రాత్స్ చైల్డ్ కుటుంబం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాత్స్‌చైల్డ్ కుటుంబం అన్నది 1760లో ఫ్రాంక్ ఫర్ట్ స్వేచ్ఛా నగరంలో బ్యాంకింగ్ వ్యాపారం చేసిన యూదు వడ్డీ వ్యాపారి మేయర్ ఆమ్స్‌చెల్ రాత్స్‌చైల్డ్ వారసులుగా వచ్చిన సంపన్న కుటుంబం[1] చక్రవర్తులకు, మతాధికారులకు అప్పులిచ్చే యూదు వడ్డీ వ్యాపారులు కోర్టు ఫాక్టర్ల కోవలోనివాడైన రాత్స్ చైల్డ్, ఇతర కోర్టు ఫాక్టర్లలా కాకుండా తన సంపదను వారసత్వంగా సంక్రమించేలా చేసుకుని, తన ఐదుగురు కుమారుల ద్వారా అంతర్జాతీయ బ్యాంకింగ్ కుటుంబాన్ని నెలకొల్పగలిగాడు,[2] వారు ఐదుగురూ ఐదు ఐరోపా నగరాలైన లండన్, ప్యారిస్, ఫ్రాంక్‌ఫర్ట్, వియన్నా, నేపుల్స్ నగరాల్లో బ్యాంకర్లుగా స్థిరపడ్డారు.

ఫ్రాంక్ ఫర్ట్ లో రాత్స్‌చైల్డ్ కుటుంబ నివాసం
పూర్వం రాత్స్‌చైల్డ్ కుటుంబం యొక్క వియన్నీస్ శాఖ వారికి సంబంధించిన గృహం.
స్క్లాస్ హింటర్లైటెన్, ఆస్ట్రియన్ రాత్స్ చైల్డ్ వంశం నిర్మించిన అనేక ప్రాసాదాల్లో ఒకటి. 1905లో ఈ భవంతిని విరాళంగా ఇచ్చారు.
కోటె దె ఆజర్, ఫ్రాన్స్ లో రాత్స్ చైల్డ్ విల్లా
బారన్ ఆల్బర్ట్ వాన్ రాత్స్ చైల్డ్ ప్యాలెస్ (ఫోటో 1884)
ఫ్రాన్స్ లోని పికార్డీలో రాత్స్ చైల్డ్ కుటుంబం వారి గృహం.

19వ శతాబ్దంలో రాత్స్‌చైల్డ్ కుటుంబం ప్రపంచంలోకెల్లా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, కుటుంబాల్లో అతి సంపన్నమైనదిగా పేరొందింది, ఆధునిక ప్రపంచ చరిత్రలోకెల్లా సంపద్వంతమైన కుటుంబంగా నిలిచింది.[3][4][5] కుటుంబ సంపద వివిధ వారసుల మధ్య విభజించి పంచారు,[6] ప్రస్తుతం వారి ఆస్తుల్లో భూములు, ఆర్థిక సేవలందించే సంస్థలు, రియల్ ఎస్టేట్, గనులు, విద్యుత్, వ్యవసాయ క్షేత్రాలు, మద్యం తయారీ వంటివి ఉన్నాయి, లాభాపేక్ష రహిత సంస్థలు కూడా వారికి ఉన్నాయి.[7][8]

రాత్స్ చైల్డ్ కుటుంబానికి వ్యతిరేకంగా చాలా కుట్ర సిద్ధాంతాలే ఉన్నాయి; వీటిలో చాలావరకూ యాంటీ సెమెటిసిజం (యూదుల పట్ల వివక్షాపూరిత వ్యతిరేకత) మూలాలు కలిగినవి.[9]

వంశ చరిత్ర[మార్చు]

ఈ కుటుంబంలో రాత్స్ చైల్డ్ అన్న పేరు వాడిన మొట్టమొదటి వ్యక్తి 1577లో జన్మించిన ఐజాక్ ఎల్కనాన్ రాత్స్ చైల్డ్. ఈ పేరు జర్మన్ భాషలో రెడ్ షీల్డ్ లో (zum rothen Schild) అన్న అర్థం వచ్చే పదాల నుంచి వచ్చింది. ఈ పేరు ఆ కుటుంబం తరాల పాటుగా జీవించిన ఇల్లును సూచిస్తూ వచ్చింది, ఆరోజుల్లో ఇళ్ళను సూచించడానికి నెంబర్లు వాడేవారు కాదు; రకరకాల గుర్తులూ (షీల్డ్), రంగులూ (రెడ్) వాడేవారు. ఇప్పటికీ వారి కోట్ ఆఫ్ ఆర్మ్స్‌లో ఈ రెడ్ షీల్డ్ కనిపిస్తుంది.

