భద్రాపరిణయము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భద్రాపరిణయము
కృతికర్త: అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి
సంపాదకులు: పురాణపండ మల్లయశాస్త్రి
అంకితం: రావు గంగాధరరామారావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కావ్యం
విభాగం (కళా ప్రక్రియ): తెలుగు సాహిత్యం
ప్రచురణ: శ్రీ విద్ద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురం
విడుదల: 1912


అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి పిఠాపురం మహారాజా రావు గంగాధరరామారావు ప్రాపున 10 సంవత్సరాలు ఉండి 1879లో భద్రాపరిణయము [1] అనే కావ్యాన్ని వ్రాసి అతడికి అంకితమిచ్చాడు. రాజావారు కవిని మడులు మాణిక్యాలతో సత్కరించాడు. ఈ భద్రాపరిణయము కావ్యము రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు చేత పిఠాపురములోని శ్రీవిద్ద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాలలో 1912లో పురాణపండ మల్లయశాస్త్రి చేత పరిష్కరింపబడి ముద్రించబడింది.

కథాసంగ్రహము

[మార్చు]

కృష్ణుడు ఇంద్రప్రస్థమునకు వెడుతూ మార్గమధ్యమున రోహణ పర్వతముపై విశ్రమించెను. శ్రుతిరంజని అనే యోగిని వచ్చి కేకయ దేశపు రాజు కథ తెలిపి, అతని కుమార్తె భద్రాదేవికి లక్ష్మీదేవి ఆజ్ఞానుసారం తాను సకల విద్యలు నేర్పినానని చెప్పి, భద్ర సౌందర్యమును కొనియాడెను. తరువాత భద్ర కృష్ణుని వలచినట్లు చెప్పి, ఆమెని వివాహమాడుమని శ్రీకృష్ణునకు ప్రబోధించెను. కృష్ణుడు ఇంద్రప్రస్థము నుండి భద్రాస్వయంవర వృత్తాంతము విని కేకయ పురమునకు ప్రయాణమయ్యెను. కేకయపురమున కృతకాద్రి సమీపములో ఉన్న వనము నుండి వీణానాదము వినిపించగా కృష్ణుడు అచ్చట ఆగి వీణవాయించుచున్న భద్రను చూచెను. భద్రాదేవి కృష్ణుని గాంచి సిగ్గుతో ఆ చోటు విడిచెను. కేకయ రాజపత్ని శ్రుతకీర్తి కృష్ణుని మేనత్త అగుటచేత అతడు ఆమెను చూచి కుశల ప్రశ్నలు వేసెను. కృష్ణుడు భద్ర సోదరునితో సల్లాపము లాడుచుండ నారదుడు వచ్చి "భద్రాప్తిరస్తు" అని దీవించి స్తోత్రము చేసి వెడలిపోయెను. మార్గమధ్యమున విందానువిందులను రాజులెదురై భద్ర తమ యిరువురిలో నెవ్వరిని వరించునని నారదుని ప్రశ్నించిరి. "భద్ర రమాంశ సంభూత, కృష్ణునే వరించును" అని నారదుడు చెప్పెను. స్వయంవర మంటపమునకు వచ్చుచున్న భద్రను విందానువిందులు అపహరించుకొని పోవుచుండ కృష్ణుడు వారితో యుద్ధము చేసి జయించి, భద్రాదేవిని వివాహమాడి ద్వారక కేగి సుఖముగా నుండెను.

