రాయవెల్లూరు కోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెల్లూరు కోట తమిళనాడు లోని వెల్లూరు నగరంలో ఉంది. దీన్ని విజయనగర రాజులు నిర్మించారు. విజయనగరాన్ని పాలించిన ఆరవీటి వంశస్థులకు కొంత కాలం వెల్లూరు ఇది రాజధానిగా ఉండేది. ఈ కోట ఎత్తైన ప్రాకారం, దాని చుట్టూ కందకం, బలిష్ఠమైన నిర్మాణంతో ఉంటుంది. ప్రస్తుతం ఈ కోటలో వెల్లూరు నగర పాలక సంస్థ మూడవ జోన్ కార్యాలయం ఉంది.

చరిత్ర[మార్చు]

చారిత్రిక ఆధారాలను బట్టి 1526 నుండి 1604 చంద్రగిరి రాజులకు సామంతులుగా వుండిన నాయక రాజులు వేలూరు కోటకు రాజులుగా వుండే వారు. విజయ నగర రాజు సదాశివ రాయలకు సామంతులుగా వెల్లూరును పాలించారు. (చంద్రగిరి కోట కూడా విజయనగర రాజులదే) ఆ విధంగా వెల్లూరు సుమారు మూడు శతాబ్దాల కాలం విజయనగర రాజుల ఆధీనంలో ఉంది. అందుకే ఈ నగరానికి రాయ వెల్లూరు అని పేరు వచ్చింది. బీజా పూరు సుల్తాను అదిల్ షా 1644 లో వేలూరును వశపరచు కున్నంత వరకు వెల్లూరు విజయనగర సామ్రాజ్యంలో భాగంగానె వుండేది. ఆవిధంగా సుల్తానుల పాలన 1676 వరకు సాగింది. కాని మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గోల్కొండ, బిజాపూర్ సుల్తానులను జయించి 1676లో రాయ వేలూరును వశపరచు కున్నాడు. కాని 1686 లో ఔరంగజేబు వశమైంది. వారు తమ పాలనను జింజీ నుండే సాగించారు. 1716 వ సంవత్సరంలో వారి రాజధానిని జింజీ నుండి ఆర్కాడుకు మార్చారు. అప్పటి నుండి వారు ఆర్కాడు నవాబులుగా పేరు గాంచారు. అన్వరుద్దీన్ 1744 వ సంవత్సరంలో ఆర్కాడు నవాబుగా పదవి చేపట్టాడు. అదే సమయంలో గోవాను పరిపాలిస్తున్న ప్రెంచి వారికి అనగా డుప్లెక్స్, ఈస్టిండియా కంపెనీ అధికారి రాబర్ట్ క్లైవ్ తమ రాజ్య విస్తరణ కార్యక్రమంలో స్థానిక రాజుల రాజ్యాలను వశపరచుకున్నారు. ఆ క్రమంలో రాబర్ట్ క్లైవ్ 1775 వ సంవత్సరంలో ఆర్కాడు నవాబు నుండి వేలూరు కోటను వశపర్చుకున్నాడు. 1777 లో జరిగిన శ్రీరంగపట్నం యుద్ధంలో మైసూర్ రాజు టిప్పు సుల్తానును యుద్ధభూమిలో వధించి అతని కొడుకు, కూతురు ఇతర బందు వర్గాన్ని వేలూరు కోటలో బంధించారు.

ఉత్తర భారత్ లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా 1857 వ సంవత్సరంలో సిపాయిల తిరుగు బాటు జరిగింది. ఆ సంఘటన భారత్ లో జరిగిన మొట్ట మొదటి స్వాతంత్ర్యోద్యమంగా చరిత్ర పుటలలో స్థానం సంపాదించు కున్నది. కాని దానికి సుమారు 50 సంవత్సరాలకు పూర్వమే అనగా 1806 లోనె వేలూరు కోటలో జరిగిన సిపాయిల తిరుగు బాటులో అనేక మంది బ్రిటిష్ సైనికాధికారులు అసువులు బాసారు. కాని అనేక కారణాల వల్ల ఆ సంఘటన చరిత్ర పుటల లోకి ఎక్కలేదు. అదే విధంగా బ్రిటిష్ వారిచేతుల్లో ఓడిపోయిన శ్రీలంక రాజు విక్రమ రాజ సింహను బ్రిటిష్ వారు వెల్లూరు కోటలోనే బందీగా వుంచారు. 17 సంవత్సరాల తర్వాత అనగా 1832 వ సంవత్సరంలో అతను మరణించాడు. ఈ విధంగా రాయ వెల్లూరు కోట అనేక చారిత్రిక సంఘటనలకు సాక్షీభూతంగా నిలిచింది.

