మల్లవరపు రాజేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లవరపు రాజేశ్వరరావు
నివాస ప్రాంతంహైదరాబాదు భారత దేశముIndia
తండ్రిమల్లవరపు జాన్
వెబ్‌సైటు
http://mallavarapu-johnkavi.blogspot.in/

మల్లవరపు రాజేశ్వరరావు[మార్చు]

మల్లవరపు రాజేశ్వరరావు ప్రముఖ పద్యకవి, తెలుగు ఉపాధ్యాయుడు. 1949 ఆగస్టు 1లో ప్రకాశం జిల్లాలో జన్మించారు. ఈయన మల్లవరపు జాన్ కవి కుమారుడు.

రచనలు[మార్చు]

ఈయన కలం నుండి పద్యకావ్యాలు, శతకాలు, కవితా ఖండికలు వెలువడ్డాయి. వీటిలో జీవనది కవితాఖండిక వీరికి ఎంతో పేరుతెచ్చింది. ముంతాజ్ మహల్ పద్యకావ్యం అనేకమంది సాహితీవేత్తల ప్రశంసలు అందుకుంది. భక్తయోబు, అనాథ గంగ, ఎయిడ్స్ మహమ్మారి, బాలగేయాలు, హన్నా, కాళింది, రజయ ప్రణయం, ఎస్తేరు రాణి మొదలైన రచనలు చేశారు. ఈయన రాసిన జీవనది కావ్యంపై తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పరిశోధన చేశారు. ఈయన ఇటీవల రాసిన ‘మల్లవరపు శతకం’ సాహిత్య విలువలతో పాటు, సమకాలీన సమస్యల్ని ప్రతిబింబించిందని ప్రముఖ విమర్శకుడు డా.దార్ల వెంకటేశ్వరరావు ఒక పరిశోధన వ్యాసంలో పేర్కొన్నారు.[1] ఆ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను.

మల్లవరపు శతకం[మార్చు]

