Jump to content

మయూర ధ్వజుడు

వికీపీడియా నుండి
(మయూరధ్వజుడు నుండి దారిమార్పు చెందింది)
మయూర ధ్వజుడు దానంగా యిచ్చిన శరీర సగభాగాన్ని కోస్తున్న భార్య పిల్లలు

మయూర ధ్వజుడు మణిపుర పాలకుడు,మహా పరాక్రమవంతుడు, గొప్ప దాత.[1]

పాండవులతో యుద్ధం

[మార్చు]

మయూరధ్వజుని కుమారుడైన తామ్ర ధ్వజుడు పాండవుల యాగాశ్వమును బంధించి తనతో యుద్ధం చేసిన నకుల సహదేవ భీమార్జునుల్ని ఓడిస్తాడు. తమ్ముళ్ళు ఓడిపోయిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా బయలుదేరగా కృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి జయించేందుకు ఒక కపటోపాయాన్ని చెబుతాడు. దాని మేరకు శ్రీకృష్ణుడు, ధర్మరాజులిద్దరూ వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరారు. వారిని చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మన్నాడు. అందుకు శ్రీకృష్ణుడు, తమ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారున్ని పట్టుకుంది. బాలుని విడిచిపట్టవలసిందని పార్ధించగా అందుకా సింహము మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజుని శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఇప్పించమని కోరింది. ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరమున సగభాగం దానమిచ్చి బాలుని కాపాడమని కోరుకుంటారు. వారి మాటలు విని అందుకు అంగీకరించిన మీదట కృష్ణుడు తమ భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలనే నియమాన్ని కూడా విధించాడు.[2]

శరీరాన్ని దానంగా యిచ్చుట

[మార్చు]

అందుకు తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు రావటం గమనించిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అన్నాడు. అందుకు మహత్మా తమరు పొరపాటుపడ్డారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది; ఆ భాగ్యం నాకు కలుగలేదు కదా అని ఎడమ కన్ను మిగుల బాధపడుతోంది అంటూ వివరిస్తాడు.

శ్రీకృష్ణుని వరం

[మార్చు]
మంగళగిరి ఆలయంలోని ద్వజస్తంభం

మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజ రూపమును చూపి ఏదేన వరం కోరుకోమన్నాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్ధం ఉపయోగపడేలా నిత్యం మీ ముందుండేటట్లు దీవించండి" అని కోరుకోగా. అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు పలికాడు. మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజ స్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మసఫలం అవుతుంది. నీ నెత్తిన వుంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజ స్తంభాలు విధిగా ప్రతిష్టించడం ఆచారమయింది.

మూలాలు

[మార్చు]
  1. Manasa, Laxmi (2016-05-11). "మయూర ధ్వజుని పరోపకారం | Story of Mayura Dhvaja in Telugu". Hari Ome (in ఇంగ్లీష్). Retrieved 2023-07-31.
  2. Sanjaypatel2010, ~ (2010-06-19). "Mayurdhwaj – A Great Daanveer". Karna The Great (in ఇంగ్లీష్). Retrieved 2023-07-31. {{cite web}}: |first= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)