మార్టిన్ లూథర్ 95 చర్చనీయాంశాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
95 చర్చనీయాంశాలు

అక్టోబర్ 31వ తేదీ క్రైస్తవ మతంలో ప్రాటెస్టులు సంఘాలకు చాలా ప్రాముఖ్యమైన రోజు. 1517లో ఈ దినాన మార్టిన్ లూథర్ తన 95 సిద్ధాంతాలను బహిరంగ చర్చకోసమని విటెన్ బర్గ్ దేవాలయ తలుపులమీద మేకులతో కొట్టాడు. ఈ సంఘటన క్రైస్తవ లోకంపైనే కాకుండా యావత్ ప్రపంచంపై తన ప్రభావాన్ని చూపింది. డాక్టర్ మార్టిన్ లూథర్ 95 చర్చనీయాంశాల తెలుగు అనువాదం ఇక్కడ ఉంది.

డాక్టర్ మార్టిన్ లూథర్ 95 సిద్ధాంతాలు (చర్చనీయాంశాలు)

 1. మన ప్రభువు బోధకుడైన యేసు క్రీస్తు “మారు మనస్సు పొందండి” అని అనటంలో, విశ్వాసుల యావజ్జీవితం పశ్చాత్తాపంతో కూడిందై ఉండాలన్నది ఆయన ఉద్దేశం.
 2. ఇది మత గురువులచేత ఆచరించబడే పాపాల్ని ఒప్పుకోవడం, తృప్తి పొందటం లాంటి సంస్కార సంబంధమైన పశ్చాత్తాపం లాంటిదని అనుకోకూడదు.
 3. ఇంకా దీన్ని అంతరంగంలో కలిగే పశ్చాత్తపమని కూడా అనుకోకూడదు. ఈందుకంతే శరీరాన్ని శుష్కింప చేసుకోడం లాంటి బాహ్య చర్యలద్వారా వ్యక్తపరచబడనప్పుడు అది అంతరంగ పశ్చాత్తాపం అనబడదు.
 4. కాబట్టి ఈపాపశిక్షావిధి మనల్ని మనం త్యజించుకుంటున్నతవరకూ కొనసాగుతూనే ఉంటుంది. ఏందుకంటే ఎదే నిజమైన అంతర్గత పశ్చాత్తాపం కనుక అది మనం పరలోకంలో ప్రవేశించేంతవరకూ కొనసాగుతుంది.
 5. సంఘ శాసనాల ద్వారా, తనకున్న అధికారం ద్వారా విధించే శిక్షల్ని తప్ప మిగిలిన వాటిని తగ్గించటానిక్కాని, తగ్గించాలనుకోటానిక్కాని పోపుకు వీల్లేదు.
 6. దేవుడు కొట్టేయ్యాలనుకొంటున్న శిక్షల్ని అవి దేవుడిచేత కొట్టెయ్యబడ్డాయని ప్రకటించడంతప్ప మరెలాంటి శిక్షనీ పోపు తగ్గించలేడు. ఇంకాచెప్పాలంటే తన తీరుపుకు లోబడిన శిక్షల్ని అతడు కొట్టెయ్యొచ్చు. అయితే శిక్షల్ని తగ్గించటానికి తనకున్న అధికారాన్ని అశ్రద్ధచేసి వాటిని కొట్టెయ్యకపోయినా అవతలివాడిలో పాపం అలాగే నిలిచుంటుంది.
 7. తనకు బదులుగాఉన్న సంఘ గురువుకు అన్ని విషయాల్లో విధేయుడ్ని చెయ్యకుండా దేవుడెవరి శిక్షనూ కొట్టెయ్యడు.
 8. పశ్చాత్తాపానికి సంబంధించిన సంఘశాసనాలు బ్రతికున్నవాల్లకు విధించటానికేతప్ప, ఆ శాసనాల ప్రకారం చచ్చిపోయినవాళ్ళకు విధించటానికి వీల్లేదు.
 9. అందుకే పోపు తన తీర్పుల్లో ఏప్పుడూ మరణానికి సంబంధించిన విధివిధానాల్లో మినహాయింపులు ఎచ్చేలా పరిశుద్ధాత్ముడు మన పట్ల దయచూపిస్తున్నాడు.
