Jump to content

మట్టెలు

వికీపీడియా నుండి
వివాహ సమయంలో వధువుకు మెట్టెలు తొడుగుతున్న వరుడు

హిందూ స్త్రీలకు పెళ్ళి రోజున పెళ్ళి ముహుర్తానికి ముందు జరిగే నలుగు కార్యక్రమంలో మేనమామ లేక మావ వరుస అయినవారు పెళ్ళికుమార్తె కాళ్ల బొటన వ్రేలి పక్కనున్న వ్రేళ్ళకు వెండి రింగ్ లను తొడుగుతారు, వీటినే మట్టెలు లేక మెట్టెలు అంటారు. స్త్రీ ఐదోతనంలోని ఐదు అలంకారాలలో మట్టెలు ఒకటి.

స్త్రీలు మట్టెలు ధరించుట తెలుగు అచారము. ఇది వైదిక సంస్కృతిలో లేదు. సాహిత్యంలో మట్టెల గురించిన తొలి ప్రస్త్రావన ఆంధ్రమహాభారతంలోని విరాట పర్వంలో ఉంది. "లలితంబులగు మట్టియల చప్పుడింపార సంచకైవడి నల్లనల్ల వచ్చి" (విరాట 2-64). నన్నయ తిక్కన కాలంలో పురుషులు కూడా కాళివేళ్లకు మట్టెలు ధరించెడివారు. అరుదుగా ఈ కాలంలో కూడా అక్కడక్కడ కొందరు పురుషులు సకృత్తుగా మట్టెలు పెట్టుకోవడం కనిపిస్తుందని సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్రలో వ్రాశాడు.[1]

Toe Ring

పండితుల అభిప్రాయం

[మార్చు]

కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దాని నుంచి విద్యుత్తు ప్రసరిస్తూ ఉంటుందని కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదని అలా తగలకుండా ఉండటానికే మట్టెలు ధరించే సంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు.

పురాణగాథ

[మార్చు]

దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానించినప్పుడు తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపోద్రిక్తురాలైన దాక్షాయణి, తన కాలి వేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించి అందులో తాను దహనమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భాన్ని అనుసరించి శక్తి వంతమైన ఈ వేలు భూమికి తగలకుండా మెట్టెలు ధరిస్తారని పురాణగాథ.

చారిత్రికత

[మార్చు]

స్త్రీలు మట్టెలు ధరించుట తెనుగువారి యాచారమే వైదిక పద్ధతిలో లేదు. "లలితంబులగు మట్టియల చప్పుడింపార నంచకై వడి నలనల్లవచ్చి" (విరాట 2-64) అనుట యిందుకు ప్రమాణము. నన్నయ తిక్కన్నల కాలములో పురుషులుకూడ మట్టియలను కాలివ్రేళ్ళకు పెట్టుకొనుచుండిరి. నేటికిని అందందు సకృత్తుగా కొందరు పురుషులు మట్టెలను పెట్టుకొనుట కాననగును. కీచకుడు నర్తనాగారమునకు పోయినప్పుడు "మట్టియ లౌండౌంటి బిట్టు దాకగనేల నందంద మునిగాళ్ళ నప్పశించుచు" పోయెను (విరాట 2-250). వధువును పెద్దలు చూచుట, బాంధవ్యము నిశ్చయించుట, అట్టి 'నిశ్చితార్థములో' కన్యకకు "ముద్రారోహణము" చేయుట అనగా తలపై పేలాలుంచుట ఆ కాలమందలి తెలుగువారి యాచారమై యుండును. [ ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచయిత సురవరం ప్రతాపరెడ్డి పుట. 6]

ఇవి కూడా చూడండి

[మార్చు]

తాళిబొట్టు

మూలాలు

[మార్చు]

సాక్షి ఫన్ డే (ఔనా - ఎందుకు) - 23-9-2012

  1. సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘీక చరిత్ర పేజీ.5

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మట్టెలు&oldid=4320379" నుండి వెలికితీశారు