మంగిపూడి వేంకటశర్మ
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
నిరుద్ధ భారతము మానవ ధర్మపరమైన హిందూ మత పరమార్ధమును తేటతెనుగున పద్యరూపమునను హృద్యముగ బోధించుచున్నది. భారతీయులందు హరిజనులత్యంత నిరుద్ధులు. భారత ధర్మరక్షణమునకు నిరుద్ధుల నిరుద్ధులు గావలసిన యవసరమును దేశ కాల పరిస్థితులు సువ్యక్తము చేయుచున్నవి. సనాతనులును సంస్కరణ ప్రియులును నీకృతియందు దెలిపినటులు ప్రశాంత చిత్తులై యవధరించి కర్మయోగారూఢులగుదురు గాత! అంటూ మంగిపూడి వేంకటశర్మ గురించి కాశీనాథుని నాగేశ్వరరావు పరిచయ వాక్యాలు పలికారు.
మంగిపూడి వేంకటశర్మ గురించి ... డాక్టర్ ద్వా.నా. శాస్త్రి ... ...
జాతీయోద్యమంలో అస్పృశ్యతపై చాలా పద్యాలు వెలువడ్డాయి. ఆ కోవలో మంగిపూడి వేంకటశర్మ రాసింది పద్యాలు మాత్రమే కాదు. ఖండకావ్యం. వస్తువు అంటరానితనం. భావం పంచముల పుట్టుపూర్వోత్తరాలు. కవి ప్రగతిశీల భావాలు గల నిజాయితీ పరుడు. -క్రియాశీలుడు. ఆ కావ్యమే నిరుద్ధ భారతము! రాసింది ముందే అయినా ప్రచురింపబడింది 1915లో.
మంగిపూడి వేంకటశర్మ తీవ్రస్వరంతో, ధిక్కార స్వరంతో సనాతనులపై, పురాణజ్ఞులపై, ఆచారవంతులపై, బ్రాహ్మణులపై...! ప్రశ్నల వర్షం కురిపించారు. కుసుమ ధర్మన గానీ, జాషువ గానీ ఈ విషయంలో మూలాలలోకి వెళ్ళలేదు. ఇన్ని ప్రశ్నలు సంధించలేదు. ఇంతగా నిలదీయలేదు. వేదాలు, ఇతిహాసాలనే, పురాణాలనే ధిక్కరించలేదు. ఇదంతా చేసింది ఒకే ఒక్కడు మంగిపూడి వేంకటశర్మ. అదీ 1915లో పంచములార! యంతరిత భవ్య గుణోత్కరులార! గర్భితో/ దంచిత శక్తులార! యసమర్థులెమీఱలు? గొఱ్ఱమందలో/ వంచితమై చరించు నలవ్యాఘ్ర కిశోరము రీతిపూర్తిగా/ వంచితులైతి రాత్మబల వైఖరినెంచుడు! మేల్కొనుండికన్ అంటూ1915లో పలికిన దమ్మున్న కవి మంగిపూడి. పంచముల్ని పొగుడుతూ ఆత్మబలాన్ని పుంజుకొని మేల్కొనమని ప్రబోధం చేశారు. ఎవరికీ తీసిపోరని పిలుపునిచ్చారు.
మంగిపూడి వేంకటశర్మ 1882 లో జన్మించారు. పేదరికం అనుభవించారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని తమ వాణిని, లేఖినిని ఝళిపించారు. వస్తువులన్నియు పోనీ/ పస్తుండగవచ్చు గానీ ప్రాణపదములౌ/ పుస్తకములు తడియగగని/ వాస్తవ వాస్తవ్యుడగు నెవండు సహించున్' అని దిగులు చెందారు.
