Jump to content

స్టెతస్కోప్

వికీపీడియా నుండి
3ఎమ్ లిట్ట్‌మాన్ క్లాసిక్-2 స్టెతస్కోపు

స్టెతస్కోప్ (ఆంగ్లం: Stethoscope) అనగా గుండె, ఊపిరితిత్తులు, ఉదరం లాంటి అవయవాల చప్పుడు విని పరీక్షించడానికి వాడే ఒక వైద్య పరికరం. దానిని రెని థియోఫిల్ హయసింత్ లెనెక్ (Rene Theophile Hyacinthe Laennec) అనే ఫ్రెంచ్ వైద్యుడు 1819లో కనుగొన్నాడు.[1][2]

చరిత్ర

[మార్చు]
స్టెతస్కోప్ ఆవిష్కర్త.
మొదటి తరం స్టెతస్కోపులు;

1781 నుండి 1826 వరకు జీవించిన లెనెక్ ప్రతిభాశాలియైన కల్పనాచరుతుడే కాక అనుభవశాలియైన వైద్యుడు కూడా. 1816లో అతను ఒక యువతిని పరీక్షించసాగాడు. ఆ రోజుల్లో వైద్యుడు రోగి గుండెను, ఊపిరితిత్తుల్ని పరీక్షించేటప్పుడు తన చెవుల్ని రోగి గుండెకు ఆనించి వినేవాడు. కాని లెనెక్ ఆ యువతిని పరీక్షించడానికి మొహమాటపడ్డాడు. గట్టి వస్తువుల ద్వారా చప్పుడు పయనిస్తుందని అతనికి తెలుసు. కాబట్టి అతను 24 కాగితాల్ని చుట్టగా చుట్టి వాటి ఒక కొనను తన చెవికీ, యింకొక కొనను ఆ యువతి గుండెకు ఆనించి వినగా మామూలు పద్ధతిలో కంటే చాలా స్పష్టంగా చప్పుడు వినపడి అతను సంతోషించాడు.

మొదటితరం స్టెతస్కోపులు.

ఆ ఏడాదే లెనెక్ పారిస్‌లోని నెకెర్ ఆస్పత్రిలో ఉద్యోగాన్ని స్వీకరించాడు. తరువాతి కొన్నె నెలలపాటు అతను నవీన స్టెతస్కోప్‌కు పూర్వపు మోటురకాలతో ప్రయోగాలు చేశాడు. చివరకు అతను వాడిన స్టెతస్కోప్ యొక్క సమాచారాన్నీ, నిరూపణన్నీ ప్రమాణ పత్రాల ద్వారా ఆధారంగా చేసుకొని ఒక రాత ప్రతిని 1817 మార్చి 8న తయారుచేశాడు. అంగశ్రవణానికి సంబంధించి నమోదైన మొట్టమొదటి రాతప్రతి యిదే. లెనెక్ తన పరికరానికి "లె సినిండర్" అని పేరుపెట్టాడు. తరువాత స్నేహితులు, సహచరులు అతనికి నచ్చచెప్పాక దానికి "స్టెతస్కోప్" అని పేరును మార్చాడు. గ్రీకు భాషలో స్టెతస్కోప్ కు "నేను గుండెను చూస్తున్నాను" అని అర్ధము. లెనెక్ ఆ స్టెతస్కోప్‌ను వెంటనే వాడుకలో ప్రవేశపెట్టాడు. తన ఇంటిలో ఒక చిన్న కర్మాగారాన్ని నెలకొల్పి అతను కర్ర స్టెతస్కోపుల్ని తయారుచేయసాగాడు. రెండు కర్ర ముక్కల్తో అతని పరికరం తయారైంది. ఒక వైపు చెవిలో పెట్టుకోడానికీ, యింకొకవైపు శంకు ఆకారంతోనూ వుండేది. బోలుగా వుండే యిత్తడి స్తంభాకారపు గొట్టంగల మూడవ ముక్కను ఆ శంకులాంటి మిక్కలోకి వుంచి గుండె కొట్టుకోవడాన్ని వినడానికీ ఊపిరితిత్తుల్ని పరీక్షించేటప్పుడు అది తీసివేయడానికీ వాడబడింది.

