Jump to content

భాస్కరభట్ల కృష్ణారావు

వికీపీడియా నుండి

భాస్కరభట్ల కృష్ణారావు (1918 - 1966) తెలుగు కథా రచయిత.[1] తెలంగాణా తోలి తరం ఆధునిక రచయితల్లో అతను ఒకడు. తన నాటి జాతీయ, అంతర్జాతీయ సాహిత్య ధోరణులను తన రచనల్లో ప్రతిఫలించే కృషి చేశాడు. తెలంగాణాలో అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్న మద్య తరగతి జీవితాలను గూడా తన నవలల ద్వారా రికార్డు చేసి వాటికీ శాశ్వతత్వం కలిగించాడు. అతని కధల్లో సమకాలిక సమాజంలో కుటుంబాల్లో జరిగే సంఘటన ఇతివృత్తాలుగా కనిపిస్తాయి. అతని కధనం సాపీగా, ఆసక్తికరంగా చదివించేటట్లుగా ఉంటుంది. సహజమైన సంఘటనలు, పటాలు అతని కధల్లో దర్శనమిస్తాయి.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

అతను హైదరాబాదు సమీపంలోని ప్రేమావతి పేటలో లక్ష్మీబాయి అంబయ్యశాస్త్రి దంపతులకు 1918 డిసెంబరు 19న జన్మించాడు. 1940లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి గణితంలో బి.యస్సీ డిగ్రీ చేసాడు. 1943లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఎల్ చేసాడు. అప్పటి హైదరాబాదు "దక్కను రేడియో" లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తరువాత ఆకాశవాణిగా మారిన ఆల్ ఇండియా రేడియోలో సీనియర్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా 1966 నవంబరు 11న తన తుదిశ్వాస తీసుకొనే వరకు పనిచేసాడు.

అతను బహు భాషావేత్త. తెలుగే కాక ఉర్దూ, పర్షియన్, హిందీ, మరాఠీ, ఇంగ్లీషు భాషల్లో నిష్ణాతులు. బెంగాలీ భాషలో కూడా అతనికి పరిచయం ఉంది. అతని రచనా వ్యాసంగం 1939లో ప్రారంభమై 1957 వరకు కొనసాగించాడు. అతను 20 సంవత్సరాల కాలంలో మొత్తం 40 కథలు రచించాడు. ఇవి మూడు సంపుటాలుగా ముద్రించబడ్డాయి. వీరి రచనలు ఇతివృత్తం, శిల్పం, భాష, పాత్ర పోషణలలో చాలా వైవిధ్యంగా ఉంటాయి.

1950-60 దశకాల్లో అతను రచించిన నవలలు, కథలు విశేషమైన ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. అతని కథలు రెండు సంపుటాలుగా లభిస్తున్నాయి. 'వెన్నెలరాత్రి కథల సంపుటి'లో 19 కథలు. 'కృష్ణారావు కథల సంపుటి'లో 10 కథలు ఉన్నాయి. అతనిపై గోపిచంద్‌, బుచ్చిబాబుల ప్రభావం ఉంది. ఇతివృత్తాల్లో, భాషాభావాలలో మొదలైన వాటిలో వారితో సారూప్యత కన్పిస్తుంది. ఆ కాలానికి ప్రపంచంలో వచ్చిన తాత్విక, సాహిత్య రంగాల్లో వస్తున్న పరిణామాల్ని అధ్యయనం చేశాడు.

కృష్ణారావు నిరంతర అధ్యయన శీలి. పలు రంగాలకు చెందిన గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేయడం వలన ప్రపంచంలోని ఎన్నో విషయాలపైన వారికి అవగాహన కలిగింది. ఫలితంగా వారి ఆలోచనా పరిధి పెరిగింది. భావనా ప్రపంచం విస్తరించింది. అందుకే వారు ఒక ప్రాంతానికే పరిమితమయ్యే రచనలు చేయలేదు. అన్ని ప్రాంతాలను పరిగణనలోకి తీసుకొని రచనలు రాశాడు[3].

వీరు 11 నవంబర్ 1966 తేదీన పరమపదించారు.

రచనలు

[మార్చు]

కథా సంకలనాలు

[మార్చు]
  • కృష్ణారావు కథలు (1955) - పది కథల సంకలనం[4]
  • చంద్రలోకానికి ప్రయాణం - తొమ్మిది కథలు, ఒక నాటికల సంకలనం
  • వెన్నెల రాత్రి (1962) - 17 కథల సంకలనం.

నవలలు

[మార్చు]
  • వింత ప్రణయం (1957)
  • యుగసంధి (1957)
  • వెల్లువలో పూచిక పుల్లలు (1960)
  • భవిష్యద్దర్శనం (1966)
  • భాస్కరభట్ల కృష్ణారావు రచనలు[5]

మూలాలు

[మార్చు]
  1. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-07-12.
  2. "Buy Bhaskarabatla Krishna Rao Rachanalu 1 online". www.logili.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-12.
  3. "తెలంగాణ కథలో మేలిమిస్వరం | దర్వాజ | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 2020-07-12. Retrieved 2020-07-12.
  4. "కథానిలయం - View Book". kathanilayam.com. Retrieved 2020-07-12.
  5. "Bhaskarabhatla Krishna Rao Rachanalu-1 (Navalalu) - భాస్కరభట్ల కృష్ణారావు రచనలు - 1 (నవలలు) by Bhaskarabhatla Krishna Rao -". anandbooks.com/ (in ఇంగ్లీష్). Archived from the original on 2020-07-12. Retrieved 2020-07-12.