దక్షిణ భారత దేశంలోనే ఈ రాయ వెల్లూరు కోట విశాలమైన కోట గోడలతో, ఎత్తైన బురుజులతో, లోతైన అగడ్తలతో అత్యంత పతిష్టమైన కోటగా పేరు గాంచింది. ఈ కోట బ్రిటిష్ వారి వశమయ్యాక అందులోని పురాతన భవనాలను కూల గొట్టి కొత్త భవనాలను కట్టారు. ఆవిధంగా కట్టినవే ఇప్పుడున్న ఐదు భవనాలు. అవి 1.హైదర్ మహల్, 2. టిప్పు మహల్, 3. రాజ మహల్, 4.రాణి మహల్, 5. కాండి మహల్. ఇవి ఆయా పేర్లను బట్టి వారు కట్టినవి కాదు. రాజ మహల్, రాణి మహాలో తప్ప మిగతావి ఆయా వ్యక్తులు, లేక వారి సంబందీకులు వాటిలో యుద్ధ ఖైదీలుగా బంధించ బడినందున వాటికా పేర్లు వచ్చాయి. హైదర్ మహల్, టిప్పు మహల్ గా పిలువబడే ఈ రెండు భవనాలు శ్రీరంగ పట్నం యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించగా అతని కొడుకు, కూతురు మిగతా బందు వర్గాన్ని ఈ భవనాలలో యుద్ధ ఖైదీలుగా బంధించారు. ఈ భవనాలలోనె ఈ మధ్యన భారత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధిని హత్య చేసిన LTTE ఖైదీలను కూడా బంధించడం జరిగింది. రాజ మహల్, రాణిమహల్ ఈ రెండు భవనాలు మొన్నటి వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాలుగా ఉపయోగ పడ్డాయి. క్యాండి మహల్ గా పిలువబడే భవనం బ్రిటిష్ వారు శ్రీలంక రాజు క్యాండిని యుద్ధ ఖైదీగా పట్టుకొని ఈ భవనంలో బంధించినందున దానికా పేరు వచ్చింది. వీటి మధ్యలో వున్న మరోభవనము, బ్రిటిష్ వారు వారి అవసరార్థం 1846 వ సంవత్సరంలో కట్టిన చర్చి. అది ఈ నాటికి చర్చి గానె సేవ లందిస్తున్నది. ఇంకొన్ని భవనాలు ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలుగాను ఉపయోగ పడుతున్నాయి. ఈ కోటలో ఒక పురాతన మసీసు కూడా ఉంది. అది ముస్లింల పాలన కాలంలో కట్టబడింది. కోటలోని విశాలమైన మైదానాలు ప్రస్తుతం పోలీసు ట్రైనింగు కొరకు ఉపయోగంలో ఉన్నాయి.

ఈ రాయ వెల్లూరు కోట ఆవరణంలోనె వున్న అతి పెద్ద కట్టడం జలకంటేశ్వరాలయం ఈ ఆలయం అతి పురాతన మైనది. విజయ నగరాదీసుడు సదాశివ రాయలు కాలంలో ఈ కోట ప్రహరి గోడను, జలకంటేశ్వరాలయంలోని కళ్యాణ మండపాన్ని కట్టించి నట్లు చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తున్నది. ఈ కోట మొదట ముస్లింల పాలన లోను ఆ తర్వాత బ్రిటిష్ వారి పాలనలో వున్నందున ఈ ఆలయంలోని విగ్రహాలు మాయమైనవి. బ్రిటిష్ వారు ఈ ఆలయ ప్రాంగణాన్ని వారి మందు గుండు సామాగ్రిని దాచడానికి గోదాముగా వాడుకున్నారు. ఆ తర్వాతి బ్రిటిష్ వారి కాలంలోనె దీనిని చారిత్రిక కట్టడంగా భావించి, వార సత్య సంపదగా ప్రకటించి దానిని భారత పురావస్తు శాఖ వారి అదీనం చేయబడింది. అలా ఈ ఆలయం కొన్ని దశాబ్దాల కాలం పూజ పునస్కారలకు నోచుకోక చీకటిలో మగ్గింది. భారత్ స్వాతంత్ర్యం వచ్చింతర్వాత కొన్ని దశాబ్దాల పాటు సాగిన ఉద్యమాల మూలంగా 1987 వ సంవత్సరంలో హిందువుల ఆధీనంలోకి వచ్చి గర్బగుడులలో మాయమైన విగ్రహాల స్థానంలో విగ్రహాలను ప్రతిష్ఠించి ఇప్పుడు నిత్య దూప దీప నైవేద్య కార్యక్రమాలు జరుగు తున్నాయి.

ఈ ఆలయ ప్రాంగణంలో వున్న కళ్యాణ మండపంలోని శిల్ప కళా చాతుర్యం విజయనగర శిల్ప కళ వైభవానికి మచ్చు తునక. ఈ శిల్ప కళా చాతుర్యానికి అచ్చెరు వొందిన బ్రిటిష్ వారు ఆ కాలంలోనె దీన్ని ఏభాగానికి ఆభాగాన్ని విడదీసి లండన్ లో పునర్ నిర్మించాలని పథకం పన్ని దాని రవాణ కొరకు ఒక స్టీమరును కూడా సిద్దం చేసు కున్నారు. కాని భారతీయుల అదృష్ట వశాత్తు ఆ స్టీమరు భారత్ కు వస్తూ మార్గ మధ్యలోనె, మునిగి పోయింది. వారి పథకం ఆవిధంగా విపలమైంది. కనుక మనమీనాడు ఆ కళ్యాణ మండపాన్ని కనులార చూడ గలుగు తున్నాము.

136 ఎకారల విస్తీర్ణంలో వున్న ఈ కోటకు ఒకే ద్వారమున్నది. చుట్టు ఎత్తైన రాతి గోడ అందులో బురుజులుతో లోతైన అగడ్తలతో అలరారు చున్నది. కోట చుట్టు వున్న లోతైన, విశాలమైన అగడ్త చుట్టు విశాలమైన పచ్చికమైదానమున్నది. కోట లోనికి వెళ్లడానికి ఆ కాలంలో అగడ్తపై suspension bridge లాంటి గేటు వుండేదని చరిత్రికాదారలను బట్టి తెలుస్తున్నది. కాని ప్రస్తుతం ఈ స్థానంలో రోడ్డు ఉంది. [1]

మూలాలు[మార్చు]

  1. (మూలం: The book 'vellore fort and the temple through the ages' written by A.k.Seshadri.)

యితర లింకులు[మార్చు]