భవించాయి.
మన దేశమందలి ప్రాచీన శాసనము లన్నియు బ్రాహ్మీ, ఖరోష్టి అను రెండు లిపులలో వ్రాయబడి యున్నవి. బ్రాహ్మీ లిపి ఎడమనుండి కుడి వైపుకును, ఖరోష్టి లిపి కుడి నుండి ఎడమకు వ్రాయబడియున్నవి. ఖరోష్టి లిపి పశ్చిమోత్తరప్రాంతములలో మాత్రమే ప్రబలి యుండి క్రీ. శ. 4వ శతాబ్దమునాటి అంతరించెను. బ్రాహ్మీ లిపి పశ్చిమోత్తరమునను, దేశమునందు అంతటను వ్యాపించింది. దాని నుండియే హిందు, సింహళ, టిబెట్టు, బర్మాదేశములలిపిలుద్భవించినవి. ఈ బ్రాహ్మీలిపి శబ్దశాస్త్రజ్ఞులచే సంస్కృతమును, తద్భవములను వ్రాయుటకై నిర్మింపబడింది. ప్రాచీన హైందవలిపి బ్రహ్మ నుండి ఉద్భవించెననియు, ఇది బహు ప్రాచీనమగు జాతీయ నిర్మాణమనియు అని చాలా మట్టుకు చెప్పడం జరిగింది. వీనిలో మొదటి అభిప్రాయము నారద స్మృతి, మనుసమ్హిత, బృహస్పతి వార్తికము, హుయాంత్సాంగు వ్రాతలు, సమవాయంగ సూత్రములు మున్నగు వానిలో చాలా వరకు ఇదే చెప్పడం జరిగింది. ఎడమనుండి కుడి వరకు వ్రాయబడు బ్రాహ్మీలిపి లేదా బ్రాహ్మీ లిపి బ్రహ్మ నిర్మితమను సంగతి చైనా దేశీయుల బౌద్ధ గ్రంథమగు ఫవాన్ షావులిన్ లో కూడా ఉంది. బెరూని [1] మరియొక గాథను చెప్పుచున్నారు.
ఒకప్పుడు హిందువులు తమ లేఖన విధానమును మరచిరట పిమ్మట అది దైవికమగు వ్యాసమహామునిచే తిరిగి సంపాదింపబడెనట. దాని నుండి ఈ వృత్తాంతము క్రీ.పూ.4000 న జరిగిఉండవచ్చునని భావింపవచ్చును. బ్రాహ్మీ, ఖరోష్టి యుగాక ద్రావిడ అను లిపి భట్టిప్రోలు స్థూపము అవశేష పాత్రలనుండి తెలియుచున్నది. యవనా అను లిపి మరియొక లిపి పాణినీ యందును, యవణారియను మరియొక లిపి జైన గ్రంథములందును తెలియుచున్నది. శాసన పరిశోధనము, హిందూ లిపి యొక్క ప్రాచీనతను తెల్పు పెక్కు నిదర్శనములను బయల్పడినవి. 1898 సం. నేపాల్ ప్రాంతమందు క్రీ.పూ. 4 వ శతాబ్దమునాటి వ్రాతగల ఒక అవశేషపాత్రి కనుగొనబడింది.తక్షశిలానగరందు ఇట్టిదే ఒక అరేబిక్ శాసనము బయటకి తీయబడింది. పండితులు దానిని క్రీ.పూ. 5 వ శతాబ్దమునాటిదని కనుగొనబడింది. దీనినుండి హిందూ గాథలనుండియు ప్రాచీనశాసనములనుండియు క్రీ.పూ. 4, 5 వ శతాబ్దములనాటికే లేఖనా విధానము హైందవ లిపి యందు చేరబడియున్నదని స్పష్టపడుచున్నది.