మేంగోస్టీన్
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
వంగ మామిడి (మేంగోస్టీన్) చెట్లు ఆగ్నేయ ఆసియా ఖండంలోను, కొలంబియా దేశాల్లోను కనిపిస్తాయి. వీటి శాస్త్రీయ నామం గార్సీనియా మాంగోస్టానా (Garcinia Mangostana).
వివరణ
[మార్చు]రుచిలో మేంగోస్టీన్ ను పండ్లకు రాణిగా పేర్కొనవచ్చు. టెన్నీసు బంతి కంటే కొద్దిగా చిన్నగా ఉండే మేంగోస్టీన్ కాయలు తినడానికి చాలా తీపిగా ఉంటాయి. కాయ పై తోలు ముదిరిన తాటి కాయ వలే నలుపు-ఎరుపు రంగుల సమ్మేళంతో ఉంటుంది. మందంగా ఉండే తోలు లోపల భాగం ఎరుపు రంగులో ఉంటుంది. తినగలిగే భాగం తొనల రూపంలో తెల్లగా ఉంటుంది. సుమారు 2 - 4 విత్తనాలు ఉంటాయి.
సాగు
[మార్చు]పుష్కలంగా నీటి సదుపాయంతో పాటూ తేమ అధికంగా ఉండే ప్రాంతాల్లో పెరిగే ఈ వృక్షాలు 6 నుండి 25 మీటర్ల ఎత్తు ఎదుగుతాయి. నేడు మేంగోస్టీన్ చెట్ల సాగు దక్షిణ భారతదేశంలో ఉన్న తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో జరుగుచున్నది. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న కోస్తా ప్రాంతాల్లో కూడా మేంగోస్టీన్ సాగు చేపట్టవచ్చును.[1]. నర్సరీలలో మేంగోస్టీన్ మొక్కలను సాధారణంగా విత్తనంనుండి అభివృద్ధి చేస్తారు. మాంగోస్టీన్ పండు నుండి తీసిన విత్తనాలు బయట వాతావరణంలో 5 రోజులకంటే ఎక్కువ కాలం జీవించవు. కనుక విత్తనాలు తీసిన తరువాత నీడలో శుభ్రంగా ఆరబెట్టి సారవంతమైన మట్టి ఉన్న నర్సరీ ప్యాకెట్లలో 1 సెంటీ మీటరు లోతులో నాటి నీడన పెట్టాలి. విత్తనాలు నాటిన 30 నుండి 40 రోజుల్లో మొలకెత్తుతాయి. 60 రోజుల తర్వాత మొక్కలను పెద్ద ప్యాకెట్లలోకి మార్చాలి. 24 నుండి 36 నెలల తర్వాత మొక్కలను బాగా దున్నిన పొలంలో మొక్కకు మొక్కకు 7x7 లేక 8x8 మీటర్ల దూరం ఉండేటట్లు మొక్కలను నాటుకోవాలి. విత్తనం నాటిన తర్వాత 5 నుండి 6 సంవత్సరాల వయసునుండి కాయలు ఫలిస్తాయి. కర్నాటకలో ఉన్న నీలిగిరి కొండ ప్రాంతంలో మేంగోస్టీన్ చెట్లు రెండు సార్లు పంట పండుతాయి. ఆగస్టు-అక్టోబరు నెలల్లోను ఒక సారి, ఏప్రిల్-జూన్ నెలల్లోను మరో సారి కొత కోస్తారు. ఒక ఎకరంలో 100 చెట్లు పడతాయి. 10 సంవత్సరాల వయసుగల మేంగోస్టీన్ చెట్టు సుమారు 100 కేజీల కాయలను ఇస్తుంది. మేంగోస్టీన్ చెట్ల ఎదుగుదల మొదటి 4 లేక 5 సంవత్సరాలు చాలా మెల్లగా ఉంటుంది. అందువలన రైతులు సాధారణంగా ఐదు అంతకంటే ఎక్కువ వయసుగల మొక్కలను నేరుగా నర్సరీలనుండి ఒక్కొక్కటీ 200 రూపాయలకు చొప్పున కొనుగోలు చేసి భూమిలో నాటుకుంటారు. మేంగోస్టీన్ సాగు సాధారణంగా కోకొవా సాగువలె కొబ్బరిచెట్ల నీడలో జరుగుతుంది. కేరళ రాష్ట్రంలో మేంగోస్టీన్ కు అనుబంధ పంటగా రేంబుటాన్ (Rambutan) పండిస్తారు.
పోషక విలువలు, ఉపయోగాలు
[మార్చు]మేంగోస్టిన్ కాయల్లో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, అస్కార్బిక్ ఆసిడ్ వంటివి ఉంటాయి. మేంగోస్టీన్ గుజ్జును నేరుగా తినడమే కాకుండా ఐస్ క్రీముల్లోను, షరబత్తుల్లోను వాడుకోవచ్చును. ఆకులు, చెట్టు బెరడు, పండు తొక్క వంటివి విరేచనాలు, ప్రేగుల సమస్యలు, డయేరియా, గనేరియా, ఎగ్జిమా, వరిబీజము వంటి సమస్యలకు ఉపయోగపడతాయి. చెట్టు కాండంతో కలపకు ఉపయోగపడుతుంది.
మార్కెట్ అవకాశాలు
[మార్చు]హోల్ సేల్ మార్కెట్లో కేజీ మేంగోస్టీన్ కాయలు 200 రూపాయల ధర పలుకుతున్నది. ఒక్కొక్క చెట్టు సుమారు 20 వేల రూపాయల అదాయం ఇస్తుంది. ఎకరానికి సుమారు 2 లక్షల రూపాయల నికర లాభం వస్తుంది. గ్రామాల్లో నివసించే ప్రజలకు మేంగోస్టీన్ కాయలు గురించి అవగాహన లేకపోయినా ముంబైయి, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా వంటి మెట్రో నగరాల్లో కిలో కాయల ధర సుమారు 650 రూపాయలు పలుకుతున్నది.
మూలాలు
[మార్చు]- ↑ Mangosteen Booklet No.121, Fruit Production: FPS - 23
లంకెలు
[మార్చు]- http://en.wikipedia.org/wiki/Purple_mangosteen
- http://www.cropsforthefuture.org/publication/Manuals/Mangosteen%20extension%20manual.pdf[permanent dead link]
- https://web.archive.org/web/20100415125536/http://www.acfs.go.th/standard/download/eng/mangosteen.pdf
- https://web.archive.org/web/20121005105922/http://www.cropsforthefuture.org/publication/Factsheets/Factsheet-Garcinia-Mangosteen.pdf
- https://web.archive.org/web/20120227101550/http://www.zoranvolleyart.si/images/Mango/01.pdf
- https://web.archive.org/web/20130911140759/http://theindianvegan.blogspot.in/2012/11/all-about-mangosteen.html
- https://web.archive.org/web/20130327013053/http://www.fruitipedia.com/Mangosteen.htm
- http://www.inseda.org/Additional%20material/CD%20-%20Agriculture%20and%20Environment%20Education/47-Fruit%20Production%20(FPS)/Mangosteen-121.doc[permanent dead link]