 10. సంఘ శాసనాలప్రకారం మరణ సమయంలో పాటించాల్సిన పశ్చాత్తప విధులు పర్గెటరీలో చెయ్యటానికి అట్టిపెట్టుకోనిచ్చే సంఘ గురువుల పనులు బుద్ధిలేనివి, దుర్మార్గమైనవి.
 11. సంఘ శాసనాలకు సంబంధించిన శిక్సావిధి పర్గెటరీకి సంబంధించిన శిక్షావిధిగా మార్చబడటం, బిషప్పులు తాము చెయ్యాల్సిన పనులుమాని నిద్రపోతున్నప్పుడు సంఘంలో విత్తబడ్డ ఓ కలుపుమొక్క లాంటిది.
 12. గతంలో సంఘశాసనాలకు సంబంధించిన శిక్షా విధులు నిజమైన పశ్చాత్తాపాన్ని పరీక్షించటంకోసం పాపక్షమాపణకు ముందే విధించబడేయిగాని తర్వాతకాదు.
 13. చనిపోతున్నవాళ్ళు తమ మరణాన్నిబట్టి అన్ని శిక్షావిధులనుండి విడుదల పొందుతారు. సంఘ శాసన విధుల విషయంలో సైతం వాళ్ళూ మ్రుతులేకాబట్టి వాటినుండికూడా విడుదలపొందే హక్కు వాళ్ళకుంటుంది.
 14. తమలోని ఆత్మీయ అనారోగ్యం, ఇంకోమాటలో చెప్పాలంటే అరకొరగాఉన్న ప్రేమ చనిపోతున్నవారిలో మరింతగా భయాన్ని కలిగిస్తోంది. ప్రేమ తక్కువయ్యేకొద్దీ వాళ్ళలో భయం ఎక్కువౌతుంది.
 15. ఈ భయమూ భీతీ మహా నిరాశకు చేరువగా ఉంటాయి కాబట్టి పర్గెటరీలోని శిక్షావిధులన్నిటికీ ఇవే సరిపోతాయి.
 16. నిరాశ – నిరాశ పడటం – రక్షణ అభయం అన్నవి ఎలా వేరు వేరు అంశాలో అలాగే నరకం – పర్గెటరీ – పరలోకం కూడా వేరు వేరు విషయాలే.
 17. పర్గెటరీలోని ఆత్మల్లో భయం తగ్గి ప్రేమ పెరగటం అవసరమేమో అనిపిస్తుంది.
 18. ప్రేమలో ఎదిగి మంచి కార్యాలు చెయ్యగల స్థితిలో వాళ్ళు లేరు అని అంటానికి లేఖనపరమైన రుజువులేవీ లేవు.
 19. అలాగని తమ రక్షణ స్థితికి సంబంధించిన అభయాన్ని వాళ్ళు రూఢిగా కలిగిఉన్నారని చెప్పటానిక్కూడా వీల్లేదు.
 20. కాబట్టి “అన్ని శిక్షావిధుల్నీ పూర్తిగా కొట్టెయ్యడం” అనే విషయం “అన్నిటికీ” కాకుండా “తనచేత విధించబడిన వాటికి మాత్రమే” వర్తిస్తుందని పోపు భావిస్తున్నాడు.
 21. కాబట్టి పోపు ఇచ్చే పాప పరిహార పత్రికల ద్వారా ఒక వ్యక్తి అన్ని శిక్షావిధుల్నుండి విడిపించబడి రక్షించబడతాడని చెప్పే పాపపరిహార పత్రికల బోధకులందరూ అబద్ధీకులే.
 22. నిజానికి సంఘశాసనాల ప్రకారం తాము బ్రతికున్నప్పుడు పొందాల్సిన శిక్షావిధుల్లో ఇంకా మిగిలిపోయిన వాటిల్లో దేన్నికూడా పర్గెటరీలోని ఆత్మల విషయంలో పోపు కొట్టెయ్యలేడు.
