Jump to content

మహాకాళి ఒప్పందం

వికీపీడియా నుండి

మహాకాళి సంధి, నేపాల్, భారత ప్రభుత్వాలు మహాకాళి నది పరీవాహక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి చేసుకున్న ఒప్పందం. ఈ ఒప్పందంపై 1996లో సంతకాలు చేసారు.బ్యారేజీ, ఆనకట్టలు, జలవిద్యుత్తుల సమగ్ర అభివృద్ధి కోసం ఈ ఒప్పందంలో 12 అధ్యాయాలున్నాయి. ఈ ఒప్పందం మహాకాళి నదిని రెండు దేశాల మధ్య సరిహద్దుగా గుర్తిస్తుంది.

చారిత్రికంగా అభివృద్ధి

[మార్చు]

1920లో, యునైటెడ్ ప్రావిన్స్‌కు సాగునీరు అందించడానికి శారదా బ్యారేజీని నిర్మించడానికి బ్రిటిషు భారత ప్రభుత్వం ఇండో నేపాల్ నీటి ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒడంబడికను శారదా సంధి అంటారు. ఒప్పందంలో భాగంగా, ఆనకట్ట నిర్మాణం కోసం మహాకాళి నది తూర్పు ఒడ్డున 4093.88 ఎకరాల భూమిని ఇవ్వడానికి నేపాల్ ప్రభుత్వం అంగీకరించింది. బదులుగా బ్రిటిష్ భారత ప్రభుత్వం, నేపాల్‌కు దానికి సమానమైన అటవీ భూమి ఇచ్చింది. అదనంగా, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం NPR 50,000, నీటిలో వాటా కూడా నేపాల్‌కు ఇస్తుంది.[1][2]

1971 లో నేపాల్, పంచాయత్ కాలంలో ప్రపంచ బ్యాంకు సహాయంతో 1920 ల నాటి శారదా ఒప్పందం ఆధారంగా మహంకాళి నీటిపారుదల ప్రాజెక్టును ప్రారంభించింది.[3] 1977 లో భారతదేశం, నేపాల్‌లు సంయుక్తంగా మహాకాళి నది వనరులను పరిశోధించడానికి అంగీకరించాయి.[1]

1981 లో శారదా ఒప్పందం ప్రకారం బ్రిటిషు భారతదేశానికి బదిలీ చేసిన భూమిలో భారతదేశం తనక్‌పూర్ బ్యారేజీని ఏకపక్షంగా నిర్మించడం ప్రారంభించింది. సాంకేతిక లోపాల కారణంగా, నేపాల్‌లోని మహాకాళి నదికి తూర్పు వైపున ఉన్న నీటి ప్రవాహాన్ని ఆపలేకపోయారు. దాంతీ నేపాల్‌లో ఎడమ ఒడ్డున ఒక కట్ట అవసరం ఏర్పడింది. నేపాల్ వైపు భారతదేశానికి అవసరమైన దాదాపు 2.9 హెక్టార్ల భూమిని అందించేందుకు ఒప్పందం కుదిరింది. 25,000 క్యూసెక్కుల నీటిని అందించడంతో పాటు 25 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు భారత్ అంగీకరించింది. అయితే నేపాల్ నీటిలో 50%, విద్యుత్‌లో 59 శాతం వాటాను డిమాండ్ చేసింది, అయితే భారతదేశం ఇందుకు అంగీకరించలేదు.[1]

1991లో, నేపాల్ ప్రధానమంత్రి భారతదేశ పర్యటన సందర్భంగా, నేపాల్ ప్రభుత్వం 577 మీటర్ల పొడవైన కట్టను నిర్మించేందుకు అనుమతించింది. ప్రతిగా, భారతదేశం 28.34 క్యూసెక్కుల నీరు, 10 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఏటా అందించడానికి అంగీకరించింది. అయితే ఈ అంశం నేపాల్‌లో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. రాజకీయ గందరగోళం కారణంగా, 1992 అక్టోబరులో భారతదేశం పొందుతున్న 2.9 హెక్టార్ల భూమికి బదులుగా 20 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను అందించడానికి భారతదేశం అంగీకరించిన కొత్త అవగాహన ఒప్పందం (MOU) సంతకం చేయబడింది.[1]

నేపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 126 ప్రకారం, మహాకాళి ఒప్పందాన్ని పార్లమెంటులోని ఎగువ, దిగువ సభలు ఉమ్మడిగా మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాయి.

