వాడుకరి:Chaduvari/తెవికీ తాత్వికత
Jump to navigation
Jump to search
వికీ మౌలిక తాత్వికత ఏంటి? మూలస్థంభాలు, విధానాలు వగైరాలున్నాయి. కానీ టూకీగా, తెవికీలో వాడుకరి వ్యవహారం ఎలా ఉండాలంటే..
మౌలికంగా
[మార్చు]తెవికీలో మీకు స్వేచ్ఛ ఉంది, కానీ అది విశృంఖలత్వం కాదు. దేని గురించైనా రాయొచ్చు. కానీ మూలాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది.
తెవికీలో కృషి విషయంలో తోటి వాడుకరుల పట్ల సద్భావనతో ఉండండి. ఎదటివారు కూడా సద్భావనతోనే ఉన్నారని అనుకోండి.
వికీపీడియా అంటే స్వేచ్ఛ, బాధ్యత, హుందాతనం, మర్యాద, విశాల దృక్కోణం, పరిశీలనలు, ఆలోచనలు, అభిప్రాయాలు
ఎలా మెలగాలి
[మార్చు]- మీ అభిప్రాయాలను దాచుకోవద్దు, వెల్లడించండి. నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, మర్యాదగా చెప్పండి. ఇతరుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పడం భిన్నాభిప్రాయం అవుతుందే గానీ, అమర్యాద కాదు. దానివలన మైత్రి చెడదు. వాళ్ళు బాధపడతారేమో అని అభిప్రాయం చెప్పకుండా మనసు లోనే తొక్కిపెడితే అది లేనిపోని టెన్షనుకు దారితీస్తుంది.
- "తప్పైంది, మన్నించండి" అనేది ఊతపదంగా పెట్టుకోండి, తప్పులేదు. మీ తప్పు లేకపోయినా సరే.., "నా తప్పుందని మీరు భావిస్తే మన్నించండి" అని చెప్పెయ్యండి. ఊరికే, ఎవరినీ ఉద్దేశించని బహిరంగ ప్రకటన లాగా చెయ్యొద్దు, "ఫలానా సుబ్బారావు గారూ," అంటూ పిలిచి మరీ సారీ చెప్పండి. అది పద్ధతి. అవతలి మనిషికి సాంత్వన చేకూరుతుంది. వికీ వాతావరణంలో నెగెటివిటీ తగ్గుతుంది.
- అవతలి వ్యక్తి మన్నించమని మిమ్మల్ని అడిగితే, "ఏం పర్లేదు సార్, అయిందేదో అయిపోయింది, వదిలేద్దాం" అనో, "నాది కూడా తప్పుందిలెండి, నన్నూ మన్నించండి" అనో.. అనేసెయ్యండి. వికీ వాతావరణంలో పాజిటివిటీ పెరుగుతుంది.
- ఒక అంశంపై చర్చలో వంద అభిప్రాయాలు ఒకే కోణంలో రావచ్చు. ఒకే ఒక్క అభిప్రాయం వాటికి వ్యతిరేకంగా రావచ్చు. కానీ ఆ ఒక్క అభిప్రాయంలో చెప్పిన తర్కం మిగతా వందకంటే మెరుగ్గా, ఆమోదనీయంగా ఉంటే, నిర్ణయం చెప్పేవారు దానివైపుకే మొగ్గు చూపాలి, చూపుతారు. ఆ ఆభిప్రాయమే చర్చలో నెగ్గుతుంది. ఇక్కడ వోట్లు కాదు ముఖ్యం, అభిప్రాయాలకే విలువ. ఎంత ఎక్కువమంది చర్చలో పాల్గొంటే అన్ని ఎక్కువ అభిప్రాయాలు వస్తాయి, నిర్ణయం అంతే మెరుగ్గానూ ఉంటుంది.
- వికీలో 20 ఏళ్ళుగా చేస్తున్నవారు 20 రోజులుగా చేస్తున్నవారూ - అందరూ ఒకటే.
- వ్యాసాల విషయంలో భేదాభిప్రాయం వచ్చి, వాదన జరుగుతూ, అది ఒక పరిష్కారానికి చేరేట్టుగా లేనపుడు ఆ పేజీ నుండి, ఆ వాదన నుండీ తప్పుకోండి. వేరే పేజీలో పనిచెయ్యండి. వికీలో మనం పనిచెయ్యడానికి లక్ష పేజీలున్నై. లక్షా తొంభై పనులున్నై. అలా తప్పుకోవడం ఓటమి కాదు, హుందాతనం. (ఒకసారి నేను అలా ఒక చర్చ నుండి తప్పుకుంటే, ఆ చర్చలో అసలు పాల్గొనని వేరే వ్యక్తి నాకు థాంక్స్ సందేశం పంపించారు)
- మీరు సృష్టించిన పేజీ మీ బిడ్డేమీ కాదు, దాన్ని అతిగా ప్రేమించకండి. ఆ పేజీలో మీరూ ఇతరులూ చేసే ప్రతీ దిద్దుబాటూ దాన్ని మెరుగుపరచేందుకే అని భావించండి. అలా అని తప్పులను ఎత్తిచూపవద్దని అనడం లేదు. తప్పు రాసినది అజ్ఞాత అయితే వ్యాసం చర్చ పేజీలో అ సంగతి రాసి, తప్పు సవరించేయండి. తప్పు రాసినది నమోదైన వాడుకరి అయితే, ఆ సంగతి వ్యాసం చర్చ పేజీలో ఆ వాడుకరి పేరును ప్రస్తావిస్తూ చెప్పండి. ఆ వాడుకరి సమాధానం కోసం కొంత కాలం (ఉదాహరణకు మూడు రోజులు) వేచిచూసి, వారి నుండి స్పందన రానట్లైతే అప్పుడు మీరు తలపెట్టిన మార్పు చేసెయ్యండి. నేరుగా మార్చెయ్యకపోతే మంచిది. అయితే కొన్ని సందర్భాల్లో మార్పు వెంటనే చెయ్యాల్సిన అవసరం ఉండవచ్చు - అప్పుడు వెంటనే చెసెయ్యండి. వ్యాసం చర్చపేజీలో మాత్రం రాయండి.
- తెవికీలో మీ కృషి గురించి మీ వాడుకరి పేజీలో రాసుకోండి. బాగా రాసుకోండి. కొంచెం ఎక్కువ రాసేసుకుంటున్నానేమో అని భావించవద్దు, రాసేసుకోండి. అబద్ధాలు కానంతవరకూ రాసుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే వికీలో మనం చేస్తున్న పని గురించి ఎంత చెప్పుకున్నా సరిపోదు. ఎక్కువ రాసుకోవాలనుకున్నా రాసుకోలేం. కానీ మీ గురించి, వికీకి సంబంధం లేనివాటి గురించీ ఎక్కువగా రాయొద్దు
- థాంక్స్ చెప్పండి. విరివిగా చెప్పండి.
- వాడుకరులను అభినందించండి. వాళ్ళ చర్చ పేజీలకు వెళ్ళి, "ఫలానా పని భలే చేసారు, నాకు నచ్చింది" అని చెప్పండి. పతకాలు ఉదారంగా ఇవ్వండి, మరీ అనర్హులకు ఇవ్వవద్దు.