 23. ఒకవేళ అన్ని శిక్షావిధులూ కొట్టివెయ్యబడటం అంటూ జరిగితే అది కేవలం సర్వ సంపూర్ణులైన వాళ్ళకు మాత్రమే దక్కుతుంది. అయితే అలాంటి వాళ్ళు ఏకొద్దిమందో ఉంటారు.
 24. కాబట్టి ప్రాయశ్చిత్తానికి సంబంధించిన అన్ని శిక్షావిధుల్నుండి విడుదల పొందుతారని చెప్పబడే వాగాఢంబరమైన, అవివేక వాగ్ధానాలవల్ల చాలామంది మోసపోతున్నారు.
 25. మొత్తానికి పోపుకు పర్గెటరీమీదున్న అధికారం, ప్రతీ బిషప్పుకూ తన సినడ్ మీద, ప్రతీ పాస్టరుకు తన పారిష్ మీద ఉన్న అధికారం వంటిదేనని చెప్పొచ్చు.
 26. పోపు పర్గెటరీలోని ఆత్మలకు పాపక్షమాపణ ఇచ్చేప్పుడు దాన్ని తనకున్న తాళపుచెవుల అధికారాన్నిబట్టికాక విజ్ఞాపన ద్వారా ఇవ్వటం మంచిది.
 27. చందా పెట్టెలో డబ్బులు గలగలమనగానే పర్గెటరీలోంచి ఆత్మ రయ్యిమంటూ ఎగిరిపోతుంది అని చెప్పే బోధ మానవ కల్పితమైంది.
 28. చందాపెట్టెలో డబ్బులు గలగల లాడటంవల్ల లాభమూ లోభీతనమూ రెండూ పెరుగుతాయి. అయితే సంఘం యొక్క విజ్ఞాపనల ఫలితం మాత్రం దేవుని శక్తికి మాత్రమే లోబడి ఉంటుంది.
 29. పరిశుద్ధులైన సెవేరినస్ పాస్కల్ కు సంబంధించిన ఇతిహాసంలో చెప్పబడ్డట్టుగా పర్గెటరీలోని ఆత్మలన్నీ విడిపించబడటానికి ఇస్టపడుతున్నట్టు ఎవరికి తెలుసు?
 30. తన పశ్చాత్తాపం మనహ్ పూర్వకమైందనిగాని, తన పాపాలు సంపూర్ణంగా క్షమించబడ్డాయని గాని ఎవ్వరూ కచ్చితంగా చెప్పలేరు.
 31. యదార్ధంగా పశ్చాత్తాపపడేవాళ్ళు ఎంత అరుదుగా ఉంటారో అలాగే పాపక్షమాపణా పత్రాలు నిజంగా పాపాల్ని పరిహరిస్తాయని నమ్మి వాటిని కొనేవాళ్ళు కూడా అంతే అరుదుగా ఉంటారు.
 32. పాపక్షమాపణాపత్రాలు తమదగ్గరున్నందున తమకు రక్షణ కలుగుతుందని నమ్మేవాళ్ళు, అలా బోధించేవాళ్ళూ నిత్య నాశనం పొందుతారు.
 33. పోపు ఇచ్చే పాపక్షమాపణ దేవునితో మానవుడ్ని సమాధానపర్చే ఓ అమూల్యమైన వరమని బోధించేవాళ్ళ విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
 34. ఎందుకంటే ఈ “క్షమాపణా క్రుపలు” కేవలం మనుషులు నియమించిన సంస్కార సంతృప్తికి సంబంధించిన శిక్షావిధులకు చెందినవి.
 35. డబ్బులిచ్చి ఆత్మల్ని పర్గెటరీలోంచి విడిపించాలనుకుంటున్నవాళ్ళు లేదా పాపపుటొప్పుకోలు పత్రికలు కొన్నవాళ్ళు ఇక ఏమాత్రం పశ్చాత్తాపపడనవసరం లేదని చెప్పేవాళ్ళు క్రైస్తవ సిద్ధాంతాన్ని బోధించటం లేదు.
 36. పాపక్షమాపణ పత్రికలతో నిమిత్తం లేకుండానే అన్ని శిక్షావిధుల్నుండి, అపరాధం నుండి విడుదలపొందే హక్కు నిజంగా పశ్చాత్తాపం చెందే ప్రతీ క్రైస్తవునికీ ఉంటుంది.
