భక్త శిరియాల
భక్త శిరియాల (1948 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టరు | |
---|---|
దర్శకత్వం | జి.రామకృష్ణారావు |
తారాగణం | పద్మనాభం, చిలకలపూడి సీతారామాంజనేయులు |
నిర్మాణ సంస్థ | మురళీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
భక్త శిరియాల మురళీ పిక్చర్స్ పతాకంపై జి.రామకృష్ణారావు దర్శకత్వంలో బి.పద్మనాభం, చిలకలపూడి సీతారామాంజనేయులు ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు భక్తిరస చిత్రం. ఈ సినిమా 1948, జూన్ 30వ తేదీన విడుదలయ్యింది.[1]
కథ
[మార్చు]ఈ చిత్రానికి మాతృక శ్రీనాథుడు వ్రాసిన హరవిలాసం అనే కావ్యంలోని కొంత భాగం. చిరుతొండడు ఆర్యకులోత్తముడైన ఒక బీదకుటుంబీకుడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తన మేనమామ కన్నప్పశెట్టి ఇంట్లో పెరుగుతూ ఉంటాడు. కన్నప్పశెట్టికి ఉమ అనే కూతురు ఉంది. చిరుతొండడు బీదవాడు, చదువుసంధ్యలు లేని వాడు కాబట్టి ఉమను ఇచ్చి పెళ్ళిచేయడానికి కన్నప్పశెట్టి నిరాకరిస్తాడు. దానితో విరక్తి చెంది చిరుతొండడు కంచికి ప్రయాణమౌతాడు. కంచిని నరసింహ పల్లవుడు అనే చక్రవర్తి పరిపాలిస్తూవుంటాడు. ఒకరోజు ఆ చక్రవర్తి పల్లకీలో పోతుండగా పిచ్చి పట్టిన ఒక ఏనుగు అతనిపైకి రాసాగింది. అప్పుడు చిరుతొండడు ఆ మదపుటేనుగు బారినుండి ఆ చక్రవర్తిని కాపాడతాడు. దానికి సంతోషించి చక్రవర్తి అతడి ధైర్యసాహసాలకు మెచ్చి అతడిని సర్వసైన్యాధిపతిగా నియమిస్తాడు. అల్లుడి గొప్పను విని కన్నప్పశెట్టి తనకూతురును చిరుతొండడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఇంతలో పల్లవ రాజులకు, చోళ రాజులకు యుద్ధం సంభవిస్తుంది. రణరంగంలో పారిపోతున్న చోళరాజును చిరుతొండడు చంపబోగా ఒక యోగి అడ్డుకుంటాడు. అయినా వదలకుండా అతడిని చంపబోగా ఆ యోగిపుంగవుడు అడ్డంవచ్చి ప్రాణాలను కోల్పోతాడు. చిరుతొండడు తాను ఇంతవరకూ చూసిన రక్తపాతము, యోగి దుర్మరణం చూసి అప్పటి నుండి హింసను వదిలి శివభక్తునిగా మారిపోతాడు. చిరుతొండనికి శ్రీయాళుడు అనే పుత్రుడు కలుగుతాడు. అతడు కూడా తండ్రిలాగా పరమభక్తుడౌతాడు.
