లంకిణి
లంకిణి హిందూ పురాణమైన రామాయణంలో కనిపించే రాక్షసి. ఈమె పేరు ప్రకారం లంకకు కాపలాగా ఉండే మూర్తీభవించిన అధిదేవత.[1]
బ్రహ్మ శాపం
[మార్చు]రామాయణం ప్రకారం ఈమె బ్రహ్మ లోకానికి కాపలాగా ఉండేది. సకలలోకాలకూ సృష్టికర్త అయిన బ్రహ్మ లోకానికే తాను కాపలా కాస్తున్నాననే గర్వంతో ఇతరులను చిన్నచూపు చూడటంతో రాక్షసులకు శాశ్వతంగా కాపలాగా ఉండమని బ్రహ్మ ఆమెను శపించాడు. లంకిణి తన తప్పును తెలుసుకుని బ్రహ్మను క్షమించమని కోరింది. తన శాపాన్ని వెనకకు తీసుకోలేని బ్రహ్మ ఆమెను ఒక వానరం చేతిలో ఓడిపోతే అది రాక్షస జాతి అంతానికి కారణమవుతుందని, ఆమెకు శాప విమోచనం అవుతుందని వరం ఇస్తాడు.[2]
హనుమతో పోరు
[మార్చు]రావణుడు అపహరించిన సీతను వెతుకుతూ హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరుకుంటాడు. అక్కడ లంకకు కాపలాగా ఉన్న ఈమెను హనుమను అడ్డగించి ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తుంది. హనుమ తన ఉద్దేశ్యాన్ని చెప్పకుండా ఊరికే లంకను చూసిపోదామని వచ్చానని చెబుతాడు. అతన్ని చొరబాటుదారుగా భావించిన లంకిణి అతని వీపు మీద ఒక చరుపు చరుస్తుంది. హనుమకు కోపం వచ్చి శరీరాన్ని పెంచి ఎడమచేతి పిడికిలి బిగించి లంకిణి తలపైన దెబ్బ వేస్తాడు. ఆ దెబ్బకు ఆమె విలవిలలాడుతూ నేల కూలుతుంది. అబలను చంపడం ధర్మం కాదని హనుమ అంతటితో విడిచిపెడతాడు. గాయపడ్డ లంకిణి బ్రహ్మ తనకు ఇచ్చిన వరం గుర్తుకు వస్తుంది. ఇదే లంకా వినాశనానికి హేతువని గుర్తించి హనుమకు తెలియజేసి అతన్ని లోపలికి వెళ్ళమంటుంది. అలా ఆమెకు శాపవిమోచనం కలుగుతుంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ Kishore, B.R. (1995). Ramayana. Diamond Pocket Books. ISBN 9789350837467. Retrieved 2017-01-08.
- ↑ Yedavalli, S.K. (2015). Ramayan. Lulu.com. ISBN 9781304901002. Retrieved 2017-01-08.[permanent dead link]
- ↑ Ramayan: India's Classic Story of Divine Love: P. R. Mitchell: 9780595507634: Amazon.com: Books. February 2009. ISBN 978-0595507634.