 37. పాపక్షమాపణ పత్రాలతో నిమిత్తం లేకుండా నిజమైన ప్రతి క్రైస్తవుడూ – సజీవుడైనా – మ్రుతుడైనా – దేవుడనుగ్రహించిన క్రీస్తు యొక్క, సంఘం యొక్క సకలాశీర్వాదాలలో పాలిభాగస్తుడై ఉంటాడు.
 38. అలాగని పోపు ఇచ్చే పాపక్షమాపణ, ఆశీర్వాదాలను ఎంతమాత్రం తక్కువైనవిగా ఎంచకూడదు. ఏందుకంటే నేను ఇదివరకే చెప్పినట్టు అవి దేవుడిచ్చే పాప క్షమాపణల యొక్క ప్రకటనలై ఉన్నాయి.
 39. నిజ పశ్చత్తాపం యొక్క అవసరం గురించి, సమ్రుద్ధిగా దొరికే పాప క్షమాపణల గురించి ఒకేసారి ప్రజలకు వివరించి చెప్పటం ఎంతగొప్ప వేదాంత పండితుడికైనా సరే చాలా కస్టమైన పని.
 40. నిజమైన పశ్చ్చాత్తాపం శిక్షావిధుల్ని కోరుకుంటుంది, ప్రేమిస్తుంది. ఆయితే విచ్చలవిడిగా దొరికే పాప క్షమాపణా పత్రికలు శిక్షావిధుల తీవ్రతని తగ్గించటమేకాక ఒక్కోసారి ఆ పత్రికల మీద అసహ్యం కలిగేలా చేస్తాయి.
 41. ప్రేమతోకూడిన ఇతర మంచి కార్యాలకంటేకూడా పాపక్షమాపణా పత్రాలు మంచివని ప్రజలు అపోహ పడకుండా వాటి గురించి చాలా జాగ్రత్తగా బోధించటం అవసరం.
 42. పాపపరిహార పత్రికల్ని కొనడం ఏమాత్రం కనికరయుత కార్యాలతో పోల్చదగింది కాదన్నది పోపు అభిప్రాయమని క్రైస్తవులకు బోధించాలి.
 43. పేదలకు సాయం చేసేవాడు, అవసరంలో ఉన్నవాళ్ళకి అప్పిచ్చేవాడు పాపపరిహార పత్రికల్ని కొనడంకంటేకూడా మంచి పనిచేస్తున్నాడని క్రైస్తవులకు బోధించాలి.
 44. ఎందుకంటే ప్రేమపూర్వకమైన పనులు మరింతగా ప్రేమను పెంచి ఒకడ్ని మంచి వాడ్ని చేస్తాయి. అయితే పాపపరిహార పత్రికలు కొనడంద్వారా కేవలం శిక్షావిధుల్నుండి తప్పించబడతాడేగాని మంచివాడు మాత్రం కాలేడు.
 45. అవసరంలో ఉన్నవాడ్ని చూసికూడా ముఖం తప్పించివెళ్ళి, పాపపరిహార పత్రికలు కొనేవాడు పోపు ఇచ్చే క్షమాపణ్ణీ కాదుగాని, దేవుని ఉగ్రతనే కొంటున్నాడని క్రైస్తవులకు బోధించాలి.
 46. తమ స్వంత కుటుంబ అవసరాలకు చాలినంత అట్టిపెట్టుకున్నాక, ఇంకా తమ అవసరాలకు మించి ఏమైనా మిగిలిపోతే ఆడబ్బుతో పాపపరిహార పత్రికలు కొనొచ్చుగాని అనవసరంగా డబ్బులు పాడుచేసుకోకూడదని క్రైస్తవులకు బోధించాలి.
 47. పాపపరిహార పత్రికల్ని కొనటం తమ ఇస్టాయిస్టాలమీద ఆధార పడిందేతప్ప అదేమీ ఆజ్ఞాపూర్వకమైంది కాదని క్రైస్తవులకు బోధించాలి.