నీ వేసువనుచు బుద్ధుడు/ నీవనుచున్ రాముడనుచు కృష్ణుడవనుచున్/ భావింతురు నీవందఱు గావలయు నటంచు నెంతు గాంధిమహాత్మా అంటూ 1924లో గాంధి శతకం రాశారు. జాషువ కూడా గాంధి అనుయాయుడే. బాపూజీ అనే ఖండకావ్యం రాసి బాగా ప్రస్తుతించారు. అప్పట్లో వీరిపై గాంధి ప్రభావం వల్లనే అంటరానితనంపై గళమెత్తారు. 1919 లోనే బాల వితంతు విలాపం, అబలా విలాపం పద్యాలు రాసి వితంతు వివాహాల్ని ప్రోత్సహించడం తప్పకుండా గమనించాలి -గుర్తుంచుకోవాలి. జాతీయోద్యమ కవిత్వంపై తొలి పరిశోధన గ్రంథం రాసిన ఆచార్య మద్దూరి సుబ్బారెడ్డి గారి మాటలివి:
అస్పృశ్యతా నివారణాన్ని ప్రతిపాదించిన ప్రథమ పద్యకావ్యం. ఒక జాతిలోనే ఒక వర్గాన్ని బానిసలుగా చూసినప్పుడు ఆ జాతిమొత్తం స్వతంత్రతకి అనర్హమౌతుందన్న శర్మ కేవలం కవిత్వం రాసి చేతులు దులుపుకోలేదు. అస్పృశ్యతా నివారణ కోసం నిమ్నజాత్యుద్ధరణ కోసం రాత్రింబవళ్ళు శ్రమించి -చిట్టచివరకు తనవాళ్ళ చేత వెలివేయబడినా కూడా పట్టువదలకుండా జాత్యభ్యుదయం ప్రాణంగా భావించిన త్యాగి శర్మగారు. అంతేకాదు మరొకచోట మంగిపూడి జాతికి వెన్నెముక యనందగు నంత్య జాతులను సంఘమునకు దూరముచేసి మనకు గాని వారినిగ జేసికొనుట కన్నయాత్మహత్య వేరొండు లేదు అని ప్రకటించారు. స్త్రీ విద్యను కోరుతూ కర్మదేవి, వీరమతి వంటి రచనలు చేశారు (అయితే అలభ్యం). ఈ నేపథ్యమంతా మంగిపూడి నిరుద్ధ భారతము కావ్యం సానుభూతి పరంగానో, అభ్యుదయవాది అనిపించుకోవాలనో రాయలేదనీ -గుండె చప్పుళ్ళతో జీవుని వేదనతో రాసిందేనని స్పష్టమవుతుంది.
నిరుద్ధం అంటే అడ్డగించబడిన కొందరు అభివృద్ధి చెందకుండా, విద్యావంతులు కాకుండా, ఆత్మగౌరవం లేకుండా అడ్డుపడుతున్నారు. అడ్డగిస్తున్నారు. కాబట్టి ఈ భారతదేశం అడ్డగింపబడుతున్న దేశమేనన్న భావనతో కావ్యానికి పేరుపెట్టారు. దళితులు అడ్డగింపబడుతున్నారని, అణచివేయబడుతున్నారని 1915లో ఆవేదన చెందినవారు మంగిపూడి వేంకటశర్మ.
నిరుద్ధ భారతము మానవ ధర్మపరమైన హిందూ మత పరమార్ధమును తేటతెనుగున పద్యరూపమునను హృద్యముగ బోధించుచున్నది. భారతీయులందు హరిజనులత్యంత నిరుద్ధులు. భారత ధర్మరక్షణమునకు నిరుద్ధుల నిరుద్ధులు గావలసిన యవసరమును దేశ కాల పరిస్థితులు సువ్యక్తము చేయుచున్నవి. సనాతనులును సంస్కరణ ప్రియులును నీకృతియందు దెలిపినటులు ప్రశాంత చిత్తులై యవధరించి కర్మయోగారూఢులగుదురు గాత! అంటూ కాశీనాథుని నాగేశ్వరరావు పరిచయవాక్యాలు పలికారు.
నిరుద్ధ భారతంలోని మొదటి పద్యంలో నాస్తితు పంచమ అని పల్కిన వేదాన్ని వినకుండా అయిదో జాతిని సృష్టించారు -ఎక్కడుందో చెప్పండి.. అని నిలదీశారు (ఈ భావాన్నే జాషువ ప్రకటించారు). మంగిపూడి రామాయణ, భారత పురాణాల మూలాల్లోకి వెళ్ళి రహస్యాలను బయటపెట్టారు. ఎన్నెన్నో గుట్లు బట్టబయలు చేశారు. పలికిన, ప్రకటించిన ప్రతి అంశానికి అథోజ్ఞాపికలో ప్రమాణం చూపించారు. ఉదాహరణలిచ్చారు. అమ్మహా వేదవి దుండువాల్మీకి పవిత్రుడు మున్ను నిషాదుడే కదా!
