Jump to content

మేకా నరసింహ అప్పారావు

వికీపీడియా నుండి

మేకా నరసింహ అప్పారావు, 18వ శతాబ్దానికి చెందిన నూజివీడు జమీందారు. ఇతను (1789) బ్రిటీష్ వారి ఈస్టిండియా కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వ్యక్తి.[1] ఒక బాకీ విషయమై అతనికి జరిగిన అన్యాయాన్ని సహించలేక పలుమార్లు తిరుగుబాటు చేశాడు.

జమీందారీ తొలినాళ్ళు

[మార్చు]

1771లో నూజివీటి జమీందారైన నరసింహ అప్పారావు చాలా ఖర్చుమనిషిగా పేరొందాడు. ఆ కారణంగా చెన్నపట్నంలోని ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పేష్కసు (కప్పం) కూడా సరిగ్గా చెల్లించలేక ఇబ్బందుల్లో పడ్డారు.1773లో జమీందారీని వశపరుచుకోవడానికి ఒక సైనిక దళాన్ని పంపాడు. అప్పుడు ఇతను అధిక వడ్డీ రేట్లకు బందరులోని కొందరు కంపెనీ దొరల వద్దనే కొంతసొమ్ము బదులు తీసుకుని బకాయి చెల్లించాడు. 1775లో బందరులో కంపెనీవారి పరిపాలనాసంఘాధ్యక్షునిగా ఉన్న వైట్‌హిల్‌కు, హాడ్జెస్ కీ, మరికొందరు కంపెనీ ఉద్యోగస్తులకు నరసింహ అప్పారావు బాకీ ఉన్నారని తగాదా పెరిగి మూడు సంవత్సరాలు గడిచినా వ్యవహారం ముందుకుసాగలేదు. నరసింహ అప్పారావు వారికి పడ్డబాకీని కొంత చెల్లించాననీ, అసలు తీసుకున్న బాకీ కన్న వారు చెప్తున్నది చాలా ఎక్కువగా ఉందని ఆగ్రహం చెందారు. నరసింహ అప్పారావు ఈ వ్యవహారం తేల్చుకునేందుకు మద్రాసు వెళ్ళినా అక్కడ వైట్ హిల్ కి ఉన్న పలుకుబడి వల్ల అతని మాట ఎవరూ వినిపించుకోలేదు.[2]

తిరుగుబాటు ప్రయత్నం

[మార్చు]

కంపెనీ పరిపాలన, న్యాయం వంటివాటిపై పూర్తగా విశ్వాసం కోల్పోయిన అప్పారావు తిరుగుబాటు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దాంతో కంపెనీ వారు మేజర్ కాసాను నూజివీడు పంపి జమీందారును బందరు తీసుకువచ్చి అరెస్టు చేశాడు. అతనిని నిర్బంధించిన కారాగారాధికారి హాడ్జెసే కావడంతో ముందుగా ప్రస్తావించుకున్న దొరలందరికీ అప్పారావు, వారు చెప్పేంత ధనం ఇవ్వాల్సిందిగా బాకీ పత్రం నరసింహ అప్పారావుతో వ్రాయించుకున్నాడు. అప్పటికే వైట్ హిల్ చేసిన అక్రమాలపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో 1781లో ఆయనను సస్పెండ్ చేశాడు. ఈ అవకాశం తీసుకుని అప్పారావు తనకు జరిగిన అన్యాయాన్ని మద్రాసు పరిపాలక సంఘ తాత్కాలిక ముఖ్యాధికారి శాడ్లియర్‌కు అర్జీ పెట్టుకొనగా, దానిని కంపినీ డైరెక్టర్ల కోర్టుకు పంపాడు. ఆపైన గవర్నరైన మెకార్‌ట్నీ న్యాయబుద్ధితో నూజివీడు సంస్థాన విషయాన్ని పరిశీలించి కచ్చితంగా వైట్ హిల్ చేసిన అక్రమాల్లో ఇది ఒకటి కావచ్చునని భావించాడు. కానీ ఈలోగా కంపెనీ వారు అర్జీపై న్యాయం చేస్తారన్న నమ్మకం కోల్పోయిన నరసింహ అప్పారావు 1783లో కొంత సైన్యాన్ని సమకూర్చుకుని కోటలో ఉండి తిరుగుబాటు చేశాడు.[2]

తిరుగుబాటు

[మార్చు]

