మలిశెట్టి వెంకటరమణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మలిశెట్టి వెంకటరమణ
అభాగ్యురాలు వెలుగొండ సుజాతమ్మకు ఆశ్రయం అందిస్తున్న వెంకటరమణ
జననం (1965-01-22) 1965 జనవరి 22 (వయసు 58)
కడప జిల్లా
ఇతర పేర్లుమలిశెట్టి రమణ
వృత్తిపోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టరు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మానవతావాది, పరమాత్మ తపోవనాశ్రమం నిర్వాహకుడు
పిల్లలుఐదుగురు (ముగ్గురు కుమారులు, ఇద్దరు కూమర్తెలు)
తల్లిదండ్రులులక్షుమమ్మ, సుబ్బన్న
మలిశెట్టి సుబ్బన్న లక్షుమమ్మ
పరమాత్మ సేవా తపోవన ఆశ్రమం
తన బృందంతో అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న వెంకటరమణ

మలిశెట్టి వెంకటరమణ మానవతావాది. వృత్తి రీత్యా అతను కడప జిల్లా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. అతను "పరమాత్మ సేవా ట్రస్టు" నడుతుపుతున్నాడు.[1] "పరమాత్మ రమణ" గా అందరికీ సుపరిచితుడు.

జీవిత విశేషాలు[మార్చు]

అతను 1965 జనవరి 22న లక్షుమమ్మ, సుబ్బన్న దంపతులకు జన్మించాడు. పోలీసు అధికారిగా పనిచేస్తున్న అతనికి అనాథలంటే వల్లమాలిన అభిమానం. అనాథలుగా చనిపోయిన వారికి తన సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. అనేక సంవత్సరాలుగా ఇలాంటి పనులు చేయడం ఈయన జీవితంలో భాగమైంది. ఇప్పటికి సుమారు558 దహన సంస్కారాలు నిర్వహించాడు. 1993లో కడపలో ఎవరూ లేని  ఓ వృద్ధురాలు మృతి చెందితే చలించిపోయిన అతను తానే దహన సంస్కారాలు చేశాడు. అక్కడి నుంచి అనాధలుగా  ఎవరు మృతిచెందినా తానే ముందుకు వచ్చి సొంత ఖర్చులతో ఖర్మకాండలు జరుపుతూ వస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజు కాశీకి వెళ్లి కార్యక్రమాన్ని జరపుతున్నాడు. కృష్ణా పుష్కరాల డ్యూటీలో భాగంగా విజయవాడలో ఉన్న ఆయన ఉన్నతాధికారుల అనుమతితో శాస్త్రోక్తంగా ఇప్పటి వరకూ తాను అంత్యక్రియలు నిర్వహించిన 480 మందికి పిండ ప్రదానాలు పూర్తి చేశాడు[2]. తన కార్యక్రమాలను మరింత విస్తరించాలని పరమాత్మ' అనే సేవా సంస్థను ఏర్పాటు చేశాడు.

పరమాత్మ సేవా ట్రస్టు[మార్చు]

అతను వృద్ధాశ్రమాలు అవసరం లేని సమాజం రావాలని కోరుకుంటున్నాడు. సమాజంలో నేడు కొడుకులు, కోడళ్ళు, కూతుళ్లు, అల్లుళ్లు మూలంగా నిరాదరణకు గురి అవుతున్న పెద్దలకు ఆసరాగా "పరమాత్మ సేవా సంస్థ" ను స్థాపించాడు. ఈ సంస్థకు అనేక సేవా సంస్థలు, వ్యక్తులు వివిధ రకాలుగా సహాయాలు అందించి, ఆ సంస్థ సేవలలో భాగం పంచుకుంటుంటారు. ఈ సంస్థ ద్వారా అనాథ శవాలకు అంత్యక్రియలు చేయడం జరుగుతుంది.[3]

పరమాత్మ తపోవనాశ్రమం[మార్చు]