వ్యాసుడు నిమ్నజాతుడే వ్యాసముని చంద్రగన్న పరాశరుండు/ మాలదానికి బుట్టి బ్రహ్మర్షియయ్యె/ వేశ్యకును బుట్టి మాలెత బెండ్లియాడి/ యావసిష్ఠ మహర్షి బ్రహ్మర్షియయ్యె
పంచములు మ్లేచ్ఛులును విష్ణుభక్తి మెఱసి వైష్ణవులు పూజసేయు నాళ్వారు వైరి
(పంచములుగా, మ్లేచ్ఛులుగా పిలువబడేవారు ఆళ్వారులయ్యారు -మంగయాళ్వారు, తిరుప్పాణియళ్ళారు -అని దుగ్గిరాల వేంకటసూర్యప్రకాశరావు గారిని ఉదహరించారు) ఈ సూర్యప్రకాశరావు మానవ సేవలో వెల్లడించిన సత్యం -మైసూరు రాజ్యము లోని మేలుకోట వైష్ణవ దేవాలయమున సంక్రాంతి దినములలో మూడునాళ్లు మాలవాండ్రు దేవున కర్చకులుగా నుండి బ్రాహ్మణులకు సహితము శఠగోపమును బ్రసాదము నిత్తురు పండితరామభుజ దత్తుగారి ఉపన్యాసం ఆధారంగా పద్యాలు రాసి వర్ణ సంకరం భారత దేశంలో అనాదిగా ఉన్నదేనని మంగిపూడి ఎంతో ధైర్యంగా సిద్ధాంతీకరించారు -1915లో! ఎక్కడెక్కడి నుంచో సాక్ష్యాలు చూపించి మంగిపూడి వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం సాధ్యంకాదు -
మారోపంతను నట్టి మ/ హారాష్ట్రుడు భక్త గణమునందు బుధులచే/ జేరుపబడి పొగడొందడె?
దారగ నాతండు మాలెతను జేకొనడే?
స్కాంద, భవిష్యత్ పురాణాలనుంచి, సంస్కృత భాగవతం నుంచి, కావ్యాల నుంచి, కథా సరిత్యాగరం నుంచి... ఎన్నెన్నో సంఘటనల్ని ఉదాహరిస్తుంటే ఆశ్చర్యపోతాం కొమఱ్ఱాజు లక్షణరావు గారు చెప్పిన వృత్తాంతం ఆధారంగా రాసిన పద్యమిది-
చారుతరకీర్తి శ్రీహర్ష చక్రవర్తి/ సభను బాణమయూరాది సత్కవీంద్ర/ తుల్యసత్కార గౌరవాదులను గాంచి
తనరడే దివాకరుండు మాతంగజుండు?
పూర్వం రాజులకు నాల్గవజాతి వారు వంటలు వండితే వాడుకయటంచు మునులును బ్రాహ్మణులును
పాపడెడు వారనుచు కృతుల్ చాటుగాదె?
అంటు భారతం, మనుస్మృతుల్లి ఉదాహరించారు. గంగలో మునిగితే గంగ అపవిత్రం అవుతుందనటాన్ని మంగిపూడి నిరసించారు. ఈ విధంగా సగం కావ్యమంతా అంటరానితనం అనేది, తక్కువ కులం అనేది ఎక్కడ, ఎప్పుడు ఉందని సోపపత్తికంగా తెలిపారు.
మాలమాదిగలును మనవంటి మనుజులే/ వారి ప్రాణము మన ప్రాణమొకటె!/ సర్వావయవములు సర్వేంద్రియములును/ సర్వమానవులకు సమముగాదె!/ నీరమాహారము నిద్రయు మనకును/ వారికి గూడ నావశ్యకములె! / వారలదేహంబువలె మనదేహంబు/ రక్తమాంసాదుల రాశియగును/ మోదఖేదాలు, సుఖ దు:ఖములును, / బుణ్యపాపాలు గలిమిలేములును సరులె!/ ఉభయులకు హెచ్చు లొచ్చులేమున్న వింక?