 48. ప్రజలుతెచ్చే డబ్బుకంటేకూడా భక్తియుతమైన వాళ్ళ ప్రార్థనలు తనకెంతైనా అవసరమని, అవే పోపు కోరుకొంటున్నాడని క్రైస్తవులకు బోధించాలి.
 49. పాపపరిహార పత్రాలమీద నమ్మకముంచకపోయినా అవి కొన్నవాళ్ళకు ఉపయోగకరంగా ఉంటాయిగాని, వాటినిబట్టి దేవునిమీద వాళ్ళకుండాల్సిన భయభక్తులు తగ్గిపోతేమాత్రం అవే వాళ్ళకు హానికరమౌతాయని క్రైస్తవులకు బోధించాలి.
 50. పాపక్షమాపణా పత్రికల్ని బోధకులు ఎంత నిర్బంధంగా అమ్ముతున్నారో పోపుకుగనక తెలిస్తే, తన గొర్రెల (సంఘస్తుల) రక్తమాంసాలతో పరిశుద్ధ పేతురు దేవాలయం కట్టబడటంకంటే అధికాలి బూడిద కావటానికే పోపు ఇష్టపడతాడని క్రైస్తవులకు బోధించాలి.
 51. పాపక్షమాపణ పత్రికలమ్మేవాళ్ళు మోసపు మాటలు చెప్పి ప్రజలసొమ్ము దోచుకుంటున్న సంగతి పోపుకు గనక్ తెలిస్తే తన స్వంత డబ్బుల్తోపాటు అవసరమైతే పరిశుద్ధ పేతురు దేవాలయాన్ని సైతం అమ్మి వాళ్ళడబ్బు వాళ్ళకు తిరిగివ్వటం తనధర్మంగా పోపు భావిస్తాడని క్రైస్తవులకు బోధించాలి.
 52. ఈ పత్రికల్ని సరఫరా చేసేవాళ్ళుగాని, లేదా చివరికి పోపుగాని వాటిమీద తమ ఆత్మల్ని పణంగా పెట్టినప్పటికీ పాపక్షమాపణ పత్రికలద్వారావచ్చే రక్షణ అభయం వ్యర్థమైందే.
 53. పాపక్షమాపణ పత్రికలగురించి చెప్పటంకోసం కొన్ని దేవాలయాల్లో దేవుని వాక్యం బోధింపబడకుండా ఆటంకపెట్టేవాళ్ళూ క్రీస్తుకు, పోపుకు విరోధులు.
 54. ఒక ప్రసంగంలోనే దేవుని వాక్యంతో సమానంగాగాని, లేదా ఎక్కువగాగాని పాపపరిహార పత్రాలగురిచి చెప్పటానికి సమయాన్ని వెచ్చించినప్పుడు అది దేవుని వాక్యాన్ని కించపర్చినట్లవుతుంది.
 55. చాలా చిన్నపాటి విషయమైన పాపక్షమాపణ పత్రాలకోసం ఒక గంటకొట్టి, ఓ వూరేగింపుచేసి, కొన్ని కర్మకాండలు జరిపినప్పుడు మహత్తరమైన సత్యసువార్తను ప్రకటించటంకోసం వందగంటలు కొట్టి, వంద వూరేగింపులు జరిపి వంద కర్మకాండలు చెయ్యాలని పోపు తలంచాలి.
 56. ఏ సంఘ ఖజానాలోంచి తీసి ఈ పాపపరిహార పత్రికల్ని పోపుఇస్తున్నాడో అది ప్రస్తావించబడలేదు, క్రైస్త ప్రజలకు దాన్నిగురించి ఏం చెప్పబడలేదు.
 57. చాలామంది బోధకులు ఈ ఖజానాలోని మూలధనాన్ని ఇష్టమొచ్చినట్టు వాడిపారేయకుండా ఎంతో జాగ్రత్తగా సమకూర్చటం చూసినప్పుడు ఈ ఖజానాలోని ధనం కచ్చితంగా ఈలోక సంబంధమైంది కాదని అనిపిస్తుంది.