1996 ఫిబ్రవరి 12 న, మహాకాళి ఒప్పందంపై ఢిల్లీలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, భారత ప్రధాని PV నరసింహారావు సంతకం చేశారు.[4] 1996 సెప్టెంబరు 20 న నేపాల్‌ పార్లమెంటు 2/3 వంతు మెజారిటీతో ఆమోదించింది. నాలుగు నెలల అధికారిక చర్చల తరువాత ఒప్పందం కుదిరింది.[5]

శారదా బ్యారేజీ, తనక్‌పూర్ బ్యారేజీ నుండి మహంకాళి నదికి సంబంధించిన మునుపటి ఒప్పందాలు రద్దై, వాటి స్థానంలో మహాకాళి ఒప్పందం వచ్చింది.[6]

ఒప్పందాలు

[మార్చు]

ఒప్పందం సారాంశం క్రింది విధంగా ఉన్నాయి:[6]

శారదా బ్యారేజీకి ఒప్పందం

[మార్చు]
  • నేపాల్ తడి సీజన్‌లో (అంటే మే 15 నుండి అక్టోబరు 15 వరకు) శారదా బ్యారేజీ నుండి 28.35 మీ 3 /సె (1000 క్యూసెక్కులు), పొడి సీజన్‌లో (అంటే అక్టోబరు 16 నుండి మే 14 వరకు) 150 క్యూసెక్కుల నీటిని తీసుకోవచ్చు
  • పర్యావరణ ప్రవాహాన్ని 10 మీ 3 /సె (350 క్యూసెక్కులు) లేదా అంతకంటే ఎక్కువ ఉండేలా చూడాలి.
  • బ్యారేజీ పని చేయని పక్షంలో తనక్‌పూర్ బ్యారేజీ నుండి అదనంగా నీటిని సరఫరా చేసే హక్కు నేపాల్‌కు ఉంటుంది.

తనక్‌పూర్ బ్యారేజీకి ఒప్పందం

[మార్చు]
  • నేపాల్ తనక్‌పూర్ బ్యారేజీ నిర్మాణానికి మహేంద్రనగర్ మునిసిపల్ ప్రాంతంలోని జిమువా గ్రామం వద్ద సుమారు 2.9 హెక్టార్లు, సరిహద్దుకు ఇరువైపులా ఉన్న నో-మ్యాన్స్ ల్యాండ్‌లో కొంత భాగాన్నీ ఇవ్వాలి. ఈ భూమి నేపాల్ నిరంతర సార్వభౌమాధికారం, నియంత్రణలో ఉంటుంది. దానికి సంబంధించిన అన్ని హక్కులను వినియోగించుకోవడానికి నేపాల్‌కు స్వేచ్ఛ ఉంటుంది.
  • తడి సీజన్‌లో (అంటే మే 15 నుండి అక్టోబరు 15 వరకు) 28.35 మీ 3 /సె (1000 క్యూసెక్కులు), పొడి సీజన్లలో (అంటే అక్టోబరు 16 నుండి మే 14 వరకు) 8.50.మీ 3 /సె (300 క్యూసెక్కులు) నీటిని తీసుకునే హక్కు నేపాల్‌కు ఉంటుంది.
  • భారత్ తనక్‌పూర్ బ్యారేజీ ఎడమ ఒడ్డున హెడ్ రెగ్యులేటర్‌ను, నేపాల్-భారత్ సరిహద్దు వరకు జలమార్గాలనూ నిర్మిస్తుంది. హెడ్ రెగ్యులేటర్ సంయుక్తంగా నిర్వహించబడుతుంది.
  • భారతదేశం ఒక విద్యుత్ కేంద్రాన్ని (120,000 KW) నిర్మిస్తుంది. నేపాల్‌కు 70 మిలియన్ కిలోవాట్-గంటల (యూనిట్) శక్తిని నిరంతర ప్రాతిపదికన ఉచితంగా సరఫరా చేస్తుంది.
  • భారతదేశం తనక్‌పూర్ పవర్ స్టేషన్ నుండి నేపాల్-ఇండియా సరిహద్దు వరకు 132kV ట్రాన్స్‌మిషన్ లైన్‌ను నిర్మిస్తుంది
  • తనక్‌పూర్‌లో ఏదైనా నిల్వ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయబడితే, భారతదేశం ప్రవాహానికి అనుగుణంగా అదనపు రెగ్యులేటరును, జలమార్గాలను నిర్మిస్తుంది.
  • అదనంగా ఉత్పత్తైన శక్తి ఏదైనా ఉంటే దాన్ని చెరి సగం పంచుకుంటారు. అయితే, అదనపు శక్తి ఉత్పత్తి ఖర్చులో కూడా చెరి సగం భరించాలి.

పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కోసం ఒప్పందం

[మార్చు]
  • పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్‌ను ఉమ్మడి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆధారంగా మహాకాళి నదిపై నిర్మించాలి
  • ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తి, నీటిపారుదల, వరద నియంత్రణ మొదలైన వాటికి ఉపయోగపడుతుంది, అంచనా వేయబడుతుంది.
  • ఉత్పత్తి చేయబడిన మొత్తం శక్తిని సమానంగా పంచుకోవాలి
  • ప్రాజెక్ట్ యొక్క వ్యయాన్ని పార్టీలు వారికి పొందే ప్రయోజనాలకు అనుగుణంగా భరిస్తాయి. ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన ఆర్థిక సమీకరణకు రెండు పార్టీలు సంయుక్తంగా ప్రయత్నిస్తాయి.
  • పరస్పరం అంగీకరించిన రేటు ఆధారంగా నేపాల్ శక్తి వాటాలో కొంత భాగాన్ని భారతదేశానికి విక్రయించాలి.
  • నేపాల్ భూభాగంలోని దోధరా-చందానీ ప్రాంతం యొక్క నీటిపారుదల కొరకు భారతదేశం 10m 3 /s (350 క్యూసెక్కులు) నీటిని సరఫరా చేస్తుంది.
  • స్థానిక కమ్యూనిటీల కోసం సగటు వార్షిక ప్రవాహంలో 5% పంచేశ్వర్ వద్ద నిర్వహించబడుతుంది.

ఇతరులు

[మార్చు]
  • మహాకాళి నది కమిషన్‌లో రెండు దేశాల నుండి సమాన సంఖ్యలో ప్రతినిధులుంటారు. ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయడానికి, ప్రణాళికలను సమన్వయం చేయడానికి, పర్యవేక్షించడానికి, తలెత్తే సంఘర్షణలను పరిష్కరించడానికి ఇది పనిచేస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • మహాకాళి నదిని శారదా నది అని కూడా అంటారు
  • పంచేశ్వరుడు
  • తనక్‌పూర్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Analysis of the Indo - Nepal Mahakali Treaty". Retrieved 27 June 2020.
  2. D.K. Vajpeyi (2011). Water Resource Conflicts and International Security: A Global Perspective. Lexington Books. ISBN 9780739170847.
  3. S.K. Das (2005). Peace Processes and Peace Accords. South Asian Peace Studies series. SAGE Publications. ISBN 9780761933915.
  4. "Mahakali Treaty Outcome of economic nationalism - The Himalayan Times". 21 December 2009. Retrieved 2020-06-27.
  5. Natural Resources Security in South Asia:Security in South Asia:Security in South Asia:Security in South Asia: Nepal's Water. Institute of security and development policies. 2007. p. 143.
  6. 6.0 6.1 MAHAKALI TREATY. 1996.