రాయసం వేంకటపతి
రాయసం వెంకటపతి శ్రీరంగరాయ ఆస్థానంలో అధికారి, కవి. ఈ కవి కర్ణాటక సామ్రాజ్యం యొక్క సకలాధిపాత్ర (అన్ని రాజరిక కార్యాలయాల) నిర్వాహకుడనని చెప్పుకున్నాడు. శ్రీరంగరాయలు అతి పెద్ద సైన్యం కలిగిన కుతుబ్ షా ను ఓడించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ కవి శ్రీరంగరాయలు తనకు బహుమతిగా గ్రామాన్ని, రాయసం కార్యాలయాన్ని, బంగారం, ఆభరణాలను యిచ్చినట్లు చెప్పుకున్నాడు.[1]
రాయసము వేంకటపతి - ఇత డారువేల నియోగి; అక్కయామాత్యుని కుమారుడు. ఈకవి తన వంశము వారిని వర్ణించుచు తమది వసిష్ఠగోత్ర మయినట్లీ క్రింది పద్యమునందు జెప్పెను -
- శా. శ్రీల న్మించి సమస్త ధీకలనచే జెన్నొందు నార్వేలవం
- శాలంకారకరుల్ వసిష్ఠమునిగోత్రాంకుల్ బుధు ల్దీనర
- క్షాలీలం బొగ డొంది రందు వెలసెన్ సన్మాని భానప్ప ది
- గ్జాలలోద్వేలవిశాలకీర్తుల సుధీసందోహమందారమై.
ఇతడు లక్ష్మీవిలాసమనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచించెను[2]. "రసిజనహృదయంగమ సంగీతసాహిత్యకళాధౌరంధర్య" అని గద్యములో జెప్పుకొన్నదానినిబట్టి యీకవి సాహిత్యమునందు మాత్రమేకాక సంగీతమునందును సమర్థు డైనట్టు కనబడుచున్నాడు. ఇతడు శ్రీరంగరాయని యాస్థానమునందుండి యాతనివలన నగ్రహార రత్నాభరణాదులను బొందినట్టు లక్ష్మీవిలాసములోని యీక్రిందిపద్యమువలన విదితమగుచున్నది.
- మ. అలఘుప్రాభవభవ్యు డాకుతపశాహామేయసైన్యంబు న
- గల్గిక న్బాహులచేత గెల్చి బిరుదల్ గైకొన్న శ్రీరంగరా
- యల చిత్తం బిగురింప రాయసము వ్రాయం జాలి తౌనౌ సుధీ
- తిలకా యక్కయమంత్రి వేంకటపతీ దీవ్యత్కళావాక్పతీ.
- ఉ. వ్రాయుచు రాజ్యవైభవ ధురంధరభూతి దలిర్ప గీర్తిధౌ
- రేయసిరంగరాయమహిభృన్మణిరాయస మగ్రహారహై
- మాయతరత్న భూషలు నృపాడ్యులు వర్తనలియ్య నుబ్బుచున్
- వేయననేమి రాయసము వేంకటమంత్రియనన్ యశస్వివై.
ఈశ్రీరంగరాయలు వసుచరిత్రను కృతినందిన తిరుమలదేవరాయ ని కుమారుడు. ఇతడు 1534 వ సంవత్సరము మొదలుకొని 1585 వ సంవత్సరము వఱకును రాజ్యముచేసినందున, కవియు నాకాలమునందే యుండినవాడు. లక్ష్మీవిలాసము సలక్షణమై మృధుమధురరచనను గలిగి యున్నది[3]. కవితాశైలి జూపుట కయి గ్రంథమునుండి రెండు పద్యముల నుదాహరించుచున్నాను-
- చ. తనదువిలాసహాసముల దాలిమి దూలగ రాగసాగరం
- బున బలుమాఱు మారుదెస మున్గుచు దేలుచు నిచ్చ మెచ్చగా
- మునుకొని వారితో భువనమోహిని యాకుహనావియచ్చరాం
- గన పలికెం బికస్వరవికస్వరసుస్వరభాస్వరంబుగన్. [ఆ.3]
మూలాలు
[మార్చు]- ↑ Krishnaswami Aiyangar, Sakkottai (1919). Sources of Vijayanagar history. University of California Libraries. [Madras] : The University of Madras.
- ↑ "Venkatapati - Meaning And Origin Of The Name Venkatapati | WIKINAME.NET". www.wikiname.net (in ఇంగ్లీష్). Retrieved 2018-01-19.[permanent dead link]
- ↑ Aiyaṅgār, Sākkoṭṭai Krishṇaswāmi (1986). Sources of Vijayanagar history (in ఇంగ్లీష్). Gian Pub. House.