‘‘ఆటవెలది మనసు నలరించు చుండు పాటవోలె నద్ది పరుగుదీయు నీతిసూక్తులకు నిండైన పద్యంబు మల్లవరపు మాట మల్లెమూట’’’’అంటూ మృదువైనశబ్దాలతో, పదునైన భావాల్ని మధురమైన కవిత్వంగా అందిస్తున్న కవి మల్లవరపు రాజేశ్వరరావుగారు. తెలుగు సాహిత్య చరిత్రలో ఇప్పటికే తనకంటూ ఒకస్థానాన్ని పదిలపర్చుకున్న ఈయన పద్యకవిగా ఎంతగానో ప్రసిద్ధులు. పద్యాన్ని రాయడంతోపాటు దాన్ని భావ, రాగయుక్తంగా ఆలపించడంలో కూడా తనదైన ఒక ప్రత్యేక ముద్రను సొంతంచేసుకున్న కవి. మల్లవరపు జాన్‌ కవిగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని పోతనలోని మాధుర్యాన్ని, కరుణశ్రీలోని మృదుత్వాన్ని, వేమనలోని వస్త్వలంకారాలతో సత్యాన్ని సామాన్యులకు కూడా అందించగల నేర్పునీ, జాషువాలోని సామాజిక స్పందన్నీ ఏకోన్ముఖంగా మనకి అందించగల కళానైపుణ్యమీయన కవిత్వంలో కనిపిస్తుంది.ఈయన కుమారులు సుధాకరరావు, ప్రభాకరరావులు కూడా బలమైన వ్యక్తీకరణతో వచనకవిత్వాన్ని దీప్తిమంతం చేస్తున్నారు. అందుకనే కవిత్వ విద్యను తన వారసులకు కూడా అందించి సాహిత్యంలో ‘‘మల్లవరపు కవులు’’ అనే ఒక అధ్యాయానికి కావాల్సినంత కృషిని చేశారని అనగలుగుతున్నాను. రాజేశ్వరరావుగారు వృత్తిరీత్యా తెలుగు పండితులుగా పనిచేశారు. కానీ, కవిగా బాలలకోసం బాలగేయాలు, నాటికలు వంటి వివిధ ప్రక్రియల్లో రచనలు చేసి వారిలో సాహిత్యాభిలాషను, నైతికవిలువల్ని పెంపొందించే ప్రయత్నం చేశారు. ఈయన రాసిన అనేక ఖండకావ్యాలనిండా ‘కండ’గల కవిత్వం, సమకాలీన వస్తువు, దాన్ని కవిత్వం చేయగలిన నేర్పు కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చదువుతున్న ‘‘మల్లవరపు శతకం’’ కూడా ఆ కోవలేనే ఒక సామాజిక బాధ్యతగల కవిగానే ఈయన కలం నుండి వెలువడిరది. శతక ప్రక్రియా రచనలో కవికి వస్తుస్వీకరణలో స్వేచ్ఛ ఉంటుంది. ఆ వస్తువుని మూడు పాదాల్లోనే చెప్పమనే నిబంధనల సంకెళ్ళుకూడా ఉంటాయి. ఒకపాదం మకుటం కావడం ఒకవిధంగా నాల్గోపాదం గురించి ఆలోచించవలసిన అవసరం లేకపోయినా, ఆ మకుటంలో చెప్పిన భావాన్ని పై మూడు పాదాలు అర్థవంతం చేస్తున్నట్లున్నప్పుడే శతకరచనలో కవిత్వం అలరిస్తుంది. వీటితో పాటు తాను ఎన్నుకునే ఛందస్సు, భాష, తీసుకొనే ఉపమానాలు కవిత్వ లక్ష్యాన్ని చెప్పకనే చెప్తుంటాయి. నీతిని బోధించే శతకాల్లో సుమతీశతకం నేటికీ అగ్రస్థానంలోనే నిలుస్తుంది.దీనిలోనూ కొన్ని పద్యాలు కొన్ని కులాల్ని కించపరిచేలా ఉన్నాయి. వాటిని గమనించిన పండితులు తమ శక్తిసామర్థ్యాలతో పరిష్కరణలు చేశారు. అయినప్పటికీ వాటిని మూలంలో కూడా బహుశా ఆ పద్యాలు అలాగే ఉన్నాయనుకుని చదివేవాళ్ళున్నారు. దీనితో పాటు కుమార, కుమారీ శతకాలు వచ్చినా వీటి లక్ష్యం, పరిధి నీతిశతకానికున్నంత విస్తృతమైంది కాదు. తర్వాత భక్తి, అధిక్షేప, హాస్య శతకాలెన్ని వచ్చినా వేమనపద్యాలుకున్నంత ప్రాచుర్యం వేటికీ దక్కలేదనిపిస్తుంది. వేమనపద్యాలు వేలాదిగా లభిస్తున్నాయి.ఇవన్నీ నిజంగా వేమనే చెప్పి ఉంటాడా? అనీ కొంతమంది పరిశోధకులు అనుమానాల్ని వ్యక్తం చేశారు. సమాజంలో జరుగుతున్న పెడధోరణుల్ని ఆకర్షణీయంగా చెప్పడానికీ, చెప్పిన దానికి ప్రామాణికత్వాన్ని కలిగించడానికీ వేమన మకుటాన్ని ఉపయోగించుకొని పద్యాలు రాసినవాళ్ళున్నారు. తాము చెప్తే వింటారనుకున్నప్పుడు కొంతమంది సమకాలీన విషయాల్ని తాము సృష్టించుకున్న మకుటాలతోనే శతకాలను రాసినవాళ్ళున్నారు. అందువల్ల శతకానికి ఆత్మీయతాముద్ర అనే లక్షణం కూడా వచ్చి చేరింది. మల్లవరపు రాజేశ్వరరావుగారు తన ఆత్మీయతాముద్రతోనే సమకాలీన సామాజిక విషయాల్ని రసవంతంగా వర్ణించారు. దండ్రులు, గురువులు, కవులు, సామాజిక సంస్కరణవాదులు, దేశభక్తులు, దార్శనికులతో పాటు, కుల, మత, వర్ణాది విషయాల్ని ఈశతకంలో వర్ణించారు కవి. పండితపామరజనరంజకంగా చెప్పాలకున్నప్పుడు చెప్పేవిధానం కూడా ముఖ్యమే. నీతిని చెప్పేటప్పుడు సాధారణంగా ఆటవెలది, తేటగీతి పద్యాల్లో వర్ణిస్తుంటారు కవులు. ఏ విషయాన్ని ఏ వృత్తంలో వర్ణిస్తే ఔచిత్యంగా ఉంటుందో లాక్షణికులు చెప్పారు. క్షేమేంద్రుడు తన ‘సువృత్తతిలకమ్‌’లో ఈ లక్షణాల్ని ఎంతో వివరంగా చర్చించాడు.లాక్షణికులు చెప్పినవి పాటించేవాళ్ళు కొంతమందైతే, వాటిని పాటిస్తూనే మరికొన్ని ప్రయోగాలు చేసేవాళ్ళు మరికొంతమంది.వీటినేమీ పట్టించుకోకుండా తాము పట్టిన కుందేలుకి మూడేకాళ్ళనే పద్ధతిలో రాసుకుంటూ పోయేవాళ్ళూ ఉన్నారు. వీళ్ళలో పూర్వకవుల, లాక్షణికుల సంప్రదాయాల్ని పాటిస్తూనే నూతనప్రయోగాలు చేసేవాళ్ళ వల్ల కవిత్వం కొత్తపుంతలు తొక్కగలుగుతుంది. రాజేశ్వరరావుగారి ‘మల్లవరపు శతకం’ ఈ విభాగంలోకే చేరుతుందనిపిస్తుంది.నీతిని, అధిక్షేపాన్ని వర్ణించేందుకు ఆటవెలది, కందపద్యాలు చాలా అనువుగా ఉంటాయి. కవి ఆటవెలదిని ఎన్నుకున్నారు. ఇది పూర్వలాక్షణిక సంప్రదాయానుసరణ. భాషాశైలిలో కొన్ని ప్రయోగాలున్నాయి. ఇది ఆధునికకవిత్వవికాసానికి, ప్రయోగానికి చెందిన మార్గం. ‘‘ఆటవెలది నాట్యమాడిరచు నేర్పరి

