వాడుకరి:Arjunaraoc/అందరి విజ్ఞానం అందరికీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు వెలుగు జనవరి 2014 సంచికలో ముద్రించబడినది

వీలైనంత ఎక్కువ నాణ్యతతో ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని సృష్టించి ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ అది అందేలా చేయాలి. అది కూడా ఎవరి అమ్మభాషల్లో వారికి, అదే వికీపీడియా లక్ష్యం. విజ్ఞాన సర్వస్వమంటేనే ఆనంత కోటి ఆంశాలకు ప్రతిబింబం. దాన్ని ప్రపంచ ప్రజలందరికీ ఉచితంగా.. అదీ వారి అమ్మభాషల్లో అందించడమంటే సాధ్యమయ్యే పనేనా: ఒక్కరికే అయితే అసాధ్యమే. వందల మంది చేతులు కలిపితే కొంత వరకూ ఆ దిశగా కృషి చేయవచ్చు ఆదే వేలమంది కలిసి నడిస్తే.. వారిని లక్షల మంది అనుసరిస్తే... విజ్ఞాన సర్వస్వాన్ని సృష్టించి అందరికీ ఆందుబాటులోకి తేవడం కష్టమేమీ కాదు ఈ భావనలోంచే పుట్టింది వికీపీడియా.

నాకు రెండు విషయాలు తెలుసు. నీకు రెండు విషయాలు తెలుసు. మనిద్దరం కలిసి మనకు తెలిసిన విషయాలకు అక్షర రూపమిచ్చి ఓ చోట ఆందుబాటులో ఉంచితే, వాటిని చదివిన మూడో వ్యక్తికి నాలుగు విషయాలు తెలుస్తాయి. తనకు తెలిసిన ఒకటో రెండో విషయాలను ఆక్కడ ఆ మూడో వ్యక్తి రాస్తే... వాటిని చూసిన నాలుగో వ్యక్తికి ఇంకా ఎక్కువ ఆంశాలపై విషయ పరిజ్ఞానం లభిస్తుంది. ఇలా ఒకరికి ఒకరు విజ్ఞానాన్ని పంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తే విజ్ఞాన సర్వస్వమే తయారవుతుంది. వికీపీడియా వ్యవస్థాపకుల అలోచన ఇదే. దీపం ఎంత చిన్నదైనా చీకటిని తరిమి వెలుగుల్ని పంచుతుంది.. అలోచనా ఆలాంటిదే.. అజ్ఞానాన్ని పరిమార్చి విజ్ఞాన వీచికల్ని ప్రసరింపజేస్తుంది. జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకునే సౌధనాన్ని సృష్టించి తద్వారా వీలైనంత ఎక్కువ నాణ్యతతో ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని సృష్టించి ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ అది అందేలా చేయాలి. ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని తయారు చేయాలన్న వికీపీడియా స్పష్టికర్తల ఆలోచన ఇప్పుడు తెలుగుతో సహా అనేక భాషల్లో జ్ఞానజ్యోతులను ప్రసరింపజేస్తోంది.

ప్రపంచంలోని ఎలాంటి సమాచారాన్నైనా ఆందించే ఎన్ సైక్లోపీడియా వంటి పుస్తకాలు ఇప్పటికే ఉన్నాయి. ఆయితే వీటితో లబ్ధి పొందాలంటే కొంత సొమ్ము వెచ్చించాలి. అంతేకాదు, వాటిని ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకోవడానికి వీలుండదు. తాజా సమాచారమూ దొరకదు. ఆంతర్జాలమే ఆలంబనగా ఆ సమస్యలను ఆధిగమించి విజ్ఞానాన్ని ఉచితంగా అందించేదే వికీపీడియా, కనీస కంప్యూటర్ పరిజ్ఞానం గల ఏ వ్యక్తికైనా ఉపకరించే విజ్ఞాన సర్వస్వమిది. ఇందులోని వ్యాసాలను ఎవరైనా ఉచితంగా వాణిజ్య ప్రకటనల రొద లేకుండా చదువుకోవచ్చు. ఆంతేకాదు... వాటిలోని అంశాలకు మార్పులు చేర్పులు చేయవచ్చు. ఏ అంశంపైనైనా కొత్త వ్యాసం రాయవచ్చు. మరోమాట.. కాపీరైట్ జంఝాటం లేని స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వమిది కాబట్టి దీన్లోని సమాచారాన్ని ఎవరి అనుమతి తీసుకోకుండానే దేనికోసమైనా వాడుకోవచ్చు.

