ముష్టి లక్ష్మీనారాయణ
ముష్టి లక్ష్మీనారాయణ | |
---|---|
జననం | 1891 |
ముష్టి లక్ష్మీనారాయణ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ న్యాయవాద వృత్తిని వదిలి స్వాతంత్య్రోద్యమంలోకి దిగారు. నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన వృత్తి వదలి స్వాతంత్ర్య సమరంలోకి వచ్చినప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా స్వాతంత్ర్య సమరం కొనసాగించారు. 1891 జూన్ 20న భీమవరంలో రామకృష్ణయ్య, విశాలాక్షి దంపతులకు పుట్టారు ఆయన. కాకినాడలో బి.ఎ చదివి, భీమవరంలో న్యాయవాదిగా పనిచేశారు లక్ష్మీనారాయణ.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]1891 జూన్ 20న భీమవరంలో పేద బ్రాహ్మణ కుటుంబంలో ముష్టి రామకృష్ణయ్య, విశాలాక్షి దంపతులకు జన్మించారు ఆయన. భీమవరంలో ప్రాథమిక విద్య అభ్యసించిన లక్ష్మీనారాయణ, ఉన్నత విద్య నరసాపురంలోని టేలర్స్ పాఠశాలలో చదివారు. కాకినాడలోని పి.ఆర్ కళాశాలలో బి.ఎ చదివి, ప్లీడరు పరీక్ష పాసయ్యారు ఆయన. ఆ తరువాత భీమవరంలో మొదటి గ్రేడు ప్లీడరుగా పేరు తెచ్చుకున్నారు లక్ష్మీనారాయణ. స్వాతంత్ర్య ఉద్యమం కోసం బాగా నడుస్తున్న ప్లీడరుగిరీ వదిలిపెట్టేసిన ఆయన ఎన్నో ఆర్థిక కష్టాలకు గురయ్యారు. ప్రభుత్వ పాఠశాలలకు వ్యతిరేకంగా ఊరూరా తిరిగి చందాలు పోగుచేసి, 1921 ఫిబ్రవరి 6న స్నేహితులతో కలసి భీమవరంలో జాతీయ పాఠశాలను స్థాపించారు లక్ష్మీనారాయణ. ఎందరో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి, ఈ పాఠశాలలో చేరారు.[1]
న్యాయవాద వృత్తి
[మార్చు]భీమవరంలో న్యాయవాద వృత్తిలో చేరిన నాటి నుంచీ మంచి ప్లీడరుగా పేరు సంపాదించుకున్నారు ఆయన. ఎన్నో కేసులను గెలిచి, ఫస్టు గ్రేడు ప్లీడరుగా కొనసాగారు. చిన్నప్పుడు ఎంతో పేదరికాన్ని అనుభవించిన ఆయన ఆ సమయంలోనే కొంత సుఖంగా ఉన్నారు. అయితే విద్యార్థి దశ నుంచే గాంధీ మార్గం పట్ల ఆకర్షితులైన ఆయన కొన్నాళ్ళకు మంచిగా నడుస్తున్న న్యాయవాది వృత్తిని వదిలి స్వాతంత్ర్యోద్యమంలోకి దిగారు. ఆ తరువాత నుంచి ఆదాయం లేక విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని కూడా, తిరిగి న్యాయవాది వృత్తి మాత్రం చేపట్టలేదు.[1]
జాతీయోద్యమం
[మార్చు]నరసాపురంలో ఉన్నత విద్యనభ్యసించే రోజుల నుంచే జాతీయోద్యమంపై ఆసక్తి పెంచుకున్న లక్ష్మీనారాయణ వందేమాతరం ఉద్యమం గురించి తెలుసుకునేవారు. జుగాంతర్ అనే జాతీయోద్యామానికి చెందిన రహస్య పత్రిక చదివి దేశంలోని పరిస్థితులను ఆకళింపు చేసుకునేవారు. గాంధీ ఇచ్చిన సహాయనిరాకరణ ఉద్యమం పిలుపుతో మంచిగా నడుస్తున్న ప్లీడరు వృత్తిని 1920 మే 10న వదిలిపెట్టి స్వాతంత్ర్యోద్యమంలోకి ప్రవేశించారు ఆయన.[1] తటవర్తి కృష్ణమూర్తి, ములుకుట్ల సుబ్బారాయుడు వంటి స్నేహితులతో కలసి 1920 మే 7న భీమవరం, చెరుకుమిల్లి, ఏలూరుపాడు ప్రాంతాల్లోనూ, 8న జువ్వలపాలెం, కాళ్ళకూరు గ్రామాల్లో సహాయనిరాకరణ ఉద్యమం గురించీ, గాంధీజీ సిద్ధాంతాల గురించీ విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం నడిపే శాసనసభ ఎన్నికలకూ, న్యాయస్థానాలు, విద్యాసంస్థలనూ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే పెదఅమిరం, గరగపర్రు, వీరవాసరం గ్రామాల్లో తటవర్తి, కృష్ణమూర్తి, ములుకుట్ల సుబ్బారాయుడు, అత్తోటి వీరరాఘవరావులతో కలసి చందాలు పోగు చేసి, 1921 ఫిబ్రవరి 6తేదీన జాతీయ పాఠశాల ప్రారంభించారు లక్ష్మీనారాయణ. 1929లో ఆయన హిందుస్థానీ సేవాదళ సంఘ సభ్యునిగా ఎన్నిక కాబడ్డారు.
