వాటర్ షెడ్ పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వర్షాభావ ప్రాంతాల్లో నిర్దిష్ట విధానాలతో వాన నీటి సంరక్షణ చేసి భూగర్భ జలాలను పెంచడం వాటర్‌షెడ్ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం అమలయ్యే ప్రాంతంలో పడే ప్రతి చినుకునూ ఆ ప్రాంతంలోనే భూమిలోకి ఇంకేలా చేస్తారు. ఇందుకోసం కురిసిన కాస్తంత వర్షం వృథాగా పోకుండా అక్కడికక్కడే అడ్డుకట్ట వేసి నీటిని భూమిలో ఇంకేలా చేస్తారు. అందులో భాగంగానే కొండలు, వాలు ప్రాంతాల్లో పై నుంచి వచ్చే నీటినీ భూగర్భ జలంగా మార్చే ప్రక్రియ ఉంది. చెక్‌డ్యామ్‌లు, ఊట చెరువులు లాంటి నిర్మాణాలతో నీటిని నిల్వ చేస్తారు. వాగులు, వంకల వెంట మొక్కలు, అనేక రకాల చెట్లను పెంచడంద్వారా పర్యావరణ పరిరక్షణ చేపడతారు. తద్వారా వర్షపాతాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు.

వాటర్‌షెడ్ పథకం కింద నీటి నిలువ కుంటలు, చెక్‌డ్యామ్‌లను, పొలాల నుంచి మట్టి కొట్టుకు పోకుండా అడ్డుగా రాతి కట్టలు, రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటి, చెట్ల పెంపకం, కందకాల తవ్వకం, ఊటకుంటలు, డగ్ అవుట్ పాండ్స్ (వాగుల్లో నుంచి వచ్చే నీరు నిల్వ చేసేందుకు తవ్వే కుంటలు), వాగులో ఇంకుడు గుంటలు, రైతువారీ కుంటల పనులు వంటి కార్యక్రమాలను చేపడతారు. చేపట్టిన పనులపై ఆయా గ్రామాల్లో సామాజిక తనిఖీ సభలు నిర్వహిస్తారు. ఈ తనిఖీలకు వాటర్‌షెడ్ పనులు కొనసాగుతున్న గ్రామాల్లో నలుగురు వలంటీర్లను ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన ఈ వలంటీర్లను స్వగ్రామంలో కాకుండా ఇతర గ్రామాలకు పంపించి క్షేత్ర స్థాయిలో పనులను తనిఖీ చేస్తారు. అనంతరం తనిఖీ నివేదికలను, గ్రామ పంచాయతీల తీర్మానంతో కలిపి కలెక్టర్‌కు నివేదిస్తారు. కలెక్టర్ ఆదేశాలతో గ్రామసభలు నిర్వహించి బహిరంగచర్చ జరుపుతారు.

ఈ వాటర్‌షెడ్ పథకం మరింత అభివృద్ధి కోసం హరియాలీ మార్గదర్శక సూత్రాలు ప్రచురించబడినాయి. ప్రజాస్వామ్య పరిపాలన 73 వ రాజ్యాంగ సవరణ, వ్యవసాయము – పేదరికం, గ్రామీనాభివృద్ధి పథకాలు, వాటర్ షెడ్ నిర్వచనం, ఉద్దేశాలు, పరిణామ క్రమం, చతుర్విధ జల ప్రక్రియ, హరియాలీ మార్గదర్శక సూత్రాలు – సంస్థాగత ఏర్పాట్లు – నిధుల కేటాయింపు, వాటర్ షెడ్ పథకం అమలులో గ్రామ పంచాయితీ, గ్రామ సంఘం, రైతుల బృందం, కూలి బృందం పాత్ర వుంటుంది. [1]

మూలాలు[మార్చు]