కడప జిల్లా సిద్ధవటం మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని మూడున్నర ఎకరాల స్థలంలో ఏపుగా పెరిగిన వృక్షాలూ, పూల మొక్కలూ, పండ్ల చెట్లూ వాటి మధ్యలో ఖజానా బాతులూ, పర్ణశాలలను పోలిన నిర్మాణాలతో కూడిన ప్రదేశం ఓ గురుకులాన్ని తలపిస్తుంది. లోపలికి వెళ్లి చూస్తే వయోధికులు కనిపిస్తారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారూ, మతి స్థిమితంలేనివారూ, పూర్తిగా మంచానికే పరిమితమైనవారూ అంతా కలిసి ఓ 30 మంది వరకూ ఉంటారు. అలాంటివారికోసం ఏర్పాటుచేసిందే ఈ "పరమత్మ తపోవనాశ్రమం". దీనిని తన పూర్వీకుల ఆస్తి నుంచి తనకు అందిన రూ.50లక్షలకు తోడు పైసా పైసా కూడబెట్టి పొదుపు చేసుకున్న రూ.10 లక్షలూ, మిత్రులు అందించిన రూ.20 లక్షలూ కలిపి ఆశ్రమాన్ని అభివృద్ధి చేశాడు వెంకటరమణ. 2011లో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో నిర్వాహకులూ, వృద్ధులూ ఉండేందుకు మూడు చిన్న చిన్న భవనాల్ని నిర్మించాడు. వాటికి తోడు వంటశాల, పశువుల కొట్టాం, పర్ణశాల ఉంటాయి. మొక్కల పెంపకానికి వీలుగా అక్కడక్కడా నీటి పంపుల్నీ, పక్షుల కోసం చిన్న నీటి తొట్టెల్నీ ఏర్పాటుచేశారు. ఇక్కడ కాసే ప్రతి కాయా, పండే ప్రతి ఫలమూ, పశువులు ఇచ్చే పాలు ఆశ్రమ వాసులకే అందిస్తారు. అతను వృద్ధులకు అవసరమైన ప్రాథమిక వైద్యాన్ని కూడా అందిస్తుంటాడు. అప్పుడప్పుడూ బయట నుంచి వైద్యులు వచ్చి సేవలు అందిస్తారు. తనకు ఉద్యోగంలో వచ్చిన జీతంలో తనకు 15వేలు మాత్రమే ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని సంస్థ ద్వారా సేవలకు వినియోగిస్తుంటాడు. ఆశ్రమంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్ని చూసి సాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే ఆ లెక్కల్ని పక్కాగా రాసి ఉంచుతాడు. ఆశ్రమంలోని పచ్చదనాన్ని చూసిన ఓ కార్పొరేట్‌ విద్యాసంస్థవారు రూ.2కోట్లు పెట్టి ఆ స్థలాన్ని కొనడానికి ముందుకు వచ్చారు. రమణ వారి ప్రతిపాదనను తిరస్కరించాడు. ‘భవిష్యత్తులో మనసు మారితే’ అన్న ఆలోచన వచ్చి ఆ మర్నాడే ఆశ్రమ ఆస్తిని "పరమాత్మ తపోవనాశ్రమ ట్రస్టు" పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాడు. ఆశ్రమ ఆస్తుల్ని ఎవరూ విక్రయించడానికి వీలులేని విధంగా నిబంధన పెట్టాడు. తన తర్వాత నిర్వహణకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఆశ్రమంలో శ్రీగంధం చెట్లు నాటించాడు. భవిష్యత్తులో వాటిని అమ్మగా పెద్దమొత్తంలో డబ్బు వస్తుందనీ, దానిని బ్యాంకులో పొదుపు చేయగా వచ్చే వడ్డీతో ఆశ్రమ నిర్వహణ జరుగుతుందని అతని భావన. తపోవనాశ్రమం ప్రారంభంకంటే ముందు, దాదాపు రెండు దశాబ్దాలుగా అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాడు[4].[5]

అనాధలకు అండగా...[మార్చు]

అనేక సేవా సేవాకార్యక్రమలను చేపడుతున్న రమణ దృష్టి అనాథ చిన్నారులపై పడింది. వాళ్లకి సహాయపడాలనే ఉద్దేశంలో కడపలోని 12 హోటళ్ల వద్ద కొన్ని అడ్డాల బాక్సులు ఏర్పాటు చేశాడు. వాటిల్లో చందాల . పేరున డబ్బులు వెయ్యమని కోరలేదు. ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక చాక్లెట్, ఒక బ్రెడ్డు, కేకు... ఏదైనా తినుబండారం ఇందులో వెయ్యండి. డబ్బులు మాత్రం వద్దు అని ఆ డబ్బాలపై రాయించాడు. వీటిలో దాతలు వేసిన ప్యాకెట్లను అనాథశరణాలయాల్లోని బాలలకి అందజేయడం మొదలు పెట్టారు. అంతేకాదు, ఈ చిన్నారులందరికీ ఒకే రోజు పుట్టినరోజును భారీస్థాయిలో నిర్వహిస్తున్నారు. ప్రతీయేటా నవంబర్ 14న అంటే బాలల దినోత్సవంనాడే వీళ్లందరి పుట్టినరోజు. ఆరోజు దాదాపు వెయ్యిమంది చిన్నారులకు కొత్త బట్టలు కొనిస్తారు. పెద్ద కేకు తయారు చేయించి ఆందరితో ఒకేసారి కట్ చేయిస్తారు. ఆరోజంతా విందులూ వినోదాలూ పండగే పండగ.

