వాడుకరి:Chaduvari/మరి..ల ఏరివేత
"మరియు" వాడకం మనభాషకు సహజమైన ప్రయోగం కాదు. ఇంగ్లీషులో ఉందిగదా అని తెలుగులో రాసెయ్యకూడదు. ఇకారంగా ఉంటది.
- రాముడు, సీత మరియు లక్ష్మణుడు: చక్కగా రాముడు, సీత, లక్ష్మణుడు అని రాయాలి.
- ఇంగ్లీషులో And తో వాక్యాన్ని మొదలెడతారు, ముందరి వాక్యానికి కొనసాగింపు వాక్యం ఇది. దాన్ని మక్కికిమక్కి రాయనక్కర్లా.. అల్ పచీనో చేసిన పని అతడికి పేరు తెచ్చిపెట్టింది. మరియు అతడికి చాలా సంతృప్తి నిచ్చింది. అని రాయగూడదు.. అల్ పచీనో చేసిన పని అతడికి పేరు తెచ్చిపెట్టింది. అదతడికి చాలా సంతృప్తి నిచ్చింది కూడా.
- ఏ సంబంధమూ లేని రెండు విడివిడి వాక్యాలను "మరియు" తో కలిపేసి రాస్తూంటాం. గద్వాల చేనేత చీరలకు ప్రసిద్ధి చెందింది మరియు ఇది ఒక చరిత్రాత్మకమైన స్థలం కూడా. నిజానికిది ఒకటి కాదు, రెండు వేరువేరు వాక్యాలు. రెంటి మధ్య ఫుల్‌స్టాప్ పెట్టకుండా మరియు పెట్టారు. ఈ వాక్యాన్ని ఇలా రాయవచ్చు: గద్వాల చేనేత చీరలకు ప్రసిద్ధి చెందింది. ఇది ఒక చారిత్రిక స్థలం కూడా.
మరియుల ఏరివేతను లాంఛనంగా ఒక ప్రాజెక్టుగా చేపట్టలేదు. కానీ పని మాత్రం ఒక ప్రాజెక్టుపై జరిగినట్టే జరిగింది. 2020 మార్చి 22 నాటికి ప్రధాన పేరుబరి నుండి "మరియు" లను ఏరివెయ్యడం పూర్తైంది. ముఖ్యంగా యర్రా రామారావు గారు, వెంకటరమణ గారు, నేనూ ఈ ప్రాజెక్టుపై పనిచేసాం.
దీని కోసం లాంఛనంగా ప్రాజెక్టునేమీ తయారుచెయ్యక పోయినా, దీన్ని ప్రాజెక్టు అని ఎందుకంటున్నానంటే..,
- ప్రధాన పేరుబరిలో ఉన్న 21,000 పేజీల నుండి మరియులను తీసెయ్యాలి
- ఆయా పేజీల్లోని పాఠ్యంలో నేరుగా ఉన్న మరియు లను తీసేసినంత మాత్రాన సరిపోదు...
- మూసల్లో ఉంటాయి, వాటిని ట్రాన్స్‌క్లూడు చేసిన పేజీల్లో కనిపిస్తాయి. వాటిని తీసెయ్యాలి
- పేజీల పేర్లలో "మరియు" లు ఉన్నాయి. ఆ పేజీలను సరైన పేరుకు తరలించాలి, పాత పేజీకి ఉన్న లింకులను కొత్త పేజీకి మార్చాలి, పాత పేజీని తొలగించాలి
- వర్గాల పేర్లలో "మరియు" లున్నాయి. సరైన పేరున్న వర్గాన్ని సృష్టించాలి, పాత వర్గంలో ఉన్న పేజీలను కొత్త వర్గానికి తరలించాలి, పాత వర్గాన్ని తొలగించాలి
ప్రాజెక్టుగా తీసుకుని పనిచెయ్యకపోయినా, చొరవగా ఈ పనిలో భాగం పంచుకుని పనిచేసిన రామారావు గారిని, వెంకటరమణ గారినీ, అలాగే ప్రణయ్ గారినీ, ఇతరులనూ అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. గతంలో అందరం "మరియు"లు రాసిన వాళ్ళమే. అయితే, అవి రాయవద్దని అనుకోగానే రాయడం మానేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా రాస్తూనే ఉన్న వారికి మానెయ్యమని మరోసారి నమస్కారాలతో విజ్ఞప్తి.
