రెనే లేనెక్
రెనే లేనెక్ | |
---|---|
జననం | 17 ఫిబ్రవరి 1781 క్విమర్, ఫ్రాన్స్ |
మరణం | 13 ఆగష్టు 1826 (వయసు 45) ప్లొరె, ఫ్రాన్స్ |
పౌరసత్వం | ఫ్రాన్స్ |
జాతీయత | ఫ్రెంచ్ |
ప్రసిద్ధి | స్టెతస్కోప్ ఆవిష్కర్త. |
రెని థియోఫిల్ హయసింత్ లెనెక్[1] (1781 ఫిబ్రవరి 17 - 1826 ఆగస్టు 13) ఒక ఫ్రెంచ్ వైద్యుడు. ఇతను హొపిటల్ నెకర్ హాస్పిటల్ లో పనిచేస్తున్నప్పుడు 1816 లో స్టెతస్కోప్ కనుగొన్నారు, వివిధ ఛాతీ పరిస్థితులు నిర్ధారించడానికి దానిని ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఇతను 1822 లో కాలేజ్ డి ఫ్రాన్స్ లో ఒక లెక్చరర్, 1823 లో వైద్య ప్రొఫెసర్ అయ్యాడు. ఇతని ఆఖరి నియామకాలు హొపిటల్ డి లా ఛారిటీలో మెడికల్ క్లినిక్ యొక్క హెడ్‌గా, కాలేజ్ డి ఫ్రాన్స్ లో ప్రొఫెసర్‌గా ఉన్నాయి. ఈయన 45 ఏళ్ల వయసులో 1826 లో క్షయ వ్యాధితో మరణించాడు.
ప్రారంభ జీవితం, వ్యక్తిత్వం
[మార్చు]లేనెక్ క్విమర్ (బ్రిటానీ) లో జన్మించాడు. ఇతనికి ఐదు లేదా ఆరు సంవత్సరాల వయసులో ఇతని తల్లి క్షయ వ్యాధితో చనిపోయింది, ఇతను ఇతని తాత అబె లేనెక్ (ఒక పురోహితుడు) తో జీవించడానికి వెళ్ళాడు. పన్నెండు సంవత్సరాల వయస్సులో ఇతను నాంటెస్ వెళ్లాడు ఇక్కడ తన అంకుల్ గుయిల్లౌమి-ఫ్రాంకోయిస్ లేనెక్ విశ్వవిద్యాలయంలో వైద్య శాఖలో పనిచేసేవాడు. లేనెక్ ప్రతిభ గల విద్యార్థి. ఇతను ఇంగ్లీష్, జర్మన్ నేర్చుకున్నాడు, ఇతని అంకుల్ మార్గదర్శకత్వంలో తన వైద్య అధ్యయనాన్ని ప్రారంభించాడు.
స్టెతస్కోప్ ఆవిష్కరణ
[మార్చు]1816లో ఇతను ఒక యువతిని పరీక్షించసాగాడు. ఆ రోజుల్లో వైద్యుడు రోగి గుండెను, ఊపిరితిత్తుల్ని పరీక్షించేటప్పుడు తన చెవుల్ని రోగి గుండెకు ఆనించి వినేవాడు. కాని లెనెక్ ఆ యువతిని పరీక్షించడానికి మొహమాటపడ్డాడు. గట్టి వస్తువుల ద్వారా చప్పుడు పయనిస్తుందని అతనికి తెలుసు. కాబట్టి అతను 24 కాగితాల్ని చుట్టగా చుట్టి వాటి ఒక కొనను తన చెవికీ, యింకొక కొనను ఆ యువతి గుండెకు ఆనించి వినగా మామూలు పద్ధతిలో కంటే చాలా స్పష్టంగా చప్పుడు వినపడి అతను సంతోషించాడు. తరువాత కొన్ని నెలలపాటు ఇతను నవీన స్టెతస్కోప్‌కు పూర్వపు మోటురకాలతో ప్రయోగాలు చేశాడు. చివరకు ఇతను వాడిన స్టెతస్కోప్ యొక్క సమాచారాన్నీ, నిరూపణన్నీ ప్రమాణ పత్రాల ద్వారా ఆధారంగా చేసుకొని ఒక రాత ప్రతిని 1817 మార్చి 8న తయారుచేశాడు. అంగశ్రవణానికి సంబంధించి నమోదైన మొట్టమొదటి రాతప్రతి యిదే. లెనెక్ తన పరికరానికి "లె సినిండర్" అని పేరుపెట్టాడు. తరువాత స్నేహితులు, సహచరులు ఇతనికి నచ్చచెప్పాక దానికి "స్టెతస్కోప్" అని పేరును మార్చాడు. గ్రీకు భాషలో స్టెతస్కోప్ కు "నేను గుండెను చూస్తున్నాను" అని అర్ధము. లెనెక్ ఆ స్టెతస్కోప్‌ను వెంటనే వాడుకలో ప్రవేశపెట్టాడు. తన ఇంటిలో ఒక చిన్న కర్మాగారాన్ని నెలకొల్పి ఇతను కర్ర స్టెతస్కోపుల్ని తయారుచేయసాగాడు. రెండు కర్ర ముక్కల్తో ఇతని పరికరం తయారైంది. ఒక వైపు చెవిలో పెట్టుకోడానికీ, యింకొకవైపు శంకు ఆకారంతోనూ వుండేది. బోలుగా వుండే యిత్తడి స్తంభాకారపు గొట్టంగల మూడవ ముక్కను ఆ శంకులాంటి మిక్కలోకి వుంచి గుండె కొట్టుకోవడాన్ని వినడానికీ ఊపిరితిత్తుల్ని పరీక్షించేటప్పుడు అది తీసివేయడానికీ వాడబడింది. ఈ స్టెతస్కోప్ ఉపయోగంతో లెనెక్ ఇంతకుముంచు తెలియని ఎన్నో రోగాల లక్షణాల్ని కనుగొని వాటిని నమోదుచేశాడు. 1818లో "Societe de I'Ecole de Medicine"కు అతను ఒక పత్రాన్ని సమర్పించాడు. తరువాత సంవత్సరం ఇతను కనుగొన్న పరిశోధనల్ని వివరిస్తూ ఒక గ్రంథాన్ని ప్రచురించాడు. ఒక్కొక్క గ్రంథ ప్రతితో సహా అతను నిర్మించిన స్టెతస్కోపులు కూడా అమ్మబడ్డాయి.