వాడపల్లి వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాడపల్లి వెంకటేశ్వరరావు
జననంఆగష్టు 26, 1963
నర్సిపూడి, తూర్పు గోదావరి జిల్లా, భారతదేశం
మరణంజూలై 7, 2008
మరణ కారణంబాంబుప్రేలుడు
ఇతర పేర్లువి. వి. రావు
వృత్తిదౌత్యవేత్త
జీవిత భాగస్వామిమాలతి
పిల్లలు2; కుమార్తె, కుమారుడు
తల్లిదండ్రులు
  • అప్పలాచార్యులు (తండ్రి)
  • సుభద్ర (తల్లి)

వాడపల్లి వెంకటేశ్వరరావు (ఆగష్టు 26, 1963 - జూలై 7, 2008) భారతదేశంలో రెండవ అత్యున్నత పురస్కారం అయిన కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు.[1][2]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

వాడపల్లి వెంకటేశ్వరరావు 1963, ఆగష్టు 26 వ తేదీన తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామంలో జన్మించారు. తండ్రి వాడపల్లి అప్పలాచార్యులు రిటైర్డ్ హెల్త్ ఎక్స్ టెన్షన్ అధికారి, తల్లి సుభద్ర. వి.వి.రావు తన జన్మస్థలం నందే ఎస్.ఎస్.సి.వరకు చదివారు. ఆ తర్వాత ఎ.పి.ఆర్.జె.సి. నాగార్జున సాగర్ లో ఇంటర్మీడియట్ 1978-80లో పూర్తిచేశారు. వారేవు చినవీరభద్రుడు కూడా వీరి సహాధ్యాయి.

చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండే వి.వి.రావు ఎంట్రంస్ ద్వారా రాష్ట్రంలోనే ప్రతిష్ఠాత్మకమైన కర్నూలులో వుండే సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తన బి.ఎ. గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. సివిల్ సర్వీసెస్ లో టాపర్ గా నిలవడమే తన ధ్యేయమని తన సిల్వర్ జూబ్లీ కళాశాల మిత్రులతో వి.వి.రావు చెప్పడం వల్ల అందరూ వి.వి.రావును పేరుతో కాకుండా "టాపర్" అని పిలిచేవారు. సిల్వర్ జూబ్లీ కళాశాలలో వి.వి.రావు తన జీవిత గమనమును నిర్ణయించుకొని అక్కడి చక్కటి వాతావరణాన్ని తన మేధస్సు అభివృద్ధికి ఉపయోగించుకున్నాడ 1983 నుండి 1985 సంలో హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. వెంటనే ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి ఎం.పిల్ పూర్తిచేశారు.

ఆ తర్వాత అదే విశ్వవిద్యాలయం నుండి ఆసియా దేశాలతో భారతీయ సంబంధాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ సంపాదించాడు.[3] ఆ వెంటనే 1990 సంవత్సరంలో సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై ఆప్షంస్ లో ఐ.పి.ఎస్./ఐ.ఎఫ్.ఎస్. లకు అవకాశం వుండగా తండ్రి అప్పలాచార్యులు సలహా మేరకు, తనకు అప్పటికే ప్రపంచదేశాలతో భారత సంబంధాలపై పరిశోధన ద్వారా మంచి పట్టు వుండడం, ప్రపంచదేశాలలో నిత్య ప్రయాణీకుడిగా ఉండాలనే తన అభీష్టం మేరకు ఇండియన్ ఫారిన్ సర్వీస్ ను ఎంపిక చేసుకున్నారు.