వర్ణనలు

[మార్చు]

ఈ కావ్యములో 1)ద్వారకా,2)కేకయపుర,3)ప్రయాణ, 4)రోహణగిరి, 5)వన, 6)దౌహృద, 7)కుమారోదయ, 8)మధూదయ, 9)వనవిహార, 10)పుష్పాపచయ, 11)సరోవర, 12)జలక్రీడా, 13)అనంగపూజా, 14)సూర్యాస్తమయ, 15)సంధ్యా, 16)చంద్రోదయ, 17)సూర్యోదయ, 18)యుద్ధ, 19)వైవాహిక, 20)కన్యాంగ సౌందర్య, 21)శ్రీకృష్ణ, 22)ధృష్ట కేతురాజ వర్ణనలు ఉన్నాయి. చూచుట, చింతించుట మొదలైన దశవిధ శృంగారావస్థలు ఈ కావ్యమున వర్ణించబడినది.

అలంకారములు

[మార్చు]

ఈ కావ్యములో సుబ్రహ్మణ్యకవి ఉత్ప్రేక్షాలంకారము, అతిశయోక్తాలంకారము, యమకాలంకారము, అర్థాలంకారము, ఉపమాలంకారము, నిదర్శనాలంకారము, ముక్తపదగ్రస్తాలంకారము మొదలైన ఎన్నో రకములైన అలంకారములను ఉపయోగించాడు. ఇంకా ఎన్నో విధాలైన చమత్కారములను, శ్లేషను, ధ్వనిని ఈ కావ్యములో కవి ప్రదర్శించాడు.

ఉభయభాషాకందము

[మార్చు]

3వ ఆశ్వాసములోని 60వ పద్యము కవికి సంస్కృతాంధ్ర భాషలలో ఉన్న పాండిత్యాన్ని తెలుపుతుంది.

నీలాగారయనగ వే
నాలియ మాదాని పాలనాతి బలారే
మేలా నీలా వరయమి
వాలాయము నేన కావ వారక పదమా

తెలుగు: నీలాగు, ఆరయన్, నగవు, ఏ, నాలి, అ, మాదాని పాలన్= మాదియగు పని విషయమై, నాతి, బలారే, మేలు, ఆ, నీలావు, అరయమి, వాలాయము, నేను, అ, కావన, వారక, పదమా.

సంస్కృతము: నీలాగారయ నీల+అగార= నీలాచలమను గృహమును, య=పొందినస్వామీ, నగవ= గోవర్ధనమను పర్వతమును వహించిన గోపాల, ఇన+ఆలియ= సూర్యుల వరుసను పొందినవాడా!(ఆదిత్యరూపమైన నారాయణా), దాని పాలన= గజమును రక్షించినవాడు, అతిబలారే = ఇంద్రుని అతిక్రమించిన బలవంతుడా! మొదలైన అర్థవివరణ వ్యాఖ్యత చేశాడు.

మరి కొన్ని పద్యాలు

[మార్చు]
ఉ|| రాజకళావతంస, సురరాజ, ముఖస్తవనీయుఁ డబ్జినీ
రాజ నిభప్రభుండు, ఘనరాజమరాళరథుండు, వాహినీ
రాజగభీరమూర్తి, ఖగరాజగ, నాభిభవుండు భారతీ
రాజు చిరాయుఁజేయుఁ గవిరాజ విధేయుని రామరాయనిన్
ఉ|| వారకస్రుక్కె బాహుబిసవల్లులు వాడెఁగు చాబ్జకోశముల్
తోరపుఁగంకణావళులతోడనె జాఱె సమంచితోర్మికల్
సారెఁగలంగె జీవనము శ్వాస మహోష్మసమారవార వి
స్ఫారగతిన్ వియోగపుఁ దపర్తుదినంబునఁ గృష్ణవేణికిన్
మ|| గతిమత్తేభము, నాసచంపక, మొగిన్‌గైశ్యంబు కందంబు, సం
గతవాక్యంబులు మత్తకోకిలలు, దృగ్వ్యాపారమయ్యుత్పల
ద్యుతి మోమంబు రుహంబు, దేహరుచి విద్యున్మాల, యీ మానినీ
తత వృత్తస్థితులెన్నంగాఁ దరమె తద్వాగ్జానికైనన్ ధరన్

మూలాలు

[మార్చు]
  1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973