రక్తదానం[మార్చు]

అతను ఇప్పటి వరకూ 47సార్లు రక్తదానం చేశాడు. అంతేకాదు, రక్తదానం చేయమనీ చుట్టుపక్కల వారందరినీ ప్రోత్సహిస్తాడు. అలా పరమాత్మ సంస్థలో 1500 మంది రక్తదాతలు సభ్యులుగా చేరారు. ఏ ఆసుపత్రి నుంచైనా ఫలానా గ్రూపు రక్తం అత్యవసరం అని రమణకి తెలియగానే తన వద్ద ఉన్న దాతలకు ఫోన్లు చేస్తారు. ఇప్పటివరకూ ఎంతోమంది రోగుల ప్రాణాలను పరమాత్మ' ద్వారా రక్తం ఇచ్చి కాపాడారు.[6]

అనాథ శవాల దహన సంస్కారాలు[మార్చు]

అతను తన వృత్తిలో భాగంగా ఒకసారి 1993లో ఒక చెరువులోంచి శవాన్ని తీసి పంచనామా చేయించారు. కానీ ఆ శవాన్ని తీసుకువెళ్ళేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతొ గ్రామ నౌకరుతొ కలసి దానిని ఖననం చేసాడు. తరువాత ఒక సాధువుకు అంతిమ సంస్కారం చేసేటప్పుడు స్థానికులు ముందువు వచ్చారు. అప్పటి నుండి ప్రమాదాల్లో మరణించిన అనాథలూ, యాచకులూ, గుర్తు తెలియని శవాలెన్నింటికో అంతిమ సంస్కారాలు చేస్తూ వస్తున్నాడు. ఈ కార్యక్రమాలకు తన మిత్ర బృందం సహకారం కూడా ఉంటుంది. అతను వారి మిత్రబృందంతో కలసి సుమారు 558 శవాలకు దహన సంస్కారాలు చేసాడు. అంతిమ సంస్కారం జరపడమే కాకుండా, బిడ్డలు తమ తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మలు చేసినట్టే వారందరికీ వారణాసిలో పిండ ప్రదానం చేస్తున్నాడు[4]. ఇటువంటి కార్యక్రమాలను రెండు దశాబ్దాలుగా చేస్తున్నాడు. ప్రతీ దహన సంస్కారానికి తన స్వంత సొమ్ములో 500 నుండి 1000 రూపాయలు ఖర్చు చేస్తుంటాడు[7]. అంతే కాకుండా ప్రతీ యేటా డిసెంబరులో కాశీ వెళతాడు. అప్పటి వరకు తాను అంత్యక్రియలు చేసినవారి పేరున గంగానది ఒడ్డున పిండ ప్రదానం చేస్తాడు. రమణ సేవాభావం కడప జిల్లాలో ఎందరిలో కదిలించింది. ప్రస్తుతం సుమారు 40మంది ఆయన వెంట సేవాకార్యక్రమాలను చేసేందుకు వెళ్తుంటారు. రానురాను ఈ కాలిస్టేబుల్ పేరు క్రమంగా "శవాల రమణ" గా మారిపోయింది. ఇదే పేరు తరువాతి కాలంలో "పరమాత్మ రమణ" గా మారిపోయింది.[8]

వ్యక్తిగత జీవితం[మార్చు]

వెంకటరమణకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూమర్తెలు ఉన్నారు. వారిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Constable, NRI feted for social service". The Hindu (in Indian English). 2010-06-01. ISSN 0971-751X. Retrieved 2019-01-19.
  2. "మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న పోలీస్..!". Archived from the original on 2016-08-24.
  3. "వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలి". 2016-02-05. Archived from the original on 2020-01-24. Retrieved 2019-01-19.
  4. 4.0 4.1 "EENADU NEWS 2019 - Special Page - Sunday Magzine". www.eenadu.net. Retrieved 2019-01-19.[permanent dead link]
  5. Swena, Naresh (2017-04-09). "జగమంత కుటుంబం నాది.. మానవత్వ జీవితమే నాది." journalismpower.com (in ఇంగ్లీష్). Archived from the original on 2017-11-10. Retrieved 2019-01-19.
  6. "USEFUL LIFE SKILLS: CONSTABLE VENKATA RAMANA - SUBBANNA GARI PALLE". USEFUL LIFE SKILLS. 2012-11-11. Retrieved 2019-01-19.
  7. "Khaki, The Earth Colour". 2019-01-19.[permanent dead link]
  8. "USEFUL LIFE SKILLS: CONSTABLE VENKATA RAMANA - SUBBANNA GARI PALLE". USEFUL LIFE SKILLS. 2012-11-11. Retrieved 2019-01-19.

బయటి లంకెలు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.