 58. ఈ ఖజానాలోని మూలధనం క్రీస్తుకు, పరిశుద్ధులకు చెందిన పుణ్యఫలమేమీకాదు. ఎందుకంటే పోపుతో నిమిత్తం లేకుండానే ఇది అంతరంగపురుషుడికి క్రుపను, బాహ్యపురుషుడికి సిలువ, మరణం, నరకాలను ఇస్తుంది.
 59. సంఘంలోని పేదవాళ్ళే సంఘానికి నిజమైన ఖజానా అని పరిశుద్ధుడైన లారెన్స్ అన్నాడు. అయితే తనకాలంలో ఆమాటకున్న వాడుకనిబట్టి ఆయన అలా అన్నాడు.
 60. ఈలోకంలోనూ పరలోకంలోనూ బంధించటానికి, విప్పటానికి సంఘానికి క్రీస్తు అనుగ్రహించిన తాళపుచెవుల అధికారమే ఆఖజానాకి మూలధనమని మేముచెప్పటంలో తొందరపాటుతనమేమీలేదు.
 61. అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో పాపవిధుల్ని కొట్టెయ్యడానికి పోపుకు స్పస్టమైన అధికారం చాలినంతౌంది.
 62. మహిమతో నిండిన మహాపరిశుద్ధమైన సువార్త, దేవుని క్రుప ఇవే సంఘానికి నిజమైన ఖజానా.
 63. ఇది మొదటివాళ్ళని చివరివాళ్ళగా చేస్తుంది కాబట్టి సహజంగానే చాలామంది దీన్ని అసహ్యించుకుంటారు.
 64. అయితే పాపపరిహార పత్రికల ఖజానా చివరివాళ్ళని మొదటివాళ్ళగా చేస్తుంది కాబట్టి సహజంగానే దీన్ని అందరూ మెచ్చుకుంటారు.
 65. కాబట్టి సువార్త అనే ఖజానా గతంలో ధనవంతుల్ని దేవునికోసం పట్టే వల వంటిదై ఉంది.
 66. ఇప్పుడైతే ఈ పాపపరిహార పత్రికల ఖజానా ధనంకోసం మనుషుల్నిపట్టే వలలాంటిదైఉంది.
 67. ఇవి మహాగొప్ప క్రుపలు అంటూ బోధకులు కేకలుపెట్టి చెప్పే ఈ పాపపరిహార పత్రికలు నిజంగానే గొప్పవేమో అనిపిస్తుంది. ఏందుకంటే ఇవి దందిగా లాభాలు తెచ్చిపెడుతున్నాయిగదా!
 68. అయితే దేవుని క్రుపపట్ల, సిలువపట్ల ఉన్న విశ్వాసాలతో పోలిస్తే నిజానికివి చాల చిన్నపాటి క్రుపలు.
 69. బిషప్పులు, చిన్న పాదుర్లు ఈ పాపపరిహార పత్రికల్ని సరఫరాచేసేవాళ్ళని గౌరవంగా తమదగ్గరకు చేర్చుకోవాల్సిందే!
 70. కానీ పోపు చెప్పమన్నదానికి బదులుగా తమస్వంత కల్పితాలు చెపుతున్నప్పుడు మాత్రం వాళ్ళమీద ఒకన్నేసి ఉంచాల్సిన బాధ్యత వాళ్ళమీదుంది.
 71. ఈ పాపపరిహార పత్రికలను గురిచిన వాస్తవాల్ని వ్యతిరేకించేవాడు దౌర్భాగ్యుడు, శాపగ్రస్తుడు.
 72. అలాగే ఈ పాపపరిహార పత్రికలమ్మే బోధకుల దురాశల్ని, విచ్చలవిడితనాన్ని ఖండించేవాడు ధన్యుడు.
 73. ఈ పాపపరిహార పత్రికల జోరును ఆపటానికి నేర్పుగా ఉపాయాలుపన్నే వాళ్ళమీద సహజంగా పోపు ఎంతమండి పడతాడో..
 74. అంతకంటే ఎక్కువగా పాపపరిహార పత్రికల్ని సాకుగా పెట్టి పరిశుద్ధప్రేమను, సత్యాన్ని అడ్డగించే వాళ్ళమీద పోపు మండిపడతాడు.