క్ర సం | వెతికిన తేదీ | ప్రధాన పేరుబరిలో "మరియు" లున్న పేజీలు | ప్రగతి ఎలా ఉందంటే |
---|---|---|---|
1 | 2018 ఆగస్టు 17 | 20,539 | |
2 | 2019 ఆగస్టు 29 | 20,838 | పనితీరు అసలేం బాలేదు. సంవత్సరం తిరిగేటప్పటికి సంఖ్య తగ్గాల్సింది పోయి బాగా పెరిగింది. |
3 | 2019 డిసెంబరు 30 | 21,233 | తగ్గలేదు సరికదా, నాలుగు నెలల్లో నాలుగొందలు పెరిగాయి. కొత్తగా అనువాద పరికరాన్ని వాడేవారిలో మరింత అవగాహన తీసుకురావాలి |
4 | 2020 ఫిబ్రవరి 9 | 19,450 | దాదాపుగా 2,000 తగ్గాయి. యాంత్రికానువాద వ్యాసాలను తొలగించడం వలన ఇవి తగ్గాయే తప్ప, వ్యాసాలను శుద్ధి చెయ్యడం వలన కాదు. |
5 | 2020 ఫిబ్రవరి 13 ఉదయం: 6:00 | 18,683 | 767 పేజీలు తగ్గాయి. ప్రధానంగా మూసల్లో "మరియు" లను తీసెయ్యడంతో ఈ తగ్గుదల వచ్చింది. నాలుగు రోజుల కిందట "మరియు" ఉన్న మూసలు 400 పైచిలుకు ఉండగా, ఇప్పుడవి 85 ఉన్నాయి. ఇంగ్లీషు నుండి మక్కికి మక్కి అనువాదాలు (మూసల పేరులతో సహా) చెయ్యడం దీనికి కారణం. వీటిని సరిదిద్దే క్రమంలో నేను గమనించినవి:
అనవసరమైన మూసలు, అసలు ఎక్కడా వాడని మూసలు, అసలు ఒక్క లింకూ లేని మూసలు, మామూలు వ్యాసం లాంటి మూసలు.. ఇలా కొన్ని ఉన్నాయి. ఇంగ్లీషులో కాపీ చేసి ఇక్కడ పేస్టు చేసినవి బోలెడు. మూసలో ఉన్న లింకులకు చెందిన పేజీలు తెవికీలో ఉన్నా, వాటిని లింకు చెయ్యలేదు; ఎర్రలింకు గానో, ఇంగ్లీషు పేజీకి లింకు గానో ఉంచేసారు. మూస పేరు (name), మూస పేజీ పేరూ వేరువేరుగా ఉన్న మూసలు కూడా కొన్ని ఉన్నాయి. (అవి రెండూ ఒకటే కాకపోతే మూస పైపట్టీలో ఉండే ఎడిట్ లింకు (e) పనిచెయ్యదు.) కొన్ని మూసలను మళ్ళీ దిగుమతి చేసుకుని తాజాకరించాల్సి వచ్చింది. అలాంటివి ఇంకా ఉండి ఉండవచ్చు. మరో సంగతి: ఇదే నాలుగు రోజుల సమయంలో గూగుల్ వెతుకులాట ఫలితాలు (మరియు site:te.wikipedia.org -కోసం వెతికినపుడు) 1,08,000 నుండి 97,000 కు తగ్గాయి. |
6 | 2020 ఫిబ్రవరి 25 | 14,669 | AWB వాడి, గ్రామాల పేజీల్లో ఉన్న "మరియు" లను తొలగించాను. ఆ విధంగా 4,000 పేజీల శుద్ధి జరిగింది. పంజాబు గ్రామాల పేజీల్లో "భౌగోళిక ప్రాంతం వద్ద మరియు జనాభా" , "కమ్యూనికేషన్ మరియు రవాణా", "మార్కెట్ మరియు బ్యాంకింగ్" అనే విభాగాలను సవరించాను. పనిలో పనిగా కొన్ని పంజాబు గ్రామాల్లో "సమీప" తరువాత ఖాళీ లేకపోవడం, "గ్రామంలో లేదు", "గ్రామంలో ఉంది" లాంటి పునరుక్తులను, " పాఠశాల ఉంది/ఉన్నాయి" లాంటి ఛాయిస్ లనూ తొలగించాను. |
7 | 2020 మార్చి 5 | 13,931 | వెంకటరమణ గారు, యర్రా రామారావు గారు AWB ద్వారా మరియు లను తొలగించడంతో ప్రధానంగా తగ్గాయి. |
8 | 2020 మార్చి 20 | 11,638 | యర్రా రామారావు గారు, వెంకటరమణ గార్ల కృషి కొనసాగుతోంది. |
9 | 2020 మార్చి 20 రాత్రి 11:53 | 4,987 | AWB వాడి 4,942 పేజీల్లో "మరియు" లను తీసేసాను. మిగతావి రామారావు గారు తీసేసారు |
10 | 2020 మార్చి 22 సాయంత్రం 6 గం | 42 | AWB వాడి మరో 4,663 పేజీల్లో "మరియు" లను తీసేసాను. మరికొన్నిటిని మానవికంగా కూడా తీసేసాను. మొత్తమ్మీద, పూర్తిగా నిర్మూలించే స్థాయి దరిదాపుల్లోకి చేరుకున్నాం. |
11 | 2020 మార్చి 22 రాత్రి 10:00 | సున్నా | చప్పట్ల సమయం! |