రాజభక్తుల సభా భగ్నం
[మార్చు]సహాయనిరాకరణోద్యమ ప్రచారానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగుల చేత సభలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. భీమవరంలోని తాలూకా కార్యాలయ ఆవరణలో సభ జరుగుతుందని చాటింపు వేయించగా, సభ సాగే తీరును వీక్షించేందుకు దగ్గర పల్లెటూళ్ళ నుంచి దాదాపు 1500మంది ఉద్యమకారులు వచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న జాతీయవాదులను చూసి అధికారులు సభను కార్యాలయ వెనుకవైపుకు మార్చారు. ఈ సభలో తహశీల్దారు వంటి అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు గోడలు దూకి సభాస్థలికి చేరుకోవాలని ప్రయత్నించటంతో పోలీసు డెప్యూటీ సూపరింటెండెంట్ గోడ పొడువునా సాయుధులైన పోలీసులను కాపలా ఉంచి, కాల్పుల ఉత్తర్వులు ఇచ్చారు. అయినా తగ్గని ఉద్యమకారులు, రాళ్ళు, ఇటుకలు రువ్వి సభను భగ్నం చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల వల్లగానీ, ఉద్యమకారుల వల్లగానీ ప్రాణనష్టం జరుగుతుందని భయపడిన జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి లక్ష్మీనారాయణను సంప్రదించిమని పోలీసు వారికి సలహా ఇచ్చారు. పోలీసు వారి కోరిక మేరకు లక్ష్మీనారాయణ జాతీయవాదులను హింసాత్మక కార్యక్రమాలు మాని, ర్యాలీ తీద్దామంటూ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. దాంతో పరిస్థితి చేజారకముందే కార్యక్రమాన్ని ఆపి, భీమవరంలో పెద్ద ర్యాలీ తీశారు. సమయం మేరకు ఉద్యమంలో హెచ్చుతగ్గులు కూడా ఉండాలనేది లక్ష్మీనారాయణ చేసి చూపినట్టైందని సమకాలీకులు మెచ్చుకునేవారు.[1]
ఉప్పు సత్యాగ్రహం
[మార్చు]1930లో మొదలైన ఉప్పు సత్యాగ్రహానికి జిల్లాలో లక్ష్మీనారాయణ నిర్మాణాత్మక కృషి చేశారు. పశ్చిమగోదావరిజిల్లా సత్యాగ్రహ డిక్టేటరుగా నియమితులైన దండు నారాయణరాజు సారథ్యంలో జరిగిన సత్యాగ్రహంలో లక్ష్మీనారాయణ ముఖ్య పాత్ర పోషించారు. నారాయణరాజు, లక్ష్మీనారాయణ, ప్రకాశరాయుడు, 50మంది సత్యాగ్రహులతో కలసి భీమవరం దగ్గర్లోని నాగిడ్డిపాలెం వద్ద సహజంగా ఉప్పు ముద్దలు తయారు చేసి, భీమవరం కాంగ్రెస్ కార్యలయం అయిన కోపల్లె వారి సత్రానికి బస్తాల కొద్దీ తెచ్చారు. దాంతో 14తారీఖున పోలీసులు వీరిపై దారుణంగా లాఠీచార్జ్ చేశారు. అదీ లెక్కచేయని లక్ష్మీనారాయణ పోలీసు వారి దౌర్జన్యానికి వ్యతిరేకంగా సభ నిర్వహించారు. ఆ తరువాత గాంధీ, నెహ్రూల అరెస్టు నిరసిస్తూ భీమవరంలో హర్తాళ్ నిర్వహించిన ఆయన, ఏప్రిల్ 25తేదీన ములపర్రు, తూర్పుతాళ్ళు ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసి, ఉప్పు తయారు చేశారు ఆయన.
