Jump to content

మధుకేశ్వర ఆలయం

వికీపీడియా నుండి

మధుకేశ్వర ఆలయం కదంబ సామ్రాజ్యంలో 9వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. అద్భుతమైన కళానైపుణ్యానికి, నిర్మాణశైలికి అద్దంపడుతున్న ఈ ఆలయం ఏటా వేల సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ ప్రాచీన ఆలయం కర్ణాటకలోని శివమెుగ్గ జిల్లా సరిహద్దుల్లో, ఉత్తర కన్నడ జిల్లాలో బనవాసి గ్రాయంలో ఉంది[1].

ఆలయ విశేషాలు

[మార్చు]

మధుకేశ్వర ఆలయం లోపల, ఆవరణలో... విష్ణుమూర్తి, అలగే... విష్ణు రూపాన్ని అలంకరించబడిన అనేక విగ్రహాలు సందర్శించవచ్చు. ఏకశిలతో చేయబడిన త్రిలోక మంటపంలో భూమి, స్వర్గం, పాతాళ లోకాలు ప్రదర్శించబడుతుంటాయి. ఈ యాత్రాస్థలంలో మరో ప్రధాన ఆకర్షణ గణేశుని విగ్రహం. ఈ విగ్రహం సగం వరకే ఉంటుంది. ఈ విగ్రహం యొక్క మిగిలిన సగం వారణాసిలో ఉన్నదని యాత్రికులు నమ్ముతారు. ఈ గణేషుని విగ్రహమే కాకుండా, నరసింహ స్వామి విగ్రహం కూడా ఈ మధుకేశ్వర ఆలయంలో చూడవచ్చు.ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు భక్తులు ఐదు పడగల నాగేంద్రుని శిల్పం కూడా చూడవచ్చు. ఈ శిల్పం 2వ శతాబ్దానికి చెందినది. జాగ్రత్తగా గమనిస్తే... ఈ నాగ శిల్పంపై ఒక శిలాశాసనం (ప్రాకృత భాషలో) గమనించవచ్చు. శిలాశాసనం నుండి సేకరించిన సమాచారం ప్రకారం, శిల్పం ఏర్పాటుతో పాటు ఇక్కడ ఉన్న ఒక తొట్టి నిర్మాణం... రాణి శివస్కంద నాగశ్రీ ద్వారా ఇక్కడ ప్రతిష్ఠిపబడినదని తెలుస్తోంది. దేశం నలు మూలల నుండి శివభక్తులు శివరాత్రి సందర్భంలో మధుకేశ్వర ఆలయం సందర్శిస్తారు.

ఆలయ చరిత్ర

[మార్చు]

క్రీశ 325-540 మధ్య కదంబులు ఈ గ్రామాన్ని రాజధానిగా చేసుకుని పాలించారని చరిత్ర చెబుతోంది. ఇక్కడ నివసించే ప్రజలు ఎన్నో కళల్లో నిష్ణాతులు. వడ్రంగం, నగిషి, బుట్టల అల్లిక, కుండలు తయారుచేయడం ఇక్కడి వారి వృత్తి. వ్యవసాయంలో కూడా వీరిది అందెవేసిన చెయ్యి. చెరకు, ధాన్యం, అనాస ఇక్కడ పండే పంటలు. చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్ కూడా ఇక్కడ పర్యటించాడని చెబుతారు. తొమ్మిదో శతాబ్దంలో నిర్మించిన మధుకేశ్వరాలయం చుట్టూ ఈ గ్రామం విస్తరించింది.

ఎన్నెన్నో ఉత్సవాలు

[మార్చు]

ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాధుని రథయాత్ర తరువాత ఇక్కడ జరిగే ‘కార్‌ ఫెస్టివల్‌’ మళ్లీ అంతటి పేరు సంపాదించుకుంది. కర్ణాటక ప్రభుత్వం ఏటా డిసెంబరులో నిర్వహించే ‘కదంబ ఫెస్టివల్‌’ చూసి తీరాల్సిందే. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యంలో ప్రజలు పాల్గొంటారు. చక్కని భారతీయ సం ప్రదాయం ఈ ఉత్సవంలో కనువిందు చేస్తుంది. సంప్రదాయ నృత్యాలు, ఇక్కడి సంస్కృతిని ప్రతిబింబించే పద్యాలు, పాటలు ఈ ఫెస్టివల్‌కే హైలైట్‌గా నిలుస్తాయి. అలాగే ‘బనవాసి కళామేళ’. ఇందులో అక్కడి ప్రజలు తీర్చిదిద్దిన కళారీతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకృతులను ‘బనవాసి హోమ్‌’లో చూడొచ్చు. శిల్పాలు, నగిషీలు, పెయింటింగ్స్‌ ఇలా అన్ని రకాల కళాకృతులు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ గ్రామ పర్యటనకు వచ్చినవారు తప్పకుండా చూడాల్సిన మరో ప్రదేశం ‘వర్ణలోక’ ఆర్ట్‌ గ్యాలరీ. అలాగే ‘లక్షద్వీపోత్సవం ఉత్సవం’ కూడా ఇక్కడి వారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుంది.

ప్రకృతి,శిల్పశళ

[మార్చు]

ఎటు చూసినా పచ్చని ప్రకృతి పరుచుకున్నట్టు కనిపించే ఈ గ్రామం మధ్యలో మధుకేశ్వరాలయం ఉంది. ఈ ఆలయంలోని శిల్పకళ ఆనాటి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఆనాటి శిల్పుల కళా నైపుణ్యం చూసిన వారిని ‘ఔరా’ అనిపించకమానదు. ఈ గ్రామంలో ఉన్న ‘గుధాపుర’ సరస్సు ఈ గ్రామం అందాన్ని మరింత పెంచుతుంది. ఈ సరస్సు పైనుంచి వీచే చల్లని గాలులు మనసును ఆహ్లాదపరుస్తాయి. సంవత్సరమంతా ఇక్కడ ఉల్లాసభరితమైన వాతావరణం కనువిందు చేస్తుంది. కాకపోతే సెప్టెంబరు-మార్చి మధ్య ఇక్కడ పర్యటిస్తే మరిచిపోలేని మధురానుభూతి పర్యాటకుల సొంతమవుతుంది.

మూలాలు

[మార్చు]