మెటె ఫ్రెడెరిక్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెటె ఫ్రెడెరిక్సన్
2022లో మెటె ఫ్రెడెరిక్సన్
డెన్మార్క్ ప్రధానమంత్రి
Assumed office
2019 జూన్ 27
చక్రవర్తిడెన్మార్క్‌కు చెందిన రెండవ మార్గ్రేత్ (2019-2024)
పదవ ఫ్రెడరిక్ (2024-)
Deputyజాకబ్ ఎలెమన్ జెన్సెన్ (2022–2023)
ట్రోల్స్ లుండ్ పౌల్సెన్ (2023–)
అంతకు ముందు వారులార్స్ లోకె రస్ముసెన్
సోషల్ డెమోక్రాట్స్ నాయకురాలు
Assumed office
2015 జూన్ 28
Deputyఫ్రాంక్ జెన్సన్
మోగెన్స్ జెన్సన్
అంతకు ముందు వారుహెల్లే థార్నింగ్ ష్మిట్
వ్యక్తిగత వివరాలు
జననం (1977-11-19) 1977 నవంబరు 19 (వయసు 46)
ఆల్బర్గ్, డెన్మార్క్
రాజకీయ పార్టీసోషల్ డెమోక్రాట్స్ (డెన్మార్క్)
జీవిత భాగస్వామి
ఎరిక్ హార్
(m. 2003; div. 2014)
బో టెంగ్‌బర్గ్
(m. 2020)
సంతానం2
కళాశాలఆల్బొర్గ్ యూనివర్శిటీ (బి.ఎ.)
యూనివర్శిటీ ఆఫ్ కోపెన్‌హాగెన్ (ఎం.ఎ.)

మెటె ఫ్రెడెరిక్సన్ (జననం 1977 నవంబరు 19) డానిష్ రాజకీయ నాయకురాలు; ఈమె 2019 జూన్ నుంచి డెన్మార్క్ ప్రధాన మంత్రిగానూ, 2015 జూన్ నుంచి సోషల్ డెమోక్రాట్ పార్టీ నాయకురాలిగానూ పనిచేస్తున్నది. ఈమె డానిష్ చరిత్రలో ప్రధాని పదవి చేపట్టిన రెండవ మహిళ, అతి పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రి.[1]

1977 నవంబరు 19న ఉత్తర డెన్మార్క్‌లోని ఆల్బొర్గ్ నగరంలో జన్మించిన ఆమె తండ్రి టైపోగ్రాఫర్, తల్లి టీచర్.  మెటె ఫ్రెడెరిక్సన్ టీనేజి వయసులో ఉన్నప్పటి నుంచే పలు సామాజిక అంశాలకు సంబంధించి స్పందించేది. ఆ అంశాల్లో వర్షారణ్యాలను పరిరక్షించడం, తిమింగలాలు అంతరించిపోకుండా కాపాడడం, వర్ణవివక్షను అంతం చేయడం వంటివి ఉండేవి.[2] ఆల్బొర్గ్ నగరంలోని ఆల్బొర్గస్ జిన్మాజియం అన్న పాఠశాలలో ఆమె చదువుకుంది. ఆల్బొర్గ్ విశ్వవిద్యాలయం నుంచి పరిపాలన, సామాజిక శాస్త్రాలు అంశంతో బ్యాచిలర్ డిగ్రీ సంపాదించింది. కోపెన్‌హాగెన్ విశ్వవిద్యాలయంలో ఆఫ్రికన్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసింది.[3]

ట్రేడ్ యూనియనిస్టుగా (2001–2001) కొద్దికాలం పనిచేయడం మినహాయిస్తే ఫ్రెడెరిక్‌సెన్‌కు రాజకీయాల బయట వేరే కెరీర్ ఏమీ లేదు. ఆమె 2001 సాధారణ ఎన్నికలలో మొదటిసారిగా డానిష్ పార్లమెంట్ అయిన ఫోల్కెటింగ్‌కు కోపెన్‌హేగెన్ కౌంటీకి ప్రతినిధిగా ఎన్నికైంది. 2011 సార్వత్రిక ఎన్నికలలో సోషల్ డెమోక్రాట్లు గెలిచాకా ప్రధానమంత్రి హెల్లే థోర్నింగ్-ష్మిత్ ఆమెను ఉపాధి మంత్రిగా (మినిస్టర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్) నియమించాడు. 2014లో న్యాయశాఖ మంత్రిగా పదోన్నతి పొందింది.[4] 2015 సార్వత్రిక ఎన్నికలలో సోషల్ డెమోక్రాట్‌లు స్వల్ప తేడాతో ఓటమి పొందాకా, థోర్నింగ్-ష్మిత్ పార్టీ నాయకత్వం నుంచి తప్పుకున్నాడు. ఈ పరిణామంతో వచ్చిన సోషల్ డెమోక్రాటిక్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో గెలిచి ఫ్రెడ్రిక్సన్ ప్రతిపక్ష నాయకురాలు అయింది. [4][5] 2019 సార్వత్రిక ఎన్నికల్లో సోషల్ డెమోక్రాటిక్ పార్టీకి ఫ్రెడెరిక్సన్ నేతృత్వం వహించింది. ఈ ఎన్నికల్లో వామపక్ష, సెంటర్-లెఫ్ట్ పార్టీల బ్లాక్ మెజారిటీ సాధించింది. రాణి రెండవ మార్గ్రెతె కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన చర్చలు సాగించమని ఫ్రెడెరిక్సన్‌ని ఆహ్వానించింది. ఫలితంగా 2019 జూన్ 27న ఫ్రెడెరిక్సన్ డేనిష్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.[6] 2021 డిసెంబరులో యూరోపియన్ యూనియన్లో అధికారంలో ఉన్నవారిలో అత్యధిక కాలం పదవీలో ఉన్న మహిళా దేశాధినేతగా రికార్డుకెక్కింది.