ఇద్దరు మిత్రులు

[మార్చు]

'వికీ' ఆంటే హవాయి భాషలో త్వరితం అని అర్థం. దానికి 'ఎన్ సైక్లోపీడియా'లోని రెండోభాగం 'పీడియా' కలిపితే వికీపీడియా. పుష్కరం కిందట అమెరికాకు చెందిన జీమ్మీవెల్స్, లారీ సాంగర్ దీనికి రూపకల్పన చేశారు. అధునిక అంతర్జాల సౌలభ్యాన్ని వాడుకుంటూ సంప్రదాయ పద్ధతిలో మేధావులతో వ్యాసాలు తయారు చేయించే 'న్యూపీడియా' అనే విజ్ఞాన సర్వస్వాన్ని తయారు చేయాలనుకున్నారు వారు. మొదట్లో, ఆయితే, ఆ పని ఆనుకున్నంత వేగంగా జరగలేదు. దాంతో మేధావులనే కాకుండా ఎవరైనా ఈ కృషిలో భాగం పంచుకునే విధంగా ప్రయోగం చేశారు. కొద్ది పమయంలోనే ఇది అతివేగంగా అభివృద్ధి చెందడంతో పాత ప్రాజెక్టుని నిలిపివేసి కొత్త ప్రయోగానికి 'వికీపీడియా' అని పేరు పెట్టారు. తరువాత పదేళ్లలోనే ఇది గణనీయమైన ప్రగతి సాధించింది. ప్రస్తుతం ఇందులో అంగ్లంలో 42 లక్షల వ్యాసాలు ఉన్నాయి. దీన్ని ఆనుసరిస్తూ ఆన్ని భాషల్లోనూ వికీపీడియా విప్లవం ప్రారంభమైంది. ఆయితే వికీపీడీయాను తొలిసారి తెలుగులోకి తెచ్చింది మాత్రం నాగార్జున వెన్న. డిసెంబరు 10 2003 న ఆయన తెలుగు వికీపీడియా(http://te. wikipedia.org)కు అంకురార్పణ చేశారు. ఆనాటికి ఆయన అమెరికాలోని బోస్టన్ లో సమాచార సాంకేతిక నిపుణుడు, తెలుగు వికీపీడియా('తెవికీ) ప్రారంభమైనప్పుడు కంప్యూటర్, అంతర్జాలంలో తెలుగు వాడుక శైశవ దశలో ఉంది. కంప్యూటర్లో తెలుగు రాయడానికి ప్రత్యేక ఉపకరణాలు అవసరమయ్యేవి. వికీపీడియాలో సైతం నేరుగా తెలుగులో రాయడానికి వీలయ్యేది కాదు. ఆ సమయంలో నాగార్జున తయారు చేసిన సాంకేతిక ఉపకరణం 'పద్మ' కొద్దిమేరకు ఉపయోగపడేది. సాధారణంగా విండోస్ లో వాడే సార్వజనీయం కాని తెలుగు ఖతులను (ఫాంట్లు) యూనెక్స్ బ్రౌజర్లో, అంతర్జాలంలో వాడే యూనికోడ్ ఖతులుగా మార్చడానికి ఇది సాయం చేసేది. తరువాత వికీపీడియాలో నేరుగా తెలుగు రాయడానికి వీలైన ఉపకరణాన్ని వైజాసత్య తయారు చేశారు. అప్పటి నుంచి తెవికీ లో అనువాద వ్యాసాలు పెరిగాయి.

ఊరగాయతో శ్రీకారం

[మార్చు]

