Jump to content

రోవర్ (అంతరిక్ష అన్వేషణ)

వికీపీడియా నుండి
సోజర్నర్, మెర్, క్యూరియాసిటీ సహా మూడు వేర్వేరు అంగారక గ్రహ రోవర్ నమూనాలు.
అపోలో 15 చంద్ర రోవర్

రోవర్ (ఆంగ్లంలో Rover) అనగా ఒక అంతరిక్ష అన్వేషణ వాహనం, ఇది గ్రహాల ఉపరితలంపై లేదా ఇతర గ్రహాల పరిమాణంలో ఉండే ఖగోళ వస్తువులపై తిరగడానికి రూపొందించబడిన వాహనం. సాధారణంగా రోవర్లను లాండర్ తరహా అంతరిక్ష నౌక ద్వారా గ్రహ ఉపరితలానికి చేరుస్తారు. రోవర్లు తమను తాము స్వీయ నియంత్రణ చేసుకుంటూ ఆ గ్రహంపై ఖగోళ అన్వేషణ జరుపుతాయి. ఇవి నడిపేందుకు సౌర శక్తి లేదా అణు విద్యుత్ ఉపయోగిస్తారు. ఆయా అవసరాలకు తగ్గట్టు వీటిని రూపొందిస్తారు.

చంద్రుడు, ఇతర గ్రహాలపై ఇవి ల్యాండర్ సహాయంతో దిగి వివిధ ఖనిజాలు, నీటి అన్వేషణ నమూనాలు సేకరించడమే కాదు, వాటిని పరీక్షించి ఫలితాలను ల్యాండర్ ద్వారా భూమికి పంపుతాయి.

భారతదేశపు చంద్రయాన్-3 లోని ప్రజ్ఞాన్ రోవర్, అమెరికా అపోలో మిషన్ల LRV (Lunar Roving Vehicle), చైనా యుటు (Yutu) లు రోవర్లకు ప్రముఖ ఉదాహరణలు. కెనడా, ఆస్ట్రేలియా కూడా తమ సొంత చంద్ర రోవర్లను అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి భవిష్యత్తులో చంద్రుని అన్వేషణలో భాగం కానున్నాయి.[1]

భారతదేశపు ప్రజ్ఞాన్ రోవర్, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో పెద్ద, పురాతనమైన బిలాలను (craters) కనుగొని, చంద్రుని చరిత్ర గురించి ముఖ్యమైన విషయాలను వెల్లడించింది.

పదం యొక్క మూలం

[మార్చు]

రోవర్ (Rover) అన్న పదానికి ఆంగ్లంలో అన్వేషకుడు, తిరిగేవాడు అని అర్ధం.[2]

సాంకేతికత

[మార్చు]

భూమికి దూరంగా ఉన్న ఖగోళ వస్తువులపై దిగే రోవర్లు, గ్రహ అన్వేషణ రోవర్లను తమను తాము నియంత్రించుకునే సాంకేతికతతో మాత్రమే రూపొందిస్తారు. దీనికి కారణం రేడియో సిగ్నల్స్ ప్రయాణించే వేగం నెమ్మదిగా ఉండడం మూలంగా వాటిని భూమి నుంచి నియంత్రించడం కష్టం. ఉదాహరణకు, అంగారకుని (మార్స్) నుండి భూమికి సిగ్నల్ చేరడానికి 3 నుండి 21 నిమిషాల మధ్య సమయం పడుతుంది. అందుకే రోవర్ల నావిగేషనుకు, డేటా సముపార్జనకూ సంబంధించినంతవరకు, గ్రౌండ్ కంట్రోల్ జోక్యం పెద్దగా లేకుండా, స్వయంప్రతిపత్తితో పనిచేస్తాయి. అయినప్పటికీ, అవి అన్వేషించాల్సిన లక్ష్యాలను గుర్తించడానికీ, సౌరశక్తి గరిష్ఠ స్థాయిలో ఉత్పత్తి అయ్యేలా తాను ఏ దిశలో నిలబడాలో నిర్ణయించడానికి మానవ సహాయం అవసరమే.[3]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Canada's lunar dream: First-ever moon rover unveiled for launch". The Times of India. 2025-09-02. ISSN 0971-8257. Retrieved 2025-12-10.
  2. ↑ "Rover - Definition, Meaning & Synonyms". Vocabulary.com (in ఇంగ్లీష్). Retrieved 2025-12-10.
  3. ↑ Michael Schirber (8 July 2012). "Rovers of the future may make decisions on their own". Astrobiology Magazine. Mother Nature Network.