1744లో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో మయెర్ ఆమ్‌షల్ రాత్స్‌చైల్డ్ జననంతో కుటుంబం అంతర్జాతీయ స్థాయి ప్రాముఖ్యత సంపాదించుకునే దిశగా ఎదగడం ప్రారంభమైంది. అతను ఆమ్‌షల్ మోజెస్ రాత్స్‌చైల్డ్ (జ. 1710) కుమారుడు.[10] మోజెస్ హెసె రాజవంశానికి చెందిన రాకుమారునితో మనీ ఛేంజర్ (కరెన్సీ మార్పిడి చేసేవారు, బ్యాంకులకు పూర్వ దశ)గా వ్యాపారం చేసేవాడు. ఫ్రాంక్‌ఫర్ట్‌లోని "జుడెన్‌గెసే" అన్న యూదుల వీధిలో జన్మించిన మయెర్ ఒక వాణిజ్య కుటుంబాన్ని అభివృద్ధి చేశాడు. అతని వ్యాపార సామ్రాజ్యం ఐరోపా వ్యాప్తంగా విస్తరించడంతో తన ఐదుగురు కొడుకుల్లో ఒక్కొక్కరినీ ఐరోపాలోని ఒక్కొక్క ఆర్థిక కేంద్రాల్లో తన వ్యాపారాలను నిర్వహించడానికి ఉంచాడు. రాత్స్‌చైల్డ్ కోట్ ఆఫ్ ఆర్మ్స్‌లో ఐదు బాణాలతో కూడిన పిడికిలి ఉంటుంది, ఇది మయెర్ రాత్స్‌చైల్డ్ ఐదుగురు కొడుకులు ఐదు వ్యాపార వంశాలను స్థాపించడానికి సంకేతంగా నిలుస్తోంది. "యోధుడి చేతిలో బాణాల వలె వ్యక్తి యవ్వనంలో జన్మించిన సంతానం" అన్న అర్థం వచ్చే బైబిల్ వాక్యం నుంచి దీన్ని స్వీకరించారు. కన్‌కోర్డియా (Concordia), ఇంటెగ్రిటాస్ (Integritas), ఇండస్ట్రియా (Industria) (ఐకమత్యం, నైతిక నిష్ఠ, కృషి) అన్న కుటుంబపు ఆదర్శ వాక్యం (మోటో) షీల్డ్ కింద కనిపిస్తుంది.[11]