అముక్తమాల్యద, హంశవింశతిల్లోని ఊరగాయల వర్ణనల ఆధారంగా కట్టా మూర్తి రాసిన ఊరగాయ' వ్యాసం... 'తెవికీ'లో నేరుగా తెలుగులో వ్యాసాల రచనకు అది ఆయింది. అప్పట్లో మన దేశంతో పాటు ఆమెరికాలో కంప్యూటర్ రంగంలో పనిచేసే యువత విద్యార్థులెక్కువ మంది 'తెవికీ'లో రాసేవారు. కొద్దికాలానికి కంప్యూటర్లో తెలుగు వాడకానికి సంబంధించిన ననరులు పెరగడంతో కొత్తవాళ్లు 'తెవికీ'లో సభ్యులయ్యారు. ఇ-తెలుగు సంస్థ సాయంతో హైదరాబాదులోని బ్లాగర్లు తెవికీ లో పనిచేయడం ప్రారంభించారు. తర్వాతర్వాత రాసేవాళ్ల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఇందులో 33,568 మంది నమోదైన సభ్యులున్నారు. వీరిలో 605 మంది తెవికీ'లో చురుగ్గా ఉంటారు. వీరందరూ మొదట్లో చిన్న వ్యాసాలు రాయడం లేదా వ్యాసాలను అంగ్లం నుంచి అనువదించడంతో ప్రారంభించినా ఆనతికాలంలోనే తమ ఆసక్తి ప్రకారం వివిధ అంశాలపై చక్కటి వ్యాసాలు రాశారు. వారి కృషితో 'తెవికీ' ఇప్పుడు 54 వేల వ్యాసాల భాండాగారమైంది. మొత్తమ్మీద తెవికీ లో 1.37 లక్షల పుటలున్నాయి. 'తెవికీ'లో కొద్దిపాటి వివరాలతో రాష్ట్రంలోని ప్రతి ఊరికి ఒక వ్యాసం సృష్టించడానికి కృషి చేసిన వారిలో వైజాసత్య, మాకినేని ప్రదీప్ ముఖ్యులు.

చదువుతారా.. రాస్తారా!

[మార్చు]

ఔత్సాహికులు 'తెవికీ'లో కావాల్సిన వ్యాసాల్ని చదవచ్చు. 'రచ్చబండ' విభాగంలో వ్యాపాల్ని చర్చించవచ్చు. పరిశీలించిన వ్యాసానికి ఆదనంగా యథార్థ సమాచారాన్నీ జతపరచవచ్చు. దోషాల్ని సవరించవచ్చు. ఎంతమంది సరిచేశారో పేరు, తేదీలతో సహా ఆ వ్యాసాన్ని అంతకు ముందు చూడవచ్చు. ఛాయాచిత్రాలనూ, వీడియోలనూ ఉంచవచ్చు. వీటన్నిటినీ నిర్వాహకులు ('తెవికీ'లో క్రియాశీలకంగా ఉండే సభ్యుల నుంచే ఎంపికవుతారు) ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నియంత్రిస్తుంటారు. ప్రధాన సంపాదకుడంటూ ఎవరూ లేకుండా దీనిలో పనిచేసే వారే వివిధ రకాలుగా రచనలను మెరుగు చేస్తుంటారు.

తెవికీ లో సభ్యత్వంతో సంబంధం లేకుండా ఎవరైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు. సభ్యులకైతే మాత్రం.. వారు రాసిన వ్యాసాన్ని ఇతరులు సరిచేస్తున్నప్పుడు సమాచారం ఆందుతుంది. ఒకే విషయం గురించి కొద్దిమంది కలసి బృంద రచన చేయవచ్చు. అంతేకాదు రచనల్ని ముద్రించుకోవచ్చు.

నాణ్యమైన వ్యాసాల్లో ఒకదాన్ని 'ఈ వారం వ్యాసం'గా తెవికీ మొదటి పుటలో ప్రదర్శితమవుతుంది. దానితో పాటు ఇటీవల వికీపీడియాలో చేర్చిన ఆసక్తికరమైన విషయాలతో కొత్త వ్యాసాల పరిచయం కనిపిస్తుంది. 'చరిత్రలో ఈ రోజు' తీర్షికతో ఆ తేదీన జరిగిన ముఖ్య సంఘటనల సమాచారం ఉంటుంది. వికీపీడియాలో మరికొన్ని విభాగాలూ ఉన్నాయి. ఆవి.... కాపీరైట్ చట్టాల గొడవ లేని సమావారం, ఛాయాచిత్రాలకు నెలవైన 'కామన్స్', యూనికోడ్ లోని గ్రంథాల సమాహారం 'వికీసోర్స్', విద్యావిషయిక పుస్తకాలకు ఆలవాలమైన 'వికీబుక్స్', మహనీయుల మంచిమాటల గని 'వికీకోట్స్'. పద సంపదలను భావితరాలకు ఆందించడానికి 'విక్షనరీ' పేరిట నిఘంటువూ ఉంది ఇక్కడ. ఇందులో మనకు తెలిసిన పదాలకు ఆధారాల సహితంగా ఆర్ధాలు రాయవచ్చు, లేని పదాలను చేర్చవచ్చు.

