Jump to content

యయాతి చరిత్రము

వికీపీడియా నుండి

యయాతి చరిత్రము కావ్యాన్ని పొన్నెగంటి తెలగన్న రచించారు. ఇది తొలి అచ్చతెలుగు కావ్యంగా ప్రఖ్యాతి పొందింది.[1]

రచయిత

[మార్చు]

యయాతి చరిత్రము కావ్య రచయిత నేటి మెదక్ జిల్లాలోని పొటంచెరువు/పొట్లచెరువుకు చెందిన పొన్నెగంటి తెలగన్న. పొన్నెగంటి తెలగన్న సా.శ. 1520-1600 కాలానికి చెందినవాడు. అతను యయాతి చరిత్రమును గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఇబ్రహీం కుతుబ్ షా (మల్కిభ రామ్) దగ్గర అమీన్ గా ఉన్న అమీన్ ఖాన్ కు అంకితం చేశారు.

ప్రధాన వ్యాసం: పొన్నెగంటి తెలగన్న

కావ్య విశిష్టత

[మార్చు]

ఆద్యంతం అచ్చ తెలుగు భాషలో రాసిన కావ్యాల కోవలో మొదటిదిగా, అగ్రగణ్యమైనదిగా యయాతి చరిత్రము తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయింది.[2]తెలుగు భాషలో సంస్కృత సమాలు, ప్రాకృత సమాలు, సంస్కృత భవాలు, ప్రాకృత భవాలు, దేశ్యాలు, అన్యదేశ్యాలు అంటూ 6రకాల పదాలు ఉన్నాయి. వీటిలో సంస్కృత సమాలు తప్ప మిగిలిన పదాలన్నిటినీ కలిపి అచ్చతెలుగు పదాలుగా పేర్కొంటారు. అటువంటి అచ్చతెలుగులో పద్యరచన చేయడమే విశేషమైనదైతే ఇక కావ్యరచన ఎంతటి విశిష్టత సంతరించుకుంటుందో ఊహించవచ్చు. అచ్చతెలుగు కావ్యం వల్ల పాఠకులకు భాషా సంపద, భాషా సృజనశక్తి పెరుగుతుందని విమర్శకులు పేర్కొన్నారు.

సాధారణంగా ఒక సాహిత్యశాఖకు మార్గదర్శకంగా శ్రీకారం చుడుతూ వెలువడిన కావ్యానికి చారిత్రిక ప్రాధాన్యం మాత్రమే ఉంటుంది. ఆ శాఖలో అనంతరకాలంలో వెలువడిన కావ్యాలు గుణ పరిణతితో అలరారి అగ్రస్థానం ఆక్రమిస్తాయి. కానీ తెలుగు సాహిత్యంలో చాలా కావ్యశాఖల్లో మొదట వెలువడినదే నేటికీ గుణాత్మకంగా అగ్రస్థానంలో ఉండడం విశేషం. అలాగే ఈ యయాతి చరిత్రం కూడా అచ్చతెలుగు కావ్యాల శాఖలో మొదటిదీ, అగ్రగణ్యమైంది.[3]

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2021-08-29). "మొదటి అచ్చ తెలుగు కావ్యం మనదే!". www.ntnews.com. Retrieved 2025-03-02.
  2. "మొదటి అచ్చ తెలుగు కావ్యం మనదే!-Namasthe Telangana". web.archive.org. 2025-03-02. Archived from the original on 2025-03-02. Retrieved 2025-03-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. బేతవోలు రామబ్రహ్మం రాసిన పద్యకవితా పరిచయం-1లోని పొన్నెగంటి తెలగన్న వ్యాసం