Jump to content

తెలుగు వాక్యం

వికీపీడియా నుండి
(వాక్యాలు నుండి దారిమార్పు చెందింది)
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గోడలపై రాసిన తెలుగు వాక్యాలు

విషయం అర్థవంతముగా, సంపూర్ణముగా స్పష్టముగా భావప్రకటన కలిగించెడి పదముల సముదాయమును వాక్యం అంటారు. వాక్యములో మూడు ప్రధానమైన భాగాలు ఉన్నాయి.

హిందూమతం లోని ఆధ్యాత్మిక, ఉపనిషత్తుల సారము నాలుగు మహా వాక్యాలు. ఒక్కొక్క వేదం యొక్క సారమే ఒక మహావాక్యంగా ఈ మహాకావ్యాలు చెబుతాయి.

భాగాలు

[మార్చు]

అత్యంత ప్రాచీన కాలముననే మన దేశమున శాస్త్రకారులు వాక్య నిర్వచన గావించారు. పదసమూగము నుండి పుట్టిన అర్థము వాక్యమట- పద సంఘాతజం వాక్యం (బృహద్దేవత), పదములవలన గాక పదార్థముల వలనే వాక్యము పుట్టుచున్నదని కుమారిల భట్టు - పదార్థైః పద విజ్ఞాతైః వాక్యార్థః ప్రతి ఉద్యతె (తంత్ర వార్తికము), ఆకాంక్ష కలిగి ఏకార్థమును బోధించునది వాక్యము (మీమాంస సూత్రము), వాక్యము నిరాకాంక్షమని కాత్యాయన శ్రౌత సూత్రము చెప్పుచున్నది. అనగా వాక్యము తనకు వెలుపలి పదములతో ఆకాంక్షలేక స్వయం సమగ్రమగుట అన్నమాట. వక్త చేసిన అర్థయుక్తమైన శబ్ద సముదాయము వాక్యము.

వాక్యములో "యోగ్యత, ఆకాంక్ష, ఆసత్తి" అను మూడు అంశములుండవలెను. ప్రాచీనులు యోగ్యత అనగా సంబంధార్హత్వము అనిరి. ఇది వాక్యామాత్ర పరము. అర్ధ అబాధ అర్ధాపరము. దీనినే కొందరు బోధా నిశ్చయ అభావమని అంటారు. ఆకాంక్ష అనగా నిలుపుదల లేకుండా వెంటవెంటనే వచ్చు పదార్ధముల మీది ఆదరము. ఇది వినువారికి తెలిసికొనవలెను అను అపేక్షారూపమున ఉండును. పులి, సింహము, ఏనుగు అని పల్కినచో వినువారికి ఆకాంక్ష కలుగదు. అదే ఇది పులి, ఇది సింహము, ఇది ఏనుగు అని అనగానే ఏది పులి, ఎక్కడ ఉంది అను ఆకాంక్షకు అవకాశమున్నది. ఆసత్తి అనునది వాక్యమందలి పదములను సన్నిహిత్యముగ ఉచ్చరించునపుడు గాని అర్థము బోధపడదు. రాముడు అను పదము ఇప్పుడును, సీత అను పదము మరియొక గంటకును, అడవికి వెళ్ళిరు అని రేపు చెప్పినచో వాక్యము కానేరదు. కుమారిలభట్టు చెప్పినట్లు ఆకాంక్ష అనగా పదార్ధముల పరస్పర జిజ్ఞాసా విషయత్వ యోగ్యత. వాక్యా భాగములు (క్రింద తెలిపడిన) ఈ మూడు అంశములతో ముడిపడి ఉన్నాయి.

  • కర్త: ఒక పనిని చేయువారు.
  • కర్మ: ఆ పని యొక్క ఫలితములను అనుభవించునది.
  • క్రియ: పనిని తెలియజేయు పదము.

అనగా క్రియా శ్రవణము వలన కారకము యొక్కయు, కారక శ్రవణము వలన క్రియ యొక్కయు, అట్లే కారణ శ్రవణము వలన కర్తవ్యము యొక్కయు జిజ్ఞాస కలుగును. ఉదా: కొట్టు అను క్రియ వినగానే దేనిచే? అను కారక జిజ్ఞాస, కర్రచే అనగానే ఏమి చేయవలెను? అను క్రియా జిజ్ఞాస కలుగును. అట్లే వాన వచ్చుచున్నది అని వినగానే గొడుగు తెరుచుకొనుటయో, తడువని చోటుకుపోయి నిలుచుండవలెనని ఇతి కర్తవ్యతా రూపమైన జిజ్ఞాస కలుగును. ఇది వాక్యమాత్ర పరము. తెమ్ము అనే క్రియకు దేనిని? అను సహజ జిజ్ఞాస. ఇది ఉత్తింతాకాంక్ష అనబడును. ఆసత్తి అనునది సన్నిహిత్య అభావము, శబ్దబోధిత్వ అభావము అను రెండు రకములు. సన్నిహిత్య అభావములో పదముల అవ్యవధానము లేకుండుట-ఫలితముగా అర్థము ఉపస్థితి తప్పుట-రెండవదానిలో శబ్దము లోపించుట. "ఆవును కట్టివేయుము" అనుటకు గుర్రమును కట్టి వేయుము అనుట, మీమాంసకులు లోపించిన శబ్దమును ఊహించినచో శ్రుతార్ధాపత్తి అంటారు. ప్రకరణమును బట్టి క్రియను ఊహించినచో క్రియార్దాపత్తి. తలుపు అనగానే తీయవలెనా? మూయవలెనా? అను దానిని ఊహించినట్లు. శ్రుతార్ధాపత్తిలో కేవల శబ్దమును ఊహించుట. ఇదే అభిదానాపత్తి అగును.