ఈ స్టెతస్కోప్ ఉపయోగంతో లెనెక్ ఇంతకుముంచు తెలియని ఎన్నో రోగాల లక్షణాల్ని కనుగొని వాటిని నమోదుచేశాడు. 1818లో "Societe de I'Ecole de Medicine"కు అతను ఒక పత్రాన్ని సమర్పించాడు. తరువాతి సంవత్సరం అతను కనుగొన్న పరిశోధనల్ని వివరిస్తూ ఒక గ్రంథాన్ని ప్రచురించాడు. ఒక్కొక్క గ్రంథ ప్రతితో సహా అతను నిర్మించిన స్టెతస్కోపులు కూడా అమ్మబడ్డాయి. లేనెక్ తన 45వ ఏట పిన్న వయసులోనే క్షయ వ్యాధి పీడితుడై చనిపోవడం శోచనీయం.

అకస్టిక్ స్టెతస్కోపు.

తదుపరి వైద్యుల్ని చూడగానే గుర్తించేలాగ స్టెతస్కోప్‌ లు వారి పరికరాలయ్యాయి. కాలం గడిచేసరికి లెనెక్ కనుగొన్న మోనారల్ స్టెతస్కోప్‌కు (దానికి ఆ పేరు రావడానికి కారణం ఒక చెవికే అది వాడబడేది) పరిశోధకులు మెరుగులు దిద్దారు. దానిలో చెప్పుకోదగ్గది పియెర్ అడాల్ఫ్ పియరీ (1794-1879)ది. అతను "ప్లెక్సిమీటెర్" అనే యింకొక పరికరాన్ని స్టెతస్కోప్‌లోకి చేర్చి స్టెతస్కోప్ పరిమాణాన్ని సగానికి తగ్గించాడు. వంగేలాటి సరళమైన మోనారల్ స్టెతస్కోప్‌లు కూడా ప్రవేశపెట్టాయి. వీటికి 14 నుండి 18 అంగుళాలు పొడుగుగా పట్టుతో కప్పబడిన స్ప్రింగులకు ఒక వైపు గుండె ఆనించుకునేలాటి బిళ్ళ, మరిఒకవైపు చెవికి వినిపించడానికి ఒక చిన్న బిళ్ళ చేర్చబడ్డాయి[3]. ఇంకొక మాదిరి స్టెతస్కోపును 1828లో చార్లెస్ జేంస్ బ్లూసియస్ నిర్మించాడు[4].లెనెక్ పరికరం కంటే యిది చిన్నది. సుకరమైనది కూడా. ఆ తరువాత థెర్మోమీటర్ లాటి వైద్య పరికరాలను కూడా తీసుకుని వెళ్ళేలా స్టెతస్కోపులు ఉపకరించాయి[5]. ఏనుగు దంతంలాటి విలువైన వస్తువులతో మోజు గొలిపేలా నిర్మించబడ్డ స్టెతస్కోపుల్ని ఉన్నత వర్గ వైద్యులు వాడుకునేవారు. మోనారల్ స్టెతస్కోప్ 30 ఏళ్లకు పైగా వాడుకలో ఉన్నాక పరిశోధకులు రెండు చెవులతో వాడుకునేలాటి పరికరాన్ని నిర్మించడం గురించి ఆలోచించారు. అయితే రష్యాలో, ఇంగ్లాండులోనూ 19వ శతాబ్దం మధ్య భాగం వరకు ఈ మోనరల్ స్టెతస్కోప్ అధిక వ్యాప్తిని పొందింది.

వ్యాపార రంగంలో స్టెతస్కోపు

[మార్చు]

సిన్సినాటిలో 1851లో డా.మార్ష్ బైనారల్ స్టెతస్కోప్ నమూనాను వ్యారపరంగా ప్రవేశపెట్టి ఆద్యుడయ్యాడు. యాభై ఏళ్ళ తరువాత గుండెపై ఉంచుకునే విభాజకం గురించి ఆలోచన కార్యరూపం దాల్చింది. న్యూయార్క్ లో నార్తెర్న్ డిస్పన్సరీలోని డా.జార్జ్ కామంకు మార్ష్ నమూనాపై ఆధారపడిన్ బైనారల్ స్టెతస్కోప్‌ను 1855లో కనుగొన్న ఫలితం దక్కింది. ఈ నమూనాకు ప్రజాదరణ కలగడానికి పదేళ్ళు పట్టింది. 1863లో ఒకేసారి శ్రోత గుండెలో రెండు వివిధ ప్రదేశాలలో చప్పుడు విని పరిశీలించేలా రెండు చెస్ట్ పీసులతో వేరే స్టెతస్కోప్‌ను స్కాట్ అలీసన్ కనుగొన్నాడు. కాని యిది ఆచరణ సాధ్యమనిపించుకోలేదు. 1884లో ఐడన్ స్మిత్ విభిన్నమైన బైనారల్ స్టెతస్కోప్‌ను మూత్ర సంబంధియైన సూక్ష్మనాళికగానూ, రక్తస్రావాన్ని ఆపేట్టుగానూ నిర్మించాడు. 1885లో ఫోర్ద్ గంట చెస్ట్ పీస్ కనుగొనబడింది. చెవులకు గొట్టాలలోని చప్పుడును రెండు రబ్బర్ గొట్టాల ద్వారా ప్రసరింపజేసేలాగ ఒక ఉక్కు చెస్ట్ పీస్ అడుగు భాగం నల్ల చేవమాను లేక దంతంతో వుండేలాగ నిర్మితమైంది. 1910లో మళ్ళీ విభాజక చెస్ట్ పీస్ ప్రవేశించే అవకాశం కలిగింది. ఫోర్డ్ గంటని పలుచటి పొరతో సన్నటి చప్పుడును గాలనం చేసి, ఎక్కువ ధ్వని ప్రసరించడానికి సాధ్యమయింది. ఇప్పుడు వాడుకలో వున్న నవీన స్టెతస్కోప్‌కు ఇది ప్రమాణమైంది.