 75. దేవమాతను చెరపడంలాంటి అసాధ్యమైన పాపం చేసినవాడ్ని సైతం క్షమించేంత గొప్పవి ఈ పాపపరిహార పత్రికలు అని అనుకోటం వెర్రితనం.
 76. దానికి బదులుగా మెమేం చెపుతున్నామంటే – అపరాధానికి సంబంధించి క్షమించదగిన అతిచిన్న పాపాన్ని సైతం పాపపరిహార పత్రికలు తీసెయ్యలేవు.
 77. పరిశుద్ధుడైన పేతురు ఇప్పుడు పోపుగా ఉన్నాసరే ఇంతకుమించిన మహాక్రుపలేవీ ఇవ్వలేడని చెప్పటం పరిశుద్ధుడైన పేతురుకి, పోపుకు వ్యతిరేకంగా చేసే దైవనింద.
 78. దానికి బదులుగా మళ్ళీ మేమేం చెపుతున్నామంటే – ఇప్పుడున్న పోపు మాత్రమే కాకుండా ఇంకా ఏ పోపైనా సరే మొదటి కొరింథీ పత్రిక పన్నెదో అద్యాయంలో చెప్పబడ్డ సువార్త, ఆత్మశక్తులు, స్వస్తతా వరంలాంటివి కలిగుంటే పాపపరిహార పత్రికలిచ్చే వాటికంటే మరిన్ని క్రుపల్ని వాళ్ళివ్వ గలరు.
 79. పాపపరిహార పత్రికల్ని శ్రుంగారించటానికి వాటినమ్మే బోధకులు ఆపత్రికలమీద వేసిన పోపు ముద్రలోఉన్న శిలువగుర్తుకు, క్రీస్తు శిలువతో సమానమైన శక్తి ఉన్నదని చెప్పటం దేవుడ్ని నిందించటమే అవుతుంది.
 80. ఇలాంటి తప్పుడు బోధలు ప్రజల్లో వ్యాపిస్తుంటే చూస్తూ వూరుకొనే బిషప్పులు, చిన్న పాదుర్లు, వేదాంతులు దేవుడికి లెక్క అప్పచెప్పాల్సినవాళ్ళై ఉన్నారు.
 81. పాపపరిహార పత్రికల గురించి అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న ఈ ప్రచారంవల్ల తనమీదపడే అభాండాలకారణంగాను, సంఘస్తులు యుక్తిగావేసే ప్రశ్నల కారణంగాను పోపు పోగొట్టుకుంటున్న గౌరవాన్ని కాపాడటం జ్ఞానవంతులకు సైతం కష్టసాధ్యమైన పని.
 82. వరసగా చెప్పాలంటే:- గుడికట్టటానికి దిక్కుమాలిన డబ్బు సంపాదించటంకోసమని పర్గెటరీలొంచి ఆత్మల్ని విడిపించటానికి బదులుగా పరిశుద్ధమైన ప్రేమనుబట్టి, ఆత్మలకున్న అఘోరమైన అక్కరనుబట్టి పోపు ఎందుకు పర్గెటరీని ఖాళీ చెయ్యకూడదు? మొదటిదేమో తుచ్చమైంది, రెండోదేమో సమంజసమైంది.
 83. విడుదల పొందిన ఆత్మలకోసం ప్రార్థన చెయ్యటం తప్పుకదా, అలాంటప్పుడు చచ్చిపోయినవాళ్ళ కోసం సంస్మరణ ఆరాధనలు, సాంవత్సరిక ఆరాధనలు ఇంకా జరిగించటం ఎందుకు? వాళ్ళ పేరుతో దానధర్మాలు చెయ్యటానికి ఏర్పాటుచేసిన జ్ఞాపకార్ధ నిధుల్ని తిరిగి ఇచ్చెయ్యటంగాని, లేదా వాళ్ళ బంధువులు ఆడబ్బును వాపసు తీసుకోటానిగ్గాని ఎందుకు అనుమతించరు?