రకాలు

[మార్చు]
  • సంపూర్ణ వాక్యము: సమాపక క్రియలో పూర్తి అగునట్టి వాక్యమును సంపూర్ణ వాక్యము లేదా సామాన్య వాక్యము అంటారు. ఉదా: కల్యాణమండపములో వివాహము జరుగుతున్నది.
  • అసంపూర్ణ వాక్యము: అసమాపక క్రియలలో వాడిన వాక్యమును అసంపూర్ణ వాక్యము అంటారు. ఉదా: నేను దేవాలయమునకు వెళ్ళి,
  • అవాంతర వాక్యము: ఒక సంపూర్ణము కాని వాక్యమును, ప్రసంగమున మధ్యలో వచ్చెడి వాక్యమును అవాంతర వాక్యము అంటారు. ఉదా: తగిన ఇంధనము లేనిచో విమానము ఎగురలేదు.
  • సంశ్లిష్ట వాక్యము: సంపూర్ణ వాక్యములను, అవాంతర వాక్యములను కలిగియుండి పూర్తి అర్థము నిచ్చు వాక్యమును సంశ్లిష్ట వాక్యము అంటారు. ఉదా: నీవు సక్రమముగా పోటీకి వచ్చి, ప్రశ్నలకు శ్రద్ధగా సమాధానములు వ్రాయగలవు.
  • సంయుక్త వాక్యం: వాక్యంలో కర్త, కర్మ, క్రియలలో ఏవైనా ఒకటి కన్నా ఎక్కువ ఉండి, అవి,, లేదా, కావున, కాబట్టి, వంటి సముచ్చాయలతో సంధానింపబడితే ఆ వాక్యాన్ని సంయుక్త వాక్యం అంటారు. ఉదా: రాము, రాజు గద్వాలకు వచ్చారు. వానలు బాగా పడినవి కాబట్టి పంటలు పండాయి.
  • కర్తరి వాక్యం : కర్మణి వాక్యం: కర్త ప్రధానంగా కలిగే వాక్యాలు కర్తరి వాక్యాలు. కర్మ ప్రధానంగా కలిగే వాక్యాలు కర్మణి వాక్యాలు. ఉదా: రాముడు రాక్షసులను సంహరించాడు - కర్తరి వాక్యం; రామునిచే రాక్షసులు సంహరింపబడిరి - కర్మణి వాక్యం. కర్మణి ప్రయోగం అనేది తెలుగు భాషలో సహజంగా లేదు. ఇది ఇతర భాషల నుండి తెలుగు లోనికి వచ్చింది. కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి వస్తుంది, కర్మకు ద్వితీయా విభక్తి వస్తుంది. కర్మణి వాక్యంలో కర్తకు తృతీయా విభక్తి, కర్మకు ప్రథమా విభక్తి వస్తుంది.
  • ప్రశ్నార్థక వాక్యాలు: సమాధానాన్ని ఆశించి అడిగేది ప్రశ్న. అలాంటి వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఉదా: రాణి పాఠాలు చదువుచున్నదా ? ఏమిటి, ఎందుకు, ఎలాగ, ఎవరు, ఎక్కడ, ఏది? మొదలైనవి ప్రశ్నలకు మూలాలైన ప్రశ్నార్థక పదాలు..

కథనం

[మార్చు]
  • ప్రత్యక్ష కథనం : ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా ఉన్నదున్నట్లు చెప్పటం ప్రత్యక్ష కథనం. నేను, మేము, నా, మా వంటి పదాలతో వాక్యాలు మొదలవుతాయి. చెప్పిన మాటలను ఉద్దరణ చిహ్నాలలో ఉంచుతారు.

ఉదా: "నా కన్నా గొప్ప రచయిత తెలుగులో మరొకరు లేరు " అని సుబ్బారావు, వెంకట్రావుతో అన్నాడు.

  • పరోక్ష కథనం : వేరేవాళ్లు చెప్పిన దాన్ని మన మాటల్లో చెబితే అది పరోక్ష కథనం. ఉదా: తన కన్నా గొప్ప రచయిత తెలుగులో మరొకరు లేరని సుబ్బారావు వెంకట్రావుతో అన్నాడు.

ఈ రెండూ అనుకరణాలే. అనుకరణంలో అంతా చెప్పి చివరికి "అని" అనేదాన్ని వాడతాం. దీనికి అనుకారకం అని పేరు. ఇతరులు చెప్పిన దాన్ని, లేక తాను చెప్పిన దాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుకరించి చెప్పడం ప్రత్యక్షానుకృతి. ఉదా: నేను నీతో "నేను రాను" అని చెప్పాను.అనుకరించిన దానిలోని విషయాన్ని లేదా అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించడం పరోక్షానుకృతి. ఉదా: నేను నీతో రానని చెప్పాను.

మూలాలు

[మార్చు]
  • తెలుగు వ్యాకరణము: వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.దిలీప్

వనరులు

[మార్చు]