నేటి స్టెతస్కోప్

[మార్చు]

ప్రస్తుతం వైద్య, విజ్ఞాన శాస్త్ర రంగాలలో వాడుకలో వున్న సున్నితమైన ఉపకరణాల అభివృద్ధికి స్టెతస్కోప్‌లోని సూత్రం ఉపకరిస్తుంది. రోగి ప్రక్కనే అతని గుండె కొట్టుకోవడాన్ని పర్యవేక్షించే కార్డియోమాటిక్ యంత్రం, గుండెను ప్రేరేపించే కార్డియాక్ పేసర్ దీనికి రెండు ఉదాహరణలగా చెప్పవచ్చు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో డాగ్యులస్ విమాన సముదాయం సముద్రంలోని జలాంతర్గాముల్ని కనిపెట్టడానికి విద్యుత్కణ సంబంధి స్టెతస్కోప్‌ను రూపొందించింది.

స్టెతస్కోపు రకాలు

[మార్చు]
  • సాధారణ స్టెతస్కోపు
  • అకస్టిక్ స్టెతస్కోపు [6]
  • ఎలక్ట్రానిక్ స్టెతస్కోపు
  • నాయిస్ రిడక్షన్ స్టెతస్కోపు
  • రికార్డింగ్ స్టెతస్కోపు [7]
  • ఫాటల్ స్టెతస్కోపు
  • డాప్లర్ స్టెతస్కోపు [8][9]

మూలాలు

[మార్చు]
  1. http://www.telugudanam.co.in/vijnaanam/meeku_telusaa/Stethoscope.htm[permanent dead link]
  2. Laennec, René (1819). De l'auscultation médiate ou traité du diagnostic des maladies des poumon et du coeur. Paris: Brosson & Chaudé.
  3. Samuel Wilks, "Evolution of the stethoscope", Popular Science, vol.22, no.28, pp.488-491, Feb 1883 ISSN 0161-7370.
    Golding Bird, "Advantages presented by the employment of a stethoscope with a flexible tube", London Medical Gazette, vol.1, pp.440-412, 11 December 1840.
  4. Wilks, p.490, cites Comins, "A flexible stethoscope", Lancet 29 August 1829.
  5. Duffin, Jacalyn. "Big Ideas: Jacalyn Duffin on the History of the Stethoscope". TVO. Archived from the original on 27 సెప్టెంబరు 2013. Retrieved 28 November 2012.
  6. Eli Finkelstein (2008-07-01). "The Ultimate Acoustic Stethoscope Review". Retrieved 2010-01-25.
  7. Palaniappan R, Sundaraj K, Ahamed NU, Arjunan A, Sundaraj S. Computer-based Respiratory Sound Analysis: A Systematic Review. IETE Tech Rev 2013;30:248-56
  8. Mc Loughlin MJ and Mc Loughlin S. Cardiac auscultation: Preliminary findings of a pilot study using continuous Wave Doppler and comparison with classic auscultation Int J Cardiol. 2013 Jul 31;167(2):590-1
  9. http://www.amazon.com/Cardiac-Auscultation-Continuous-Stethoscope-ebook/dp/B00AXFB2IG/ref=sr_1_3?s=digital-text&ie=UTF8&qid=1369946217&sr=1-3&keywords=mario+mc+loughlin

ఇతర లింకులు

[మార్చు]