మనసు మౌర్ఖ్యంబు నెనసి క్రమ్మఱదుగాక
ఇందులో మూర్ఖత్వం పదం తీవ్రతను తెలుపుతుంది. ఇలా ఎన్నో సీసపద్యాలలో పంచముల ఘనతను తెలుపుతూ చివర్లో ఇలా అంటారు -
సంఘదేహమెల్ల జక్కగా లేకున్న
సంఘమంత కార్తి సంఘటిల్లు
గాన జాతులెల్ల జ్ఞానంబునొందక
ముక్తిలేదు సంఘమునకు నిజము
సవర్ణులైన దళితులు ఇతర మతాలలోకి వెళ్ళడానికి కారణం ఆ మతాల పరమార్థం గ్రహించి కాదనీ మన దుర్బుద్ధులవల్లనే, మన అమానుష కార్యాలవల్లనే అని నిర్భయంగా ప్రకటించారు.
పరువుగ నెల్ల వారి సమభావమునన్ మనమాదరింపయిన్ అన్నారు మంగిపూడి. అంతేకాదు -
అగ్రవర్ణాల వారు అధికులని అతి విధేయత చూపిస్తారెందుకు?/ బ్రాహ్మణుల్ని దైవాంశ సంభూతులుగా మొక్కుతారెందుకు?/ బ్రాహ్మణుల పాదాలను కడిగిన నీళ్ళు పావనమని భావిస్తారెందుకు?/ అని దళితుల్ని కూడా ప్రశ్నిస్తారు? వారి జీవన స్థితి ఎంతదుర్భరమో వివరించి ఇలా నిలదీస్తారు-
వాత్సల్యమున నాత్మవత్సర్వభూతాని
యనుపల్కు మనమునందరయరయ్య
అర్థిన్ బరోపకారార్థం శరీర మన్
పలుకు యీమదిలోన నిలుపరయ్య
కరుణమై 'బాపాయ పరపీడన'మ్మను
నీతి డెందమునన్ గణింపరయ్య
సొరిది 'సర్వేజనాస్సుఖినోభవం'తను
ధర్మంబు నెదలోన దలపరయ్య
ఈ అస్పృశ్యతా జాడ్యం పోవాలనీ, పోతుందనీ ఆశిస్తూ ఈ కావ్యాన్ని ఈ పద్యంతో ముగిస్తారు-
మాట దక్కించుకొనుటెల్ల మంచిమాట
ఆగబోదింక నెవరెంతయడ్డు పడిన
నడచెనిదే నేడు శ్రీ జగన్నాథరథము
దారి తొలగుటకంటే సాధనము గలదె?
కాబట్టి జాషువ కంటె మున్ముందుగా సాక్ష్యాలతో, ప్రమాణాలతో ప్రశ్నలు సంధించి, మూలాలను అన్వేషించి, హేతుబద్ధతతో వివరించి 1915లోనే నిరుద్ధ భారతం కావ్యం రాయడం విప్లవమే! దళితుడు రాస్తేనే దళిత కావ్యం అనడం సమంజసం కాదు. దళితేతరుడు రాయడమే విశేషం. బ్రాహ్మణాధిపత్యం, అంటరానితనం, దళితద్వేషం ఉన్న సంఘంలో వాటికి ఎదురీది 'నిరుద్ధ భారతం' అనే కావ్యాన్ని ఒక బ్రాహ్మణుడు రాయడం మరీ మరీ విశేషం. దళితులు మంగిపూడిని అభినందించాలి.
ఆ రోజుల్లో ఇలా రాసి కులభ్రష్ఠుడయ్యాడని బ్రాహ్మణులు వెలివేస్తే, ఈ కావ్యానికి ప్రాచుర్యం రాకుండా చేస్తే ఈ రోజుల్లో తమ పక్షాన నిలిచి నిర్భయంగా, నిజాయితీగా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తే బ్రాహ్మణుడు కాబట్టి -దళితుడు కాదు కాబట్టి నిరుద్ధ భారతం దళిత కావ్యం కాదంటారు. రెండూ అసంబద్ధమైనవే, అనుచితమైనవే. దళితులు తమ వాదానికి మంగిపూడి కావ్యంలోని ప్రశ్నల్ని ఊతం చేసుకోవాలి. నిరుద్ధ భారతానికి ప్రాచుర్యం రావాలి!!
డాక్టర్ ద్వా.నా. శాస్త్రి
బయటిలింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]http://www.prabhanews.com/specialstories/article-317759[permanent dead link]