రంప ఉద్యమం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఆంధ్రదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అల్లూరి సీతారామరాజు సాగించిన ఉద్యమాల్లో రంప ఉద్యమం ఒక ముఖ్యమైన ఘట్టం. దీనికీ కాంగ్రెస్ ఉద్యమానికీ ఎటువంటి సంబంధమూ లేదు.
గోదావరి అటవీ ప్రాంతంలో 1922 జనవరి నుంచి 1924 మే వరకు ఈ ఉద్యమం కొనసాగి, ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. దీనికి నాయకుడు అల్లూరి సీతారామ రాజు. 1921 నాటికి ఆయన సహాయ నిరాకణోద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. హింసా పద్ధతిని నమ్మాడు. ఆంగ్లేయులను భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలని నిశ్చయించుకుని 1921 జూలైలో చిట్టగాంగ్ కు వెళ్ళి బెంగాల్ విప్లవ కారులతో చర్చలు జరిపాడు.
అక్కడి నుంచి తిరిగి వచ్చి తూర్పు గోదావరి జిల్లా లోని గూడెం కొండలను తన కార్యకలాపాలకు స్థావరంగా ఎన్నుకున్నాడు. దీనికి కారణం ఇక్కడి గిరిజనులపై స్థానిక తహసీల్దారు బాస్టియన్ అక్రమ చర్యలు, ముత్తదారీ పద్ధతులు, ప్రజలు పోడు వ్యవసాయం వల్ల ఎన్నో కష్ట నష్టాలని ఎదుర్కొని ఎంతో అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళందరికీ సీతారామరాజు నాయకత్వం వహించి బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చేశాడు. ఉద్యమానికి ఆయుధ సామాగ్రి అవసరమైంది. అందువల్ల ఆయుధాల కోసం పోలీస్ స్టేషనులపై దాడులు చేశారు. 1922 ఆగస్టు 22 న చింతపల్లి పోలీస్ స్టేషను పై దాడి నిర్వహించారు. సీతారామరాజుకు గాం సోదరులుగా పేరున్న గాం మల్లు దొర, గాం గంటం దొర నమ్మిన బంట్లుగా ఉండేవారు. కృష్ణదేవి పేట, రాజ వొమ్మంగి, పోలీస్ స్టేషనుల పై దాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
పరిస్థితిని గమనించిన ప్రభుత్వం స్కాట్‌కోవర్డ్, హేటర్ లను బళ్ళారి పోలీసు బలగాలను పంపించింది. ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న రాజు వారిని దామనపల్లి ఘాట్ దగ్గర దట్టమైన అడవిలో కాపు కాశీ మెరుపుదాడి చేసి స్కాట్ కోవార్డ్, హేటర్, ఇంకా నలుగురు పోలీసులను హతమార్చాడు. మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాడు. ప్రభుత్వం వ్యూహాన్ని మార్చి మలబార్ తీరం నుంచి ప్రత్యేక పోలీసులను పిలిపించింది. 1922 డిసెంబరు 6న పెద్దగడ్డపాలెం వద్ద పోలీసులు రాజుపై ఆకస్మిక దాడి చేసినా ఆయన తప్పించుకున్నాడు. తర్వాత కొంతకాలంపాటు రాజు కార్యకలాపాలు సాగలేదు. దాంతో ప్రభుత్వం మలబారు పోలీసులను వెనక్కు పిలిచింది. అయితే 1923 ఏప్రిల్ 18న రాజు అన్నవరం పోలీస్ స్టేషను పై దాడి చేసి తన కార్యకలాపాలని తిరిగి ప్రారంభించాడు. అయితే అక్కడ ఆయుధాలు ఏమీ దొరకలేదు. అయితే స్థానిక సబ్‌ఇన్‌స్పెక్టర్, పోస్ట్ మాస్టర్, డిప్యూటి తహసీల్దార్ విజయోత్సాహంతో రాజుకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాజు శంఖవరం వెళ్ళాడు. అక్కడ ఆయనకు ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. రాజు అనుచరులు మే 10 నుంచి 31 వరకు అనేక గ్రామాలు తిరిగి అనేక వస్తు సంబరాలను సంపాదించారు. జూన్ 15న రాజు కొండకండేరు, మల్కనగిరిలప్ ఆయుధాల కోసం దాడి చేశాడు కానీ అక్కడ ఏమీ లభించలేదు.
సెప్టెంబర్ 18న గాం మల్లుదొర పోలీసులకు దొరికాడు. ప్రభుత్వం పోలీస్ స్టేషను లలో ఆయుధాలు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకుంది. ప్రభుత్వం రెండు అస్సాం రైఫిల్స్ దళాలను రప్పించింది. రూథర్‌ఫర్డ్ను ప్రత్యేక కమీషనర్ గానియమించి రాజును పట్టుకునే బాధ్యతను ఆయనకు అప్పగించింది. 1924 మే6న రాజు సన్నిహితుడు, సహచరుడు అగ్గిరాజుగా ప్రసిద్ధి చెందిన పేరిచర్ల సూర్యనారాయణ మద్దేరు వద్ద ప్రభుత్వానికి పట్టుబడ్డాడు. 1924 మే 7 న జమేదారు కంచుమీనన్ రాజును బంధించాడు. సీతారామరాజును కొయ్యూరుకు తీసుకుని వచ్చి కాల్చి చంపారు. ఆ తర్వాత పోలీసులు రాజు అనుచరులను క్రమక్రమంగా పట్టుకుని కాల్చి చంపారు. 1924 జూన్ నాటికి రంప విప్లవం సమసిపోయింది. అల్లూరి సీతారామరాజు చేసిన మన్యం విప్లవాన్ని, ఆయన దేశభక్తినీ, త్యాగాన్ని గాంధీజీ ఆ తర్వాత కాలంలో 1929 జూలై 18న యంగ్ ఇండియా పత్రికలో అభినందించాడు.