కీర్తిచక్ర పురస్కారం

[మార్చు]

తొలుత జర్మనీలోని భారత రాయభార కార్యాలయంలో ఉద్యోగంలో చేరారు. త ర్వాత శ్రీలంక, నేపాల్, భూటాన్, ఇండియా, అమెరికా వంటి దేశాలలో 1990 నుండి 2005 వరకు పనిచేశారు. ఆఫ్ఘనిస్తాన్ లోని రాయబార కార్యాలయంలో పనిచేయడానికి ఎందరో విముఖత చూపిన సమయంలో వి.వి.రావు గారిని ఆ పదవికి భారత ప్రభుత్వం నిర్ణయించింది. విధి నిర్వహణలో మంచి పట్టుదల, సమర్ధత కలిగిన అధికారిగా సౌమ్యునిగా గుర్తింపు పొందిన వి.వి.రావు భారత ప్రభుత్వం తన భుజస్కంధాలపై వుంచిన బాధ్యతలను ఒక సవాలుగా తీసుకొని అక్కడ బాధ్యతలలో చేరారు. అక్కడి కాబూల్ లోని భారత రాయబార కార్యాలయంలో కన్సులేట్ గా 3 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఆఫ్ఘనిస్తాన్ లోని ముఖ్యమైన భాషలలో ఒకటైన "దారి" భాష యందు చక్కటి పట్టువున్న వి.వి.రావు ఇరుదేశాల బంధాన్ని ఇనుమడింపజేశారు.

2008 జూలై 7వ తేదీన కాబూల్ లోని భారత రాయబార కార్యాలయం ముందు జరిగిన తీవ్రవాదుల ఆత్మాహుతి దాడిలో మొత్తం 41 మంది మృతి చెందగా అందులో భారత్ రక్షణ విభాగానికి చెందిన బ్రిగేడియర్ మెహతాతో పాటు మరో ముగ్గురు కార్యాలయ సిబ్బంది మరణించారు. వారితోపాటు మరణించిన వారిలో భారతీయ దౌత్యవేత్త అయిన 44 యేళ్ళ వాడపల్లి వెంకటేశ్వరరావు ఉన్నారు.[4]

అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికాధికారులకు ఇచ్చే కీర్తిచక్ర పురస్కారాన్ని వి.వి.రావు గార్కి తన మరణానంతరం భారత ప్రభుత్వం ప్రకటించింది. వి.వి.రావు గారు ఆవిధంగా కీర్తిచక్రతో గౌరవించబడిన మొట్టమొదటి సైనికేతర భారతీయుడిగా గుర్తింపుపొందారు.

వి.వి.రావు గారి పదవిని సమానమైన హోదా కలిగిన భారతీయ సాంస్కృతిక సంస్థ, బ్యాంకాక్ కు డైరెక్టర్ గా పదవీ బాధ్యతలను ఆయన ధర్మపత్ని వాడపల్లి మాలతీరావుకు భారత ప్రభుత్వం అప్పగించి గౌరవించింది.[5]

కుటుంబం

[మార్చు]

వీరికి ఒక అన్న కృష్ణ, చెల్లి శేషు కుటుంబ సభ్యులు. అన్న వి.ఎస్.టి.కృష్ణ మైసూరు లోని ఎస్.ఎస్. మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇతడు 1993 సంవత్సరంలో కాకినాడకు చెందిన మాలతిని వివాహం చేసుకున్నారు. మాలతి ఢిల్లీలో గల విదేశి వ్యవహారాల అధికారులు వారి పిల్లల చదువుకోసం ఏర్పాటుచేసుకున్న స్వచ్ఛంద సంస్థకు చెందిన సంస్కృతీ స్కూల్ లో మానసిక వికలాంగులకు బోధించే ఉపాధ్యాయని. వీరికి ఒక కుమారుడు అనిఖేత్, ఒక కుమార్తె అమూల్య. వీరు ఢిల్లీలో విద్యాభ్యాసం చేస్తున్నారు.[6]

మూలాలు

[మార్చు]
  1. Kirti Chakra for Kabul embassy martyrs
  2. Kabul, Mumbai terror martyrs awarded Kirti Chakra
  3. "The reunion that was never to be, The Hindu, July 8, 2008". Archived from the original on 2011-02-17. Retrieved 2013-08-25.
  4. India target in Kabul’s deadliest attack, The Telegraph, July 8, 2008.
  5. President Pratibha Patil presents gallantry awards-ద హిందూ-మార్చి 20,2009
  6. Had he left a day later, Rao would still be alive

ఇతర లింకులు

[మార్చు]