తెవికీ స్వచ్ఛంద సభ్యుల సముదాయం, వికీమీడియా ఫౌండేషన్ తో ఆనుబంధమున్న సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ యాక్సెస్ టూ నాలెడ్జ్(సీఐఎస్-ఎనికె) లాభనిరపేక్ష సంస్థలు వికీపీడియా గురించి ఆవగాహనను పెంచడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. వికీపీడియాకు రచనలు చేయడం ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను పెంచే ప్రయోగాత్మక ప్రాజెక్టుని కొన్ని కళాశాలల్లో వికీమీడియా ఆమలు చేసింది. 2011 లో ఏర్పాటైన వికీమీడియా భారతదేశ లాభనిరపేక్ష సంస్థ కూడా వికీమీడియా ఫౌండేషన్ సహకారంతో అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తోంది. తెవికీని కొత్తవారికి పరిచయం చేయడం, సమస్యలను చర్చించడం, వాటికి పరిష్కారాలను సాధించడమే వీటి లక్ష్యం.

పాఠశాలలకు వెళ్లాలి

[మార్చు]

ప్రస్తుతం చాలా పాఠశాలల్లో కంప్యూటర్ ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి. అయితే వీటిని ఆంగ్లంలో కంప్యూటర్ అంశాలను వివరించడానికే పరిమితం చేస్తున్నారు. కేరళలో మాదిరిగా స్థానిక భాషలో కంప్యూటరును వినియోగించే విధానాలను విద్యార్థులకు నేర్పడం, ఉపాధ్యాయులు వారి పాఠ్యాంశాల్లో కంప్యూటర్ ఆధారిత విద్యా వనరులను ఉపయోగిస్తే విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి చెండుతారు. ఇప్పుడున్న సాంకేతిక సౌలభ్యాల ప్రకారం ఆదనపు ఖర్చు లేకుండా పాఠశాలల్లోని కంప్యూటర్లను తెలుగులో వాడుకోవచ్చు. తెలుగు సాంకేతిక ఉపకరణాలు, ఉత్పత్తుల ఆభివృద్ధికి ఇది బాటలు పరుస్తుంది.. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు వికీపీడియాపై అవగాహన పెంచాలి. 'తెవికీ' లో రచనలు చేయించడం ద్వారా సహకారం భావవ్యక్తీకరణ, సాంకేతిక నైపుణ్యాలు పెంచటానికి కృషి చేయాలి. ఆనియత విద్యానిధానంలో సార్వత్రిక పాఠశాలలు పెరుగుతున్న నేపథ్యంలో వారికి కావాల్సిన విస్తృత సమాచార వనరుగా వికీపీడియా ఉపయోగపడుతుంది. దీనివల్ల వాళ్లకి విశ్వసనీయమైన, నిర్దిష్టమైన సమాచారం వేగంగా అందుతుంది. ఆంతేకాదు... చిన్నారులకూ విజ్ఞాన వినిమయమూ అలవడుతుంది.

ఇలా చేస్తే భవితకు మేలు

[మార్చు]

వస్తు సేవల కొనుగోలు శక్తి పెరిగేకొద్దీ పెట్టుబడిదారీ సంస్థలు ప్రజల భాషలోనే వ్యవహారాలు జరుపుతాయి. గత అయిదేళ్లలో వివిధ అంతర్జాల సంస్థలు తెలుగికి ప్రాధాన్యమివ్వడం, తెలుగులో అనూహ్యంగా పెరిగిన ఎలక్ట్రానిక్ మాధ్యమాలే దీనికి నిదర్శనం. ఇది ఇంకా బలపడటానికి 'తెవికీ' సమాచారం బలమైన వనరవుతుంది. మూలాలను పేర్కొంటూ ముఖ్యమైన సమాచారాన్ని 'తెవికీ' లో వికీపీడియాలో చేర్చడం ద్వారా సమాజానికి అవసరమైన విజ్ఞాన సర్వస్వాన్ని తయారు చేసుకోవచ్చు. అలాగే, వికీపీడియాకు ఆయువుపట్టు అయిన ఆంతర్జాలంలో కూడా శాశ్వత తెలుగు భాషా వనరులను ఆందుబాటులోకి తెచ్చుకోవాలి. ఆంతర్జాలంలో ఉంచే సమాచారాన్ని సాధ్యమైనంత వరకూ యూనికోడ్ లో పెట్టాలి. ఛాయాచిత్రాలు, పీడీఎఫ్ ల రూపంలో పెట్టే సమాచారాన్ని గూగుల్ లాంటి శోధనా యంత్రాలు విశ్లేషించి తమ ఫలితాల్లో చూపించలేవు. దాంతో సమాచారం ఆవసరమున్న వారికి అందకుండా పోతుంది.