        అలతి పదములందు అంత్య ప్రాస
        మధురభావములకు మల్లెమాలయె సాటి
        మల్లవరపు మాట మల్లెమూట’’
        ‘‘లలితపదములన్ని లాలిత్యముగ గూర్చి
        నడకసోయగములు నాట్యమాడ
        జగతికంకితంబు‘జంధ్యాల’ పద్యాలు

మల్లవరపు మాట మల్లెమూట ’’ అని సహజకవిగా పేర్గాంచిన ‘మల్లెమాల’ కవిత్వాన్నీ, ‘కరుణశ్రీ’ పేరుతో ప్రఖ్యాతిగాంచిన జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి కవిత్వాన్ని ప్రస్తావించారు రాజేశ్వరరావుగారు. మరోచోట పోతన, జాషువా కవిత్వంలోని మాధుర్యాన్నీ గుర్తుచేసుకున్నారు. ఇవన్నీ ఛందస్సు, వృత్తాల ఎంపికతోపాటు, భావసౌకుమార్యాన్నీ, లాక్షణికుల సూత్రాల్నీ తన పూర్వీకులనుండి అనుసరించిన సంప్రదాయక లక్షణాలుగా భావించే అంశాలు. గతమంతా కొట్టిపారేయలేమనే సూచనకు నిదర్శనాలు. ఇన్స్సెక్టరయ్యలు, రిజరువేషనులు, హస్తిపురపురేడు, కాంటరాక్టరు, జాష్వ మొదలైన పదాలు ఛందస్సుకోసం కొన్ని, సహజత్వం కోసం మరికొన్నింటినీ ప్రయోగించారుకవి. ఈ శతకంలో ప్రతిపద్యమూ మధురమైన భావాన్ని అందిస్తుంది. స్పందనతో పాటు సందేశాన్నీ ఇస్తుంది. సమకాలీనతను గుర్తిస్తూనే భవిష్యత్తుకి మార్గాన్ని వేస్తుంది. గతవైభవాన్ని స్మరిస్తూనే మంచిని స్వీకరించమంటుంది. ‘‘ఒంటిమీద గుడ్డ నుండనీయరు నటీ

        మణుల నటన భంగిమలను గాంచ
        సిగ్గునెఱుగనట్టి చిన్నారులైనారు
        మల్లవరపు మాట మల్లెమూట’’ అనడంలో కవి తన చక్కని అధిక్షేపంతో పాఠకుణ్ణి ఆనందింపజేస్తూనే, ఆలోచించమంటారు. సినిమాల్లో ఒకప్పటి క్యాబరేడాన్స్‌ నుండి రకరకాల పాత్రలవరకూ అనీ నేటి సినీ హీరోయిన్సే పోషించేతీరుని ఛమత్కారంగా మనముందుంచారు కవి.
        ‘‘మతములన్నియు జనుల హితమునే కూర్చును
        సతము వాని నమ్మి సాగువారి
        బ్రతుకులందు శాంతి భావాలు వెలుగొందు