అతని సంస్థానంపై కంపెనీ సైన్యాన్ని పంపగా నిజాం రాజ్య సరిహద్దు దాటి వెళ్ళిపోయి నూజివీడుపై తనకున్న సైన్యంతో దండయాత్రలు చేస్తూపోయాడు.అతనిని పట్టుకునేందుకు నిజాం ప్రభుత్వంతో కంపెనీ ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూండగా తిరుగుబాటును క్షమిస్తే బాకీ చెల్లించేట్టు ఒప్పందం చేసుకుని జమీందారీ తిరిగిపొందాడు. మొదటి కిస్తీ కట్టి రెండవది కట్టలేక మళ్ళీ మారువేషంతో పారిపోయాడు. కంపినీ వారు నరసింహ అప్పారావుకు జమీందారీ తీసివేశామని కుమారుడు వెంకట నరసింహ అప్పారావును జమీందారును చేశామని 1784లో ప్రకటించారు. నరసింహ అప్పారావు భద్రాచలం అడవుల్లో అనుచరులను చేర్చుకుని ఉంటూ సైన్యంతో వచ్చి గ్రామాలు కొల్లగొడుతూ, గృహదహనాలూ, ఖజానా లూటీలు చేస్తూండడంతో చివరకు కంపెనీవారు ఈ పోరు పడలేక నరసింహ అప్పారావు కొడుకుతో నూజివీటిలో ఉండేందుకు అంగీకరించారు.[2]

లొంగుబాటు, తుది దశ

[మార్చు]

కుమారుని అసమర్థత వల్ల తండ్రి పరోక్షంగా రాజ్యంలో అధికారం నిలుపుకొని, పలుకుబడి నెరపుతూండడంతో నరసింహ అప్పారావును బందరు రప్పించి అక్కడ ఖైదు చేశారు. అతనితోపాటుగా వచ్చిన పరివారం కొత్త జమీందారుకు లొంగకు చిన్న రాణీ కుమారుణ్ణి రాజ్యానికి తీసుకురావాలని అల్లర్లు, దౌర్జన్యాలు చేశారు. ఒక ప్రభుత్వాధికారి లంచం వ్యవహారంలో జరుగుతున్న కేసులో సాక్ష్యమిచ్చేందుకు మద్రాసు తీసుకురాగా వృద్ధులైన నరసింహ అప్పారావు అక్కడే కొద్ది రోజుల్లో మరణించారు.[2]

మరణానంతరం

[మార్చు]

నరసింహ అప్పారావు కాలంలోనే తన ఇద్దరు భార్యల కుమారుల్లో అధికారం విషయమై తలయెత్తిన వివాదం చివరకు బ్రిటీష్ పరిపాలకు తీర్చారు. కంపెనీ వారు భూస్వామ్యపు హక్కులను నిర్ణయించి పర్మినెంట్ సెటిల్మెంట్ చేయతలపెట్టినప్పుడు నూజివీడు జమీందారీలో పెద్ద భార్య కుమారునికీ, చిన్న భార్య కుమారులకు నడుమనున్న తగాదాలు పరిష్కరించారు. దానిలో భాగంగా వెంకట నరసింహారావుకు నిడదవోలు పరగణాలు, రామచంద్ర అప్పారావుకు వుయ్యూరు పరగణాలు ఇచ్చారు. తమకు జమీందారీ నుంచి రావలసిన పేష్కషు బకాయిని వదులుకొన్నారు. జమీందారీని ఆ పరిష్కారంపై 1803లో వారికి వశపరిచారు. అప్పటికి మూడుసార్లు తలయెత్తి న్యాయాధికారులు, పరిపాలనాధికారులు తన అధీనంలోని బందీతో హడ్జెస్ బాకీ పత్రం రాయించుకోవడం సరికాదని తేల్చిన బాకీ వ్యవహారం ఈ సెటిల్మెంటు సమయంలో ప్రస్తావనకే రాలేదు. నూజివీడు జమీందారులకు కొత్త పట్టా యిచ్చిన 30 సంవత్సరాల తర్వాత బాకీ వ్యవహారం మరోమారు తలెత్తింది. ఇంగ్లాండులో పలుకుబడి ఉన్న కొందరు దొరలు ఈ బాకీ రాబట్టుకుని అక్రమంగా తమలో తాము పంచుకుని లాభిద్దామని ఈ ప్రయత్నం ప్రారంభించారు. బాకీ వ్యవహారం అన్ని విధంగానూ అబద్ధమని కంపెనీ వారు వాదించినా ప్రతికక్షులు బలవంతులు కావడంతో ఇంగ్లాండు పార్లమెంటులోని ప్రభువుల సభలో చర్చకు వచ్చింది. వారికీ ఈ బాకీ అక్రమమని తెలుస్తూ ఉన్నా పలుకుబడి, బలం కలిగిన తెల్లదొరలతో మొహమాటంవల్ల ఈ బాకీ తీర్చాల్సిందేనని 1832లో నూజివీటి జమీందార్లకు తేల్చిచెప్పారు.చివరకు వారు ఈ అక్రమ రుణశేషం నుంచి తప్పించుకోలేకపోయారు.[2]

మూలాలు

[మార్చు]
  1. థార్న్‌టన్, ఎడ్వర్డ్ (1842). హిస్టరీ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ ఇన్ ఇండియా (మాన్యువల్ ఆఫ్ ద క్రిష్ణా డిస్ట్రిక్ట్) వాల్యూం II. pp. 243–246.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలూ-గాథలూ (మొదటి సంపుటం).

ఇవి కూడా చూడండి

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]