జర్నలిస్టు, చరిత్ర రచయిత పాల్ జాన్సన్ ప్రకారం "రాత్స్‌చైల్డ్ కుటుంబీకులు వంచన చేసేవారు. వారి అసలు స్వరూపాన్ని బయటపెడుతూనే ఖచ్చతమైన వాస్తవాలను రాసిన పుస్తకం అంటూ ఏదీ లేదు. వారి గురించి రాసిన చెత్తంతా అనేక గ్రంథాలయాలు నిండేంత విస్తారంగా ఉంటుంది. లైస్ అబౌట్ రాత్స్‌చైల్డ్స్ (రాత్స్‌చైల్డ్ ల గురించిన అబద్ధాలు) అన్న పేరుతో పుస్తకం రాయాలని ప్రయత్నించిన ఒక రచయిత్రి చివరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటూ - 'అబద్ధాలను కనిపెట్టడం తేలికే కానీ [వారి గురించి] సత్యాన్ని వెలికితీయడం అసాధ్యమని నిరూపితమైంది' అన్నది." ముందుతరాల కోర్టు ఫ్యాక్టర్లు (ఐరోపా రాజవంశాల ఆస్థాన బ్యాంకర్లయిన యూదుల) ఐరోపా రాజవంశాలకు ఫైనాన్సు చేసి, వారి ఆర్థిక వ్యవహారాలు నిర్వహించినా చాలా తరచుగా హింసకు గురై కానీ, కబ్జాలు, తమ సంపద హరించడాలకు గురై కానీ తమ సంపదను కోల్పోయేవారు. కానీ, పాల్ జాన్సన్ పరిశీలన ప్రకారం రాత్స్‌చైల్డ్ వంశస్థులు సృష్టించిన కొత్త తరహా అంతర్జాతీయ స్థాయి బ్యాంకు వారిని స్థానిక దాడులకు ప్రభావితం కాకుండా నిలబెట్టింది. వారి ఆస్తులు ఆర్థిక ఒప్పంద పత్రాల్లో ఉండేవి, అవి ప్రపంచవ్యాప్తంగా స్టాక్స్ రూపంలో, బాండ్స్ రూపంలో, అప్పుల రూపంలో చలామణి అవుతూండేవి. బ్యాంకింగ్ పద్ధతుల్లో రాత్స్‌చైల్డ్ వంశస్థులు చేసుకున్న మార్పులు వారి ఆస్తులను స్థానిక హింస నుంచి రక్షణ కవచంలా కాపాడాయి: "దాంతో దాడులు చేసే గుంపులకు పూర్తిగానూ, అసూయాపరులైన పరిపాలకులకు దాదాపుగానూ అందనంత దూరంలో వారి నిజమైన సంపద నిలిచింది"[12] వారి సంపదలో అత్యధిక భాగం లండన్లోని నాధన్ మయెర్ రాత్స్‌చైల్డ్ సృష్టించాడని జాన్సన్ వాదించాడు. పారిస్‌లోని జేమ్స్ మయెర్ దె రాత్స్‌చైల్డ్, నేపుల్స్ నగరంలోని కార్ల్ మయెర్ వాన్ రాత్స్‌చైల్డ్, ఫ్రాంక్‌ఫర్ట్‌లోని ఆమ్‌షల్ మయెర్ రాత్స్‌చైల్డ్ వంటి ఇతర రాత్స్‌చైల్డ్ వ్యాపార సామ్రాజ్యాలు కూడా అంతకన్నా ఎక్కువ లేక సమానమైన లాభాలు ఆర్జించాయని చరిత్రకారుడు నీల్ ఫెర్గుసన్ చేసిన ఇటీవలి పరిశోధన సూచిస్తోంది.[13]

మయెర్ రాత్స్‌చైల్డ్ విజయానికి తోడ్పడిన మరో వ్యూహం ఏమిటంటే వారి బ్యాంకుల నియంత్రణను తమ కుటుంబం చేతిలోనే ఉంచుకోవడం, దీని వల్ల వారి సంపద ఎంతటిదన్న విషయం పూర్తి రహస్యంగా ఉంచగలిగారు. 1906 ప్రాంతంలో జ్యూయిష్ ఎన్‌సైక్లోపిడియాలో: "కుటుంబంలోని అన్నదమ్ములు ఒక సంస్థగా వివిధ వాణిజ్య కేంద్రాల్లో బ్రాంచిలు ఏర్పాటుచేయడం అన్నది రాత్స్‌చైల్డ్ కుటుంబం ప్రారంభించిన పద్ధతి. ఈ పద్ధతిని బిషోఫ్‌షైమ్ (Bischoffsheims), పెరీర్ (Pereire), సెలిగ్మాన్ (Seligman) లాజార్డ్ (Lazard) వంటి అనేక ఇతర యూదువాణిజ్య కుటుంబాలు కూడా అనుసరించాయి. తమ న్యాయబుద్ధి, వాణిజ్య మెళకువల ద్వారా వీరు కేవలం తమ తోటి యూదు వ్యాపారుల్లోనే కాకుండా మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలోనే పరపతి పొందగలిగారు. ఈ విధంగా, 19వ శతాబ్ది ద్వితీయార్థంలో యూదు వాణిజ్యవేత్తలు అంతర్జాతీయ వాణిజ్యంలో తమ వాటా పెంచుకుంటూ పోయారు. ఈ అలాంటి గ్రూప్ మొత్తానికి రాత్స్‌చైల్డ్ కుటుంబం పెద్దగా వ్యవహరించింది..." అని పేర్కొంది, అంతేకాక అదే ఎన్సైక్లోపీడియా "ఇటీవలి సంవత్సరాల్లో, యూదులు కాని వాణిజ్యవేత్తలు కూడా ఈ కాస్మోపాలిటన్ విధానాన్ని నేర్చుకున్నారు, మొత్తంగా, దీనిపై నియంత్రణ పూర్వం కన్నా తక్కువగా యూదుల చేతులో ఉంటూ వస్తోంది." అని కూడా పేర్కొంది.[14] మయెర్ రాత్స్‌చైల్డ్ జాగ్రత్తగా నిర్ణయించి చేసిన వివాహాల ద్వారా కుటుంబపు సంపదను కుటుంబంలోనే ఉంచగలిగాడు. వీటిలో చాలావరకూ మొదటి లేదా రెండవ కజిన్స్‌కి (రాజవంశీకుల్లో జరిగే వివాహాల్లాగా) ఇచ్చి చేసిన వివాహాలే. అయితే, 19వ శతాబ్ది చివరికల్లా, దాదాపు అందరు రాత్స్‌చైల్డ్ వంశీకులు కుటుంబం బయట వివాహాలు చేసుకోవడం ప్రారంభించారు, దాదాపుగా అవన్నీ ప్రభువర్గం (అరిస్టోక్రసీ)తో కానీ, ఇతర వాణిజ్య వంశాలతో కానీ జరిగాయి.[15]

