మేరా నామ్ జోకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మేరా నామ్ జోకర్ అనే పేరు గల హిందీ చలనచిత్రం 1970లో రాజ్ కపూర్ దర్శకత్వంలో రూపొందించబడింది. ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. రిషి కపూర్‌కి నటుడిగా ఇదే తొలి చిత్రం. ఎన్ని దు:ఖాలు ఎదురైనా, ఆఖరికి తన ప్రేక్షకులను నవ్వించడమే జీవిత పరమావధి అనే భావించే ఒక సర్కస్ క్లౌన్ కథ ఇది. భారతీయ సినిమా చిత్రంలోనే ఎక్కువ నిడివి ఉన్న చిత్రంగా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి దాదాపుగా ఆరు సంవత్సరాలు పట్టింది. రాజ్ కపూర్ తన నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించానని చెబుతుంటారు. అయితే నిర్మాతకు ఈ చిత్రం ఎలాంటి లాభాలు ఆర్జించి పెట్టలేదు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే చిత్రం భారతీయ సినిమాలో ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఈ చిత్రం నిడివి తగ్గించి మళ్లీ 1980లో రిలీజ్ చేస్తే, రికార్డు స్థాయి కలెక్షన్లతో సినిమా విజయవంతమవడం విశేషం.

కథా పరిచయం

[మార్చు]

మేరా నామ్ జోకర్ అనే చిత్రం రాజు అనే ఒక కుర్రాడికి సంబంధించింది. రాజు తండ్రి ఒక సర్కస్ క్లౌన్. ఒక రోజు ప్రదర్శన ఇస్తూనే, అతను చనిపోవడంతో రాజు తల్లికి సర్కస్ అంటేనే ఒక విధమైన భయం, కోపం కలుగుతాయి. కానీ రాజు కోరిక ఎప్పటికైనా తన తండ్రిలాగే ఒక మంచి జోకర్‌గా పేరుతెచ్చుకోవాలని. అదే ధ్యేయంతో ఇంటి నుండి వెళ్లిపోయిన రాజు ఎలా సర్కస్ క్లౌన్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించి, ముగించాడన్నది చిత్రకథ. ఈ కథ తొలి అధ్యాయంలో రాజు చిన్నతనంలో తనకు చదువు చెప్పే టీచర్ మేరీ (సిమీ అగర్వాల్) ను ప్రేమిస్తాడు. తన కంటే వయసులో పెద్దదైనా, ఆమె ద్వారానే ప్రేమకు సిసలైన నిర్వచనాన్ని గ్రహిస్తాడు. ప్రేమకు, ఆకర్షణకు మధ్యనున్న తేడాను గమనిస్తాడు. అయితే ఆమె పెళ్ళి చేసుకొని వెళ్లిపోవడంతో భగ్నప్రేమికుడిగా మారిన రాజు జెమిని సర్కస్‌లో ఉద్యోగం కోసం వెళ్తాడు. రాజు టాలెంట్‌ని గ్రహించిన సర్కస్ మేనేజర్ మహేంద్ర సింగ్ (ధర్మేంద్ర) అతనికి అవకాశం అందిస్తాడు. సర్కస్‌లో అనతికాలంలోనే మంచి జోకర్‌గా పేరు తెచ్చుకున్న రాజు, అదే సర్కస్‌లో పనిచేసే రష్యన్ అమ్మాయి మెరీనాతో ప్రేమలో పడతాడు. అయితే ఆ ప్రేమ కూడా విఫలమవుతుంది. ఇదే అధ్యాయంలో రాజు ప్రదర్శనను తన కళ్లారా సర్కస్‌లో చూసిన అతని తల్లి మరణిస్తుంది. ఆఖరి అధ్యాయంలో రాజు సర్కస్ వదిలేసి, గమ్యం లేని బాటసారిలా తిరుగుతూ ఓ ఊరికి చేరుకుంటాడు. అక్కడ తనకు మీనూ (పద్మనీ) అనే ఒక అమ్మాయి పరిచయవుతుంది. ఆమె ఒక అనాథ. ఆమెతో కలిసి ఒక చిన్న నాటక సంస్థను ప్రారంభిస్తాడు రాజు. వారిద్దరూ కలిసి దానిని విజయవంతంగా నడుపుతారు. అయితే సినిమాలో కథానాయికగా అవకాశం రావడంతో మీనూ కూడా రాజును వదిలేసి వెళ్లిపోతుంది. రాజు ఎప్పుడు ఎక్కడకి వెళ్లినా, తన తండ్రి తనకు అందించిన జోకర్ బొమ్మను తన వెంట తీసుకెళ్తూ ఉంటాడు. తను ప్రేమించిన వారికి ఆ బొమ్మను కానుకగా ఇస్తుంటాడు. కానీ, విచిత్రమేంటంటే ఆ బొమ్మ మళ్లీ మళ్లీ తిరిగొచ్చి, ఎప్పటికీ తన దగ్గర ఉండిపోతుంది. చివరి అధ్యాయంలో రాజు మళ్లీ జెమిని సర్కస్‌లో క్లౌన్‌గా ప్రదర్శన ఇస్తాడు. తను జీవితంలో ప్రేమించిన ముగ్గురు మగువలను ఆ ప్రదర్శనకు ఆహ్వానిస్తాడు. ప్రేక్షకుల నవ్వుల మధ్య రాజు జోకర్‌గానే స్థిరపడతాడు.

పాత్రలు

[మార్చు]

రాజ్ కపూర్ – రణ్‌బీర్ రాజ్/రాజు

సిమీ అగర్వాల్ – మేరీ

రిషి కపూర్ – రాజు (చిన్నప్పటి పాత్ర)

ధర్మేంద్ర – మహేంద్ర సింగ్

పద్మిని – మీనూ

అచలా సచ్‌దేవ్ – రాజు తల్లి

పురస్కారాలు

[మార్చు]

ఉత్తమ సంగీత దర్శకుడు (ఫిల్మ్‌ఫేర్) – శంకర్ జైకిషన్

ఉత్తమ ఛాయాగ్రహకుడు (ఫిల్మ్‌ఫేర్) – రాధు కర్మాకర్

ఉత్తమ గాయకుడు (ఫిల్మ్‌ఫేర్) – మన్నాడే

ఉత్తమ దర్శకుడు (ఫిల్మ్‌ఫేర్) – రాజ్ కపూర్

ఉత్తమ శబ్దగ్రహకుడు (ఫిల్మ్‌ఫేర్) – అల్లావుద్దీన్ ఖాన్ ఖురేషీ

మూలాలు

[మార్చు]

1. విషయ ప్రదాత: టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యాసం 2.విషయ ప్రదాత: టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యాసం