Jump to content

రెండవ ప్రపంచ యుద్ధం - మొదలు

వికీపీడియా నుండి
(రెండవ ప్రపంచ యుద్ధం - ఆరంభం నుండి దారిమార్పు చెందింది)
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో..

ప్రధాన వ్యాసం: రెండవ ప్రపంచ యుద్ధం

1937 వేసవిలో, మార్కో పోలో వంతెన సంఘటన సాకుతో జపాన్ చైనాపై పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగింది. సోవియెట్ యూనియన్ వెనువెంటనే చైనాకు మద్దతు ప్రకటించింది. జపాన్ సైన్యం షాంఘైతో మొదలు పెట్టి డిసెంబర్ నాటికి (అప్పటి చైనా రాజధాని) నాంజింగ్ను ఆక్రమించింది. 1938 జూన్ లో చైనీయులు యెల్లో నదిని ముంపుకు గురిచేయటం ద్వారా జపనీయుల పురోగతిని నిరోధించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ జపాన్ దళాలు ఆ ఏడాది ఆక్టోబర్ నాటికి యెల్లో నది దాటి వచ్చి ఉహాన్ నగరాన్ని వశపరచుకున్నాయి.

ఐరోపాలో హిట్లర్, ముస్సోలినిలు సైనికంగా మరింత బలం చేకూర్చుకున్నారు. 1938 మార్చి నెలలో హిట్లర్ ఆస్ట్రియాని జర్మనీలో విలీనం చేసుకున్నాడు. ఈ కవ్వింపు చర్యకు ఐరోపాలోని ఇతర పెద్ద దేశాల నుండి ఎటువంటి వ్యతిరేకతా వ్యక్తం కాలేదు. దానితో హిట్లర్ మరింత దుడుకుగా వ్యవహరించి చెకొస్లవేకియా, పోలాండ్ తదితర పొరుగు దేశాల్లో జెర్మను భాష మాట్లాడే ప్రాంతాలు జర్మనీలో కలవాలనే వాదన ప్రాచుర్యంలోకి తెచ్చాడు. దీనికి కూడా వ్యతిరేకత పెద్దగా వ్యక్తం కాకపోవటంతో 1939 మార్చిలో జర్మనీ చెకొస్లవేకియాని ఆక్రమించుకుంది. దీనితో కలత చెందిన పోలాండ్ హడావిడిగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లతో యుద్ధ సహకార ఒప్పందం చేసుకుంది. ఏప్రిలోలో ఇటలీ అల్బేనియాని ఆక్రమించుకోవటంతో రొమేనియా, గ్రీస్ దేశాలు కూడా ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లతో ఇదే విధమైన ఒప్పందం చేసుకున్నాయి. సోవియెట్ యూనియన్ ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లతో జట్టు కట్టటానికి ఆసక్తి కనపరిచింది కానీ పోలాండ్ అభ్యంతరం వల్ల అది జరగలేదు.


రెండవ ప్రపంచయుద్ధం మొదలులో

1939 మే మాసంలో జపాన్ సోవియెట్ యూనియన్ తో సరిహద్దుల విషయమై చిన్నపాటి యుద్ధానికి దిగింది. జర్మనీ-ఇటలీ అధికారికంగా అక్ష రాజ్య కూటమిగా ఏర్పడ్డాయి. అదే క్రమంలో జర్మనీ తమ మిత్ర, శత్రు దేశాలను ఏక కాలంలో ఆశ్చర్యచకితులను చేస్తూ సోవియెట్ యూనియన్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఉభయ దేశాలూ ఒకరి విస్తరణ పధకాలకు మరొకరు అడ్డు తగలరు. పోలాండ్ తో సహా తూర్పు ఐరోపాను ఉమ్మడిగా ఆక్రమించి పంచుకోవాలనే రహస్య అవగాహన కూడా ఈ ఒప్పందంలో ఒక భాగం.

సెప్టెంబరుకల్లా సోవియెట్ సేనలు తమ సరిహద్దులనుండి జపాన్ సైన్యాన్ని తరిమివేశాయి. జర్మనీ పోలాండ్ ఆక్రమణ మొదలు పెట్టింది. దానితో ఫ్రాన్స్, బ్రిటన్ లతో సహా కామన్ వెల్త్ దేశాలు దేశాలు జర్మనీ పై యుద్ధం ప్రకటించాయి. యుద్ధమైతే ప్రకటించాయి కానీ రక రకాల కారణాల వల్ల ఈ దేశాలేవీ పూర్తి స్థాయిలో జర్మనీ పై దాడి చేసే సాహసం చేయలేకపోయాయి. సెప్టెంబరు మధ్యలో సోవియెట్ యూనియన్ జపాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. అదే నెలలో సోవియెట్ సేనలు పోలాండ్ పై మరోవైపు నుండి దాడికి దిగాయి. అక్టోబరు మొదటి వారానికల్లా పోలాండ్ ని జర్మనీ, సోవియెట్ యూనియన్ లు పూర్తిగా ఆక్రమించి పంచుకున్నాయి. ఇదే సమయంలో జపాన్ దళాలు చైనాలోని మరో పెద్ద నగరం చాంగ్షా ఆక్రమణకు విఫల యత్నం చేశాయి.

ముందు: పూర్వరంగం తరువాత: అక్షరాజ్యాల ముందంజ