2021 నవంబరులో నార్డిక్ కౌన్సిల్ విలేకరుల సమావేశంలో మెటె ఫ్రెడెరిక్సన్

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిచెందుతున్నప్పుడు డెన్మార్క్‌లో పెరిగే మింక్ అనే క్షీరదం వల్ల కొత్త వేరియంట్ రూపొందుతూ, వ్యాప్తి చెందుతూ ఉన్నాయన్న నివేదికల ఆధారంగా దేశం మొత్తం మీద ప్రతీ మింక్‌నీ చంపెయ్యాలంటూ నవంబరు 2020లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారితీసింది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన మింక్‌లను కూడా చంపాలన్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమనీ, అలాంటి ఉత్తర్వులు జారీచేయడం న్యాయసమ్మతం కాదనీ న్యాయవేత్తలు, రాజకీయ నాయకులు, ఇతరులు విమర్శించారు. ప్రారంభించిన రెండురోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలుపుదల చేసింది. దీనిపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన మింక్ కమిషన్ జులై 2022లో విడుదల చేసిన నివేదికలో ప్రభుత్వ వ్యవహారశైలిని తప్పుపట్టింది. కాకపోతే, జరిగింది పొరబాటే అయినా ఉద్దేశపూర్వంగా ఫ్రెడెరిక్సన్ ప్రజలను తప్పుదారి పట్టించలేదని మాత్రం తేల్చింది.[7]

2022 డిసెంబరు 15న రెండవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సందర్భంలో ఫ్రెడరిక్సన్, ఆమె మంత్రివర్గం

దీని తర్వాత భాగస్వామ్య పార్టీ అయిన డెన్మార్క్ సోషల్ లిబరల్ పార్టీ ఫ్రెడరిక్‌సెన్‌కు వ్యతిరేకంగా అల్టిమేటం జారీచేసింది. ఆమె ముందస్తు ఎన్నికలకు పిలుపునివ్వకపోతే ఆమె ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకువస్తామని బెదిరించింది.[8] దీనితో 2022 నవంబర్ 1న ఎన్నికలు నిర్వహించనున్నట్టు అక్టోబరు 5న ఫ్రెడరిక్‌సెన్ ప్రకటించింది.[9] 20 ఏళ్ళలో ఎన్నడూ లేనంత మంచి ఫలితాలు ఈ ఎన్నికల్లో సోషల్ డెమోక్రాట్ పార్టీ చవిచూసింది. ఆ పార్టీ ముందుకన్నా మరో రెండు సీట్లు ఎక్కువగా గెలుచుకుని మొత్తం 50 స్థానాలకు చేరుకుంది.[10] ఆ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఫ్రెడెరిక్‌సన్ 60,837 ఓట్లను పొందింది.[11] 2022 డిసెంబరు 13న సోషల్ డెమోక్రాట్‌లు, వెన్‌స్ట్రే (డెన్మార్క్ లిబరల్ పార్టీ), మోడరేట్‌లతో సంకీర్ణ ప్రభుత్వంపై ఒప్పందం కుదిరిందనీ, తాను ప్రధానమంత్రిగా కొనసాగుతున్నానని ఫ్రెడెరిక్సన్ ప్రకటించింది.[12]

మూలాలు[మార్చు]

  1. "Denmark's youngest prime minister to lead new government". Deutsche Welle. 25 June 2019. Retrieved 27 June 2019.
  2. Sorensen, Martin Selsoe; Pérez-Peña, Richard (22 August 2019). "Denmark's Leader Didn't Want a Fight With Trump. She Got One Anyway". New York Times..
  3. "List of Danish Prime Ministers Since 1848" (in డానిష్). Ministry of the State of Denmark. Retrieved 31 August 2020.
  4. 4.0 4.1 "డేనిష్ పార్లమెంట్ వెబ్సైట్లో బయోగ్రఫీ". The Danish Parliament (in ఇంగ్లీష్). Retrieved 2024-02-06.
  5. "Portræt: Mette Frederiksen skal finde sin egen vej" [Portrait: Mette Frederiksen has to find her own way]. Politiken (in డానిష్). 20 June 2015. Retrieved 22 June 2015.
  6. "Denmark gets new left-wing government with plans to increase welfare spending and scrap anti-immigration measures". The Independent. 26 June 2019. Archived from the original on 12 May 2022. Retrieved 31 July 2019.
  7. "Minkkommissionen: Grov vildledning af Mette Frederiksen på pressemøde om minkaflivning". DR (in డానిష్). 2022-06-30. Retrieved 2022-10-05.
  8. "Sofie Carsten Nielsen: Vil vælte Mette Frederiksen hvis ikke hun udskriver valg inden 4. oktober". DR (in డానిష్). 2022-07-02. Retrieved 2022-10-05.
  9. "Mette Frederiksen udskriver folketingsvalg: Afholdes 1. november". DR (in డానిష్). 2022-10-05. Retrieved 2022-10-05.
  10. "Mette Frederiksen takker for stemmerne | Nyheder". DR (in డానిష్). 2 November 2022. Retrieved 2022-11-02.
  11. "Hvem er valgt? Se valgte kandidater og personlige stemmer | DR". www.dr.dk (in డానిష్). Retrieved 2022-11-02.
  12. "Denmark has a new government after parties agree on coalition". The Local Denmark (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-12-13. Retrieved 2022-12-15.