మరోవైపు... రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైట్లలో చాలా వరకు తెలుగు కనబడట్లేదు. కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంస్థలకు చెందిన వెబ్ సైట్లను హిందీలో నిర్వహిస్తున్నారు. మన పాలకులు కూడా మన అమ్మభాషకు ప్రాధాన్యమివ్వాలి భారతీయ డిజిటల్ గ్రంథాలయం ప్రాజెక్టులో భాగంగా 28 వేల పుస్తకాలను చిత్రాల రూపంలో డిజటలైజ్ చేశారు. సులువుగా చదివేందుకు సాయపడే వెబ్ సైట్ లేదు. ఇలాంటి వాటిని తయారు చేసి నిర్వహించేందుకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. తెలుగు పరిశోధక విద్యార్థుల గ్రంథాలను తెలుగు యూనికోడ్లో ప్రచురించేలా చూడాలి. ప్రజలకు విజ్ఞానమందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేసే సంస్థలన్నీ తమ వనరులను విడుదల చేసిన కొద్ది కాలానికైనా కాపీరైట్ హక్కుల పరిధి నుంచి తప్పించి యూనికోడ్ రూపంలోకి మార్చాలి, వాటిని వికీపీడియాకు అందజేస్తే సంబంధిత సమాచారమంతా ప్రజలకు ఆందుబాటులోకి వస్తుంది.

ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఆంతర్జాలం చాలా మందికి చేరువ కాలేదు. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకుని వీలైనన్ని ఎక్కువ చోట్ల టాబ్లెట్ కంప్యూటర్ కియోస్కులను నెలకొల్పాలి. వాటి ద్వారా ప్రజలకు సమాచారం అందించాలి. ఇవి పెద్ద గ్రంధాలయాల్లా ఉపయోగపడతాయి ఇ-సేవలను అందించడానికి నెలకొల్పుతున్న కేంద్రాల్లో ప్రభుత్వ వెబ్ సైట్లు, వికీపీడియాను స్వేచ్ఛగా వాడుకోవటానికి ఆవకాశం కల్పించాలి

ప్రతి ఒక్కరూ.

[మార్చు]

అనూహ్యమైన సాంకేతికాభివృద్ధి ప్రజల జీవనశైలిలో మార్పులు తీసుకొచ్చింది. వందేళ్ల కిందట ఆయిదారుగురు మాత్రమే విజ్ఞాన సర్వస్వ నిర్మాణంలో పాల్గొనే వీలుండేది. ఇప్పుడు వికీపీడియా వల్ల సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆ ఆవకాశం కలిగింది. దీన్ని ఆందరూ వినియోగించుకోవాలి. వికీమీడియా ఏడాదికొకసారి నిర్వహించే విరాళాల సేకరణ ప్రక్రియలో చిన్న మొత్తాలను దానం చేసి వికీపీడియాను ఆభివృద్ధికి తోడ్పడితే ముందుతరాలకు ఆపార జ్ఞానసంపదను అందించిన వాళ్లమవుతాం. తెలుగుభాష, సాహిత్యం, సంస్కృతి, కళలు ఒకటేమిటి తెలుగు ప్రజల జీవనానికి, అభ్యున్నతికి, వైభవానికి ఉపయోగపడే. సకల సమాచారానికి విశిష్ట పేటిక తెలుగు వికీపీడియా, ఏ రంగంలోనైనా తమ విజ్ఞానాన్ని పదిమందికీ తేటతెలుగులో పంచాలనుకునే వారికిది చక్కటి వేదిక, రచనలు చేయాలన్న ఆసక్తి ఉండి అవకాశం కోసం ఎదురుచూస్తున్న అక్షరయోధులకూ ఇదే ఆసలైన యవనిక.