మల్లవరపు మాట మల్లెమూట’’ అని రాశారు కవి.ఈ సందర్భంలో కొంతమంది పాఠకులకు గురజాడ వారు ప్రవచించిన ‘‘మతములన్నియు మాసిపోవును/జ్ఞానమొక్కటి నిలిచివెలుగును’’ అనేది గుర్తుకొస్తుంది. మతం అంటే ఒక జీవనవిధానం. ప్రతి మానవుడు ఏదొక జీవనవిధానానికి లోబడే బతుకుతుంటాడు. కానీ, అది మౌఢ్యం కానంతవరకు, ఇతరులకు ఇబ్బందిని కలిగించనంతవరకు ఆ మనిషి ఏ ‘మతాన్ని’ ఆచరించినా ఫర్వాలేదు. అప్పుడు మతం మానవాళిని జాగృతం చేసే దిశానిర్దేశమవుతుందని భావిస్తున్నారనిపిస్తుంది.ఈ దృష్టితో చూసినప్పుడు హేతువాదిగా జీవించడం కూడా ఒక జీవనవిధానమే.మన జీవనవిధానం ఇతరులకు బాధకలిగించనంతవరకూ అది హితమునే కోరుతుంది. మన జీవనవిధానం ఇతరులకు హాని కలిగించకుండా ఉండటంతో పాటు, ఇతరుల జీవనవిధానం మనకీ ఆటంకంగా మారనంతవరకూ ఎవరికెలాంటి ఇబ్బందీ ఉండదు. మనం స్వేచ్ఛగా, సంతోషంగా, సుఖంగా ఉండాలనుకోవడం ఎంతముఖ్యమో, ఇవన్నీ ఇతరులకు నష్టదాయకంగా, కష్టదాయకంగా మారుతున్నప్పుడు ‘శాంతి’ ప్రశ్నార్థకమవుతుంది. యుద్ధానంతర శాంతికంటే, యుద్ధమేలేని శాంతిగొప్పదికదా! శతకమంతా నేనే వివరించుకుంటూ పోతే పాఠకుడేమి చదువుతాడు. శతకమంతా చదివిన తర్వాత కవిగారే తల్లిగొప్పతనాన్నివర్ణిస్తూ చెప్పిన పద్యంతో దీన్ని ముగించాలనిపిస్తుంది.కవిత్వమొక తీరని దాహమన్నాడు శ్రీశ్రీ. సమాజంలో జీవిస్తున్న బాధ్యతాయుతమైన కవిగానీ, కళాకారుడు గానీ తన చుట్టూ జరుగుతున్నవాటికి స్పందించడంలో ‘కళాత్మకత’ ఉంటుంది. అది బయటకొచ్చేవరకు ‘పురిటినొప్పులు’ భరించాల్సిందేనన్నట్లుంటుంది. కొన్నిసార్లు ‘గుండెగొంతులో కొట్లాడుతూనే ఉంటుంది. నిలబడనీయదు. అందరిలో ఉన్నా ఒంటిరిని చేస్తుంది. ఒంటరిగా ఉన్న సమూహాన్నీ చేస్తుంది. అది బయటకొచ్చినతర్వాత కవి గొప్ప రిలీఫ్‌ పొందుతాడు. తన ‘సృష్టిని’ తనివితీరా చూసుకొని మురిసిపోతాడు. ఇక్కడ కవి పిల్లల్ని కనే ముందు తల్లిపడే కష్టంలాంటిదాన్నే అనుభవిస్తాడు. కవి మల్లవరపు రాజేశ్వరరావుగారు అటువంటి ‘తల్లి’గురించెలా వర్ణించారో చూడండి. చెప్పకనే తల్లినీ, తల్లిలాంటి కవి ‘తీయనిబాధ’నీ అద్భుతంగా మనకందించారు.

        ‘‘కనెడివేళ తల్లి కష్టంబు పడునెంతొ
        కాన్పులైన పిదప కలత మరచు
        హత్తుకొనును బిడ్డ పొత్తిళ్ళలో నుంచి
        మల్లవరపు మాట మల్లెమూట’’

ఈ శతకం మల్లవరపు రాజేశ్వరరావుగారిలోని కవిత్వకళను, సామాజిక సమస్యల్ని రసావిష్కరణ చేయగల నైపుణ్యాన్ని, వారి భావుకతనీ పట్టిచూపుతుంది. ఆయన కలం నుండి ఒక సంపూర్ణ కావ్యం కోసం పాఠకుడు ఎదురుచూసేలా చేస్తుంది.

మూలాలు[మార్చు]

 1. [1][permanent dead link] https://vrdarla.blogspot.in/2014/10/blog-post_8.html[permanent dead link] - దార్ల వెంకటేశ్వరరావు వ్యాసం ‘‘మల్లవరపు శతకం’’ రసావిష్కారసామాజిక దర్శన కవిత్వం