ఒకరోజు నారద మహర్షి కైలాసంలో శంకరుని దర్శించి చిరుతొండడు మహాభక్తుడు అని, అతడికి మోక్షం ప్రసాదించాలని కోరతాడు. శంకరుడు గంగాపార్వతులచే ప్రేరేంపింపబడి అతడిని పరీక్షించాలని నిశ్చయిస్తాడు. శంకరుడు యతిగాను, నారదుడు శిష్యుడిగా వేషం వేసుకుని భూలోకానికి వెళతారు. చిరుతొండని వద్ద అతిథులుగా వెళ్ళి నరమాంసం అదీ శిశుమాంసం కావాలని కోరతారు. చివరకు అతని కొడుకు సిరియాళును కోసి వండిపెట్టమని కోరుతారు. మహాభక్తులైన భార్యాభర్తలు అందుకు అంగీకరిస్తారు. శిష్యుని రూపంలో ఉన్న నారదుడు సిరియాళుతో తన తండ్రి మాట వినవద్దని బోధిస్తాడు. కానీ ప్రయోజనం లేకపోతుంది. అతని గుండె నిబ్బరం చూసి నారదుడు ఆశ్చర్యపోతాడు. చిరుతొండడు తన కుమారుని పచనం చేసి యతికి ఆహారంగా పెట్టబోతాడు. అయితే పుత్రహీనుడైన చిరుతొండని ఇంటిలో భుజించనని యతి అంటాడు. పతివ్రత అయిన ఉమ ఇదేమి పరీక్ష అని తన కుమారుడైన సిరియాళును ఎలుగెత్తి పిలుస్తుంది. ఆమె దీనారావాలకు రాళ్ళు కరుగుతాయి. కైలాసం కంపిస్తుంది. గంగా పార్వతులు ఆశ్చర్యపోతారు.[2] భక్త సిరియాళుడు బ్రతికి వస్తాడా లేదా అన్నది మిగిలిన చిత్రం.
చిత్ర సిబ్బంది
[మార్చు]- నటీనటులు
- చిలకలపూడి సీతారామంజనేయులు - నారదుడు, శిష్యుడు
- వేమూరి గగ్గయ్య - శంకరుడు, యతి
- రాజారావు - చిరుతొండడు
- బి. పద్మనాభం - బాల చిరుతొండడు
- హరనాథ్ - 1వ శ్రీయాళుడు
- వెంకటేశ్వర్లు - 2వ శ్రీయాళుడు
- సుందరమ్మ - చంద్రిక
- కుంపట్ల - కన్నప్పశెట్టి
- కేసరి - చంద్రుడు
- కమలనాభ ప్రసాద్ - పల్లవరాజు
- ఋష్యేంద్రమణి - ఉమ
- అనూరాధ - గంగ
- అన్నపూర్ణ - పార్వతి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం - జి. రామకృష్ణారావు
- సంగీతం: సుబ్రహ్మణ్య దేవర
- నిర్మాణ సంస్థ: మురళీ పిక్చర్స్
- విడుదల:30:06:1948.
పాటల జాబితా
[మార్చు]1.అనుకోగూడదు భక్త శైవుడవని మౌరా ఘోర కర్ముండవా(పద్యం)
2 ఓం హర హర హర హర ఓం హర హర హర మహాదేవా,
3.కులదీపిక నీ కీపుడే కాలము తీరేనా హా నినుగాను,
4.చంద్రుని చూచితిమే ప్రియా నా సుఖ శ్రీచంద్ర చంద్రికా,
5.జయ్ అలక్ నిరంజన్ జయ్ జయ్ నిరంజన శంభో,
6.తనయా ఆడుచు పాడుచు రారా నీ నగుమోము ,
7.దురాత్మా దుర్మతి దుష్టు నీచా నను నీవిటుల,
8.దేవా కావగదే వేగమే పావన నామా పరమేశ్వరా,
9.నను నిందించెను మామ ఆ కఠిన నిందాదండమే(పద్యం),
10.నోములెన్నో నోచితి మ్రొక్కులెన్నో మ్రొక్కితి,
11.వినెదన్ జెప్పుము వీర శైవుడవే నీ పేరేమి మహేశ్వర,(పద్యం)
12.వేళాకోళము లేటికి నవ్వులాటలు మానవే,
13.స్వామీ ఈ చిరుతొండ నంబియనగా సామాన్యుడా(పద్యం),
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Bhaktha Sriyala (G.R. Rao) 1948". ఇండియన్ సినిమా. Retrieved 27 March 2023.
- ↑ జి.ఆర్.రావు (30 June 1948). భక్త శ్రీయాళ పాటలపుస్తకం (1 ed.). మురళీపిక్చర్స్. p. 10.
. 3.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.