 84. ఇంకా:- దేవుడికిష్టమైన భక్తుడి ఆత్మని ఆ ఆత్మకున్న స్వంత అవసరాన్నిబట్టి, శుద్ధమైన ప్రేమతో విడిపించటానికి బదులుగా అవిశ్వాసి, విరోధి అయిన ఓ వ్యక్తి డబ్బిచ్చి ఆ ఆత్మను పర్గెటరీలోంచి విడిపించేందుకు అనుమతించటంలో దేవుడికి, పోపుకు ఉన్న ఈ సరికొత్త భక్తి సూత్రం ఏంటి?
 85. ఇంకా:- నిజానికి పశ్చ్చత్తాపానికి సంబంధించిన సంఘ శాసనాలు చాలాకాలంగా వాడుకలోలేనందున కొట్టివేయబడి మ్రుతమైన స్థితిలోఉన్నప్పుడు, అవింకా బ్రతికేఉన్నట్టు, వాటికింకా సత్తాఉన్నట్టు పాపపరిహార పత్రికలిచ్చి ఇప్పుడు తృప్తిపరచటమెందుకు?
 86. పేద విశ్వాసుల డబ్బుతోకాక ఒకప్పటి మహాధనవంతుల సంపదకు మించిన ఆస్తిపాస్తుల్ని కలిగున్న పోపు తన స్వంత డబ్బుతో పరిశుద్ధ పేతురు దేవాలయాన్ని ఎందుకు కట్టకూడదు?
 87. ఇంకా:- తమ పూర్ణ పశ్చ్చాత్తాపాన్నిబట్టి సర్వపాపక్షమాపణ పొందటానికి, పరలోకభాగ్యాన్ని అనుభవించటానికి అర్హతపొందిన వాళ్ళకి, మళ్ళీ పోపు అదనంగా కొట్టేసేది, అనుగ్రహించేది ఏముంటుంది?
 88. ఇప్పుడు రోజుకు ఒక్కసారిచేస్తున్న పోపు ఇకపై రోజుకు వందసార్లుచేసి ప్రతీ విశ్వాసికి పాపక్షమాపణ్ణి, పరలోకభాగ్యాన్ని దయచేయటానికంటే గొప్పదైన ఏ దీవెన సంఘానికొస్తుంది?
 89. తన పాపక్షమాపణ పత్రాలద్వారా డబ్బు సంపాదించాలనికాక ఆత్మల్ని రక్షించాలని పోపు అనుకుంటున్నప్పుడు వీటితో సమానమైన శక్తికలిగినవైన, తానిదివరలో మంజూరుచేసిన పాపక్షమాపణల్ని ఎందుకు రద్దుచెయ్యాలి?
 90. సంఘస్తులు లేవదీసిన ఈ వివాదాల్ని, సందేహాల్ని తగినకారణాలు చూపించితీర్చకుండా బలవంతంగా అణచివెయ్యాలనుకుంటే సంఘాన్ని పోపును వాళ్ళ శత్రువులు గేలిచేసేలా చేసి క్రైస్తవుల్ని దుఖపరిచినట్లవుతుంది.
 91. కాబట్టి పాపక్షమాపణ పత్రికలు పోపు అభిప్రాయాలకు అనుగుణంగా బోధించబడ్డప్పుడు ఈ అనుమానాలన్నీ వెంటనే తొలిగిపోతాయి, సమసిపోతాయి.
 92. కనుక శాంతిలేనప్పుడు శాంతి శాంతి అని చెప్పే ప్రవక్తలందరూ వెళ్ళిపోవాలి.
 93. సిలువ లేనప్పుడు క్రీస్తు ప్రజలకు సిలువ సిలువ అని చెప్పే ప్రవక్తలు ధన్యులు.
 94. శిక్షావిధుల ద్వారా, మరణం ద్వారా, నరకం ద్వారా తమ శిరస్సైన క్రీస్తును వెంబడించటంలో మెళకువకలిగి ఉండేలా క్రైస్తవులకు బోధించబడాలి.
 95. ఆ విధంగా శాంతి సమాధానం యొక్క అభయాన్నిబట్టికాక అనేక శ్రమలద్వారా పరలోకరాజ్యంలో ప్రవేశిస్తామన్న దృఢనిశ్చయాన్ని కలిగుండాలి.

బయటి లింకులు[మార్చు]