కాంగ్రెస్ కార్యవర్గ సభ్యునిగా
[మార్చు]జాతీయోద్యమంలో లక్ష్మీనారాయణ కృషి గుర్తించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆయనను మండల కాంగ్రెస్ కార్యవర్గ సభ్యునిగా నియమించింది. ఆ తరువాత ఏప్రిల్ 26న దండు నారాయణరాజు, ఆత్మకూరి గోవిందాచార్యుల అరెస్టులను నిరసిస్తూ ఆయన అధ్యక్షతన 10వేల మందితో బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో మద్యపాన నిషేధం, ఖద్దరు ప్రచారం వంటి వాటితో పాటు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. జూన్ 8న నల్లజర్లలో గెడా రఘునాయకులు వంటి సత్యాగ్రహుల అరెస్టుకు వ్యతిరేకంగా కూడా మరో సభను నిర్వహించారు. దేశద్రోహం, ప్రజలను రెచ్చగొట్టే ఉపన్యాసాలివ్వడం వంటి ఆరోపణలతో జూన్ 16న పోలీసులు లక్ష్మీనారాయణను అరెస్టు చేశారు. భీమవరం న్యాయస్థానంలో ఒక సంవత్సర కారాగార శిక్ష వేయగా, ఆయనను రాజమండ్రి, వేలూరు జైళ్ళకు తరలించారు. అదే సమయంలో గాంధీ ఇర్విన్ ఒప్పందం జరగడంతో శిక్షాకాలం పూర్తికాక మునుపే 1931 మార్చి 14న విడుదలయ్యారు.
శాసనోల్లంఘన ఉద్యమం
[మార్చు]1932న తిరిగి ప్రారంభమైన శాసనోల్లంఘన ఉద్యమానికి నాయకత్వం వహించారు లక్ష్మీనారాయణం. జనవరి 2 తేదీన లక్ష్మీనారాయణతో కలిపి మరో 14మంది నాయకులకు భీమవరం సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ అజంతుల్లా ఖాన్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ సంఘాలన్నిటినీ నిషేధించిందనీ, 2 నెలల వరకూ భీమవరం పంచాయితీ సరిహద్దులో 7 మైళ్ళ లోపు ఎటువంటి సభలు, సమావేశాలు, ఉత్సవాలు నిర్వహించరాదు. అలాగే ముందుగానే 144 సెక్షన్ అమలులో పెట్టారు ప్రభుత్వం. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుని హోదాలో లక్ష్మీనారాయణ భీమవరంలో హర్తాళ్ నిర్వహించారు. అదే రోజున పోలీసులు ఆయన ఇంటిలో సోదాలు జరిపి రికార్డులు, కరపత్రాలు స్వాధీనపరచుకున్నారు. జనవరి 9న ఆయన భీమవరం కాంగ్రెస్ కమిటీని సమావేశపరచి ప్రభుత్వానికి సహాయనిరాకరణ చేయాలని తీర్మానించారు.
144 సెక్షన్ ధిక్కరించి శాసనోల్లంఘన చేసిన ఆరోపణతో లక్ష్మీనారాయణకు జనవరి 14 నుండి సంవత్సరం పాటు కఠిన కారాగార శిక్ష విధించారు ప్రభుత్వం. జైలు శిక్ష వల్ల ఆయన ఆరోగ్యం చాలా పాడైంది. విడుదలైన తరువాత కూడా హరిజనోభ్యుదయ కార్యక్రమాల్లో పాల్గొనేవారు లక్ష్మీనారాయణ.
అడవి బాపిరాజుతో స్నేహం
[మార్చు]లక్ష్మీనారాయణ ప్రారంభించిన జాతీయ పాఠశాలలో అధ్యాపకునిగా పనిచేసిన అడవి బాపిరాజుకు, ఆయనకు మంచి స్నేహం ఉండేది.[1] ఉద్యమంలో కూడా వీరిద్దరూ కలసి తిరిగేవారు. లక్ష్మీనారాయణ నాయకత్వ లక్షణాలకు ఆకర్షితులైన బాపిరాజు ఆయనను బాగా అభిమానించేవారు. దేశ స్వాతంత్ర్యోద్యమం కోసం అవిరళ కృషి చేసిన లక్ష్మీనారాయణ వ్యక్తిత్వం, దీక్ష, పట్టుదలలు ఆయనను బాగా ఆకర్షించాయి. బాపిరాజు రాసిన ప్రసిద్ధ నవల నారాయణరావులో నారాయణరావు పాత్ర లక్ష్మీనారాయణదేనని సమకాలీకులు భావించేవారు. ఆ పాత్ర లక్ష్మీనారాయణను అంతగా ప్రతిబింబిస్తుందిట.[1]