రిమోట్ సెన్సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిమోట్ సెన్సింగ్ వ్యవస్థ పనితీరును తెలియజేసే చిత్రం

రిమోట్ సెన్సింగ్ అంటే ఒక వస్తువును తాకకుండా దూరం నుంచి గమనించి దాని గురించి చెప్పగలిగే విధానం. అంతరిక్షంలోకి పంపే ఉపగ్రహాల ద్వారా, విమానాల ద్వారా ఈ రిమోట్ సెన్సింగ్ జరుగుతుంది. ఇటీవలి కాలంలో దీనికి డ్రోన్ లు వాడటం కూడా మొదలయింది. అంతరిక్ష శాస్త్రంలో ఈ విధానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు భూమినే కాకుండా సౌర కుటుంబంలోని కొన్ని ఇతర గ్రహాలను కూడా మనం ఉపగ్రహాల సాయంతో 'చూస్తున్నాం'. ఈ సాంకేతికత ఎన్నో రంగాలను ప్రభావితం చేసింది. ఒక ప్రదేశానికి భౌతికంగా వెళ్లకుండానే అక్కడ ఏం ఉందో తెలుసుకోగలుగుతున్నాం; అంతరిక్ష పరిశోధనకు మూలం ఇదే. భూగోళ, భూగర్భ, జల విజ్ఞాన, వ్యవసాయ, జీవావరణ, వాతావరణ తదితర శాస్త్ర రంగాల్లో రిమోట్ సెన్సింగ్ ప్రాధాన్యత చాలా ఉంది. మచ్చుకు కొన్ని - ఉపగ్రహాలు అంతరిక్షం నుంచి పంపే భూ ఛాయాచిత్రాలను విశ్లేషించడం ద్వారా భూగర్భంలోని ఖనిజ నిక్షేపాల గురించి తెలుసుకోవచ్చు. వాతావరణం గురించి, అగ్ని పర్వతాల ఆచూకీ, నీటి జాడలు, అడవులు, వ్యవసాయ తదితర వివరాలు తెలుసుకోవచ్చు.

ఎలా చేస్తారు

[మార్చు]

రిమోట్ సెన్సింగ్ కు వాడే విమానాలు, ఉపగ్రహాలు, లేదా డ్రోన్ లలో సెన్సర్లు అమర్చబడి ఉంటాయి. భూమి ఉపరితలం వివిధ రకాలైన తరంగ దైర్ఘ్యాలతో విద్యుదయస్కాంత శక్తిని విడుదల చేస్తుంటుంది. ఇది నేల భౌతిక, రసాయనిక ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. ఈశక్తిని సెన్సర్లు గుర్తించి భద్రపరిచి తిరిగి భూమి మీదకు పంపుతాయి. భూమిపై ఆంటిన్నాల సాయంతో ఈ సమాచారాన్ని తీసుకుని ఉపయోగానుసారం వాడుకునే వీలుంటుంది. రిమోట్ సెన్సింగ్ సెన్సర్లలో అత్యంత ప్రాచుర్యం పొందినవి ఛాయాచిత్రాలు తీసే కెమెరాలు. రేడియోమీటర్లు, ఆల్టిమీటర్లు, రేడార్లు, లైడార్లు వంటివి మరికొన్ని సెన్సర్లు.

విద్యుదయస్కాంత తరంగాలు ఎక్కడ ఉత్పన్నమవుతున్నాయి అనే దాని మీద ఆధారపడి రిమోట్ సెన్సింగ్ ప్రక్రియ రెండు రకాలుగా ఉంటుంది. మొదటి రకంలో సూర్యుడు విద్యుదయస్కాంత తరంగాలకు మూలం. సూర్యుడి నుంచి వెలువడిన తరంగాలు భూమి పై ఉన్న వస్తువులపై పడినప్పుడు ఆ వస్తువుల భౌతిక, రసాయనిక ధర్మాల అనుసారంగా పలు దిశల్లో పరావర్తనం చెందుతాయి. వీటిల్లో మన సెన్సర్ల (ఉపగ్రహాలు/ విమానాలు/ డ్రోన్ లలో ఉన్న) దిశగా పరావర్తనం చెందిన తరంగాలనే ఆ సెన్సర్లు గుర్తిస్తాయి. దీన్ని పాసివ్ (నిష్క్రియాత్మక) రిమోట్ సెన్సింగ్ అనీ, ఈ సెన్సర్లను పాసివ్ సెన్సర్లనీ అంటారు. రెండో రకంలో సెన్సర్ కే విద్యుదయస్కాంత తరంగాలను వెలువరించే సామర్థ్యం ఉంటుంది. ఈ తరంగాలు భూమిపై పడి పరావర్తనం చెందగా, వాటిలో కొన్ని సెన్సర్ వైపు తిరుగు ప్రయాణమౌతాయి. వీటినే సెన్సర్ గుర్తిస్తుంది. దీన్ని యాక్టివ్ (క్రియాశీల) రిమోట్ సెన్సింగ్ అనీ, ఈ సెన్సర్లను యాక్టివ్ సెన్సర్లనీ అంటారు.

భారతదేశంలో హైదరాబాదులో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది. అక్కడ భారత ఉపగ్రహాలు పంపిన చిత్రాలనూ, సమాచారాన్నీ గ్రహించి విశ్లేషిస్తారు.

ఆధార గ్రంథాలు

[మార్చు]
  • వి. వి. బాలకృష్ణ (1991), అందరికీ అవసరమైన అంతరిక్ష విజ్ఞానం, విజయవాడ: నవరత్న బుక్ సెంటర్, archived from the original on 2019-01-14, retrieved 2019-03-14