వ్యాపార వంశవృక్షం[మార్చు]

మయెర్ ఆమ్‌షల్ రాత్స్‌చైల్డ్‌కు ఐదుగురు కుమారులు, వారిలో పెద్దవాడైన ఆమ్‌షెల్ మయెర్ రాత్స్‌చైల్డ్ వంశం ప్రారంభమైన ఫ్రాంక్‌ఫర్ట్‌లోనే ఉండి వ్యాపారాన్ని చూసుకోగా, మిగిలిన నలుగురినీ ఐరోపాలోని నాలుగు ప్రధాన వాణిజ్య కేంద్రాలకు పంపాడు మయెర్.

 • మయెర్ ఆమ్‌షల్ రాత్స్‌చైల్డ్

ఫ్రాంక్‌ఫర్ట్‌లో మయెర్ వ్యాపారాన్ని స్వీకరించిన పెద్ద కొడుకు ఆమ్‌షెల్ మయెర్ రాత్స్‌చైల్డ్ పిల్లలు లేకుండా మరణించాడు, ఇతని సంపద సాలమన్, కార్ల్ పిల్లలకు వారసత్వంగా అందింది. మిగిలిన నలుగురూ ఆయా నగరాల్లో రాత్స్‌చైల్డ్ వాణిజ్య వంశాలను స్థాపించి విస్తరించారు.

Notes[మార్చు]

 1. Elon, Amos (1996). Founder: Meyer Amschel Rothschild and His Time. New York: HarperCollins. ISBN 0-00-255706-1.
 2. Backhaus, Fritz (1996). "The Last of the Court Jews – Mayer Amschel Rothschild and His Sons". In Mann, Vivian B.; Cohen, Richard I. (eds.). From Court Jews to the Rothschilds: Art, Patronage, and Power 1600–1800. New York: Prestel. pp. 79–95. ISBN 3-7913-1624-9.
 3. The House of Rothschild: Money's prophets, 1798–1848, Volume 1, Niall Ferguson, 1999, page 481-85
 4. "The Rothschild story: A golden era ends for a secretive dynasty". The Independent. Archived from the original on 15 January 2006.
 5. The Secret Life of the Jazz Baroness, from The Times 11 April 2009, Rosie Boycott
 6. Rothschild: a story of wealth and power, by Derek A. Wilson, (Deutsch 1988), pages 415-456
 7. The Rothschilds: Portrait of a Dynasty, By Frederic Morton, page 11
 8. Robert Booth (8 July 2011). "Million-pound bash for rising star of the super-rich". The Guardian. London.
 9. The Rough Guide to Conspiracy Theories, James McConnachie, Robin Tudge Edition: 2 – 2008
 10. మూస:NDB
 11. "Concordia, Integritas, Industria – The Rothschilds – LCF Rothschild Group". Lcf-rothschild.com. Archived from the original on 24 అక్టోబరు 2007. Retrieved 7 జూన్ 2020.
 12. Paul Johnson, A History of the Jews, p.317.
 13. The House of Rothschild (Vol. 2): The World's Banker: 1849–1999, Niall Ferguson (2000)
 14. Jewish Encyclopedia c. 1906 Finance
 15. Go Ahead, Kiss Your Cousin by Richard Conniff, From the August 2003 issue, published online 1 August 2003